భీమా కోరేగావ్: గౌతమ్ నవ్‌లఖాకు సుప్రీం కోర్టు బెయిల్, ఈ కేసులో ఇప్పటివరకు ఏం జరిగింది?

ఫొటో సోర్స్, TWITTER
- రచయిత, మయూరేశ్ కొన్నూర్
- హోదా, బీబీసీ మరాఠీ
భీమా కోరేగావ్ కేసులో రచయిత, జర్నలిస్టు, సామాజిక కార్యకర్త గౌతమ్ నవ్‌లఖాకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నవ్‌లఖాకు బాంబే హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌పై విధించిన స్టేను పొడిగించలేమని సుప్రీం కోర్టు మంగళవారం తెలిపింది. స్టేను ఎత్తివేసింది.
భీమా కోరేగావ్ కేసులో 2018లో నవ్‌లఖా అరెస్టయ్యారు.
అనారోగ్య కారణాల దృష్ట్యా ఆయన్ను గృహనిర్బంధంలో ఉంచేందుకు గత ఏడాది నవంబర్‌లో సుప్రీం కోర్టు అనుమతించింది. డిసెంబరులో ఆయనకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
అయితే, ఎన్‌ఐఏ సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకోవడానికి వీలు కల్పిస్తూ మధ్యంతర స్టే (బెయిల్ ఆదేశాల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు) విధించింది.
దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు, బెయిల్ సందర్భంగా బాంబే హైకోర్టు విధించిన షరతులతో నవ్‌లఖాను విడుదల చేసేందుకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఎన్‌ఐఏ అప్పీల్‌పై సుప్రీం కోర్టులో విచారణ కొనసాగనుంది.
గృహనిర్బంధానికి అయిన ఖర్చుల నిమిత్తం రూ.20 లక్షలు చెల్లించాలని నవ్‌లఖాను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆయన గృహనిర్బంధం సందర్భంగా భద్రతా ఏర్పాట్ల కోసం రూ.1.64 కోట్లు చెల్లించాలని ఎన్‌ఐఏ కోరింది. అయితే, రూ.20 లక్షలు చెల్లించాలని నవ్‌లఖాను కోర్టు ఆదేశించింది.
అంతకుముందు గృహనిర్బంధ ఖర్చుల కోసం నవ్‌లఖా రూ.2.4 లక్షలు డిపాజిట్ చేశారు. విడుదలకు ముందే ఈ రూ.20 లక్షలు చెల్లించాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.

అసలేం జరిగింది?
మహారాష్ట్రలో పుణేకు దగ్గరలో ఉన్న భీమా కోరేగావ్‌ను 2018 జనవరి 1న అల్లర్లు దేశాన్ని కుదిపేశాయి.
1818లో జరిగిన భీమా కోరేగావ్ యుద్ధానికి 200 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో వేడుకలు చేసుకునేందుకు ఆ రోజు అక్కడకు లక్షల మంది దళితులు వచ్చారు. అయితే, అక్కడ చెలరేగిన అల్లర్లు దేశం మొత్తం ప్రకంపనలు సృష్టించాయి.
పుణేలోని శనివార్‌వాడాలోని నిర్వహించిన ‘‘ఎల్గార్ పరిషత్’’ కాన్ఫెరెన్స్‌లో రెచ్చగొట్టే ప్రసంగాలే ఈ అలర్లకు కారణమని, మావోయిస్టులకు కూడా దీనితో సంబంధముందని ఆరోపణలు చేస్తూ దీనిపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ కాన్ఫెరెన్స్ 2017, డిసెంబరు 31న జరిగింది.
ఈ కేసులో భిన్న రాష్ట్రాలకు చెందిన వామపక్ష ఉద్యమకారులు, రచయితలు, జర్నలిస్టులు, ప్రొఫెసర్లు, టీచర్లను పోలీసులు అరెస్టు చేశారు.
‘‘దేశానికి వ్యతిరేకంగా కుట్ర పన్నడం’’తోపాటు అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద కూడా నిందితులపై పోలీసులు ఆరోపణలు మోపారు. జనవరి 2020లో ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు బదిలిచేశారు.
