మన శ్వాస, శరీరం నుంచి వచ్చే చెమట చుట్టుపక్కల వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయా?

ఫొటో సోర్స్, UNIVERSIDAD DE CALIFORNIA EN IRVINE
- రచయిత, అలీసియా హెర్నాండెజ్
- హోదా, బీబీసీ న్యూస్
మనం శ్వాస తీసుకునేటప్పుడు, చెమట ద్వారా కొన్ని రసాయనాలను పరిసరాల్లోకి విడుదల చేస్తుంటాం. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు ఎప్పుడో కనుగొన్నారు. అయితే, చుట్టుపక్కల వాతావరణాన్ని కూడా మన శరీరం ప్రభావితం చేయగలదా?
ఇదే అంశంపై జర్మనీలోని మ్యాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కెమిస్ట్రీ పరిశోధకులు, అమెరికా, డెన్మార్క్ శాస్త్రవేత్తలతో కలిసి ఒక అధ్యయనం చేపట్టారు. మన శరీరం చుట్టూ ఒక ‘‘ఆక్సిడేషన్ ఫీల్డ్’’ ఉంటుందని, ఇది మన చుట్టుపక్కల పరిసరాలను ప్రభావితం చేస్తుందని దీనిలో తేలింది.
మన ఇంటిలో లేదా బయట లేదా ఉద్యోగాలు చేసే కార్యాలయాల్లో మనపై భిన్న రకాల రసాయనాలు ప్రభావం చూపిస్తుంటాయి. పెయింట్లు, గ్యాస్ ఉద్గారాలతో మొదలుపెట్టి వంట చేయడం, పారిశుద్ధ్యం ఇలా చాలా పనుల్లో మనకు తెలియకుండానే మనం రసాయనాలతో కలిసి పనిచేస్తుంటాం.
కొన్ని రసాయనాలు సహజసిద్ధంగానే బయట వాతావరణంలో నిర్వీర్యం అయిపోతుంటాయి. అయితే, కొన్ని మాత్రం అలానే పర్యావరణంలో ఉండిపోతాయి. ఇవి అయితే, సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావైలెట్ కిరణాలతో నీటి ఆవిరి, ఓజోన్ కలిసినప్పుడు ఆక్సిడేషన్ జరుగుతుంది.
ఈ ఆక్సిడేషన్ ప్రక్రియలో హైడ్రాక్సిల్ ర్యాడికల్స్ (ఓహెచ్) ఉత్పత్తి అవుతాయి. ఇవి పర్యావరణంలోని ఇతర రసాయనాలను తొలగించడంలో క్రియాశీల పాత్ర పోషిస్తాయి. అందుకే వీటిని ‘‘అట్మాస్ఫియర్ డిటర్జెంట్లు’’అని పిలుస్తుంటారు.
అయితే, ఇంటిలోపల ఈ రసాయనాల పరిస్థితి కాస్త క్లిష్టంగా ఉంటుంది. ఇంట్లో కూడా కొంత ఆక్సిడేషన్ జరుగుతుంది. బయట నుంచి వచ్చే ఓజోన్ వల్ల ఆక్సిడేషన్ జరిగి, కొన్ని రసాయనాలు విచ్ఛిన్నం అవుతాయి.
అయితే, మిగతా రసాయనాలను మన శరీరం చుట్టుపక్కల ఉండే ఆక్సిడేషన్ ఫీల్డ్ నిర్వీర్యం చేస్తుందని తాజా అధ్యయనంలో తేలింది.

ఫొటో సోర్స్, UNIVERSIDAD DE CALIFORNIA EN IRVINE
కొత్త అధ్యయనం
‘‘మన చుట్టుపక్కల వాతావరణం ఎలా శుభ్రంగా మారుతుందో తెలుసుకోవడంపై మనం ఎప్పటి నుంచో దృష్టిసారిస్తున్నాం. దీనిలో భాగంగానే మన శరీరం చుట్టూ ఉండే అద్భుతమైన ఆక్సిడేషన్ ఫీల్డ్ గురించి మరింత సమాచారం తెలుస్తోంది’’అని మ్యాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్రొఫెసర్ జోనథన్ విలియమ్స్ చెప్పారు.
ఇప్పటివరకు మన ఇంట్లోని వస్తువులు, పెయింట్లు, కర్టెన్లు విడుదలచేసే రసాయనాలపైనే మనం ఎక్కువగా దృష్టి సారిస్తున్నాం. అయితే, ఇక్కడి అన్నింటిలోనూ ప్రధాన పాత్ర పోషించేది మనుషులే.
‘‘అందుకే ఇంటిలోపల వాతావరణంపై మనుషులు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నారో మేం తెలుసుకోవాలని భావించాం’’అని జోనథన్ చెప్పారు.
ఆరుబయట మనుషులు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నారో తెలుసుకునేందుకు ఉపయోగించిన విధానాలనే ప్రస్తుతం ఇంట్లో మనుషుల ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఉపయోగించారు.
