మనిషి మెదళ్లను తినే ప్రాణాంతకమైన అమీబా ఇది, ఎలా సోకుతుంది?

బ్రెయిన్ ఈటింగ్ అమీబా

ఫొటో సోర్స్, Science Photo Library

ఫొటో క్యాప్షన్, కొరియాలో తొలి బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసు

దక్షిణ కొరియాలో అత్యంత ప్రాణాంతకమైన బ్రెయిన్ ఈటింగ్ అమీబా సోకిన తొలి కేసు నమోదైంది.

‘నెగ్లేరియా ఫాలెరీ’ అనే అమీబా నీటి ద్వారా ప్రజలకు సోకుతుంది. అది ముక్కు రంధ్రాల ద్వారా మెదడుకు పాకి మెదడు కణజాలాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది.

దీంతో రోజుల వ్యవధిలోనే రోగి మరణిస్తారు.

థాయ్‌‌లాండ్ నుంచి దక్షిణ కొరియాకు వచ్చిన ఒక 50 ఏళ్ల వ్యక్తికి ఈ వ్యాధి సోకి మరణించినట్టు ‘ది కొరియా టైమ్స్’ పేర్కొంది.

కొరియా తిరిగి వచ్చిన కొన్ని రోజుల్లోనే సదరు వ్యక్తి చనిపోయినట్లు కొరియా డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఏజెన్సీ తెలిపినట్టు ది న్యూస్ అవుట్‌లెట్ కథనం చెప్పింది.

బాధితుడు డిసెంబర్ 10న కొరియా వచ్చారని, దానికి ముందు నాలుగు నెలల పాటు థాయ్‌‌లాండ్‌లో ఉన్నారని తెలిపింది.

థాయ్‌‌లాండ్ నుంచి తిరిగి వచ్చిన సాయంత్రమే ఆ వ్యక్తిలో తలనొప్పి, జ్వరం, వాంతులు, సరిగ్గా మాట్లాడలేకపోవడం, మెడ పట్టడం వంటి లక్షణాలు కనిపించాయి.

మెదడు నాడీమండల వ్యవస్థపై ప్రభావం వల్ల ఈ లక్షణాలు కనిపిస్తాయి.

ఆ తర్వాత రోజు వెంటనే ఆయన్ను ఎమర్జెన్సీ రూమ్‌కి తరలించారు. థాయ్‌‌లాండ్ నుంచి వచ్చిన తెల్లారే ఆస్పత్రిలో చేరిన ఆయన, డిసెంబర్ 21న చనిపోయారు.

దక్షిణ కొరియాలో నమోదైన తొలి బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసు ఇది.

రెండు రకాలుగా ఈ అమీబా ఆయనకు సంక్రమించి ఉండవచ్చునని భావిస్తున్నారు.

ఈ అమీబాతో కలుషితమైన నీళ్లలో ఈదినపుడు ఆ నీరు ముక్కులోపలికి వెళ్లినపుడు దాని నుంచి ‘నెగ్లేరియా ఫాలెరీ’ అమీబా ఆయన మెదడుకు చేరి ఉండవచ్చు.

భారత్‌లో కూడా ఇలాంటి కేసులు నమోదు

అయితే, ఇంతకుముందు భారత్‌లో కూడా ఇలాంటి కేసులు నమోదయ్యాయి.

2020లో కేరళలోని కోజికోడ్‌కు చెందిన ఒక 12 ఏళ్ల బాలుడు స్విమ్మింగ్ పూల్‌కి వెళ్లి వచ్చి ఈ ‘నెగ్లేరియా ఫాలెరీ’ అమీబా బారిన పడ్డాడు.

తలనొప్పి, వాంతులు, స్పృహ తప్పడం వంటి లక్షణాలతో బేబీ మెమోరియల్ హాస్పిటల్‌లో చేరిన ఈ బాలుడు, అక్కడే మరణించాడు.

డాక్టర్లు దీన్ని అత్యంత ప్రాణాంతకమైన వ్యాధిగా పేర్కొన్నారు. నెగ్లెరియా ఫౌలెరి అనే అమీబా కారణంగా ఈ వ్యాధి సోకినట్టు కనుగొన్నారు.

ఆ బాలుడి ప్రాణాలను డాక్టర్లు రక్షించలేకపోయారు.