ఘటన జరిగి ఐదేళ్లు గడుస్తున్నాయి. అయితే, ఇప్పటికీ చాలా మంది నిందితులు జైలులోనే ఉన్నారు. కోర్టుల్లో సుదీర్ఘ పోరాటం గత ఏడాది కొంతమందికి బెయిలు వచ్చింది. నిందితుల్లో ఒకరు గృహ నిర్బంధంలో ఉన్నారు. మరొకరు మరణించారు.
మీడియాలో విపరీతంగా చర్చ జరిగిన ఈ కేసులో మొత్తంగా 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
సురేంద్ర గాడ్లింగ్, సుధీర్ ధావలే, రోనా విల్సన్, షోమా సేన్, మహేశ్ రౌత్, రచయిత వరవర రావు, సామాజిక కార్యకర్తలు సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరీరా, వెర్నన్ గొంజాల్వెజ్, జర్నలిస్టు గౌతమ్ నవ్‌లఖాలను 2018 జూన్, ఆగస్టు నెలలో అరెస్టు చేశారు. రచయిత-ప్రొఫెసర్ ఆనంద్ తెల్తుంబ్డే, ఫాదర్ స్టాన్ స్వామి, హనీ బాబు, సాగర్ గోర్ఖే, రమేశ్ గైచోర్, జ్యోతి జగ్తాప్‌లను ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల అరెస్టుల తరహాలోనే వీరి బెయిల్ పిటిషన్లపైనా మీడియాలో పెద్దయెత్తున చర్చ జరిగింది. జైలులో ఉన్నప్పుడు వీరిని పీడించిన అనారోగ్య సమస్యలు, వీరికి అక్కడ అందుబాటులోనున్న సదుపాయాలు, కేసులో ఆధారాలు, వారికి వ్యతిరేకంగా పోలీసులు చేసిన ఆరోపణలు ఇలా చర్చ జరుగుతూ వస్తోంది.
2022లో ఈ కేసుకు సంబంధించిన కొన్ని కోర్టు తీర్పులు, ఆదేశాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
గృహ నిర్బంధం నుంచి బెయిల్

ఫొటో సోర్స్, Getty Images
ఈ కేసులో తాజా పరిణామం అంటే, రచయిత, జర్నలిస్టు, సామాజిక కార్యకర్త గౌతమ్ నవ్‌లఖాకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో 73 ఏళ్ల నవ్‌లఖాను జైలుకు బదులుగా గృహ నిర్బంధంలో ఉంచాలని గత నవంబరులో సుప్రీం కోర్టు సూచించింది. అయితే, దీనిపై ఎన్ఐఏ అభ్యంతరాలు వ్యక్తంచేసింది. కానీ, సుప్రీం కోర్టు గృహ నిర్బంధానికే మొగ్గుచూపింది. ఆయన ప్రస్తుతం ముంబయిలోని తన ఇంట్లో గృహ నిర్బంధంలో ఉన్నారు.
టెలిఫోన్ ఉపయోగించడం, ఇతరులను కలవడం తదితర విషయాల్లో కోర్టు షరతులు విధించింది. ఈ షరతులకు కట్టుబడి ఉన్నంతవరకు గృహ నిర్బంధంలో ఉండొచ్చని కోర్టు సూచించింది.
2018లోనే నవ్‌లఖాను అరెస్టు చేయాలని పుణె పోలీసులు ప్రయత్నించారు. భీమా కోరేగావ్ కేసు కుట్రలో ఆయనకు ప్రధాన పాత్ర ఉందని వారు ఆరోపించారు. అయితే, 2020 ఏప్రిల్‌లో దిల్లీలోని ఎన్ఐఏ ప్రధాన కార్యాలయానికి నేరుగా నవ్‌లఖా వచ్చారు. అప్పుడే ఆయన్ను అరెస్టు చేశారు.
తనపై మోపిన ఆరోపణలను కొట్టివేయాలని కోరుతూ నవ్‌లఖా కూడా కోర్టును ఆశ్రయించారు. ఆయన్ను అరెస్టు చేయకుండా అటు బాంబే హైకోర్టు, ఇటు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేశాయి.
