మొబైల్ ఫోన్: సిగ్నల్ అందకపోతే నేరుగా శాటిలైట్‌తో కనెక్షన్, ఇది ఎవరికి అందుబాటులో ఉంటుంది?

ఫొటో సోర్స్, IRIDIUM
- రచయిత, జో క్లెన్‌మన్
- హోదా, టెక్నాలజీ ఎడిటర్
శాటిలైట్ ఫోన్ సంస్థ ‘ఇరిడియం’, చిప్ తయారీ దిగ్గజం ‘క్వాల్‌కామ్’ల మధ్య కుదిరిన కొత్త భాగస్వామ్యంతో ప్రీమియం ఆండ్రాయిడ్ ఫోన్లకు శాటిలైట్ కనెక్టివిటీ రానుంది.
శాటిలైట్ కనెక్టివిటీ ఉంటే, మొబైల్ కవరేజ్ లేని ప్రాంతాల్లో కూడా శాటిలైట్ సహాయంతో ఫోన్ల నుంచి మెసేజ్‌లు పంపడం, తిరిగి పొందడం సాధ్యమవుతుంది.
శాటిలైట్స్‌తో ఫోన్లు అనుసంధానం కావడం వల్ల ఇది సాధ్యపడుతుంది.
ఆండ్రాయిడ్ ఆధారిత అనేక స్మార్ట్‌ఫోన్లలో క్వాల్‌కామ్ చిప్‌లు ఉంటాయి.
ఐఫోన్ 14 ఫోన్‌లో కూడా శాటిలైట్ ఫీచర్ ఉంటుందని 2022 సెప్టెంబర్ 14న ఆపిల్ కంపెనీ ప్రకటించింది.
ప్రస్తుతానికైతే శాటిలైట్ కనెక్టివిటీ కేవలం అత్యవసర సమయాల్లో సందేశాలు పంపడానికి, తిరిగి పొందడానికి మాత్రమే అందుబాటులోకి రానుంది.

ఫొటో సోర్స్, BULLITT
ఆపిల్ కంపెనీని వెనక్కి నెడుతూ సొంతంగా శాటిలైట్ సర్వీస్‌ను ఆవిష్కరించిన తొలి సంస్థ ‘బుల్లిట్’. ఇది బ్రిటిష్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు.
ఇది కూడా అత్యవసర వినియోగం కోసమే ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో ఈ సేవ అందుబాటులో ఉంటుంది.
క్వాల్‌కామ్-ఇరిడియం మధ్య కొత్త భాగస్వామ్యం కారణంగా లక్షలాది స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఈ శాటిలైట్ సర్వీస్ అందుబాటులోకి రానుంది.
అయితే, ఫోన్ తయారీదారులు ఈ ఫీచర్‌ను ఫోన్‌లో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
ఇరిడియం అనేది అసలైన ఉపగ్రహ ఫోన్ వ్యవస్థ (శాటిలైట్ ఫోన్ సిస్టమ్). 1997లో ఇది తొలి శాటిలైట్‌ను కక్షలోకి పంపింది. 2019లో తన 75 స్పేస్‌క్రాఫ్ట్‌ల నెట్‌వర్క్‌ను రీఫ్రెష్ చేసింది.
ఈ శాటిలైట్లు తక్కువ కక్షలో మొత్తం భూగోళాన్ని కవర్ చేస్తాయి. భూమికి 780 కి.మీ ఎత్తులో ఇవి ఉంటాయి. ఈ ఉపగ్రహ సమూహాలు ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అవుతూ, డేటాను బదిలీ చేసుకోగలవు.
స్నాప్‌డ్రాగన్ శాటిలైట్ అని పిలిచే ఈ కొత్త ఫీచర్‌ను తొలుత ప్రీమియం చిప్‌లలో మాత్రమే పొందుపరుస్తామని, అందుకే బడ్జెట్ ఫోన్లలో ఈ ఫీచర్ ఉండే అవకాశం లేదని క్వాల్‌కామ్ చెప్పింది.
కానీ, భవిష్యత్‌లో ఇది టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, చివరకు వాహనాల్లో కూడా విస్తరిస్తుందని తెలిపింది. కేవలం అత్యవసర కమ్యూనికేషన్‌కే పరిమితం కాకుండా అన్ని సమయాల్లో ఉపయోగపడేలా ఉంటుందని వెల్లడించింది.
ఈ సేవ పొందాలంటే ఫీజు చెల్లించాల్సి ఉండొచ్చు.
శాటిలైట్ కనెక్టివిటీ అనే ఫీచర్ ‘నాన్ స్పాట్స్’ ప్రాంతాల్లో అంటే మొబైల్ కవరేజ్ లేని ప్రాంతాల సమస్యలను పరిష్కరిస్తుంది. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ఈ సమస్య చాలా సాధారణం.
ఇప్పటికే ఈ ఫీచర్ విజయవంతమైంది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్ లింక్ వంటి సర్వీసులు మారుమూల ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ కవరేజీని అందిస్తున్నాయి.
శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ అనేది చాలా వేగంగా ఉంటుంది. నమ్మదగినది కూడా. కానీ కేబుల్, ఫైబర్ కనెక్షన్లతో పోలిస్తే ఇది చాలా ఖరీదైనది.
భారత్, చైనా వంటి దేశాలు శాటిలైట్ ఫోన్ల వాడకంపై నిషేధం విధించాయి. కాబట్టి స్థానిక ప్రభుత్వాల నిబంధనలకు లోబడి ఈ ఫీచర్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- దిల్లీ: కారుతో 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్ళి చంపేసింది ఈ అమ్మాయినే
- గుండెపోటు: 40వేల అడుగుల ఎత్తులో విమానప్రయాణికునికి హార్ట్స్ట్రోక్... 5 గంటల పాటు వైద్యం చేసి బతికించిన డాక్టర్
- స్కూలుకు పంపించడానికి ఒక బిడ్డనే ఎంచుకోవాలి... ఓ అయిదుగురు పిల్లల తల్లి కథ
- ఆంధ్రప్రదేశ్: ఫ్యామిలీ డాక్టర్ విధానం ఎలా అమలవుతోంది, పూర్తిస్థాయిలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?
- మోదీ బీజేపీ మీద పోరాటంలో హిందువులు, ముస్లింల మధ్య నలిగిపోతున్న కాంగ్రెస్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















