భాంగఢ్ కోట: "చీకటి పడ్డాక అక్కడికి వెళ్లినవారు ప్రాణాలతో తిరిగి రారు" - ఇది నిజమేనా?

భాంగఢ్ కోట

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భాంగఢ్ కోట
    • రచయిత, సంకల్ప్ బహేతి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"సూర్యుడు అస్తమించిన తరువాత ఇక్కడికి వచ్చేవారు తిరిగి వెళ్లరు. చీకటి పడిన తరువాత వెళ్లినవారు చనిపోతారు లేదా మాయమైపోతారని చెబుతారు." 

ఈ మాటలు చెబుతూ టూరిస్ట్ గైడ్ సంతోష్ ప్రజాపతి భాంగఢ్ కోట కథ చెప్పడం మొదలుపెట్టారు. 

'సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు ప్రవేశం నిషిద్ధం' అని స్పష్టంగా రాసి ఉన్న బోర్డు ఇక్కడ ఉంది.

ఇది దెయ్యాల కోట అని, భారతదేశంలో అత్యంత భయంకరమైన ప్రదేశం ఇదేనని స్థానికులు నమ్ముతారు. 

రాజస్థాన్‌లోని భాంగఢ్ కోటను 16వ శతాబ్దంలో నిర్మించారు. రాజా మాధవ్ సింగ్ రాజ్యానికి ఇది కేంద్రంగా ఉండేది. అయితే, కొన్ని సంవత్సరాల తరువాత ప్రజలు ఈ ప్రాంతాన్ని విడిచి వేరే చోటికి వెళ్లిపోవడం ప్రారంభించారు. 

ఒక తాంత్రికుడు ఈ కోటలోని రాణిని వశం చేసుకోవడానికి ప్రయత్నించి, విఫలం కావడంతో ఇక్కడి ప్రజలపై క్షుద్రశక్తులు ప్రయోగించాడని, దాంతో ప్రజలు ఈ చోటు విడిచి వెళ్లిపోయారని కథలుగా చెబుతారు.

భాంగఢ్ కోట భారతదేశంలోనే పెద్ద దెయ్యాల కోటగా పేరుబడిందని, భూతాలు, పిశాచాలు ఇక్కడ నివాసం ఏర్పరచుకుంటాయన్న నమ్మకం ప్రజల్లో బాగా ఉందని పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ వినయ్ కుమార్ గుప్తా చెప్పారు. 

ఈ కోట నిర్మాణం 1570 ప్రాంతాలలో ప్రారంభమైందని, పూర్తి కావడానికి సుమారు 16 ఏళ్లు పట్టిందని ఆయన చెప్పారు.

భాంగఢ్ కోట

ఫొటో సోర్స్, Getty Images

చనిపోయిన వారి ఆత్మలు కోటలో సంచరిస్తాయా ?

ఆమెర్ రాజు భాన్ సింగ్ పేరు మీద ఈ కోటకు భాన్‌గఢ్ (భాంగఢ్) అని పేరు పెట్టారు. ఈ రాజు మాన్ సింగ్ అనే మరో పేరుతో ప్రసిద్ధికెక్కారు.

ఇది నాలుగున్నర వందల ఏళ్ల నాటి ఈ కోట అని, రాజా మాధవ్ సింగ్ దీన్ని రాజధానిగా చేసుకుని పాలన సాగించారని, ఆయన భార్య రాణి రత్నావతి అని టూరిస్ట్ గైడ్ సంతోష్ ప్రజాపతి చెప్పారు.

ఇక్కడ రాత్రిపూట విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయని, చీకటి పడిన తరువాత ఇక్కడికి వచ్చిన వారెవరూ ప్రాణాలతో తిరిగి రాలేదని చెబుతారు.

ఇక్కడ కొన్ని మరణాలు సంభవించాయి. చనిపోయినవారి ఆత్మలు ఈ కోటలోనే తిరుగుతుంటాయని ఇక్కడివారి విశ్వాసం. 

