మోదీ ప్రధాని అవుతారని హీరాబెన్ 2002లోనే చెప్పారా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఇక్బాల్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తల్లి మరణం తర్వాత ప్రధాని మోదీ ఆమెతో తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఈ ఏడాది ఆమె పుట్టిన రోజున తాను కలిసినప్పుడు ఆమె తనకొక విషయం చెప్పారని మోదీ అన్నారు.
‘‘విజ్ఞతతో పనిచెయ్యి, స్వచ్ఛతతో జీవించు’’ అని తల్లి తనకు చెప్పారని మోదీ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.
ప్రధాని తల్లి హీరాబెన్‌ను అనేకమంది జర్నలిస్టులు ఇంటర్వ్యూ చేశారు.
జర్నలిస్టు భార్గవ్ పరేఖ్‌కు 2002లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ‘‘ఏదో ఒక రోజు అతను ప్రధాన మంత్రి అవుతాడు’’ అని ఆమె తన కొడుకు గురించి చెప్పారు.
హీరాబెన్‌ను ఇంటర్వ్యూ చేసిన వారిలో గుజరాత్‌కు చెందిన జర్నలిస్టు దేవాసి బరాద్ కూడా ఒకరు.
2007లో ఆయన హీరాబెన్‌ను ఇంటర్వ్యూ చేశారు. నరేంద్ర మోదీ ప్రధాని కావాలన్నది తన కల అని హీరాబెన్ తనతో చెప్పినట్లు దేవాసీ బరద్ వెల్లడించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
హీరాబెన్ నేపథ్యం ఏంటి ?
1923 జూన్ 18న గుజరాత్‌లోని మెహసానా జిల్లాలోని విస్‌నగర్‌లో హీరాబెన్ జన్మించారు.
ఈ గ్రామం వాద్‌నగర్‌కు సమీపంలో ఉంది. వాద్‌నగర్ ప్రధాని నరేంద్ర మోదీ స్వస్థలం.
అయితే ఆమె గురించిన సమాచారం గ్రామస్తులకు కూడా పెద్దగా తెలియదు.
నరేంద్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంత సమాచారం తెలియగా, ఆయన ప్రధాని అయ్యాకనే గుజరాత్ రాష్ట్రం వెలుపల ఆమె గురించి కొంత తెలిసింది.
ఆమెకు సంబంధించిన సమాచారం కూడా నరేంద్ర మోదీ స్వయంగా రాసుకున్న బ్లాగ్ ద్వారానే ఎక్కువగా తెలుస్తోంది.
వీటితోపాటు మోదీ రాసిన కొన్ని పుస్తకాలలో కూడా తల్లి హీరాబెన్‌కు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి.
ఈ ఏడాది జూన్‌లో మోదీ తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా తన బ్లాగ్‌లో కొన్ని విషయాలు రాశారు.
‘‘ మా అమ్మకు బడి అంటే ఏంటో తెలియదు. ఆమెకు తెలిసిందల్లా పేదరికం మాత్రమే’’ అని మోదీ ఆ బ్లాగ్‌లో రాసుకొచ్చారు.
హీరాబెన్ చాలా చిన్నగా ఉన్నప్పుడే ఆమె తల్లి చనిపోయారని, ఆమె తల్లి ప్రేమను పొందలేకపోయారని మోదీ వెల్లడించారు.
అప్పటి సంప్రదాయాల ప్రకారం చాలా చిన్న వయసులోనే తన తండ్రి దామోదర్ దాస్ మోదీని తన తల్లి వివాహమాడారని చెప్పారు.
అయితే, దామోదర్ దాస్ ఏ పని చేసేవారు, ఆయనకు జీవనాధారం ఏంటి అన్నదానిపై చాలా తక్కువ సమాచారం ఉంది.
తన తండ్రి రైల్వే స్టేషన్‌లో టీ అమ్మేవారని, చిన్నతనంలో తాను తండ్రికి సాయం చేసేవాడినని మోదీ రాశారు.
వివాహానంతరం నరేంద్రమోదీ తల్లిదండ్రులు వాద్‌నగర్‌లో స్థిరపడ్డారు.
దామోదర్ దాస్, హీరాబెన్‌లకు అయిదుగురు కొడుకులు, ఒక కూతురు (సోమా మోదీ, అమృత్ మోదీ, నరేంద్ర మోదీ, ప్రహ్లాద్ మోదీ, పంకజ్ మోదీ, వాసంతి మోదీ) ఉన్నారు. నరేంద్ర మోదీ మూడో కుమారుడు.
వాద్‌నగర్‌లో ఒక చిన్న ఇంట్లో దామోదర్ దాస్ మోదీ, హీరాబెన్ ఉండేవారు.

