ఐఫోన్-14, వాచ్ అల్ట్రా వచ్చేశాయి... వీటిలోని కొత్త ఫీచర్లు ఏంటంటే

APPLE

ఫొటో సోర్స్, APPLE

    • రచయిత, షియోనా మెక్‌కలం
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆపిల్ సంస్థ సరికొత్త ఐఫోన్ 14ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీనికి ఎమర్జెన్సీ శాటిలైట్ కనెక్టివిటీ, కార్ క్రాష్ డిటెక్షన్ టెక్నాలజీ అదనపు హంగులు.

ఈ ఫోనుకు సంబంధించిన నాలుగు రకాల హ్యాండ్‌సెట్లను అమెరికాలోని కుపెర్టినో ప్రధాన కార్యాలయంలో విడుదల చేసింది. కరోనా మహమ్మారి తరువాత కొత్త ఐఫోన్ లాంచ్‌కు ప్రేక్షకులు వ్యక్తిగతంగా హాజరు కావడం ఇదే తొలిసారి.

దీనితో పాటుగా, కొత్త స్పోర్ట్స్ వాచ్ 'వాచ్ అల్ట్రా', ఎయిర్‌పాడ్‌ ఉత్పత్తులను కూడా విడుదల చేసింది.

కాలిఫోర్నియాలోని విశాలమైన ఆపిల్ క్యాంపస్‌లోని స్టీవ్ జాబ్స్ థియేటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ వేదికపై కనిపించారు. అయితే, కార్యక్రమం అంతా ముందుగానే రికార్డ్ చేసిన వీడియోను ప్రదర్శిస్తూ కొనసాగింది.

APPLE

ఫొటో సోర్స్, APPLE

ఆపిల్ వాచ్ సీరీస్ 8

ఆపిల్ వాచ్ సీరీస్ 8లో చాలా కొత్త ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా, కార్ క్రాష్ డిటెక్షన్, మహిళల అండోత్పత్తి చక్రాన్ని (ఒవ్యులేషన్ సైకిల్) గుర్తించే టెంపరేచర్ సెన్సర్స్, సరికొత్త లో-పవర్ మోడ్ ఆప్షన్‌ వంటివి ఈ కొత్త మాడల్ వాచీలోని ప్రధాన ఆకర్షణలు.

అమెరికాలో అబార్షన్ చట్టంలో మార్పులు వచ్చినప్పటి నుంచి రుతుచక్రాన్ని ట్రాక్ చేసే విషయంలో మహిళలు జాగ్రత్త వహిస్తున్నారు. ఈ యాప్స్‌లో సేవ్ అయ్యే పీరియడ్స్ డాటాను ప్రభుత్వం ఉపయోగిస్తుందేమోననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

అయితే, తమ పరికరాల్లో డాటా సురక్షితమని ఆపిల్ చెబుతోంది. పాస్‌కోడ్ లేదా బయోమెట్రిక్స్ ఉంటే తప్ప ఇతరులు డాటాను యాక్సిస్ చేయలేరని అంటోంది.

"మహిళల ఆరోగ్యం పట్ల మా నిబద్ధతకు కట్టుబడి ఉన్నాం. దాన్ని మరింత ముందుకు తీసుకువెళుతున్నాం" అని ఆపిల్ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జెఫ్ విలియమ్స్ చెప్పారు.

గర్భం దాల్చాలనుకున్న మహిళలకు కొత్త ఒవ్యులేషన్ సైకిల్ ట్రాకర్ ఉపయోగకరంగా ఉంటుందని ఆపిల్ చెబుతోంది. శరీర ఉష్ణోగ్రతలను నిరంతరం గమనిస్తూ, చిన్న చిన్న మార్పులను కూడా పసిగట్టగలదని చెబుతున్నారు.

మరో కొత్త ఫీచర్ కార్ క్రాష్ డిటెక్షన్. సెన్సర్ల ద్వారా కారు క్రాష్ తీవ్రతను గుర్తించి, వెంటనే అత్యవసర సేవలకు కనెక్ట్ చేస్తుంది. అలాగే, కారు లొకేషన్ వివరాలను పంపిస్తుంది. వాచ్‌లో ఉన్న ఎమర్జెన్సీ కాంటాక్ట్స్‌కు సమాచారం అందిస్తుంది.

సీరీస్ 8లో లో-పవర్ మోడ్ కూడా ఉంది. ఐఫోన్‌లో ఈ ఫీచర్ ఉంటుంది. ఇప్పుడు దాన్ని వాచ్‌లో కూడా ప్రవేశపెట్టారు. ఒకసారి వాచ్‌ను పూర్తిగా చార్జ్ చేశాక, 36 గంటల వరకు నడుస్తుంది.

ఆపిల్ వాచ్ సీరీస్ 8 ధర అమెరికాలో 399 డాలర్ల (సుమారు రూ. 31,802) నుంచి, బ్రిటన్‌లో 419 పౌండ్ల (సుమారు రూ. 38,443) నుంచి మొదలవుతుంది.

APPLE

ఫొటో సోర్స్, APPLE

ఫొటో క్యాప్షన్, ఆపిల్ వాచ్ అల్ట్రా

ఆపిల్ వాచ్ అల్ట్రా

స్విమ్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్, క్రాక్ రెసిస్టెంట్ వాచ్.. ఆపిల్ తన ప్రత్యర్థులైన గార్మిన్, పోలార్ వంటి వాటికి దీటుగా సరికొత్త వాచ్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది.

