నేషనల్ హైవేలపై డ్రైవింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన 5 జాగ్రత్తలు ఇవే....

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రోహన్ నామ్‌జోషి
- హోదా, బీబీసీ మరాఠీ
కారు ప్రమాదంలో గాయపడ్డ క్రికెటర్ రిషభ్ పంత్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.
శనివారం రిషభ్ పంత్ నడుపుతున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో పంత్ నిద్రపోవడం ఇందుకు ప్రధాన కారణం.
రాత్రి పూట డ్రైవింగ్ చేయడం కూడా మరొక కారణంగా చెబుతున్నారు.
చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకోకపోవడం, నిర్లక్ష్యం వల్ల ఇలా వేల మంది ప్రతి ఏడాది ప్రమాదాలకు గురవుతున్నారు. వారిలో కొందరు చనిపోతున్నారు.
జాతీయ రహదారుల మీద డ్రైవింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సి ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటో చూద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
ప్లానింగ్
మీరు కారును రోడ్డు మీదకు తీసే ముందు చేయాల్సిన అతి ముఖ్యమైన పని... ప్లానింగ్.
ఎక్కడికి వెళ్తున్నాం... వెళ్లే దారి ఎలా ఉంటుంది... హైవేనా లేక ఎక్స్‌ప్రెస్ వేనా... ఎన్ని టోల్స్ ఉంటాయి... ఎంత సేపు డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది... ఈ ప్రశ్నలకు కచ్చితంగా సమాధానం తెలిసి ఉండాలి.
ఒకవేళ ప్రయాణించాల్సిన దూరం ఎక్కువగా ఉంటే... ‘నేను అంతదూరం డ్రైవింగ్ చేయగలనా?’ అనే ప్రశ్నను మనల్ని మనం చాలా నిజాయతీగా అడగాలి.
డౌట్‌గా ఉంటే మీరు డ్రైవింగ్ చేయకపోవడమే మంచిది. ఆ దారి గురించి బాగా అవగాహన ఉన్న డ్రైవర్‌ను తీసుకెళ్లడమే మేలు.
మీరే డ్రైవింగ్ చేయాలి అని నిర్ణయించుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వెళ్లే దారి మీద అవగాహన లేకుంటే గూగుల్ మ్యాప్స్ వంటి వాటి ద్వారా ముందుగానే రోడ్డును చెక్ చేసుకోవాలి. ఫోన్‌ను ఎప్పుడూ ఫుల్ చార్జింగ్‌లో ఉంచండి.
నిద్ర వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు రాత్రి పూట డ్రైవింగ్ చేయకండి. మీ పక్కన ఉన్న వాళ్లు నిద్రపోతుంటే మీకు కూడా నిద్ర రావొచ్చు.
రాత్రి పూట తప్పక ప్రయాణించాల్సి వస్తే డ్రైవర్‌ను తీసుకెళ్లండి. రాత్రి పూట డ్రైవింగ్ అనుభవం ఉన్న డ్రైవర్‌ను తీసుకెళ్లడం మంచిది.

ఫొటో సోర్స్, Getty Images
కారు కండిషన్
ఎక్కువ దూరం వెళ్లేటప్పుడు కారులో సరిపడిన పెట్రోలు/డీజిల్/గ్యాస్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి.
ప్రయాణించే దూరాన్ని బట్టి వెళ్లే దారిలో పెట్రోలు బంకుల సమాచారం ముందుగానే తెలుసుకోవాలి.
డ్రైవింగ్ చేసేటప్పుడు ఇంజిన్ సౌండ్, ఇతర శబ్దాల మీద ఒక చెవి వేసి ఉండాలి. శబ్దాల్లో ఏమైనా తేడా ఉందేమో గమనించాలి.
కారు టైర్లకు లేదా కింద భాగంలో ఏమైనా వస్తువులు తగులుకున్నాయో లేదో చూడాలి.
వాహనం హెడ్ లైట్లు, వెనుక ఉండే టెయిల్ లైట్లు, హార్న్ బాగా పని చేస్తూ ఉండాలి. ఏమైనా రిపేర్ ఉంటే వెంటనే చేయించాలి.
కారులో టూల్ కిట్ ఉండేలా చూసుకోవడంతోపాటు, హైవే మీద ఉండే కారు మెకానిక్‌ల నెంబరు దగ్గర పెట్టుకోవాలి.
ప్రతి 100 కిలోమీటర్లు ప్రయాణించిన తరువాత ఇంజిన్‌కు కాసేపు విశ్రాంతి ఇవ్వాలి. ‘మేం ఎక్కడా ఆగకుండా వెళ్లాం...నాన్ స్టాప్‌గా డ్రైవ్ చేశాం...’ అని ఎవరైనా చెబితే... అలాంటి మాటలను గుడ్డిగా పాటించకండి. నిపుణుల సలహాలు తీసుకోండి.