ఫొటో సోర్స్, ANI
మోదీ తన తల్లి గురించి ఇంకా ఏం రాశారు?
సంసారాన్ని ఈదడానికి తన తల్లి ఎన్నో కష్టాలు పడ్డారని మోదీ తన బ్లాగ్‌లో రాశారు.
‘‘ఇల్లు గడపడానికి, అదనపు సంపాదన కోసం ఆమె ఇళ్లలో అంట్లు కడిగేవారు. పత్తి తీసే పని చేశారు. మేం పత్తి తీస్తే మా చేతి వేళ్లకు పత్తికాయలకు ఉండే ముళ్లు గుచ్చుకుంటాయని ఆమె భయపడేవారు’’ అని పేర్కొన్నారు.
ఆమెకు శుభ్రత విషయంలో చాలా పట్టింపు ఉండేదని, ఇంటిని తానే స్వయంగా అలికి, అనేక అలంకరణలు చేసేవారని మోదీ పేర్కొన్నారు.
మోడీ అదే బ్లాగ్‌లో ఇలా రాశారు. ‘‘చేసే ప్రతిపనిలో పరిపూర్ణత ఉండాలని ఈ వయసులోనూ ఆమె భావిస్తుంటారు. గాంధీ నగర్‌లో నా సోదరుడు, మేనల్లుడి ఇళ్లు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఆమె అక్కడ తన పనులన్నీ తానే చేసుకుంటారు’’ అని మోదీ పేర్కొన్నారు.
నరేంద్ర మోదీ తండ్రి 1989లో చనిపోయారు. ఆ తర్వాత హీరాబెన్ వాద్‌నగర్ నుంచి తన చిన్న కొడుకు పంకజ్ మోదీతో కలిసి గాంధీనగర్ శివార్లలోని రైసన్ గ్రామానికి మారారు.
పంకజ్ మోదీ గుజరాత్ ప్రభుత్వ సమాచార శాఖలో పని చేసేవారు. ప్రభుత్వం ఇచ్చిన ఇంట్లో ఉండేవారు.

ఫొటో సోర్స్, NARENDRAMODI.IN
మోదీ సీఎం, పీఎం పదవిలో ఉన్నా అధికారిక నివాసానికి హీరాబెన్ వచ్చింది తక్కువే
ఫ్రెంచ్ రచయిత్రి సొంటల్ డెలోబెల్లె ఆర్డునో ‘‘నరేంద్ర మోదీ: ఎ లైఫ్ ఫర్ ఇండియా’’ అనే పుస్తకాన్ని రాశారు.
17 ఏళ్లు వాద్ నగర్‌లో నివసించిన మోదీ, జశోదాబెన్‌తో కలిసి ప్రాపంచిక జీవితాన్ని ప్రారంభించరాదని, ఇల్లు వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నారని తన పుస్తకంలో పేర్కొన్నారు.
2001లో నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు హీరాబెన్ ఓ మూలన కూర్చున్నారని, ఆమె నరేంద్ర మోదీ తల్లి అని చాలా తక్కువమంది మాత్రమే గుర్తించారని భార్గవ్ పరేఖ్ చెప్పారు.
భార్గవ తెలిపిన వివరాల ప్రకారం, 2003లో హీరాబెన్ తొలిసారిగా ముఖ్యమంత్రి నివాసానికి వచ్చారు. సీఎం నివాసంలో కుటుంబ సభ్యులంతా సమావేశమయ్యారు.
మోదీ 12ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా, హీరబెన్ ఒకటి రెండుసార్లకు మించి సీఎం నివాసానికి వెళ్లలేదు.
‘‘మా అమ్మ నాతో కలిసి ప్రభుత్వ కార్యక్రమంలో ఎప్పుడూ పాల్గొనేవారు కాదు. ఆమె నాతోపాటు రెండే రెండుసార్లు పబ్లిక్ ఈవెంట్‌కు వచ్చారు’’ అని మోదీ తన బ్లాగ్‌లో రాసుకున్నారు.

ఫొటో సోర్స్, NARENDRAMODI.IN
మోదీ ప్రధాని అయినా...
2014లో ప్రధాని అయ్యాక నరేంద్ర మోదీ దిల్లీకి నివాసం మార్చారు.
ఎనిమిదేళ్లుగా మోదీ ప్రధానిగా ఉన్నా, ఆయన దిల్లీ నివాసానికి హీరాబెన్ ఒకే ఒక్కసారి వచ్చినట్లు బహిరంగంగా తెలిసింది.
మోదీ స్వయంగా తన సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేశారు.
నరేంద్ర మోదీ తన తల్లిని తన దగ్గర ఎందుకు ఉంచుకోవడం లేదని ప్రతిపక్ష పార్టీలతో పాటు చాలామంది ప్రశ్నించారు.
మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా, హీరాబెన్ తన చిన్న కొడుకు పంకజ్ మోదీ దగ్గరే ఉండేవారు.
వారి ఇల్లు ముఖ్యమంత్రి నివాసానికి కేవలం మూడు-నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండేది. మోదీ ప్రధాని అయ్యాక కూడా ఆమె తన చిన్న కొడుకు దగ్గరే ఉండేవారు.
ఈ విషయమై దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు.

