రేబిస్‌ని రాబందులు ఎలా అడ్డుకుంటాయంటే

రాబందులు

ఫొటో సోర్స్, Alamy

    • రచయిత, ఇసాబెల్ జెరెస్టెన్
    • హోదా, బీబీసీ ఫ్యూచర్

పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటంలో రాబందులు, హైనాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. రేబిస్ లాంటి వ్యాధుల వ్యాప్తిని ఇవి అడ్డుకోగలవు. మరి వాటికి తగిన ప్రాధాన్యాన్ని మనం ఇస్తున్నామా?

కళేబరాలను ఆహారంగా తీసుకునే జంతువులు, పక్షులను కొందరు చెడ్డవిగా చూస్తుంటారు. రాబందులు, హైనాల పేరు చెప్పగానే చాలా మంది అసహ్యించుకుంటారు.

ఇవి దుర్మార్గపు జీవులని కొందరు అంటారు. మరికొందరు వాటిని చూస్తే భయపడుతుంటారు.

‘‘గ్రీన్ హిల్స్ ఆఫ్ ఆఫ్రికా’’ నవలలో హైనాలను కళేబరాలను భక్షించే, కడుపుతో ఉండే జంతువులనూ వేటాడే, రాత్రిపూట పడుకొనేటప్పుడు మన మొహాలను పీక్కుతినే జంతువులు’’గా ఎర్నెస్ట్ హేమింగ్‌వే పేర్కొన్నారు.

ప్రాచీన కాలం నుంచి రాబందులను కూడా దురదృష్టానికి ప్రతీకగా, కళేబరాలకు గుర్తుగా చెప్పేవారు.

అయితే, కళేబరాలను భక్షించే ఈ జంతువుల గురించి శాస్త్రవేత్తలు కొత్త విషయాలు తెలుసుకున్నారు.

నిజానికి ఈ జంతువులకు మనం తగిన విలువ ఇవ్వడంలేదని వారు అంటున్నారు.

పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటంలో, ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చడంలో ఈ జీవులు ముందుటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కళేబరాలను భక్షించడం ద్వారా వాటి నుంచి ప్రమాదకర సూక్ష్మజీవులు.. మనుషులు, జంతువులకు వ్యాపించకుండా, పర్యావరణంలో కలవకుండా ఇవి అడ్డుకుంటున్నాయి.

తాజాగా చేపట్టిన అధ్యయనాల్లో ఈ జంతువుల వల్ల ఆరోగ్య, పర్యావరణ, ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతున్నట్లు వెల్లడైంది. వీటి సంఖ్య తగ్గిపోవడంతో వచ్చే ముప్పులను కూడా ఈ అధ్యయనాలు ప్రధానంగా ప్రస్తావించాయి.

‘‘జంతు కళేబరాలను తొలగించడంలో రాబందులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కళేబరాలను మెరుగ్గా పర్యావరణం నుంచి తొలగించే జంతుల్లో వీటిదే మొదటి స్థానం’’అని బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ ప్రిన్సిపల్ సైంటిస్టు విభు ప్రకాశ్ చెప్పారు. రాబందుల సంఖ్య పెంచేందుకు ఈ సొసైటీ కృషి చేస్తోంది. ‘‘తమ శరీరంలో బరువులో 40 శాతం వరకు ఆహారాన్ని ఇవి తీసుకోగలవు. మిగతా జంతువులు తమ శరీరంలో కేవలం 5 శాతం వరకే ఆహారాన్ని తీసుకోగలవు’’అని ఆయన చెప్పారు.

రాబందులు

ఫొటో సోర్స్, Alamy

అయితే, నేడు దక్షిణాసియా, ఆఫ్రికాలలో రాబందుల సంఖ్య చాలా వేగంగా తగ్గిపోతోంది.

వీటి సంఖ్య తగ్గిపోవడం 1990లలో మొదలైంది. ఆ తర్వాత చాలా వేగంగా పడిపోతూ వచ్చింది. 1990 10 కోట్ల నుంచి 16 కోట్ల వరకు రాబందులు భారత్‌లో ఉండేవి.