అంతకుముందు ఏడాది అదే రాష్ట్రంలోని మలప్పురం జిల్లాకు చెందిన ఒక పదేళ్ల బాలుడు కూడా ఇదే అమీబా సోకి మరణించినట్టు అప్పట్లో ది హిందూ పత్రిక రిపోర్ట్ చేసింది.

2018లో భారత్‌, అమెరికా, థాయ్‌లాండ్‌తో పాటు ప్రపంచంలో 381 నెగ్లేరియా ఫాలెరీ అమీబా కేసులు నమోదయ్యాయి.

బ్రెయిన్ ఈటింగ్ అమీబా

ప్రస్తుతం కొరియాలో ఈ అమీబా బారిన పడి ఒక వ్యక్తి మరణించిన నేపథ్యంలో, బ్రెయిన్ ఈటింగ్ అమీబా గురించి ప్రజలు తరచూ అడిగే ప్రశ్నలపై అమెరికా అంటు వ్యాధుల నియంత్రణ సంస్థ అందిస్తున్న సమాచారం మీకోసం..

‘బ్రెయిన్ ఈటింగ్ అమీబా’ అంటే ఏమిటి?

నెగ్లేరియా ఫాలెరీ అనేది స్వతంత్రంగా నివసించే ఒక అమీబా (ఏకకణ జీవి). ఇది సూక్ష్మజీవి. కేవలం మైక్రోస్కోప్‌తో మాత్రమే చూడగలం. సరస్సులు, నదులు, నీటి కొలనులు, కాల్వలు వంటి వెచ్చని నీటిలో, బురద మట్టిలో నివసిస్తుంది.

దీనినే ‘‘బ్రెయిన్ ఈటింగ్ అమీబా’’ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే నీటిలో ఉన్న ఈ అమీబా ముక్కు ద్వారా మనిషి శరీరంలోకి ప్రవేశించి మెదడుకు సోకుతుంది. మెదడు కణజాలాన్ని దెబ్బతీస్తుంది. ఈ అమీబా ఇన్‌ఫెక్షన్ అత్యంత ప్రాణాంతకం.

నెగ్లేరియా ఫాలెరీ ఎలా సోకుతుంది?

  • నీటిలో ఉండే ఈ అమీబా ముక్కు ద్వారా ఒక వ్యక్తి శరీరంలోకి ప్రవేశిస్తుంది. సాధారణంగా ఈతకు వెళ్లినప్పుడు, నీటిలో మునిగినప్పుడు లేదా సరస్సులు లేదా నదులు వంటి నీళ్లలో ప్రజలు తమ తలలను ముంచినప్పుడు ఈ అమీబా వ్యక్తి శరీరంలోకి ప్రవేశిస్తుంది.
  • ఆ తర్వాత ఈ అమీబా ముక్కు నుంచి మెదడులోకి వెళ్లి, మెదడు నరాలను దెబ్బతీస్తుంది. ప్రైమరీ అమీబిక్ మెనింజోఇన్‌సైఫలిటిస్ (పీఏఎం) అనే వ్యాధికి ఇది కారణమవుతుంది. ఇది ప్రాణాంతకమైన వ్యాధి.
  • ఆధ్యాత్మిక విధానాలను పాటించే సమయంలో లేదా ప్రజలు తమ ముక్కు పట్టేసిన సమయంలో దాన్ని శుభ్రపరుచుకునే సమయంలో ఈ అమీబాతో ఉన్న నీటిని వాడితే నెగ్లేరియా ఫాలెరీ నుంచి ఇన్‌ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుంది.
  • చాలా అరుదుగా వాటర్ పార్కులు, స్విమ్మింగ్ పూల్స్ వంటి వాటి నుంచి ఈ అమీబా సోకే అవకాశముంది. ఆ నీటిలో తగినంత క్లోరైన్ లేకపోవడం వల్ల ఇలా జరగవచ్చు.
  • అయితే తుమ్మినప్పుడు వచ్చే నీటి తుంపర్లు లేదా నీటి బిందువుల ద్వారా నెగ్లేరియా ఫాలెరీ వ్యాధి వ్యాప్తి చెందుతున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు.
  • అదేవిధంగా కలుషితమైన నీరు తాగినప్పుడు కూడా ప్రజలు నెగ్లేరియా ఫాలెరీ వ్యాధికి గురికారు.

నెగ్లేరియా ఫాలెరీని ఎక్కడ గుర్తించారు?