ఫొటో సోర్స్, NARENDRAMODI.IN
నోట్ల రద్దు సమయంలో బ్యాంకు దగ్గర క్యూలో నిల్చున్న హీరాబెన్
2017 జనవరిలో మోదీ తన తల్లిని కలిసేందుకు గాంధీ నగర్ వెళ్లారు. యోగా కార్యక్రమాన్ని రద్దు చేసుకుని తాను తల్లిని కలిసేందుకు వచ్చినట్లు మోదీ ట్వీట్ చేశారు.
ఆమెతో కలిసి అల్పాహారం చేశారు. అయితే, ఈ ట్వీట్‌పై కేజ్రీవాల్ విమర్శలు చేశారు.
‘‘నేను కూడా మా అమ్మతో కలిసి జీవిస్తున్నాను. రోజూ ఆమె ఆశీస్సులు తీసుకుంటాను. కానీ నేను ఇలా హడావుడి చేయను. రాజకీయాల కోసం తల్లిని బ్యాంకు దగ్గర క్యూలో నిలబెట్టను’’ అని ట్వీట్ చేశారు.
మరోవైపు మోదీ తన రాజకీయ ప్రయోజనాల కోసం తన తల్లితో ఉన్న ఫొటోలు, వీడియోలను ఉపయోగిస్తున్నారని కేజ్రీవాల్‌తో సహా చాలా మంది ఆరోపించారు.
2017 యూపీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఫతేపూర్‌లో జరిగిన ఓ ర్యాలీలో మోదీ మాట్లాడారు. తన తల్లి జీవితాంతం కట్టెల పొయ్యి మీదనే వంట చేసేదని, తాను తల్లుల బాధను స్వయంగా చూశానని మోదీ అన్నారు.
అయితే, దీనిపై కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. మరి అలాంటప్పుడు మోదీ తన తల్లిని తన దగ్గర ఎందుకు ఉంచలేదని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
నోట్ల రద్దు సమయంలో డబ్బు విత్‌డ్రా చేసేందుకు మోదీ తల్లి హీరాబెన్ బ్యాంకు దగ్గర క్యూలో నిలబడిన విషయంలో కూడా కేజ్రీవాల్ విమర్శలు చేశారు.
‘‘డబ్బు కోసం బ్యాంకు దగ్గర లైన్‌లో నిలబడాల్సి వస్తే నేను లైన్‌లో నిలబడతాను, నా తల్లిని నిలబెట్టను’’ అని కేజ్రీవాల్ అన్నారు.

ఫొటో సోర్స్, NARENDRAMODI.IN
విమర్శలపై మోదీ ఏమన్నారు?
మోదీ తల్లి తన మూడవ కొడుకు(నరేంద్ర మోదీ ) దగ్గర ఎందుకు జీవించడం లేదో బహిరంగంగా ఎప్పుడూ చెప్పలేదు.
2019లో సినీ నటుడు అక్షయ్ కుమార్‌తో జరిగిన సంభాషణలో మోదీ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆ సంభాషణ పూర్తిగా రాజకీయేతరమైనది.
ఈ సమయంలో అక్షయ్ కుమార్ మోదీ వ్యక్తిగత జీవితం గురించి చాలా ప్రశ్నలు అడిగారు. మీ తల్లి మీ దగ్గర ఎందుకు ఉండటం లేదన్నది కూడా ఆ ప్రశ్నల్లో ఒకటి.
ఈ ప్రశ్నకు సమాధానమిచ్చిన మోదీ, తన జీవితం చాలా భిన్నమైనదని, చిన్న వయసులోనే తాను ఇల్లు విడిచి వచ్చేశానని మోదీ వెల్లడించారు.
‘‘నేను ప్రధానిగా నా ఇంటి నుంచి వెళ్లి ఉంటే అందరూ నాతోపాటే ఉండాలని కోరుకునేవాడిని. కానీ నేను చాలా చిన్న వయసులోనే ఇల్లు వదిలి వెళ్లిపోయా. నా శిక్షణ కోసం అనుబంధాలన్నీ వదులుకున్నా. ‘నీ ఇంట్లో ఉండి నేనేం చేస్తా, నీతో ఏం మాట్లాడతా’ అని అమ్మ అడిగేది’’ అని మోదీ ఈ సంభాషణలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















