ఆర్టెమిస్: నాసా మరో రికార్డు... భూమి నుంచి అత్యధిక దూరం ప్రయాణించిన ఓరియన్ క్యాప్సూల్

Orion capsule

ఫొటో సోర్స్, NASA

    • రచయిత, జొనాథన్ ఆమోస్
    • హోదా, బీబీసీ సైన్స్ కరస్పాండెంట్

అమెరికా అంతర్జాతీయ పరిశోధన సంస్థ (నాసా) మరో ఘనత సొంతం చేసుకుంది. ఈ నెల 16న భూమి నుంచి ప్రయోగించిన మానవ రహిత ఓరియన్ క్యాప్సూల్ అత్యధిక దూరం ప్రయాణించి రికార్డు స్థాపించింది.

చంద్రుడిపైకి చేపట్టిన ఈ ప్రయోగంలో ఓరియన్ భూమి నుంచి దాదాపు 4,30,000 కిలోమీటర్లు (2,70,000 మైళ్లు) ప్రయాణించింది.

వాస్తవానికి ఇది మానవ సహిత ప్రయాణానికి అనుకూలంగా డిజైన్ చేసి అంతరిక్ష నౌకే.

ఈ ప్రయోగం ఎలాంటి అవాంతరాలు లేకుండా విజయవంతంగా పూర్తయితే మరో రెండేళ్లలో ఈ నౌకలో వ్యోమగాములు వెళ్లనున్నారు.

నాసా ప్రస్తుతం ఓరియన్‌తో పాటు మరికొన్ని క్లిష్టమైన మిషన్‌లను ప్లాన్ చేస్తోంది.

ఇవన్నీ ఆర్టెమిస్ ప్రోగ్రాంలో భాగమే. 50 ఏళ్ల తరువాత చంద్రుడిపైకి మళ్లీ మనుషులను పంపించే ప్రాజెక్ట్ ఇది.

Root to Moon

ఆర్టెమిస్ సోమవారం అధిగమించిన కీలక మైలురాయితో ఈ మిషన్ కీలక దశకు చేరుకున్నట్లయింది.

‘మిషన్ సగానికి చేరుకుంది. దీని తరువాత మానవ సహిత మిషన్లో నౌక పనితీరును అంచనా వేసేందుకు ఉపయోగపడుతుంది. మా పరిమితులు ఏంటో కూడా తెలియజేస్తుంది'' అని నాసా ఆర్టెమిస్ మిషన్ మేనేజర్ మైక్ సరాఫిన్ తెలిపారు.

ఇక ఓరియన్ తన ప్రయాణంలో కొన్ని అద్భుతమైన దృశ్యాలను ప్రసారం చేస్తోంది. రికార్డు దూరాన్ని చేరుకోకముందే, భూమికి సమీపంగా వెళ్లిన చంద్రుడి చిత్రాలను పంపింది.

ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి నవంబర్ 16న ఈ క్యాప్సూల్‌ని ప్రయోగించారు. ఇది మొత్తం 26-రోజుల మిషన్‌. ఇది సురక్షితం అని భావిస్తే తదుపరి మిషన్లో వ్యోమగాములను పంపే ప్రయత్నం చేయనుంది నాసా.

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సమకూర్చిన సర్వీస్ మాడ్యూల్ ద్వారా ఓరియన్ అంతరిక్షంలోకి వెళ్లింది.

ఈ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ గత వారం రెండు ముఖ్యమైన ఇంజిన్లను మండించడం ద్వారా చంద్రుడి సుదూర తిరోగమన కక్ష్య (డిస్టేంట్ రిట్రోగ్రేడ్ ఆర్బిట్)లోకి ఓరియన్‌ను ప్రవేశపెట్టింది.

ఇది చంద్రుడి ఉపరితలం నుంచి 61,000 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో సుదూర కక్ష్యగా పేర్కొంటున్నారు.

చంద్రుడి భ్రమణ మార్గానికి వ్యతిరేక దిశలో క్యాప్సుల్‌ను పంపించారు కాబట్టి దీన్ని రెట్రోగ్రేడ్(తిరోగమన)గా పేర్కొంటున్నారు.

ఈ స్పేస్ క్రాఫ్ట్ డిసెంబర్ 11న కాలిఫోర్నియాలోని శాన్‌డియాగో సమీపంలో పసిఫిక్ సముద్రంలో పడనుంది.

మానవ రహిత స్పేస్ క్రాఫ్ట్

ఫొటో సోర్స్, NASA

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈ క్యాప్సూల్ కోసం అంచనా వేసిన కంటే చాలా తక్కువ ఇంధనం ఖర్చయింది.

అయితే ఇది ఊహించిన కంటే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయనుంది, అదే సమయంలో దాని శక్తి వినియోగం చాలా పొదుపుగా ఉండనుంది. కొన్ని చిన్న సాంకేతిక సమస్యలు ఉన్నాయని, కానీ అవన్నీ ఫలితంపై ప్రభావం చూపనివేనని సరాఫిన్ అభిప్రాయపడ్డారు.

గతంలో అత్యధిక దూరం ప్రయాణించిన మానవులు వెళ్లగలిగే స్పేస్ క్రాఫ్ట్ రికార్డు 1970 ఏప్రిల్‌లో ప్రయోగించిన అపోలో-13 పేరిట ఉండేది.

ఆ క్యాప్సుల్ సర్వీస్ మాడ్యుల్స్‌లో సాంకేతిక సమస్య కారణంగా భూమి నుంచి 4,00,171 కిమీ (248,655 మైళ్లు) వరకు మాత్రమే వెళ్లగలిగింది.

Artemis

ఫొటో సోర్స్, NASA

కాగా, సాంకేతిక సమస్యలు ఎదుర్కొన్న అపోలో 13ని తిరిగి తీసుకురావడానికి అప్పట్లో ప్రయత్నాలు చేసిన నాసా ఇంజనీర్ ఆర్టురో కాంపోస్ గౌరవార్థం ఓరియన్ బోర్డులో ఉన్న మనిషిని పోలిన మోడల్‌కు "కమాండర్ మూనికిన్ క్యాంపోస్" అని పెట్టారు.

ఇక మొదటి మానవ సహిత ఆర్టెమిస్ మిషన్ 2024లో మొదలుకానుంది. అంతేకాకుండా 2025లో కానీ 2026లో కానీ ఓరియన్ ఫ్లైట్లో వ్యోమగాములు చంద్రుని ఉపరితలంపై దిగడాన్ని చూస్తారు.

''అవును, అపోలో మీదనే ఆర్టెమిస్ నిర్మించారు. మేం చాలా దూరం వెళ్లడం, వేగంగా ఇంటికి రావడం మాత్రమే కాదు, ఆర్టెమిస్ ప్రతికూల వాతావరణంలో లోతైన ప్రదేశంలో నివసించడానికి, అక్కడ పని చేయడానికి అంగారక గ్రహంలో కొత్తవి కనిపెట్టడం, తెలుసుకోవడం, చివరికి మనుషులను తీసుకెళ్లడానికి మార్గం సుగమం చేస్తోంది'' అని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)