నెగ్లేరియా ఫాలెరీ వెచ్చటి తాజా నీటిలో, బురద మట్టిలో ఉంటుంది. ఈ అమీబా వేడిని ఎక్కువగా ఇష్టపడుతుంది.

అంటే వేడి నీరు, వెచ్చని నీళ్లలో ఎక్కువగా నివసిస్తుంది. 46 డిగ్రీల సెల్సియస్ వరకున్న అత్యధిక ఉష్ణోగ్రతల్లో ఇది బాగా వృద్ధి చెందుతుంది.

అయితే, అత్యధిక ఉష్ణోగ్రతలో ఇది స్వల్ప కాలం మాత్రమే జీవించగలదు. కొన్ని పీఏఎం కేసులతో సంబంధం ఉన్న సరస్సులు, నదుల నీటి ఉష్ణోగ్రతలను శాస్త్రవేత్తలు పరీక్షించారు.

వీటి ఉష్ణోగ్రతలు అత్యధికంగా 26 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా 26 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలున్న నీటిలో కూడా ఈ అమీబా నివసించే అవకాశం ఉంది.

ఈ అమీబాను ఎక్కడ గుర్తించగలం?

  • సరస్సులు, నదులు వంటి వెచ్చటి తాజా నీళ్లలో
  • సహజంగా వెచ్చగా ఉండే నీటిలో
  • పరిశ్రమలు లేదా విద్యుత్ ప్లాంట్ల నుంచి విడుదలయ్యే నీటిలో
  • సహజంగా వేడిగా ఉండే పరీక్ష చేయని తాగు నీటి వనరులలో
  • సరైన నిర్వహణలేని, తగినంత క్లోరైన్ లేని స్విమ్మింగ్ పూల్స్, వాటర్ పార్కులు, సర్ఫ్ పార్కులు
  • పంపు నీటిలో
  • వాటర్ హీటర్లలో
  • సరస్సులు, కొలనులు, నదులు కిందనున్న బురద మట్టిలో
  • అయితే, సముద్రం వంటి ఉప్పు నీటిలో నెగ్లేరియా ఫాలెరీ ఉన్నట్లు గుర్తించలేదు.

నెగ్లేరియా ఫాలెరీకి ఆహార వనరు ఏంటి?

సరస్సులు, నదులలో ఉండే బురద మట్టిలో ఉండే బ్యాక్టీరియా లాంటి ఇతర చిన్న చిన్న జీవులను నెగ్లేరియా ఫాలెరీ తింటుంది.

పూర్తిగా క్రిమి సంహారం చేసిన స్విమ్మింగ్ పూల్ నుంచి ఈ అమీబా సోకుతుందా?

లేదు. పూర్తిగా శుభ్రపరిచిన, క్రిమిసంహారం చేసిన స్విమ్మింగ్ పూల్ నుంచి నెగ్లేరియా ఫాలెరీ అమీబా సోకదు.

కానీ, సరిగ్గా నిర్వహించని లేదా తగినంత క్లోరైన్ లేని నీటి పార్కులు, స్విమ్మింగ్ పూల్స్, సర్ఫ్ పార్కులలో ఈ నెగ్లేరియా ఫాలెరీని గుర్తించవచ్చు.

బ్రెయిన్ ఈటింగ్ అమీబా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నీటి నుంచి ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించే నెగ్లేరియా ఫాలెరీ అనే ఈ బ్యాక్టీరియా మెదడును తింటుంది.

అమెరికాలో నెగ్లేరియా ఫాలెరీ ఇన్‌ఫ్లెక్షన్లు ఎంత సాధారణం?

నెగ్లేరియా ఫాలెరీ ఇన్‌ఫ్లెక్షన్లు చాలా అరుదు. 2012 నుంచి 2021 మధ్య కాలంలో అమెరికాలో మొత్తంగా 31 కేసులను గుర్తించారు. వాటిలో 28 మంది వ్యక్తులకు వినోద నీటి పార్కుల నుంచే ఈ వ్యాధి సంక్రమించగా.. ఇద్దరికి ఈ అమీబాతో కలుషితమైన పంపు నీటిని ముక్కు శుభ్రపరుచుకునేందుకు వాడిన సమయంలో వచ్చింది. మరో వ్యక్తికి కూడా పంపు నీటి ద్వారానే సోకింది.