‘‘ఇతర ప్రభావాలకు లోనయ్యే అవకాశం తక్కువగా ఉండే వాతావరణంలో మేం పరిశోధన చేపట్టాం. మనుషుల నుంచి ఎలాంటి రసాయనాలు విడుదల అవుతున్నాయో మేం తెలుసుకోవాలని భావించాం. ఇలాంటి పరిశోధన చేపట్టడం ఇదే తొలిసారి’’అని మ్యాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన శాస్త్రవేత్త నోరా జనోని చెప్పారు.

ఫొటో సోర్స్, MIKAL SCHLOSSER, UNIVERSIDAD TÉCNICA DE DINAMARCA
ఈ పరిశోధన కోసం స్టెయిన్‌లెస్ స్టీల్‌తో ప్రత్యేకంగా ఒక గదిని సిద్ధం చేశారు. దీని లోపల పర్యావరణంపై ఇతర ప్రభావాలు లేకుండా జాగ్రత్త వహించారు. దీనిలోకి ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలను పంపించారు.
‘‘ఇది కాస్త వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే లోపల ఫర్నీచర్, కార్పెట్.. అసలు ఏమీ లేవు. మరోవైపు లోపలకు వెళ్లిన వారు వేసుకునే బట్టలు కూడా సువాసనలు వెదజల్లే డిటర్జెంట్లతో ఉతక్కుండా జాగ్రత్త వహించాం. అసలు అక్కడ ఎలాంటి రసాయనాలకు తావు లేకుండా చూశాం’’అని జోనథన్ వివరించారు.
భిన్న ఉష్ణోగ్రతలు, తేమతో కూడిన వాతావరణాల నడుమ ఈ పరిశోధన చేపట్టారు. మరోవైపు పరిశోధనలో పాల్గొన్న వ్యక్తుల బట్టలను కూడా మధ్యలో మార్చుకోవాలని సూచించారు. గది లోపలకు వెళ్లే ఓజోన్ స్థాయిల్లోనూ మార్పులు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆక్సిడేషన్..
భిన్న స్థాయిల్లో ఓజోన్ గదిలోకి పంపినప్పుడు.. భిన్న స్థాయిల్లో హైడ్రాక్సిల్ ర్యాడికల్స్ ఉత్పత్తి అవుతున్నట్లు పరిశోధనల్లో రుజువైంది. ‘‘ఈ ఫలితాలు మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేశాయి. ఎందుకంటే ఇక్కడ ర్యాడికల్స్ పెద్దమొత్తంలో ఉత్పత్తి అయ్యాయి’’అని జోనథన్ చెప్పారు.
ఓజోన్‌తో మానవ చర్మం చర్యలు జరిపి హైడ్రాక్సిల్ ర్యాడికల్స్ ఉత్పత్తి చేస్తోందని పరిశోధనలో గుర్తించారు.
‘‘సహజంగా మన చర్మం ఒక ఆయిల్‌ను ఉత్పత్తి చేస్తోంది. దీనిలోని కొన్ని రసాయనాలతో ఓజోన్ చర్యలు జరుపుతోంది’’అని జోనథన్ వివరించారు.
ఇక్కడ వరుస చర్యలు జరుగుతున్నాయి. మొదటగా చర్మం విడుదలచేసే ఆయిల్స్‌తో ఓజోన్ రసాయన చర్యలు జరుపుతోంది. దీని వల్ల ఒకరకమైన గ్యాస్ రూపంలో కొన్ని అణువులు విడుదల అవుతున్నాయి. ఇవి చుట్టుపక్కల పర్యావరణంలో ఓజోన్‌తో మళ్లీ చర్యలు జరుపుతున్నాయి. అలా ఓహెచ్ ర్యాడికల్స్ ఉత్పత్తి అవుతున్నాయి.
ఓజోన్‌కు ప్రభావానికి లోనయ్యే చర్మం విస్తీర్ణం పెరిగినప్పుడు మరింత ఎక్కువగా ఓహెచ్ ర్యాడికల్స్ ఉత్పత్తి అవుతున్నట్లు పరిశోధనలో తేలింది.

ఫొటో సోర్స్, UNIVERSIDAD DE CALIFORNIA EN IRVINE
చుట్టుపక్కల మొత్తంగా
మన చుట్టుపక్కల ఉండే ఓహెచ్ ర్యాడికల్స్ ఫీల్డ్ ఎంత సేపటివరకు ఉంటుందో తెలుసుకునేందుకు అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు ఒక కైనెటిక్-కెమికల్ మోడల్‌ను రూపొందించారు. మరోవైపు పెన్సిల్వేనియా యూనివర్సిటీ నిపుణులు కూడా ఒక ఫ్లూయిడ్ డైనమిక్స్ మోడల్‌ను సిద్ధం చేశారు.