ఇండియా పారానార్మల్ సొసైటీకి చెందిన సిద్ధార్థ్ బంట్వాల్ ఈ కోట గురించి మాట్లాడుతూ, "భాంగఢ్ కోట గురించి కొన్ని కథలు బాగా ప్రచారంలో ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రాచుర్యం పొందిన కథ రాణి రత్నావతి కథ. ఆమె చాలా అందమైన రాణి అని, ఈ కోట మొత్తం ఆమె స్వాధీనంలో ఉండేదని చెబుతారు. ఒక మాంత్రికుడు ఆమె దృష్టిని ఆకర్షించడానికి అన్ని విధాలా ప్రయత్నించాడు. కానీ, లాభంలేకపోయింది. దాంతో, ఆ మాంత్రికుడు కోటలో నివసిస్తున్నవారిని శపించాడు. కోట సర్వనాశనం అయ్యేవరకు నిద్రపోలేదు. ఈ కథ నిజమని చాలామంది నమ్ముతారు" అని చెప్పారు.

భాంగఢ్ కోట పైన గొడుగును పోలిన వాచ్ టవర్ ఉందని, రాణి రత్నావతిని వశం చేసుకోవడానికి ప్రయత్నించిన మాంత్రికుడు సింధు సేవ్డా, తన ప్రయత్నాలు విఫలమయ్యాక ఆ వాచ్ టవర వద్దే నివాసం ఏర్పరచుకున్నాడని గైడ్ సంతోష్ చెప్పారు.

మాంత్రికుడు కోటపై క్షుద్రశక్తులు ప్రయోగించాడని, 24 గంటలలో కోటలోని చాలా భాగాలు ధ్వంసం అయిపోయాయని చెబుతారు.

బహుశా అది 1605 సంవత్సరం కావచ్చు. అప్పట్లో కోటలో సుమారు 14 వేల మంది నివాసం ఉండేవారు.

ఆ 24 గంటల్లో ఉపద్రవం లాంటిది ముంచుకు రావడంతో రాజుతో పాటు సగంపైగా జనాభా అక్కడి నుంచి పారిపోయారు.

వారంతా ఆమెర్ వెళ్లి అక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. అదే ప్రస్తుత జైపూర్ నగరం. అందుకే, భాంగఢ్ కోట ఉన్న ప్రాంతాన్ని పాత జైపూర్ అని కూడా అంటారు.

భాంగఢ్ కోట

ఫొటో సోర్స్, Getty Images

'భాంగఢ్ లో జంతువులు తప్ప ఇంకేం లేవు'

ఇండియా పారానార్మల్ సొసైటీకి చెందిన సిద్ధార్థ్ బంట్వాల్ చాలాసార్లు భాంగఢ్ ను సందర్శించారు.

"2012లో మా బృందం రాత్రిపూట భాంగఢ్ కోటకు వెళ్లింది. ఒక పారానార్మల్ బృందం ఈ ప్రదేశాన్ని సందర్శించడం అదే మొదటిసారి. మా బృందం ఒక రాత్రి అక్కడ గడిపింది. ఆ ప్రదేశాన్ని పూర్తిగా పరిశీలించింది. మా వద్ద ఉన్న సాధనాలతో అక్కడ పారానార్మల్ అంశాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ప్రయత్నించాం. మా సాధనాల కొలమానాలలో ఎక్కడా హెచ్చుతగ్గులు కనిపించలేదు. ఇక్కడ ఎలాంటి అసాధారణ అంశాలు కనిపించలేదు" అని సిద్ధార్థ్ బంట్వాల్ చెప్పారు. 

ఈ ప్రాంతంలో వివిధ రకాల జంతువులు నివసిస్తున్నాయని, అవి వింత శబ్దాలు చేస్తాయని ఆయన చెప్పారు. 

"ఈ కోటలో చాలా కోతులు ఉన్నాయి. అవి చెట్లపైకి, కొమ్మలపైకి దూకుతుంటాయి. ఆకులు కదిలిన శబ్దం లేదా కొమ్మ విరిగిన శబ్దాలు వినిపిస్తుంటాయి. ఇక్కడ ప్రాచుర్యంలో ఉన్న కథల కారణంగా ప్రజల్లో కొన్ని విశ్వాసాలు స్థిరపడిపోయాయి. ఈ కథలు వారిని మానసికంగా ప్రభావితం చేసి ఉండవచ్చు" అని సిద్ధార్థ్ అన్నారు.