 నెగ్లేరియా ఫాలెరీఎక్కువగా మగపిల్లలకే సోకుతోంది. ముఖ్యంగా 14 ఏళ్లు, ఆ కంటే తక్కువగా వయసున్న మగపిల్లలకు సోకటం కనిపిస్తుంది. దీనికి కారణమేంటో స్పష్టంగా తెలియదు. అయితే, మగపిల్లలు ఎక్కువగా నీటిలో ఆడటానికి ఇష్టపడతారు కనుక వారికి ఇది సోకే అవకాశం ఉంది.

నెగ్లేరియా ఫాలెరీ ఇన్‌ఫెక్షన్ ఎక్కువగా ఎప్పుడు సోకుతూ ఉంటుంది?

ఈ అమీబా ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉన్న సమయంలో సోకుతూ ఉంటాయి. నీటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి, నీటి నిల్వలు తక్కువగా ఉన్నప్పుడు ఈ అమీబా సోకే ప్రమాదం ఉంది.

నెగ్లేరియా ఫాలెరీ ఇన్‌ఫెక్షన్లు చాలా అరుదైనప్పటికీ, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వంటి గరిష్ట ఉష్ణోగ్రతలున్న సమయంలో ఇవి సోకవచ్చు.

ఒకరి నుంచి మరొకరికి ఈ ఇన్‌ఫెక్షన్లు సోకవచ్చా?

లేదు. నెగ్లేరియా ఫాలెరీ అమీబా ఇన్‌ఫెక్షన్ ఒకరి నుంచి మరోకరికి వ్యాప్తి చెందదు.

నెగ్లేరియా ఫాలెరీ అమీబా ద్వారా వచ్చే వ్యాధి లక్షణాలేమిటి?

నెగ్లేరియా ఫాలెరీ అనేది పీఏఎంను కలిగిస్తుంది. అంటే మెదడు కణజాలాన్ని దెబ్బతీసే బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్. ప్రాథమిక దశలో, పీఏఎం లక్షణాలు పూర్తిగా బ్యాక్టీరియా సోకినప్పుడు కలిగే లక్షణాల మాదిరిగే ఉంటాయి.

ఈ అమీబా సోకిన 5 రోజుల తర్వాత పీఏఎం తొలి లక్షణం కనిపిస్తుంది. అయితే, ఇది సోకిన ఒకటి నుంచి 12 రోజుల్లో ఈ లక్షణాలు ఎప్పుడైనా ప్రారంభం కావొచ్చు.

తలనొప్పి, జ్వరం, వాంతులు, వికారం వంటివి ఈ లక్షణాల్లో ఉంటాయి. ఆ తర్వాత మెడ పట్టేయడం, అంతా గందరగోళంగా అనిపించడం, పక్కన మనుషులెవరున్నారు? ఏం జరుగుతుందనే వాటిపై సరిగ్గా దృష్టి సారించలేకపోవడం, మూర్ఛపోవడం, కోమాలోకి జారుకోవడం వంటివి ఆ తర్వాత దశలో కనిపించే లక్షణాలు.

లక్షణాలు ప్రారంభమైన తర్వాత, ఆ వ్యాధి వేగంగా వ్యాపించి, ఐదు రోజుల్లోనే మనిషి ప్రాణం తీస్తుంది. ఒకటి నుంచి 18 రోజుల్లో ఎప్పుడైనా ఈ వ్యక్తి మరణించవచ్చు.

మనిషి మెదడు

ఫొటో సోర్స్, Getty Images

నెగ్లేరియా ఫాలెరీ ద్వారా మరణానికి కారణమేమిటి?

ఈ అమీబా మెదడు కణజాలాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. దీంతో, మెదడు ఉబ్బిపోయి, మనిషి మరణిస్తాడు.

ఈ ఇన్ఫెక్షన్ కనిపించిన వ్యక్తుల మరణాల రేటు ఏ విధంగా ఉంది?

ఈ వ్యాధి మరణాల రేటు 97 శాతం కంటే ఎక్కువగా ఉంది. అమెరికాలో 1962 నుంచి 2021 మధ్య కాలంలో ఈ ఇన్ఫెక్షన్ సోకిన 154 మందిలో కేవలం నలుగురు మాత్రమే బతకగలిగారు.

నెగ్లేరియా ఫాలెరీ ద్వారా సోకిన వ్యాధికి సమర్థవంతమైన చికిత్స ఏమైనా ఉందా?

