దంతాల కోసం హిప్పోల అక్రమ వేట, ఆఫ్రికా ఏనుగుల్లాగే ఇవీ అంతరించిపోయే పరిస్థితికి వస్తుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నవీన్ సింగ్ ఖాడ్కా
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
ప్రపంచవ్యాప్తంగా ఏనుగు దంతాల అక్రమరవాణాపై నిఘా మరింత పెరగడంతో దంతాల కోసం హిప్పోపొటమస్‌లను వేటాడటం కూడా పెరుగుతోంది.
పోయిన ఏడాది జూన్‌లో ఏనుగు దంతాల వ్యాపారం మీద బ్రిటన్ దాదాపుగా నిషేధం విధించింది. ఆ తరువాత హిప్పో దంతాల వ్యాపారం ఒక్కసారిగా పెరిగినట్లు స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి.
‘ఏనుగు దంతాల వ్యాపారం మీద నిషేధం విధించిన ఒక నెలలోపే బ్రిటన్‌లో హిప్పో దంతాల వ్యాపారం పెరిగినట్లు మేం గుర్తించాం’ అని ఫ్రాంకీ తెలిపారు. ఇందుకు సంబంధించిన నివేదికను విడుదల చేసింది ఫ్రాంకీ బృందం.
1989లో ప్రపంచవ్యాప్తంగా ఏనుగు దంతాల అక్రమరవాణా మీద నిషేధం విధించేందుకు దేశాలు అంగీకరించిన నాటి నుంచే హిప్పో దంతాల అక్రమరవాణా మొదలైనట్లు పరిశోధకులు చెబుతున్నారు.
‘అసలే అంతరించి పోయే ముప్పు ఎదుర్కొంటున్న హిప్పోలను ఇలా దంతాల కోసం వేటాడితే వాటి మనుగడ మరింత ప్రమాదంలో పడుతుందని’ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏనుగు దంతాల మాదిరిగానే హిప్పో దంతాలను కూడా బొమ్మలు, కళాకృతులు వంటివి చేసేందుకు ఉపయోగిస్తారు. ఏనుగు దంతాలతో పోలిస్తే హిప్పో దంతాలను సాధించడం చాలా సులభం, అలాగే ఖరీదు కూడా తక్కువ.
ఏనుగు దంతాలు 2 మీటర్ల వరకు పొడవు ఉంటాయి. హిప్పోల దంతాలు 50 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి. ఏనుగు దంతాలతో బొమ్మలు చెక్కడ సులభం. కానీ హిప్పో దంతాలు గట్టిగా ఉంటాయి కాబట్టి చెక్కడ అంత తేలిక కాదు.
కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్(సీఐటీఈఎస్) కింద హిప్పో శరీరభాగాలను విక్రయించొచ్చు. ఇందుకు అనుమతులు కావాలి.
హిప్పో దంతాల అమ్మకాలను సీఐటీఈఎస్ రికార్డు చేయడం ప్రారంభించిన తరువాత, 1975 నుంచి 2017 మధ్య 7లక్షల 70వేల కిలోల హిప్పో దంతాలను చట్టబద్ధంగా విక్రయించారు. కానీ అక్రమంగా జరిగే వ్యాపారం కూడా అధికంగానే ఉంటుంది.
యూరోపియన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం 2020లో యూరప్‌లో పట్టుకున్న జంతువుల శరీరభాగాల్లో హిప్పో దంతాలే ఎక్కువ.
‘నేడు ఆఫ్రికాలోని అనేక ఎయిర్‌పోర్టుల్లో హిప్పో దంతాలను స్నిప్ఫర్ డాగ్స్ పసిగడుతున్న కేసులు బాగా పెరుగుతున్నాయి. అలా కుక్కలు గుర్తించినంత మాత్రాన అన్ని దంతాలు దొరికినట్లు కాదు. అక్రమంగా రవాణా చేసే వాటిలో సగం మాత్రమే దొరుకుతున్నాయి’ అని ఆఫ్రికా వైల్డ్‌లైఫ్ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ ఫిలిఫ్ మురుతీ అన్నారు.
2016 నాటికి ప్రపంచవ్యాప్తంగా లక్షా 15వేల నుంచి లక్షా 30వేల వరకు హిప్పోలు ఉండొచ్చని యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్(ఐయూసీఎన్) అంచనా వేసింది. 1994తో పోలిస్తే వాటి సంఖ్య 30శాతం తగ్గిపోయింది.
అటవీ విస్తీర్ణం తగ్గిపోతూ ఉండటంతోపాటు వేటాడటం వల్ల పశ్చిమ, మధ్య ఆఫ్రికాలోని 10 దేశాల్లో హిప్పోల సంఖ్య వేగంగా తగ్గిపోతోంది. హిప్పో దంతాల వ్యాపారం మీద పూర్తిగా నిషేధం విధించాలని సీఐటీఈఎస్‌ను ఆ దేశాలు కోరుతున్నాయి. పోయిన నెలలో పనామాలో జరిగిన సమావేశంలో ఆ డిమాండ్‌ను ఆఫ్రికా దేశాలు ముందుకు తీసుకొచ్చాయి. కానీ గత 10ఏళ్లలో ఒక జాతి జనాభా 50శాతం కంటే ఎక్కువ తగ్గితే అప్పుడు మాత్రమే సీఐటీఈఎస్ నిర్ణయం తీసుకోగలుగుతుంది.