అయితే, ఈ ఆదేశాల గడువు ముగిసిన తర్వాత ఆయన నేరుగా దిల్లీలోని ఎన్ఐఏ కార్యాలయానికి వచ్చారు. అరెస్టు చేసిన అనంతరం ఆయన్ను తలోజా జైలుకు తరలించారు.

ఫొటో సోర్స్, ANI
ఆనంద్ తెల్తుంబ్డేకి బెయిలు
అరెస్టైన రెండేళ్ల తర్వాత, నవంబరు 18న బాంబే హైకోర్టు రచయిత-ప్రొఫెసర్ ఆనంద్ తెల్తుంబ్డేకు బెయిలు మంజూరుచేసింది.
తెల్తుంబ్డే బెయిలుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టును ఎన్ఐఏ ఆశ్రయించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టి, బెయిలు ఇవ్వాలంటూ బాంబే హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది.
రూ.లక్ష బెయిలు బాండ్‌పై తెల్తుంబ్డేను బాంబే హైకోర్టు విడుదల చేసింది. బీమా కోరేగావ్-ఎల్గార్ పరిషద్ కేసులో 2020 ఏప్రిల్ 14న ఆయన అరెస్టు అయ్యారు. ఆయన్ను తలోజా జైలుకు తరలించారు.
దళిత హక్కులపై ఆనంద్ తేల్తుంబ్డే ఎక్కువగా మాట్లాడుతుంటారు. మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లా రాజుర్ గ్రామంలో జన్మించిన ఆయన నాగ్‌పుర్‌లోని విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజినీరింగ్ పూర్తిచేశారు.
కొన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత చదువుకోవడానికి ఆయన ఐఐఎం అహ్మదాబాద్‌కు వెళ్లారు. అక్కడ ఆయన కొన్ని పరిశోధనా పత్రాలు ప్రచురించారు. ఆ తర్వాత కార్పొరేట్ రంగంలోనూ కొన్ని పదవులు చేపట్టారు.
ఐఐటీ ఖగర్‌పుర్‌లో ఆయన ప్రొఫెసర్‌గా పనిచేశారు. అరెస్టు చేసే సమయంలో గోవా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ఆయన పనిచేస్తున్నారు. ఇప్పటివరకు ఆయన 26 పుస్తకాలు ప్రచురించారు. కొన్ని పత్రికలు, మ్యాగజైన్‌లకు కాలమిస్టుగా కూడా ఉండేవారు.
ఈ కేసుపై 2018 ఆగస్టు 31న అప్పటి అదనపు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ పుణెలో ఒక విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి వివరాలు వెల్లడించారు. ఎల్గార్ పరిషత్ సమావేశం తర్వాత విడుదలచేసిన ఒక లేఖలో తెల్తుంబ్డే పేరు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ లేఖను ఒక ‘‘కామ్రేడ్’’ రాశారని వెల్లడించారు.
ఏప్రిల్ 2018లో ప్యారిస్‌లో జరిగిన ఓ కాన్ఫెరెన్స్ అనంతరం ఆనంద్ తెల్తుంబ్డే ఇంటర్వ్యూ ఇచ్చారని, ఆ కాన్ఫెరెన్స్‌తోపాటు ఇంటర్వ్యూకు కూడా మావోయిస్టులే నిధులు సమకూర్చారని పోలీసులు చెప్పారు.
అయితే, ఆ ఆరోపణలను తెల్తుంబ్డే ఖండించారు. ఈ కేసులో తనకు వ్యతిరేకంగా దాఖలైన ప్రాథమిక విచారణ నివేదిక (ఎఫ్ఐఆర్)ను కొట్టివేయాలని ఆయన బాంబే హైకోర్టును కూడా ఆశ్రయించారు.
ఆయన బెయిలు అభ్యర్థనపై విచారణ చేపట్టే సమయంలో.. యూఏపీఏలోని సెక్షన్ 39 (మిలిటెంట్ సంస్థలతో సంబంధాలు)ల కింద తెల్తుంబ్డేపై విచారణ చేపడుతున్నామని బాంబే హైకోర్టు ధర్మాసనానికి ఎన్ఐఏ తెలిపింది.
