కాఫ్ సిరప్: పిల్లలకు దగ్గు మందు వాడవచ్చా? లేదా?

దగ్గుమందు

ఫొటో సోర్స్, UNIVERSALIMAGESGROUP?GETTYIMAGES

    • రచయిత, సుశీలా సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ముంబయిలో ఒక రెండున్నరేళ్ల చిన్నారికి దగ్గు మందు తాగించిన తర్వాత 17 నిమిషాల పాటు నాడి కొట్టుకోవడం (పల్స్) ఆగిపోయిందనే వార్తలు వెలుగులోకి వచ్చాయి.

ముంబైలోని కేఈఎం ఆసుపత్రి పిల్లల వైద్యుడు, డాక్టర్ ముకేశ్ అగర్వాల్ మాట్లాడుతూ, ఆ చిన్నారికి ఎంత పరిమాణంలో మందు ఇచ్చారనేది తెలియకుండా దాని గురించి కచ్చితంగా ఏమీ చెప్పలేనని అన్నారు.

ఈ ఘటన గురించి ముంబై నుంచి ఆ చిన్నారి నాన్నమ్మ అయిన డాక్టర్ తిలోత్తమ మంగేష్కర్‌తో బీబీసీ మాట్లాడింది.

‘‘డిసెంబర్ 15వ తేదీన బాబుకు అతని తల్లి దగ్గు మందు ఇచ్చింది. అది తాగాక బాబు తల్లి దగ్గరే కూర్చుని ఆడుకున్నాడు. ఆ తర్వాత ఒళ్లో పడుకున్నాడు. కాసేపటికి బాబు చాలా బలహీనంగా కనిపించడంతో మా కోడలు నన్ను పిలిచింది. అప్పుడు నేను మరో గదిలో ఉన్నా’’ అని ఆమె వివరించారు.

డాక్టర్ తిలోత్తమ మంగేష్కర్ ఒక అనస్థీషియాలజిస్ట్. రోగికి శస్త్ర చికిత్స చేసేముందు మత్తు మందు ఇవ్వడం ఆమె పని.

తిలోత్తమ మంగేష్కర్

ఫొటో సోర్స్, TILOTAMA MANGESHIKAR

ఫొటో క్యాప్షన్, తిలోత్తమ మంగేష్కర్

‘‘ఆ పిల్లవాడు చాలా చక్కగా ఉంటాడు. అతడు పాలిపోయినట్లు అవ్వడం నేను గమనించాను. తర్వాత అతను నీలిరంగులోకి మారడం చూశాను. వెంటనే ఇక మేం ఆసుపత్రికి పరిగెత్తాం. దారిలో నేను బాబుకి సీపీఆర్ ఇవ్వడం ప్రారంభించా. తర్వాత ఏడు నిమిషాల్లో అతను గులాబీ రంగులోకి మారడం మొదలైంది. దాదాపు 17 నిమిషాల తర్వాత బాబు స్పృహలోకి వచ్చాడు. కళ్ళు తెరిచి శ్వాస తీసుకోవడం ప్రారంభించాడు.

ఇలా ఎందుకు జరిగిందని మేం దర్యాప్తు చేశాం. గతంలో బాబుకి ఇలా ఎప్పుడు జరగలేదని మాకు తెలిసింది. తర్వాత దగ్గు మందును పరిశీలించాం. అందులో క్లోర్ఫేనెర్మయిన్, డెక్ట్సోమెథార్ఫిన్ ఉన్నట్లు గుర్తించాం. అమెరికాలో నాలుగేళ్ల లోపు చిన్నారులకు ఈ మూలకాలు ఉన్న ఔషధాల ఉపయోగాన్ని నిషేధించారు’’ అని ఆమె వివరించారు.

అయితే, తయారీదారులు ఈ దగ్గు మందుపై ఎలాంటి లేబుల్‌ను పెట్టలేదని, పిల్లల వైద్యులు కూడా చిన్నారుల కోసం ఈ మందును సూచిస్తున్నారని ఆమె చెప్పారు.