వివిధ రకాల స్పోర్ట్స్‌కు ఇది బాగా ఉపయోగపడుతుందని ఆపిల్ చెబుతోంది.

36 గంటల బ్యాటరీ, 60 గంటల అదనపు బ్యాటరీ లైఫ్‌తో అల్ట్రా ట్రయలథాన్ (స్విమ్మింగ్, సైకిలింగ్, రన్నింగ్) పూర్తి చేయవచ్చని చెబుతోంది.

దీని ధర అమెరికాలో 799 డాలర్లు (సుమారు రూ. 63,684), బ్రిటన్‌లో 849 పౌండ్లు (సుమారు రూ. 77,875) నుంచి మొదలవుతుంది.

ఆపిల్
ఫొటో క్యాప్షన్, చాలాకాలం తరువాత నేరుగా హాజరు కావడం బాగుందని ఆపిల్ సీఈవో టిమ్ కుక్ బీబీసీతో అన్నారు

ఐఫోన్ 14

ఐఫోన్ 14‌ను రెండు సైజుల్లో విడుదల చేస్తున్నారు.. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్.

ఈ కొత్త ఫోన్లు అత్యవసర పరిస్థితుల్లో నేరుగా శాటిలైట్ ద్వారా సహాయం కోసం అభ్యర్థనలు పంపించగలుగుతాయి. ఆ సమయంలో చుట్టూ ఉన్న శాటిలైట్ల వివరాలు ఫోన్‌లో కనిపిస్తాయి. అలాగే పోన్‌ను వాటివైపు ఎలా గురిపెట్టాలో కూడా సూచిస్తుంది.

సుమారు 15 సెకండ్ల నుంచి కొన్ని నిమిషాలలోపు ప్రాథమిక సమాచారాన్ని అత్యవసర సేవలకు పంపిస్తుంది.

"శాటిలైట్ సామర్థ్యాన్ని ప్రవేశపెట్టడం చిన్న విషయం కాదు. దీనికి ఆపిల్‌కు ఎన్నో ఏళ్లు శ్రమపడి ఉంటుంది. శాటిలైట్ ప్రొవైడర్ గ్లోబల్‌స్టార్‌తో కమర్షియల్ అగ్రిమెట్ చేసుకోవడం, అత్యవసర సేవలకు మెసేజ్ పంపేందుకు కావలసిన మౌలిక సదుపాయాలు తయారుచేసుకోవడం.. వీటన్నిటికీ చాలా సమయం పడుతుంది" అని సీసీఎస్ ఇన్‌సైట్ చీఫ్ అనలిస్ట్ బెన్ వుడ్ అన్నారు.

"శాటిలైట్లను ఉపయోగించుకోవడం మంచి విషయమే. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో చిక్కుకుపోయినప్పుడు ఈ సేవలు బాగా ఉపయోగపడతాయి. అయితే, నమ్మదగిన, సమర్థవంతమైన కనెక్టివిటీ ఇప్పటికీ పెద్ద సవాలే" అంటున్నారు టెక్ విశ్లేషకుడు పావొలో పెస్కాటర్.

APPLE

ఫొటో సోర్స్, APPLE

ఐఫోన్ 14 కెమేరా

కొత్త ఐఫోన్ 14లో 12 మెగాపిక్సెల్స్ కెమేరా ఉంది. వేగంగా కదిలే వాటి ఫొటోలు బాగా తీస్తుందని, వెలుతురు తక్కువగా ఉన్న చోట ఫొటోలు తీసే సామర్థ్యం 49 శాతం పెరిగిందని కంపెనీ చెబుతోంది.

ఫ్రంట్ కెమేరాలో మొదటిసారిగా ఆటో ఫోకస్ జతచేశారు. దీనివల్ల సెల్ఫీలు బాగా వస్తాయంటున్నారు.

ఐఫోన్ 14 ధర అమెరికాలో 799 డాలర్లు (సుమారు రూ. 63,684), బ్రిటన్‌లో 849 పౌండ్లు (సుమారు రూ. 77,875) నుంచి మొదలవుతుంది.

AirPods

ఫొటో సోర్స్, APPLE

ఫొటో క్యాప్షన్, ఎయిర్‌పాడ్స్

ఐఫోన్ 14 ప్రో

ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్ డిజైన్‌లో వచ్చిన పెద్ద మార్పు.. స్క్రీన్ పైభాగం పిల్ షేప్‌లో ఉండడం.

బ్లాక్ నాచ్‌కు బదులు డైనమిక్ ఐలాండ్ అనే కొత్త ఫీచర్ వచ్చింది. బ్లాక్ నాచ్ గురించి గతంలో చాలామంది యూజర్లు ఫిర్యాదుచేశారు.

హ్యాండ్‌సెట్స్ ఊదా రంగు, నలుపు, వెండి, బంగారం రంగుల్లో వస్తున్నాయి. ఫోన్ వాడకంలో లేనప్పుడు స్క్రీన్ డిమ్ అయిపోతుంది. అలాగే రిఫ్రెష్ అయే శాతం తగ్గుతుంది.

వీడియో క్యాప్షన్, మొబైల్ ఫోన్ రీపేర్‌ను ఉపాధిగా మార్చుకుంటున్న మహిళలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)