ఈ ఆరోపణలు రుజువైతే గరిష్ఠంగా పదేళ్ల వరకు తెల్తుంబ్డేకు జైలు శిక్ష విధించే అవకాశముంది. అయితే, ఇప్పటికే ఆయన రెండేళ్లు జైలులో గడిపారు. దీంతో ఆయనకు బెయిలు జారీ చేయొచ్చని కోర్టు అభిప్రాయపడింది.

ఫొటో సోర్స్, RAVI PRAKASH
స్టాన్ స్వామి మరణం..
రాంచీకి చెందిన ఫాదర్ స్టాన్ స్వామిని కూడా భీమా కోరేగావ్ కేసులో నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ (ఎన్ఎస్ఏ) చట్టం కింద ఆరోపణలు మోపి 2018లోనే అరెస్టు చేశారు. ఆయనకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు.
83 ఏళ్ల స్టాన్ స్వామికి అనారోగ్య సమస్యలు ఉండేవి. జైలులో తనకు సదుపాయాలు సరిగ్గా లేవని, మంచి నీరు తాగడానికి స్ట్రాలు కూడా ఇవ్వడంలేదని ఆయన కోర్టుకు తెలియజేశారు.
2021 మే నెలలో బాంద్రాలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రికి స్టాన్ స్వామిని తరలించారు. అయితే, ఆ తర్వాత ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. 2021 జులై 5న ఆయన ఆసుపత్రిలోనే మరణించారు.
1991లో స్టాన్ స్వామి జార్ఖండ్‌కు వచ్చారు. అక్కడి ఆదివాసీల హక్కుల కోసం ఆయన పనిచేసేవారు. ఆదివాసీల తరఫున ఆయన నిరసనలు కూడా చేపట్టారు.
మావోయిస్టులుగా ముద్రవేసి జైళ్లకు తరలించిన 3,000 మంది ఆదివాసీలను విడుదల చేయాలంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో ఆదివాసీల నుంచి భూములను కొన్ని కంపెనీలు లాక్కుంటున్నాయని ఆయన పదేపదే చెప్పేవారు.
అయితే, భీమా కోరేగావ్ కేసులో స్టాన్ స్వామిని ఇరికించేందుకు హ్యాకింగ్ ద్వారా కుట్ర జరిగిందని ఇటీవల అమెరికాకు చెందిన ఓ ఫొరెన్సిక్ సంస్థ ఆరోపించింది.
దీనిపై వాషింగ్టన్ పోస్టులో ఒక కథనం కూడా ప్రచురించారు. ద ఆర్సెనల్ కన్సల్టింగ్ సంస్థ చెప్పిన అంశాలతో ఈ కథనం ప్రచురించారు. ఈ కేసులో స్టాన్ స్వామికి వ్యతిరేకంగా ఆయన ల్యాప్‌టాప్‌లో హ్యాకింగ్ ద్వారా కొన్ని పత్రాలు చొప్పించారని ఆ సంస్థ పేర్కొంది.

ఫొటో సోర్స్, PRESS TRUST OF INDIA
సుధా భరద్వాజ్‌కు బెయిలు
ఈ కేసులో బెయిలు పొందిన కొద్ది మందిలో సుధా భరద్వాజ్ ఒకరు. 2021 డిసెంబరులో సుధాకు బాంబే హైకోర్టు బెయిలు మంజూరుచేసింది. దీనికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టును ఎన్ఐఏ ఆశ్రయించింది.
అయితే, ఎన్ఐఏ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. మరోవైపు బెయిలు సమయంలో సుధా భరద్వాజ్ ముంబయిని విడిచిపెట్టి బయటకు వెళ్లకూడదని కోర్టు సూచించింది.
కార్మిక సంఘాల ఉద్యమకర్తగా, లాయర్‌గా సుధా భరద్వాజ్‌కు మంచి పేరుంది. ఆమె కూడా ఆదివాసీలు, అణగారిన వర్గాల కోసం పనిచేస్తుంటారు.
అమెరికాలో పుట్టిన ఆమె తన అమెరికా పాస్‌పోర్టును వదులుకున్నారు. ఇక్కడకు వచ్చినప్పటి నుంచి అణగారిన వర్గాల కోసం ఆమె పనిచేయడం మొదలుపెట్టారు.