ఈ రెండు మోడల్స్ సాయంతో భిన్న వెంటిలేషన్, ఓజోన్ స్థాయిల్లో మనుషులు ఆక్సిడేషన్ ఫీల్డ్ ఎలా ఉంటుందో పరిశీలించారు.
‘‘మనుషులు ఆక్సిడేషన్ ఫీల్డ్ ప్రభావం ఎక్కువగానే ఉంటోంది. గణనీయంగానే ఇది వాతావరణంపై ప్రభావం చూపిస్తుంది’’అని ఈ అధ్యయనాలు ధ్రువీకరించాయి.
ఆక్సిడేషన్ ఫీల్డ్‌పై రూపొందించిన గ్రాఫిక్స్ మోడల్స్‌లో మన శరీరం నుంచి బయటకు వేడి ఆవిర్లు విడుదల అవుతున్నట్లుగా కనిపించింది.
ఈ చిత్రాలను చూసినప్పుడు, కొందరు ఆధ్యాత్మిక గురువులు చెప్పే ‘‘ఆరా’’ (శక్తి క్షేత్రం) మన చుట్టూ ఉన్నట్లుగా కనిపిస్తోందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
‘‘నిజానికి ఆ ఫీల్డ్ ఎలా ఉంటుందోనని ఊహించుకున్నప్పుడు అలా అనిపిస్తూ ఉండొచ్చు. దీనికి ‘ఆరా’కు ఎలాంటి సంబంధమూ లేదు’’అని జోనథన్ వివరించారు.
భవిష్యత్‌లో ఎలా..
ఈ పరిశోధనను తొలి అడుగుగా అటు జోనథన్, టు జనొని చెప్పారు. అయితే, మన జీవితంలోని చాలా అంశాలపై భవిష్యత్‌లో ఇది ప్రభావం చూపే అవకాశముందని వివరించారు.
‘‘ఇంట్లోని విష వాయువుల స్థాయిలను తగ్గించడం, వాయు నాణ్యతను పెంచడం లాంటి అంశాల్లో ఈ పరిశోధన తోడ్పడే అవకాశముంది’’అని జనొని చెప్పారు.
మరోవైపు మనుషుల ఆరోగ్యంపై ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే కోణంలోనూ పరిశోధనలు జరిగే అవకాశముందని వివరించారు. అయితే, దీన్ని ధ్రువీకరించేందుకు మరిన్ని లోతైన పరిశోధనలు అవసరమని తెలిపారు.
‘‘మన ఆరోగ్యంపై ప్రభావం అనేది చాలా ముఖ్యమైన అంశం. ముఖ్యంగా కోవిడ్-19 వ్యాప్తి లాంటి సమయాల్లో మనం ఒకేచోట దీర్ఘకాలం ఉండాల్సి వస్తోంది’’అని జనొని వివరించారు.
మరోవైపు సోఫా, పెయింట్లు లాంటి పదార్థాల నుంచి వెలువడే రసాయనాలపై చేపట్టే పరిశోధనల్లోనూ మార్పు చోటుచేసుకునే అవకాశముందని వివరించారు.
‘‘ఇప్పటివరకు సోఫా నుంచి నేరుగా వెలువడే రసాయనాలపైనే పరిశోధనలు జరిగాయి. ఇప్పుడు దానిపై ఎవరైనా కూర్చున్నప్పుడు, వారి ఆక్సిడేషన్ ఫీల్డ్ ఎలా ప్రభావితం అవుతుంది? అనే కోణంలో పరిశోధనలు జరగొచ్చు’’అని జనొని చెప్పారు.
మరోవైపు మన రిలేషన్‌షిప్‌లపై ఆక్సిడేషన్ ఫీల్డ్ ఎలాంటి ప్రభావం చూపుతుందనే కోణంలోనూ పరిశోధనలు జరగొచ్చని జనొని వివరించారు.
‘‘ఎందుకంటే మనుషుల మధ్య రసాయన సంకేతాల ద్వారా సమాచారం బదిలీ అవుతుంటుంది. ఇక్కడ ఒకరి ఆక్సిడేషన్ ఫీల్డ్ మరొకరి ఫీల్డ్‌ను ప్రభావితం చేయొచ్చు’’అని జనొని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- కరెంటు, తిండీ లేకుండా సముద్రంలోనే నెల రోజులు, చివరికి ఎలా బయటపడ్డారు?
- కోవిడ్-19 బీఎఫ్7: ఆక్సిజన్ సిలిండర్, మందులు కొని ఇంట్లో పెట్టుకోవాలా?
- అమ్మ ఒడి : బడికి వెళ్లే పిల్లలకు ఇచ్చే రూ.15 వేలు తీసుకోవడం ఎలా?
- క్రికెట్: ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 భారత ఆటగాళ్లు వీళ్లే...
- చార్లీ చాప్లిన్ శవపేటికను దొంగతనం చేసి, అతడి భార్యను బ్లాక్ మెయిల్ చేసిన దొంగల కథ మీకు తెలుసా..?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