అయితే ఈయూ కూటమితోపాటు తూర్పు, దక్షిణ ఆఫ్రికా దేశాలు మాత్రం హిప్పోల సంఖ్య బాగానే ఉందని, వాటి గురించి ఆందోళనపడాల్సిన అవసరం లేదని చెబుతున్నాయి.
‘వాస్తవానికి హిప్పోల సంఖ్యను కచ్చితంగా లెక్కించేందుకు శాస్త్రీయంగా జరిగిన పరిశోధనలు చాలా తక్కువ. హిప్పోలు ఎక్కువగా ఉండే దేశాలకు అక్కడ ఏం జరుగుతుందో బాగా తెలుస్తుంది. కాబట్టి వారి మాటలను కొట్టి పారేయకూడదు’ అని హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ సీనియర్ డైరెక్టర్(పబ్లిక్ ఎఫైర్స్) జొయన్నా స్వాబే అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
హిప్పోలు చాలా తక్కువ సంఖ్యలో పిల్లలకు జన్మను ఇస్తుంటాయి. సుమారు రెండేళ్లకు ఒక్కసారి మాత్రమే ఒక్క బిడ్డను కంటాయి. అందువల్ల వాటి సంఖ్య తగ్గిపోవడం వల్ల అది హిప్పోల మనుగడ మీదనే ప్రభావం చూపుతుంది.
- హిప్పోలు ఆఫ్రికాలో నివసిస్తాయి.
- హిప్పోలు రెండు రకాలు. కామన్ హిప్పోలు 1,15,000 నుంచి 1,30,000 మధ్య ఉంటాయి. పిగ్మీ హిప్పోల సంఖ్య 2,000 నుంచి 3,000 మధ్య ఉంటుంది.
- ఐయూసీఎన్ కింద కామన్ హిప్పోలను ‘అంతరించిపోవడానికి అవకాశం’ ఉన్న జాతిగా గుర్తించారు.
- 2009 నుంచి 2018 మధ్య 13,909 హిప్పోలకు చెందిన శరీరభాగాలు, ఉత్పత్తులను విక్రయించారు. వాటిలో మూడో వంతు టాంజానియా, యుగాండా, జాంబియా, జింబాబ్వే దేశాలదే.
- 1975-2017 మధ్య 7,70,000 కేజీల హిప్పో దంతాలను చట్టబద్ధంగా విక్రయించారు.
హిప్పో దంతాల చట్టపరమైన, అక్రమ వ్యాపారాలను చాలా దగ్గరగా గమనించాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. సీఐటీఈఎస్ అపెండిక్స్-2లో కామన్ హిప్పోలను చేర్చారు. అంటే దంతా వ్యాపారాన్ని ఆపకపోతే అవి అంతరించి పోయే ప్రమాదం ఉందని అర్థం.
హిప్పోలను అక్రమంగా వేటాడి ఆ తరువాత దంతాలను చట్టబద్ధమైన పద్ధతుల్లోకి మార్చి అమ్ముతున్నారని 10 ఆఫ్రికా దేశాలు వాదిస్తున్నాయి. అందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెబుతున్నాయి.
తగిన చర్యలు తీసుకునే వరకు హిప్పోలకు కూడా ఏనుగుల పరిస్థితే వస్తుంది. దంతాల కోసం విపరీతంగా వేటాడటం వల్ల ఆఫ్రికా అటవీ ఏనుగు జాతి ఇప్పుడు అంతరించి పోయే దశకు చేరుకుంది. ప్రభుత్వాలు మేల్కొకుంటే హిప్పోలకు కూడా అదే దుస్థితి రావచ్చు.
ఇవి కూడా చదవండి:
- క్రిస్మస్: భారత్‌లో తొలి క్రిస్మస్ కేక్ ఎక్కడ, ఎలా తయారైంది? ఆ కథ మీకు తెలుసా...
- కైకాల సత్యనారాయణ: ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి హీరోలతో పోరాడిన విలన్
- తెలంగాణలో తొలి ట్రాన్స్‌జెండర్ డాక్టర్: ‘రోగులు మొదట నా దగ్గర వైద్యం చేయించుకోవడానికి సంకోచిస్తారు, తరువాత చేతులెత్తి మొక్కుతారు’
- నిరుద్యోగులు రూ. లక్ష నుంచి 50 లక్షల వరకు రుణం పొందడం ఇలా
- అటల్ బిహారీ వాజపేయి: ప్రేమించిన అమ్మాయిని వాజపేయి ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