భీమా కోరేగావ్ కుట్రలో ఆమెకు కూడా పాత్ర ఉందని పోలీసులు ఆరోపించారు. మావోయిస్టులతో ఆమెకు సంబంధాలు ఉన్నాయని పోలీసులు అభియోగాలు మోపారు. ఆ తర్వాత ఆమెను కూడా అరెస్టు చేసి తలోజా జైలుకు తరలించారు.

ఫొటో సోర్స్, AFP
వరవర రావుకు బెయిలు
హైదరాబాద్‌కు చెందిన రచయిత వరవర రావును కూడా ఈ కేసులో పుణె పోలీసులు అరెస్టు చేశారు. రెండేళ్లపాటు జైలులో గడిపిన తర్వాత, ఆరోగ్యం క్షీణించడంతో ముంబయిలోని నానావతి ఆసుపత్రికి ఆయనను తరలించారు.
ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా బెయిలు జారీ చేయాలంటూ కోర్టులను ఆయన అభ్యర్థించారు. అయితే, చివరగా జులై 2022లో ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సుప్రీం కోర్టు ఆయనకు బెయిలు జారీచేసింది.
మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై ఇదివరకు కూడా వరవర రావును పోలీసులు అరెస్టు చేశారు.
వరవర రావు, సుధా భరద్వాజ్ లాంటి కొందరికి ఈ కేసులో బెయిలు లభించింది. అయితే, ఇప్పటికీ మరికొందరు ఇంకా జైలులోనే గడుపుతున్నారు. వీరు కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే, వీరి పిటిషన్లపై విచారణ ఇంకా పెండింగ్‌లో ఉంది.

రెండు వర్గాల మధ్య అల్లర్లు
ఈస్ట్ ఇండియా కంపెనీ, మరాఠాల మధ్య భీమా కోరేగావ్ యుద్ధానికి 200 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో భీమా కోరేగావ్‌లో ఒక కార్యక్రమాన్ని 2018 జనవరి 1న ఏర్పాటుచేశారు. ఇక్కడి విజయ స్తంభం దగ్గరకు లక్షల మంది ప్రజలు వచ్చారు. అయితే, రెండు వర్గాల మధ్య అల్లర్లు చెలరేగాయి, రాళ్లు రువ్వుకున్నారు, వాహనాలకు కూడా నిప్పు పెట్టారు. ఈ అల్లర్లలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘర్షణలకు ముందు రోజు శనివార్‌వాడాలో ఎల్గార్ పరిషద్ కాన్ఫెరెన్స్‌ను ఏర్పాటుచేశారు.
ఎల్గార్ పరిషద్ కాన్ఫెరెన్స్‌కు ప్రకాశ్ అంబేడ్కర్, జిగ్నేష్ మేవానీ, ఉమర్ ఖలీద్, సోని సోరి, బీజీ కోల్సే పాటిల్ తదితరులు కూడా హాజరయ్యారు.
భీమా కోరేగావ్ ఘర్షణల తర్వాత పోలీసులు రెండు భిన్న కేసులు నమోదుచేశారు. మరోవైపు 2018 జనవరి 2న హిందూత్వ కార్యకర్తలు శంభాజీ భీడే, మిలింద్ ఏక్బోటేలపై పింప్రీ పోలీస్ స్టేషన్‌లోనూ ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది.
2018 జనవరి 8న తుషార్ దాంగుడే అనే వ్యక్తి దాఖలుచేసిన ఫిర్యాదుపై శనివార్‌వాడాలో ఎల్గార్ పరిషత్‌కు సంబంధించిన వ్యక్తులు ఇచ్చిన ప్రసంగాలవల్లే ఆ మర్నాడు హింసలు చెలరేగాయని పుణేలోని విశ్రాంబాగ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగానే తరువాతి నెలల్లో దేశవ్యాప్తంగా రాజకీయ, సామాజిక కార్యకర్తలను అరెస్టు చేశారు.
అదే ఏడాది మే 17న యూఏపీఏ చట్టం, ఐపీసీలోని 13, 16, 18, 18బీ, 20, 39, 40 సెక్షన్ల కింద పూణే పోలీసులు కేసు నమోదు చేశారు.