‘‘అసలు ఎటుచూసినా ఇవే కనిపించేవి’’ అని ప్రకాశ్ చెప్పారు. ‘‘భారీ స్థాయిలో ఇవి కళేబరాలను ఆహారంగా తీసుకొనేవి. దీంతో పర్యావరణం శుభ్రంగా ఉండేది’’అని ఆయన చెప్పారు.

అయితే, ఆ శతాబ్దం చివరికి వచ్చేసరికి ఒక్కసారిగా వీటి సంఖ్య పడిపోయింది. 1992 నుంచి 2007 మధ్య భారత్‌లోని మూడు ప్రధాన రాబందుల జనాభా 97 శాతం కంటే ఎక్కువే తగ్గిపోయింది.

అసలు ఇవి ఎందుకు చనిపోతున్నాయనే అంశంపై పరిశోధకులు దృష్టిసారించారు. వీటి శరీరాల్లో భార లోహాలు, పురుగు మందులు అవశేషాలు పేరుకున్నాయా? కాలుష్య కారకాలు ఎక్కువయ్యాయా? లాంటి అంశాలను పరిశీలించారు.

అయితే, చాలా రాబందులు కిడ్నీలు విఫలం చెందడం వల్ల చనిపోతున్నట్లు పరీక్షల్లో వెల్లడైంది. ముఖ్యంగా మనుషులు, జంతువుల్లో నొప్పుల నివారణకు తీసుకునే డైక్లోఫెనాక్ వీటికి ప్రాణాంతకంగా మారుతోందని గుర్తించారు.

‘‘రాబందుల జీవక్రియా రేటులో అసాధారణగా చర్యలు మేం గుర్తించాం. అవి డైక్లోఫెనాక్‌ను జీర్ణించుకోలేకపోతున్నాయి. ఫలితంగా వాటి కిడ్నీలు దెబ్బతింటున్నాయి’’అని ప్రకాశ్ చెప్పారు.

రాబందులు

ఫొటో సోర్స్, Getty Images

వీధి కుక్కలకు లాభం..

రాబందుల సంఖ్య తగ్గిపోవడంతో వీధి కుక్కలకు చాలా మేలు జరిగినట్లు అయ్యిందని ప్రకాశ్ చెప్పారు.

‘‘రాబందుల సంఖ్య తగ్గిపోవడంతో వీధుల్లో జంతు కళేబరాల సంఖ్య పెరిగుతోంది. ఇవి వీధి కుక్కలకు ఆహారంగా మారుతున్నాయి’’అని ఆయన వివరించారు.

మొత్తంగా ఇది మానవుల ఆరోగ్యానికి ముప్పుగా మారుతోంది.

‘‘ఆ కుక్కల వల్ల మనుషుల్లో రేబిస్ కేసుల సంఖ్య పెరుగుతోంది’’అని ప్రకాశ్ చెప్పారు. గత 20ఏళ్లలో భారీగా భారత్‌లో రేబిస్ కేసులు పెరిగాయని ఆయన వివరించారు.

ఇంగ్లండ్‌లోని బాత్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల సమాచారం ప్రకారం.. భారత్‌లో రాబందుల సంఖ్య తగ్గిపోవడంతో దాదాపు 55 లక్షల వీధి కుక్కల సంఖ్య పెరిగింది.

దీని వల్ల 1992 నుంచి 2006 మధ్య 3.85 కోట్ల కుక్కకాటులు నమోదయ్యాయి.

భారత్‌లోని జాతీయ సర్వేను పరిశీలిస్తే భారత్‌లో పత్రి లక్ష మందిలో 123 మంది కుక్క కాటు అనంతరం ర్యాబిస్‌తో మరణించారు.

‘‘రాబందులు భారత్‌లోని ప్రజలకు చాలా మేలు చేసేవి. జంతు కళేబరాలను విచ్ఛన్నం చేయడం నుంచి ఆధ్యాత్మక కార్యక్రమాల వరకు.. చాలా పనుల్లో ఇవి ఉపయోగపడేవి’’అని ఎక్స్‌టెర్ యూనివర్సిటీ ఎన్విరాన్‌మెంటల్, పబ్లిక్ హెల్త్ ఎకనమిక్స్ సీనియర్ ప్రొఫెసర్ టిమ్ టేలర్ చెప్పారు.