దగ్గుమందు

ఫొటో సోర్స్, ROBERTO MACHADO NOA/GETTYIMAGES

‘‘నేను ఇంట్లో ఉండి నా మనవడి ప్రాణాలను కాపాడుకున్నా. చిన్న పిల్లల తల్లిదండ్రులు, శిశు వైద్యులకు ఈ విషయంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే నేను ముందుకు వచ్చి ఇదంతా చెబుతున్నా’’ అని తిలోత్తమ అన్నారు.

పిల్లల్లో తల్లి నుంచి లభించిన రోగ నిరోధక శక్తి అయిదేళ్లకు తగ్గిపోతుందని, అప్పటికి వారిలో స్వయంగా రోగ నిరోధక శక్తి అభివృద్ధి చెంది ఉండకపోవడం వల్ల పిల్లలకు అలర్జీలు, వైరల్ జ్వరాలు రావడం సాధారణమని పిల్లల వైద్యుడు, డాక్టర్ ముకేశ్ అగర్వాల్ చెప్పారు.

‘‘ఈ వయస్సులో ఉండే ప్రతీ బిడ్డకు ఏడాదికి అయిదు నుంచి ఆరుసార్లు శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయి. ఇందులో చాలావరకు రెండు లేదా మూడు రోజుల్లో తగ్గిపోతాయి. అయితే, ఈ ఇన్ఫెక్షన్ చెవులు లేదా శరీరంలోకి ఇతర భాగాలకు వ్యాపిస్తే పిల్లలకు యాంటీబయాటిక్ మందులు ఇవ్వాల్సిన అవసరం పడుతుంది. ఒక్కోసారి దానంతట అదే తగ్గిపోతుంది కూడా. కాబట్టి దానికి ప్రత్యేకంగా మందులు లేదా దగ్గు మందులు ఇచ్చి తాగించాల్సిన అవసరం లేదు’’ అని ముకేశ్ వివరించారు.

దగ్గుమందు

ఫొటో సోర్స్, ROBERTO MACHADO NOA/GETTYIMAGES

దగ్గు సిరప్ ఇవ్వడం అవసరమా?

శరీరంలో పేరుకుపోయిన మ్యూకస్‌ను తొలిగించేందుకు దగ్గు బాగా ఉపకరిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.

శరీరంలోని సూక్ష్మక్రిములను బయటకు తీయడానికి దగ్గు ఒక రకంగా సహాయపడుతుందని, కాబట్టి దగ్గు మందు ఇచ్చి దాన్ని అణచివేయాల్సిన అవసరం ఏముందని వైద్యులు అంటున్నారు.

పిల్లల్లో రెండు, మూడు రోజుల తర్వాత పరిస్థితి మెరుగుపడుతుంది. దగ్గు కూడా ఒకటి రెండు రోజుల్లో దానంతట అదే తగ్గుతుంది. అలా తగ్గకుండా పరిస్థితి మరింత దిగజారితే వైద్యులను సంప్రదించాలి. అప్పుడు పిల్లలకు ఏదైనా అలర్జీ ఉందేమో చూసి దానికి తగిన మందులను వైద్యులు సూచిస్తారు.

డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం క్లోర్ఫేనెర్మయిన్, డెక్ట్సోమెథార్ఫిన్‌లు పిల్లల్లో దుష్ప్రభావాలు కలిగిస్తాయి.

దగ్గుమందు

ఫొటో సోర్స్, UNIVERSALIMAGESGROUP/GETTYIMAGES

దగ్గు మందు వల్ల శరీరంపై కలిగే ప్రభావాలు ఏంటి?

చాలా వరకు దగ్గు మందులు, పిల్లలకు నిద్ర పట్టేలా చేస్తాయని డాక్టర్ ముకేశ్ చెప్పారు.