పీఏఎం చాలా అరుదైన వ్యాధి కావడం, దానికి తోడు ఈ ఇన్‌ఫెక్షన్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో.. సమర్థవంతమైన చికిత్సలను గుర్తించడం చాలా సవాళ్లతో కూడుకున్న పని.

కొన్ని ఔషధాలు దీనిపై సమర్థవంతంగా పోరాడుతున్నాయని కొన్ని ఆధారాలున్నాయి. కానీ, ఈ ఇన్‌ఫెక్షన్లను నయం చేసేందుకు ఉత్తమ ఔషధాలు ఏమిటనే దానిపై ఇంకా అధ్యయనాలు జరుగుతున్నాయి.

ప్రస్తుతం పీఏఎంకు చికిత్స చేసేందుకు యాంఫోటెరిసిన్ బీ, అజిత్రోమైసిన్, ఫ్లూకోనాజోల్, రిఫాంపిన్, మిల్టెఫోసిన్, డెక్సామెథాసోన్ వంటి ఔషధాల కాంబినేషన్‌ను వాడుతున్నారు.

నెగ్లేరియా ఫాలెరీకి వ్యతిరేకంగా ఈ డ్రగ్స్ బాగా పనిచేస్తున్నట్లు భావించడంతో వీటిని ప్రస్తుతానికి ఈ వ్యాధి చికిత్స కోసం వాడుతున్నారు.

టెక్సాస్ పూల్

ఫొటో సోర్స్, Getty Images

స్విమ్మింగ్ పూల్ లేదా తాజా నీటిలో ఆడుకున్న తర్వాత పీఏఎం లక్షణాలున్నట్టు అనిపిస్తే ఏం చేయాలి?

పీఏఎం వ్యాధి చాలా అరుదుగా సోకుతుంది. ఇతర బ్యాక్టీరియల్ వ్యాధుల సాధారణ లక్షణాల మాదిరిగానే తొలుత పీఏఎం లక్షణాలు కూడా ఉంటాయి.

జ్వరం, తలనొప్పి, వాంతులు లేదా వికారం, మెడ పట్టేయడం వంటి లక్షణాలు అకస్మాత్తుగా సంభవిస్తే, ముఖ్యంగా వేడి నీటిలో మునిగిన, తడిసిన తర్వాత ఇవి కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

వాతావరణంలో నెగ్లేరియా ఫాలెరీ ఎంత సాధారణంగా ఉంటుంది?

సరస్సులు, నదులు, వేడి నీటితో ఉండే నీటి కొలనులు, బురద మట్టిలో సాధారణంగా నెగ్లేరియా ఫాలెరీ పెరుగుతూ ఉంటుంది. ఈ అమీబా ఎక్కువగా సరస్సులు, కొలనులు, నదుల కిందనున్న బురద నీటిలో జీవిస్తూ ఉంటుంది.

నీటిలో నెగ్లేరియా ఫాలెరీను తక్షణం గుర్తించేందుకు ఏవైనా పరీక్షలు ఉన్నాయా?

లేదు. పర్యావరణంగా పరిశోధన చేసేందుకు, నీటిలో ఈ అమీబాను గుర్తించేందుకు వారాల సమయం పట్టొచ్చు.

ఇతర నీటి ప్రమాదాలతో పోలిస్తే నెగ్లేరియా ఫాలెరీ సోకే ప్రమాదం ఎంత?

నెగ్లేరియా ఫాలెరీ సోకే ప్రమాదం చాలా తక్కువ. 2012 నుంచి 2021 మధ్యనున్న పదేళ్ల కాలంలో అమెరికాలో 31 కేసులు రిపోర్టు అయ్యాయి. ప్రతి ఏడాది లక్షలాది మంది వాటర్ పార్కులలో సేద తీరుతున్నప్పటికీ, ఈ వ్యాధి సోకిన వారు తక్కువ మందే.

2010 నుంచి 2019 మధ్య పదేళ్ల కాలంలో, అమెరికాలో 3,957 మంది అనుకోకుండా నీటి మునిగి ప్రాణాలు కోల్పోయినట్టు అంచనాలున్నాయి.

ఆ మరణాలతో పోలిస్తే ఈ వ్యాధి బారిన పడి మరణించిన వారు తక్కువే.

ఇవి కూడ చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)