‘‘ఇక్కడ కళేబరాలను విచ్ఛిన్నం చేయడం అనేది చాలా ముఖ్యం. ఇవి వీధి కుక్కలకు ఆహారం అందుబాటులో లేకుండా చూసేవి. ఫలితంగా వీధి కుక్కల జనాభా తక్కువగా ఉండేది’’అని టేలర్ అన్నారు.

రేబిస్ వ్యాధికి చికిత్స, వీటి వల్ల సంభవిస్తున్న మరణాల ఆర్థిక భారాన్ని టేలర్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం అంచనావేసింది.

దీంతో 1993 నుంచి 2006 మధ్య భారత్ పరోక్షంగా రాబందుల సంఖ్య పడిపోవడంతో 34 బిలియన్ డాలర్లు (రూ.2.79 లక్షల కోట్లు)ను భారత్ నష్టపోయినట్లు వీరు తేల్చారు.

అంటే 2006లో భారత్ జీడీపీలో 3.6 శాతం ఇది.

వీధి కుక్కలు

ఫొటో సోర్స్, Alamy

ఆఫ్రికాలోనూ ఇంతే..

ఆఫ్రికాలోనూ రాబందుల సంఖ్య వేగంగా తగ్గిపోతోంది. అయితే, ఇక్కడి పరిస్థితులు, కారణాలు వేరు.

ఆఫ్రికా ఖండంలో మొత్తంగా రాబందుల సంఖ్య 97 శాతం వరకు పడిపోయింది. ఆఫ్రికా-యురేషియన్ రాబందుల్లోని 11 జాతుల్లో ఏడు నేడు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి.

ఇక్కడ సింహాలు లాంటి భారీ జంతువులను చంపేందుకు ఉపయోగిస్తున్న విషపూరిత పదార్థాలు, రసాయనాలు రాబందులపైనా ప్రభావం చూపిస్తున్నట్లు అంతరించిపోతున్న పక్షుల కోసం పనిచేసే పెరెగ్రిన్ ఫండ్ ఆఫ్రికా డైరెక్టర్ డేర్సీ ఒగాడా చెప్పారు.

‘‘సింహాల దాడుల వల్ల తమ పశువులను కోల్పోతున్న రైతులు ప్రమాదకర విష పదార్థాలు, రసాయనాలను ఉపయోగిస్తున్నారు. జంతువుల కళేబరాలపై వీటిని చల్లుతున్నారు. వీటిని మళ్లీ వచ్చి సింహాలు తింటాయని వారు భావిస్తున్నారు. కానీ, అలా జరగడం లేదు. వీటి వల్ల రాబందులు చనిపోతున్నాయి’’అని ఆమె వివరించారు.

‘‘మరోవైపు వేటాడిన ఏనుగులపైనా కొంతమంది పురుగుల మందులు చల్లుతున్నారు. ఫలితంగా ఈ జంతువులపై తిరిగే రాబందుల సంఖ్య తగ్గుతుంది. అప్పుడు తాము ఏనుగులను వేటాడినట్లు అధికారులకు తెలియకుండా ఉంటుంది. ఇది మరింత ప్రమాదకరం’’అని ఆమె చెప్పారు.

మరోవైపు కొంతమంది మూఢ నమ్మకాలతో కూడా రాబందులను చంపేస్తున్నారు. చేతబడిలో రాబందుల తలకాయలను దక్షిణ ఆఫ్రికా ప్రాంతాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారాని ఒగాడా చెప్పారు.

ఆఫ్రికాలో రాబందులు చనిపోవడంతో ఆరోగ్య ముప్పులు పెరుగుతున్నట్లు తమ అధ్యయనంలో తేలినట్లు ఒగాడా వివరించారు. రాబందులు లేనప్పుడు జంతువుల కళేబరాలను పీక్కుతినే హైనాలు, నక్కల సంఖ్య కెన్యాలో ఎక్కువ పెరిగినట్లు వీరి పరిశోధనలో వెల్లడైంది.