ఈ స్థితిలో పిల్లవాడు తిన్న ఆహారం శ్వాసనాళంలో చిక్కుకుపోతుందని, అది బయటకు రాకపోవడంతో పిల్లలు ఉక్కిరిబిక్కిరి అవుతారని ఆయన వివరించారు.

ఈ దగ్గు మందులు ఇవ్వడం వల్ల నిద్ర పడుతుంది, రక్తపోటు నెమ్మదిస్తుంది. జలుబు, ప్లూ కారణంగా చిన్నారులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. అలాగే ఈ మందు ఇవ్వడం వల్ల వారి శ్వాస ప్రక్రియపై ప్రభావం పడుతుంది. పిల్లల శరీరంలో ఆక్సిజన్ లోపం తలెత్తవచ్చు.

ఇలాంటి ఔషధాలను మోతాదుకు మించి ఇవ్వడం వల్ల మరిన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయని వైద్యులు చెబుతున్నారు.

నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (ఎన్‌సీబీఐ)లో ప్రచురితమైన సమాచారం ప్రకారం, ఒక చిన్నారి రోజుకు సగటున 11 సార్లు దగ్గుతారు. చలికాలంలో దాని తీవ్రత పెరుగుతుంది.

దగ్గు, జలుబు సిరప్‌లను దుకాణాలలో విక్రయిస్తారు. కానీ, రెండేళ్ల లోపు చిన్నారులకు జలుబు, దగ్గు సిరప్‌లు ఇవ్వకూడదు. అవి ప్రాణాంతకం కావొచ్చు.

నాలుగేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఈ మందులను ఉపయోగించకూడదని పేర్కొంటూ దగ్గు, జలుబు మందుల తయారీదారులే స్వచ్ఛందంగా లేబుల్ చేస్తారు.

వీడియో క్యాప్షన్, గంజాయికి అలవాటు పడ్డాడని కొడుకు కళ్లల్లో కారం కొట్టింది ఆ తల్లి

నవజాత శిశువులు, పిల్లల్లో జలుబు తగ్గించడానికి ఏం చేయాలంటే...

చాలా సందర్భాల్లో జలుబు, పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపదనీ.. కానీ, తల్లిదండ్రులకు అది కచ్చితంగా ఇబ్బందికరంగా మారుతుందని అమెరికా ఆరోగ్య శాఖలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఏజెన్సీ చెప్పింది.

జలుబు నుంచి చాలా వరకు పిల్లలు వారంతట వారే కోలుకుంటారని, మందులు ఇవ్వడం వల్ల జలుబు తొందరగా తగ్గిపోవడం ఉండదని ఎఫ్‌డీఏ సూచించింది.

దగ్గు అనేది జలుబుకు చెందిన సాధారణ లక్షణం. శరీరం నుంచి మ్యూకస్‌ను తొలిగించడానికి, ఊపిరితిత్తులను రక్షించడానికి ఇది ఉపయోగపడుతుంది.

ఔషధం కాకుండా వేడిగా ఉండే ద్రవాలు తీసుకోవడం వల్ల గొంతుకు ఉపశమనం కలుగుతుంది.

ముక్కు లోపలి భాగంలో తేమగా ఉంచడానికి సెలైన్ చుక్కలు లేదా స్ప్రేలు ఉపయోగపడతాయి.

పిల్లలు సులభంగా శ్వాస తీసుకోవడం కోసం ‘కూల్ మిస్ట్ హ్యుమిడిఫయర్’‌ను సిఫార్సు చేస్తారు.

ఏడాది కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్నారుల కోసం ‘బల్బ్ సిరంజ్’ వాడాలని సిఫారసు చేశారు. మామూలుగా దీన్ని చిన్నారుల ముక్కు నుంచి మ్యూకస్‌ను తీసేయడానికి వాడతారు.

పిల్లలకు తేనె, అల్లం, నిమ్మకాయ వంటివి నివారిణిగా వాడాలని వైద్యులు సూచిస్తున్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)