పూణే పోలీసులు దర్యాప్తు పూర్తిచేసిన తర్వాత, ఈ కేసును ఎన్ఐఏకు బదిలీ చేశారు. ఆ తర్వాత పది వేల పేజీల అభియోగపత్రాన్ని ఎన్ఐఏ దాఖలుచేసింది.

చార్జిషీటులో ఏముంది?
సోషల్ యాక్టివిస్ట్ గౌతమ్ నవలఖాకు కశ్మీరీ వేర్పాటువాదులు, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, మావోయిస్టు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని ఎన్ఐఏ దాఖలు చేసిన చార్జ్‌షీట్ పేర్కొంది.
విద్యార్థుల్లో మావోయిస్టు భావజాలాన్ని ప్రోత్సహించేందుకు దిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హనీ బాబుపై కూడా ఆరోపణలు మోపారు.
కబీర్ కాలా మంచ్‌కు చెందిన సాగర్ గోర్ఖే, రమేష్ గైచోర్, జ్యోతి జగ్తాప్..ముగ్గురూ శిక్షణ పొందిన సీపీఐ (మావోయిస్ట్) సభ్యులని ఎన్ఐఏ ఆరోపించింది.
భీమా కోరేగావ్ శౌర్య ప్రేరణా అభియాన్ సమన్వయకర్తలలో ఆనంద్ తెల్తుంబ్డే ఒకరని, 2017 డిసెంబర్ 31న శనివార్‌వాడాలో ఆయన కూడా ఉన్నారని ఎన్ఐఏ చార్జ్‌షీట్ పేర్కొంది.
నిందితులందికీ భీమా కోరేగావ్ అల్లర్ల కుట్రతో సంబంధముందని ఎన్ఐఏ ఆరోపించింది.
హిందూ కార్యకర్తలు కూడా..
పుణె సిటీ పోలీసులు భీమా కోరెగావ్ హింస వెనుక వామపక్ష కార్యకర్తల హస్తం ఉందనే ఆరోపణలపై దర్యాప్తు చేసినప్పుడు, రూరల్ పోలీసులు మాత్రం హింస వెనుక చాలా మంది హిందుత్వ నేతల పాత్ర ఉందనే ఫిర్యాదులపై దర్యాప్తు మొదలుపెట్టారు.
హిందుత్వ నేతలు భీమా కోరెగావ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో జనాలను హింసకు రెచ్చగొట్టారని జనవరి 2న పింప్రి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. మిలింద్ ఏక్బోటే, శంభాజీ భిడే అనే హిందుత్వ నేతలు జనాలకు నాయకత్వం వహించారని, జనవరి 1న దళిత సంస్థల కార్యక్రమంలో వారు హింసను సృష్టించారని అనితా సాల్వే ఫిర్యాదు చేశారు.
ఏప్రిల్ 19న పుణె సెషన్స్ కోర్ట్ ఏక్బోటేకు బెయిల్ ఇచ్చింది. మరో నిందితుడు శంభాజీ భిడే 2018 జనవరి 1న భీమా కోరెగావ్‌లో ఉండి, ప్రజలను రెచ్చగొట్టారని ఆరోపణలు వచ్చినా ఆయన్ను ఎప్పుడూ అరెస్ట్ చేయలేదు.
చాలా సంస్థలు శంభాజీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. న్యాయస్థానం తలుపు కూడా తట్టాయి. ఆ కేసులో పోలీసులు ఇప్పటివరకూ చార్జిషీటు కూడా ఫైల్ చేయలేదు.
ఇవి కూడా చదవండి:
- వరల్డ్ కప్ ఫైనల్: ఇక ఫుట్‌బాల్ రారాజు మెస్సీయేనా
- ఖతార్‌లో ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌తో దుబాయ్ భారీగా ఎలా లబ్ధి పొందుతోందంటే
- Argentina vs France: అర్జెంటీనాకు యువ ఆటగాడు జులియన్ అల్వారెజ్ ఎలా కీలకం అయ్యాడు
- సోక్రటీస్: ప్రపంచంలోనే అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాడు.. ప్రపంచ కప్ గెలవలేకపోయాడు
- పీలే: ఫుట్‌బాల్ దిగ్గజం కన్నుమూత
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