‘‘రాబందులు లేనప్పుడు ఈ జంతువుల సంఖ్య విపరీతంగా పెరిగింది. అయితే, ఇక్కడ కళేబరాల్లోని ఎముకలను పూర్తిగా తినడం రాబందులకు మాత్రమే తెలుసు. అవి తిన్న తర్వాత అక్కడ ఈగలు కూడా వాలవు. మిగతా జంతువులు అంత శుభ్రంగా ఆహారాన్ని తినలేవు’’అని ఒగాడా వివరించారు.

పైగా హైనాలు, నక్కలు మనుషులకు సమీపంలో తిరుగుతుంటాయి. వీటి వల్ల కొత్త ఇన్ఫెక్షన్లు చుట్టుముట్టే ముప్పు కూడా పెరుగుతుంది.

హైనాలు

ఫొటో సోర్స్, Getty Images

ఎందుకు ఇలా?

రాబందుల వల్ల చేకూరే ఆరోగ్య ప్రయోజనాలపై ఎక్కువగా చర్చించుకోరు. పైగా వీటి వల్ల వాతావరణంపై పడే సానుకూల ప్రభావం గురించి చాలా మందికి తెలియదు. రాబందుల సంఖ్య తగ్గిపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణంపై ప్రభావం పడుతోంది.

భారత్‌లో రాబందుల స్థానాన్ని వీధి కుక్కలు భర్తీ చేయలేవని ప్రకాశ్ అన్నారు. అంటే ఇక్కడ చాలా మృతదేహాన్ని అలానే ఉండిపోతున్నాయి.

ఈ కళేబరాలు అలా సహజంగా విచ్ఛిన్నం అయ్యేటప్పుడు వీటి నుంచి కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ లాంటి గ్రీన్‌హౌస్ వాయువులు పర్యావరణంలోకి విడుదల అవుతాయి. కానీ, రాబందుల వల్ల ఈ వాయువుల పరిమాణాన్ని కొంతవరకు తగ్గించొచ్చని అర్జెంటీనాలోని కోమాహ్యూ నేషనల్ యూనివర్సిటీ సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.

ఒక్కో రాబందు 0.2 నుంచి ఒక కేజీ వరకు కళేబరాలను రోజుకు ఆహారంగా తీసుకుంటుందని ఈ అధ్యయనకర్తలు అంచనావేశారు. కళేబరాలను అలా వదిలేయడంతో ఒక్కో కేజీ నుంచి 0.86 కేజీల సీవో2 పర్యావరణంలోకి విడుదల అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా 13 నుంచి 14 కోట్ల రాబందులు తగ్గిపోయినట్లు భావిస్తే, వీటి వల్ల మిలియన్ టన్నుల ఉద్గారాలు పర్యావరణంలోకి విడుదల అవుతాయి. అంటే కొన్ని దేశాల నుంచి వెలువడే ఉద్గారాల కంటే ఇది చాలా ఎక్కువ.

‘‘రాబందుల వల్ల పర్యావరణానికి జరిగే మేలును ఎవరూ భర్తీ చేయలేరు’’అని ఆ అధ్యయనం నొక్కిచెప్పింది.

భారత్‌లో రాబందుల సంఖ్య తగ్గిపోవడంతో నేడు కళేబరాలను పూడ్చిపెట్టడం ఎక్కువైంది. కొన్నింటిని నదులు, సముద్రాల్లోకి కూడా విసిరేస్తున్నారు. వీటి వల్ల నీరు, నేల కలుషితం అవుతున్నాయని ప్రకాశ్ చెప్పారు.

2004లో డైక్లోఫెనాక్ వల్ల రాబందుల సంఖ్య భారీగా పడిపోయిందని తెలుసుకున్నప్పుడు, విటి సంఖ్యను మళ్లీ పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలను భారత్‌లో మొదలుపెట్టారు. అయితే, ‘‘ఈ కార్యక్రమాలు అంత వేగంగా ఫలితాలు ఇవ్వడం లేదు. ఎందుకంటే ఐదు ఏళ్ల తర్వాతే రాబందులు వయసుకు వస్తాయి. పైగా సంవత్సరానికి ఒకే గుడ్డు పెడతాయి. మరోవైపు మొత్తం రాబందుల్లో సగం మాత్రమే యుక్త వయసు వరకు బతుకుతాయి’’అని ఆయన చెప్పారు.

వీడియో క్యాప్షన్, కింగ్ కోబ్రా: మనుషుల ప్రాణాలు కాపాడుతోందా?

హైనాలు కూడా ఇలానే..

ఇలా నిర్లక్ష్యానికి గురవుతున్న జంతువుల్లో హైనాలు కూడా ఉన్నాయి. ఇవి కూడా పర్యావరణానికి చాలా మేలు చేస్తాయి. అంథ్రాక్స్, టీబీ లాంటి ఇన్ఫెక్షన్లు కూడా ఇవి తగ్గించగలవు. అయితే, వీటి అవాస ప్రాంతాలు క్రమంగా తగ్గిపోతున్నాయి.

ఆఫ్రికాలో హైనాల వల్ల ఆరోగ్య, ఆర్థిక ప్రయోజనాలు చాలా చేకూరుతున్నాయని అమెరికాలోని మిషిగన్ యూనివర్సిటీ 2021లో చేపట్టిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఇథియోపియాలోని టీగ్రే ప్రాంతంలో మచ్చల హైనాలు దాదాపు 207 టన్నుల జంతు కళేబరాలను ఆహారంగా తీసుకున్నట్లు పరిశోధకులు అంచనా వేశారు.

హైనాలు ఉండేటప్పుడు, అవి లేనప్పుడు ఆర్థిక అంశాలు ఎలా ప్రభావితం అవుతున్నాయో పరిశోధకులు అంచనా వేశారు. దీంతో హైనాల వల్ల ఇథియోపియాలోని మెకెల్ పట్టణంలో ఆంథ్రాక్స్, టీబీ కేసులు తగ్గుతున్నట్లు వెలుగులోకి వచ్చింది.

‘‘ఈ వ్యాధుల నియంత్రణలో హైనాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు మా పరిశోధనలో తేలింది’’అని కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ బయోలజీ ప్రొఫెసర్ చిన్మయి సొనావనే చెప్పారు.

‘‘ఆంథ్రాక్స్, టీబీ వల్ల ఏటా ఇథియోపియాలో 6,000 మంది మనుషులు, 5,00,000 జంతువులు మరణిస్తున్నాయి’’అని అంచనా వేశారు.

వీడియో క్యాప్షన్, పెరుగుతున్న పులులతో అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలేంటి?

హైనాలు కళేబరాలను భక్షించడం వల్ల మెకెల్‌ను వ్యాధుల కట్టడికి వెచ్చించే 52,000 డాలర్లు (రూ.42.80 లక్షలు) ఆదా అవుతున్నాయని ఆ అధ్యయనం పేర్కొంది.

ఇన్ని సేవలు అందిస్తున్నప్పటికీ, రాబందులు, హైనాలకు తగిన విలువ, గుర్తింపు ఇవ్వడంలేదని పరిశోధకులు చెబుతున్నారు.

‘‘ఆఫ్రికాలో చిన్నచిన్న జంతువులను వేటాడే మాంసాహారిగా హైనాను భావిస్తారు. అందుకే వీటికి చాలా చెడ్డ పేరు ఉంది. మరోవైపు లయన్ కింగ్ లాంటి సినిమాల్లోనూ వీటిని చెడ్డగానే చూపించారు’’అని ప్రకాశ్ అన్నారు.

‘‘రాబందులను కూడా మరణాలకు ప్రతీకగా చాలా దేశాల్లో భావిస్తారు. నేపాల్‌లో ఇంటిపై రాబందు కూర్చుంటే, వారికి చేటు జరుగుతుందని, ఇంటిలో ఎవరో చనిపోతారని అంటారు. అసలు వాటి వల్ల జరిగే ప్రయోజనాలే గుర్తించరు’’అని ఆయన వివరించారు.

కళేబరాల నుంచి విడుదలయ్యే విష పదార్థాలు, విష వాయువులను రాబందులు, హైనాలు తగ్గించగలవని ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో వీటి సంఖ్యను పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలని పర్యావరణ ప్రేమికులు ఆశిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)