భాంగఢ్ కోట

ఫొటో సోర్స్, Getty Images

కోటలో ఏమేమి ఉన్నాయి?

భాంగఢ్ కోట ప్రవేశ ద్వారాన్ని చేరుకోవాలంటే సమాంతరంగా ఉన్న మూడు గోడలను దాటుకుని వెళ్లాలని పురావస్తు నిపుణుడు డాక్టర్ వినయ్ కుమార్ గుప్తా చెప్పారు. 

"కోట ప్రారంభంలో దుకాణాల శిథిలాలు ఉన్నాయి. బహుశా ఆ కాలంలో అత్యవసర వస్తువులు విక్రయించే దుకాణాలు ఇక్కడ ఉండి ఉండవచ్చు. ఇక్కడ జౌహరి బజార్ ఉంది. ఇందులో స్వర్ణకారుల దుకాణాలు ఉండి ఉండవచ్చు. కొన్ని చిన్న చిన్న భవనాలు ఉన్నాయి. ఇవి బహుశా వినోద కార్యక్రమాల కోసం నిర్మించినవి కావచ్చు. ఒక భవనాన్ని సంగీతనాట్య భవనం అని పిలుస్తారు.

ధనవంతుల కోసం కోటలో ప్రత్యేకంగా కొంత భాగాన్ని కేటాయించారు. రాజ సభ, న్యాయస్థానాలకు సంబంధించిన నిర్మాణాలు ఉన్నాయి. గుర్రాలు, ఏనుగుల కోసం ప్రత్యేక ఆవరణలు, అశ్వశాల ఉన్నాయి. రాజు, ఆయన రాణుల కోసం ఒక అందమైన భవనం ఉంది.

శత్రువుల దాడిని పసిగట్టేందుకు కోటపై ఒక వాచ్ టవర్ నిర్మిచారు. శత్రుమూకలను సుదూరం నుంచే గుర్తించేందుకు అక్కడ సైనికులు నిరంతం కాపలా కాసేవారు. శత్రువులకు, ఖైదీలను బంధించడానికి కోట లోపల ఒక జైలు కూడా ఉంది" అని డాక్టర్ వినయ్ కుమార్ వివరించారు. 

భాంగఢ్ కోట సరిస్కా టైగర్ రిజర్వ్‌కు చాలా దగ్గరగా ఉంది. సరిస్కాలో పులులు సహా అనేక జంతువులు ఉన్నాయి.

సరిస్కా టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతం కాబట్టి, దాని చుట్టు పక్కల ప్రాంతాలలో విద్యుత్ సౌకర్యం లేదని గైడ్ సంతోష్ చెప్పారు. 

"సాయంత్రం అయేసరికి ఇక్కడ చీకటి అలుముకుంటుంది. గబ్బిలాలు చేరుతాయి. పులులు, చిరుత పులులు కూడా కోట చుట్టుపక్కల సంచరిస్తుంటాయి. అందువల్ల రాత్రి పూట ఇక్కడ ఉండడం ప్రమాదకరం" అని చెప్పారు.

ఇంతకీ బాంగఢ్ కోట నిర్జన ప్రదేశంగా ఎందుకు మారింది?

బాంగఢ్ కోటను విడిచిపెట్టి ప్రజలు ఎందుకు తరలిపోయారన్న ప్రశ్నకు డాక్టర్ వినయ్ కుమార్ జవాబిస్తూ, "చరిత్రలోకి తొంగి చూస్తే, బాగున్న ప్రాంతాలను విడిచిపెట్టి వెళ్లిపోయిన ఉదాహరణలు చాలా కనిపిస్తాయి. జీవనోపాధికి కావలసిన వనరులు పుష్కలంగా ఉన్న ప్రాంతాన్ని విడిచి ప్రజలు వెళ్లరు. కానీ, బయట నుంచి దాడి జరిగినప్పుడు స్థానికులు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితులు రావచ్చు. లేదా కరువు కాటకాలు సంభవించి ఉండవచ్చు. ఇలాంటి కారణం ఏదైనా కావచ్చు" అని అన్నారు.

ఇవి కూడా చదవండి: