డ్రగ్స్ తీసుకుని దొరికిపోయిన బౌద్ధ సన్యాసులు, ఆలయమంతా ఖాళీ

ఫొటో సోర్స్, Getty Images
థాయిలాండ్‌లోని ఓ బౌద్ధ ఆలయంలో సన్యాసులకు మాదక ద్రవ్యాల పరీక్షలు నిర్వహించగా అందరూ డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది.
దీంతో వారందరినీ అక్కడి విధుల నుంచి తప్పించడంతో ఆలయం ఖాళీ అయిపోయింది.
ఫెచాబున్ ప్రావిన్స్‌లోని బౌద్ధ ఆలయ ప్రధాన సన్యాసితో పాటు మరో నలుగురికి డ్రగ్ టెస్ట్‌లు చేయగా వారంతా మెథ్‌ఎంఫటమిన్ తీసుకున్నట్లు తేలిందని అక్కడి అధికారులను ఉటంకిస్తూ ఏఎఫ్‌పీ వార్తాసంస్థ వెల్లడించింది.
మాదకద్రవ్యాలు తీసుకున్నట్లు తేలడంతో వారిని అక్కడి ఒక హెల్త్ క్లినిక్‌కు తరలించినట్లు ఫెచాబున్ ప్రావిన్స్ అధికారి బూన్‌లెర్ట్ థింటఫాయి తెలిపారు.
డ్రగ్స్ నిరోధం కోసం జాతీయ స్థాయిలో చేస్తున్న దాడులలో భాగంగా ఈ బౌద్ధ ఆలయంపై అధికారులు దాడులు చేసి అక్కడి బౌద్ధ సన్యాసులకు పరీక్షలు నిర్వహించారు.
సోమవారం ఈ సన్యాసులకు మూత్ర పరీక్షలు చేయగా వారంతా మాదక ద్రవ్యాలు సేవించినట్లు తేలింది.
దీంతో అధికారులు వారిని ఆలయ విధుల నుంచి తప్పించారు.
‘బౌద్ధ సన్యాసులు లేకపోవడంతో ‘మెరిట్ మేకింగ్’ పూజలు చేయడానికి వీలుండదని సమీప గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు’ అని థింటఫాయి చెప్పారు.
బౌద్ధ సన్యాసులకు భోజనం పెట్టడం ద్వారా ‘పుణ్యం’ సంపాదించుకుంటామని భక్తులు చెబుతుంటారు.. దీన్నే బౌద్ధంలో మెరిట్ మేకింగ్ అంటుంటారు.
స్థానికులు తమ మెరిట్ మేకింగ్ గురించి ఆందోళన వ్యక్తంచేస్తుండడంతో తాత్కాలికంగా ఈ ఆలయానికి వేరే బౌద్ధ సన్యాసులకు ఏర్పాటుచేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
థాయిలాండ్‌లో ఇటీవల కాలంలో మెథ్‌ఎంఫటమైన్ పెద్ద సమస్యగా మారింది. 2021లో అంతకుముందు ఎన్నడూ లేనిస్థాయిలో పెద్ద మొత్తంలో మెథ్ఎంఫటమైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ‘యూఎన్ ఆఫీస్ ఆన్ డ్రగ్ అండ్ క్రైమ్’ గణాంకాలు చెబుతున్నాయి.
మెథ్‌ఎంఫటమైన్ అక్రమ రవాణాలో థాయిలాండ్ కీలక స్థానంగా ఉంది. మియన్మార్ నుంచి లావోస్ మీదుగా ఈ దేశంలో పెద్దమొత్తంలో డ్రగ్ వస్తుంది.
ప్రపంచంలో మెథ్‌ఎంఫటమైన్ అత్యధికంగా ఉత్పత్తవుతున్నది మియన్మార్‌లొనే.
మియన్మార్ నుంచి థాయిలాండ్‌లోకి తీసుకొచ్చిన తరువాత మాత్రల రూపంలో ఎక్కడికక్కడ విక్రయిస్తుంటారు.
50 థాయి బాట్(సుమారు రూ. 115)కు అక్కడ ఈ మాత్రలు దొరుకుతాయి.
మెథ్ఎంఫటమైన్‌తో దొరికిన ఓ పోలీస్ అధికారిని ఇటీవల అక్కడ విధుల నుంచి తొలగించగా ఆయన కాల్పులు జరపడంతో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన అనంతరం థాయిలాండ్ ప్రధాని ప్రయూత్ చాన్ ఓచా దేశంలో మాదకద్రవ్యాల కట్టడికి కఠిన చర్యలకు ఆదేశించారు. ఆ క్రమంలోనే జరిగిన డ్రగ్ టెస్టులలో ఈ బౌద్ధ సన్యాసులు దొరికారు.
ఇవి కూడా చదవండి:
- అంబేడ్కర్ ఫౌండేషన్: దళితులు కులాంతర వివాహం చేసుకుంటే రూ. 2.50 లక్షల కానుక... ఈ పథకం గురించి మీకు తెలుసా?
- ఆర్టెమిస్: నాసా మరో రికార్డు... భూమి నుంచి అత్యధిక దూరం ప్రయాణించిన ఓరియన్ క్యాప్సూల్
- 'మియా' మ్యూజియం: అస్సాంలోని 'ముస్లిం' మ్యూజియంపై వివాదం ఏంటి?
- పీరియడ్స్: భారత్‌లో అమ్ముతున్న శానిటరీ ప్యాడ్స్‌లో ప్రమాదకర కెమికల్స్ ఉన్నాయా... వాటి వల్ల క్యాన్సర్ వస్తుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