ఫొటో సోర్స్, Getty Images
ఏకాగ్రత
కారు రోడ్డు ఎక్కిన తరువాత మనసంతా డ్రైవింగ్ మీదనే ఉండాలి. డ్రైవింగ్ అనేది కళ మాత్రమే కాదు సైన్స్ కూడా. కారు స్పీడును ఒక్కసారిగా పెంచడం లేదా తగ్గించడం చేయకూడదు. అత్యంత వేగంగా కానీ అత్యంత నెమ్మదిగా కానీ నడపకూడదు.
డ్రైవింగ్ చేసేటప్పుడు పక్కన ఉండే వాళ్లతో మాట్లాడొచ్చు. కానీ రోడ్డు మీద నుంచి దృష్టి మళ్లేలా ఆ సంభాషణ ఉండకూడదు.
చిన్న పిల్లలను ఒడిలో కూర్చొబెట్టుకుని డ్రైవింగ్ చేయకండి. పిల్లలు మారం చేసినా సరే ఆ పని చేయకూడదు.
డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ కాల్ వస్తే బ్లూటూత్ ద్వారా మాట్లాడొచ్చు. కానీ ఫోను తీసుకొని చేతిలో పెట్టుకోవడం లేదా వాట్సాప్‌ను పదేపదే చెక్ చేయడం వంటివి చేయకూడదు.
కారును నడిపే వేగం చాలా ముఖ్యం. ఓవర్ స్పీడ్‌లో నడుపుతూ సాహసాలు చేయకూడదు. ‘గంటకు 150 కిలోమీటర్ల వేగంతో నడిపాను’ అంటూ వీడియోలు రికార్డు చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టుకోవడం అనేది హీరోయిజం కిందకు రాదు.
హైవేల మీద డ్రైవింగ్ లైన్లు ఉంటాయి. ఒక లైను నుంచి మరొక లైనుకు మారేటప్పుడు ఎలాంటి సంకేతాలు ఇవ్వాలో తెలుసుకుని పాటించాలి.
రాంగ్ సిగ్నల్స్ ఇచ్చి గందరగోళానికి గురి చేస్తే అది ప్రమాదానికి దారి తీస్తుంది. ముందు ఉండే వాహనాలను గుడ్డిగా ఓవర్ టేక్ చేయాలని ప్రయత్నించకండి.
డ్రైవింగ్‌లో తరచూ బ్రేక్ తీసుకోండి. నీళ్లతో ముఖం కడుక్కోండి. నిద్ర మంపుతో డ్రైవింగ్ చేయకండి.

ఫొటో సోర్స్, Getty Images
తాగి నడపవద్దు
మద్యం తాగి తరువాత ఎప్పుడూ డ్రైవింగ్ చేయకూడదు. పోలీసులు, ప్రభుత్వం ఎంత అవగాహన కల్పిస్తున్నా చాలా మంది తాగి బండి నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు.
మత్తు కలిగించే దగ్గు మందుల్లాంటివి తీసుకున్నప్పుడు కూడా డ్రైవింగ్‌కు దూరంగా ఉండటమే మేలు.
హైవే హిప్నాసిస్
అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు, అంతా బాగానే ఉంది. అయితే ఒకోసారి తెలియని మైకం మనసును ఆవహిస్తుంది. దీన్నే ‘హైవే హిప్నాసిస్’ అంటారు.
ఉదాహరణకు మీరు పుస్తకం చదువుతూ ఉంటారు. మీకు దగ్గర్లో ఎవరైనా మాట్లాడుకుంటూ ఉన్నా లేక మరేదైనా శబ్దం వస్తున్నా మీ మనసు తెలియకుండానే అటు వైపు మళ్లుతుంది.
మీ కళ్లు పుస్తకం మీదనే ఉంటాయి. కానీ మనసు ఆ శబ్దాల వెనుక పరిగెడుతూ ఉండటం వల్ల అక్షరాలు మీ బుర్రలోకి చేరడం తగ్గుతుంది.
ఎక్కువ సేపు డ్రైవింగ్ చేసినప్పుడు ఇలాగే జరుగుతుంది. కళ్లు రోడు మీదనే ఉంటాయి కానీ మనసు మాత్రం వేరే ఆలోచనల వైపు మళ్లుతుంది. ‘హైవే హిప్నాసిస్’ వల్ల డ్రైవర్ రెస్పాన్స్ కాస్త నెమ్మదిస్తుంది.
ఒకవేళ రోడ్డు మీద అకస్మాత్తుగా ఏదైనా అడ్డం వస్తే వెంటనే రియాక్ట్ కాలేరు. అలాంటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మనసు కాస్త మత్తుగా ఉన్నట్లనిపిస్తే బ్రేక్ తీసుకోవాలి.
హైవే మీద డ్రైవింగ్ చేయడం పెద్ద కష్టమైన విషయమేమీ కాదు. అయితే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీ ప్రయాణం మంచి జాలీ రైడ్ అవుతుంది.
ఇవి కూడా చూడండి:
- చార్లీ చాప్లిన్ శవపేటికను దొంగతనం చేసి, అతడి భార్యను బ్లాక్ మెయిల్ చేసిన దొంగల కథ మీకు తెలుసా..?
- దంతాల కోసం హిప్పోల అక్రమ వేట, ఆఫ్రికా ఏనుగుల్లాగే ఇవీ అంతరించిపోయే పరిస్థితికి వస్తుందా?
- మీ పిల్లల్లోని ‘అసాధారణ ప్రతిభ’ను ఎలా గుర్తించాలి
- చంద్రబాబు: కందుకూరు సభలో తొక్కిసలాటకు కారణం ఇదేనా
- అమెరికా మహిళల క్రికెట్ జట్టులో సగం మంది తెలుగు అమ్మాయిలే...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














