ఆడ పాముల్లో లైంగిక అవయవాలు ఉంటాయని కనుగొన్న శాస్త్రవేత్తలు

snake

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఫ్రాన్సిస్ మావో
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పాముల్లో క్లిటోరిస్ ఉంటుందని ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఆడ పాములలో లైంగిక అవయవం ఉండదని చాలాకాలంగా భావిస్తున్నారు. కానీ, ఉంటుందని ఇప్పుడు నిరూపణ అయింది.

గతవారం పబ్లిష్ అయిన పరిశోధనా పత్రంలో తొలిసారిగా ఆడ పాము శరీరంలో జననాంగాల నిర్మాణాన్ని వివరంగా అందించారు.

పాము పురుషాంగం హెమిపెనిస్‌పై ఎన్నో దశాబ్దాలుగా అధ్యయనాలు జరుగుతున్నాయి. హెమిపెనిస్‌కు చివర్న ఫోర్క్‌లాగ ఉంటుంది. కొన్నిటికి స్పైక్స్ ఉంటాయని పరిశోధనలో తేలింది. 

కానీ, ఆడ పాము లైంగిక అవయాల గురించి ఎక్కువగా పరిశోధన జరగలేదు అని తాజా అధ్యయన పరిశోధకులు చెప్పారు. 

అది అంతుచిక్కనిది ఏం కాదు. కానీ, శాస్త్రవేత్తలు దానిపై ఎక్కువ ఆసక్తి చూపలేదు.

"మొదటగా, ఆడ జననాంగాల పట్ల ఉన్న ఆంక్షలు, శాస్త్రవేత్తలు పాములలో దీన్ని కనుగొనలేకపోవడం, పాములలో ఉభయలింగత్వం ఉంటుందని జనం నమ్మడం.. ఇవన్నీ కూడా ఆడ పాముల విషయంలో అధ్యయనాలు ఆలస్యం కావడానికి కారణాలు" అని తాజా అధ్యయన ప్రధాన పరిశోధకురాలు మేగన్ ఫోల్వెల్ అన్నారు.

ఆమె సహ రచయితగా ఉన్న పరిశోధన పత్రం 'ప్రొసీడింగ్స్ ఆఫ్ ది రాయల్ సొసైటీ బీ జర్నల్‌'లో ప్రచురితమైంది.

ఆడ పాము

ఫొటో సోర్స్, Alamy

ఆడ పాము తోకలో క్లిటోరిస్ ఉంటుందని తాజా పరిశోధనలో వెల్లడైంది.

పాములకు రెండు వేర్వేరు క్లిటోరిస్‌లు ఉంటాయి. వీటిని హెమిక్లిటోరిస్ అంటారు. ఒక కణజాలం ఈ రెండిటినీ విభజిస్తుంది. తోక కింది భాగంలో ఇవి ఉంటాయి.

రెండు గోడలతో ఉన్న ఈ అవయవంలో నరాలు, కొలాజెన్, ఎర్ర రక్త కణాలు ఉంటాయని, ఈ కణాలు అంగస్థంభన కణజాలానికి అనుగుణంగా ఉంటాయని పరిశోధకులు వివరించారు. 

"ఆడ పాములలో లైంగిక అవయవాలు ఉండవని లేదా పరిణామ క్రమంలో అవి మాయమైపోయాయని పుస్తకాలలో చదువుకున్నాం. కానీ, అది సరికాదనిపించింది. క్లిటోరిస్ చాలా జంతువుల్లో ఉంటుంది. పాములలో ఎందుకు ఉండదన్న సందేహం వచ్చింది" అని ఫోల్వెల్ చెప్పారు. 

ఈ సందేహమే తన పరిశోధనకు పునాది అని ఆమె చెప్పారు.

డెత్ యాడర్ అనే రకం పాములో క్లిటోరిస్ కనుగొన్నామని, అది గుండె ఆకారంలో పాములలో ఉండే వాసన గ్రంథుల పక్కనే ఉందని ఫోల్వెల్ తెలిపారు. ఈ వాసన గ్రంథుల ద్వారా ఆడ పాములు మగ పాములను ఆకర్షిస్తాయి.

వెంటనే, ఇతర రకాల పాములలో క్లిటోరిస్ కోసం వెతికారు. అన్నిట్లోనూ హెమిక్లిటోరిస్ కనిపించింది. అయితే, వాటి పరిణామాలలో తేడాలు ఉన్నాయి.

పాముల సెక్స్

ఫొటో సోర్స్, Getty Images

పాముల సెక్స్ గురించి కొత్త విషయాలు

తాజా పరిశోధన పాములలో జరిగే సంభోగం గురించి కొత్త విషయాలను తెలియజేస్తుంది. ఆడ పాములకు లైంగిక ఆనందం కలుగుతుందని ఊహించవచ్చు.

"మగ పాము సెక్స్ కోసం ఆడ పామును బలవంతం చేస్తుందని శాస్రవేత్తలు నమ్మారు" అని ఫోల్వెల్ చెప్పారు.

సంభోగం సమయంలో మగ పాములు చాలా దూకుడుగా ప్రవర్తిస్తాయి. ఆడ పాములు స్తబ్దుగా ఉంటాయి. అందుకే మగ పాములు బలవంతం చేస్తాయని సైంటిస్టులు విశ్వసించారు. 

"ఇప్పుడు క్లిటోరిస్ బయటపడడంతో ఆడ పాములకు లైంగిక ఆనందం కలుగుతుందని, మోహం, ప్రేరణ ఉంటాయని, అవి ఇష్టంతోనేే సెక్స్‌లో పాల్గొంటాయని తదుపరి పరిశోధనలలో బయటపడవచ్చు. అలాగే పాములలో కూడా ఫోర్‌ప్లే ఉంటుందని ఆశించవచు" అని ఫోల్వెల్ చెప్పారు. 

కొన్ని రకాాల పాములలో క్లిటోరిస్ చాలా సున్నితంగా, మిల్లీమీటరు కన్నా చిన్నదిగా ఉందని ఆమె తెలిపారు.

ఫోల్వెల్ కొత్త దృక్కోణమే ఈ పరిశోధనకు దారితీసిందని ఈ అధ్యాయం సహ పరిశోధకులు, అడిలైడ్ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ కేట్ సాండర్స్ అన్నారు. 

"సైన్స్ పరిశోధన ముందుకు సాగాలంటే భిన్న ఆలోచనలు, భిన్న దృక్పథాలు కలిగిన వ్యక్తులు ఉండాలని తాజా పరిశోధన మరోసారి నిరూపించింది" అన్నారు.

ఇవి కూడా చదవండి: