Rodrigo Duterte: ‘30 లక్షల మందిని చంపేశా’ అని ఘనంగా చెప్పుకునే ఈ లీడర్‌కు ఇంత ప్రజాదరణ ఎందుకు?

Rodrigo Duterte

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, హోవార్డ్ జాన్సన్, విర్మా సిమోనెట్
    • హోదా, బీబీసీ న్యూస్, మనీలా

మనిషి పుర్రె ఒకటి దొర్లుకుంటూ నా పాదాల దగ్గర వచ్చి ఆగింది.

అది నా షూస్‌కు తగిలే ఉండేది.. కానీ, అప్పుడే ఒక బాడీ బ్యాగ్ లోపలికి తోయడంతో దాని జిప్ లైన్‌కు తగిలి ఆగిపోయింది.

నా పక్కనే ఉన్న 44 ఏళ్ల గెమ్మా బరాన్ తన భర్త ఎముకలను బాడీ బ్యాగ్‌లో నింపుతుండడం చూసి భయపడుతున్నారు.

గెమ్మా అయిదేళ్ల కిందట తన భర్త పాట్రీసియో బరాన్ మృతదేహాన్ని ఇక్కడే ఖననం చేశారు. కానీ, ఇకపై ఈ స్మశానంలోని తన భర్త సమాధి స్థలానికి లీజ్ చెల్లించే స్తోమత ఆమెకు లేదు.

రద్దీగా ఉంటే మనీలాలో పేదలు తమ వారి మృతదేహాలను, అస్థికలను అద్దె సమాధుల్లోనే ఉంచుతారు. ఇందుకోసం ఒక్కో సమాధికి 200 డాలర్లు (సుమారు రూ. 15 వేలు) చెల్లిస్తారు.

గెమ్మా భర్త పాట్రీసియో సమాధిని ఇప్పుడు మారుస్తున్నారు. స్థానిక చర్చ్ ఒకటి ఉచితంగా సమాధి స్థలం ఇవ్వడంతో అక్కడికి మారుస్తున్నారు.

కొద్దికాలంగా ఫిలిప్పీన్స్‌ను అంతర్జాతీయ స్థాయిలో పతాక వార్తలలో నిలిపిన 'మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా జరిగిన దుర్మార్గపు పోరు'లో చనిపోయినవారి కుటుంబాలకు అండగా ఉండేందుకు చర్చ్ ఈ ఉచిత పథకం అమలు చేస్తోంది.

ఫాదర్ ఫ్లేవీ విల్లాన్యువా

ఫొటో సోర్స్, REUTERS/ELOISA LOPEZ

సెక్యూరిటీ గార్డుగా పనిచేసే 47 ఏళ్ల పాట్రీసియోను 2017 జులై 9న కాల్చి చంపారు.

చనిపోవడానికి ముందు రోజు నుంచి ఆయన కనిపించలేదు. అయితే, పొరుగువారు మాత్రం మూడు సార్లు తుపాకీ కాల్చిన శబ్దం విన్నామని, కాల్పులు జరిపినవారిని చూడలేదని చెప్పారు.

పాట్రీసియో మృతదేహం పక్కనే ఒక తుపాకీ ఉందని.. 'పుషర్(అక్రమంగా డ్రగ్స్ విక్రయించేవారు), రేపిస్ట్' అని రాసి ఉందని పోలీసులు చెప్పారు.

కానీ, పాట్రీసియో కుటుంబీకులు మాత్రం ఇదంతా అబద్ధమని అంటున్నారు. ఆయన ఎన్నడూ డ్రగ్స్ వినియోగించడం కానీ, విక్రయించడం కానీ చేయలేదని చెబుతున్నారు.

అయితే, హత్యకు గురికావడానికి ముందు ఆయన ఓ భూ వివాదంలో చిక్కుకున్నారని గెమ్మా చెప్పారు. ఆ వివాదం నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని ఆమె అనుమానిస్తున్నారు. కానీ, పోలీసులు చెబుతున్నదాన్ని బహిరంగా వ్యతిరేకించడానికి గెమ్మా భయపడుతున్నారు.

పాట్రీసియో చనిపోయినతరువాత నుంచి ముగ్గురు పిల్లలను పోషించడానికి, ఇంటి అద్దె చెల్లించడానికి తాను ఇబ్బందులు పడుతున్నానని గెమ్మా చెప్పారు.

ఇళ్లలో పనులు చేసుకుంటూ ఆమె కుటుంబాన్ని పోషిస్తున్నారు. చర్చ్‌లో ఇచ్చే ఆహారంపైనా ఆధారపడుతుంటారు.

''నా పిల్లల కోసం ఏం చేయాలో తెలియడం లేదు. నిజంగా కష్టాల్లో ఉన్నాను'' అని ఆమె చెప్పారు.

పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకునే తన భర్త మరణంపై దర్యాప్తు చేయాలని కూడా కోరలేదని, భయం వల్లే మౌనంగా ఉండిపోయానని ఆమె అన్నారు.

జూన్‌ నెలలో ఎండ తీవ్రంగా ఉన్న ఆ రోజున బాడీబ్యాగ్ జిప్ వేసి మరోని ప్రదేశానికి తీసుకెళ్లినప్పుడు అక్కడ ఫాదర్ ఫ్లేవీ విల్లాన్యువా.. పాట్రిసియో అస్థికల దగ్గర ప్రార్థన చేశారు.

'దుఃఖంలో ఉన్న బాధిత కుటుంబాలకు సాయం చేయడానికి మేం ఈ కార్యక్రమం చేపడుతున్నాం'' అని ఫాదర్ విల్లాన్యువా చెప్పారు.

ఫిలిప్పీన్స్ అధ్యక్ష స్థానం నుంచి వైదొలగుతున్న రోడ్రిగో డ్యుటెర్టే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుదీర్ఘకాలంగా ప్రచారం చేస్తున్నారు ఈ క్యాథలిక్ మత గురువు.

''చంపండి.. చంపండి.. చంపండి.. అనేదే డ్యుటెర్టే ప్రభుత్వ ఆదేశం. ఈ ఆదేశాల కారణంగా ఫిలిప్పీన్స్‌లో వేలాది మంది వితంతువులయ్యారు, అనాథలుగా మారారు. అధ్యక్షుడు అందిస్తున్న అత్యంత విషాద వారసత్వం ఇది' అన్నారు ఫాదర్ విల్లాన్యువా.

‘వార్ ఆన్ డ్రగ్స్’ బాధిత కుటుంబాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 'వార్ ఆన్ డ్రగ్స్' బాధిత కుటుంబాలు

డ్రగ్స్‌పై డ్యుటెర్టె యుద్ధం..

డ్రగ్స్ నిరోధానికి డ్యుటెర్ట్ చేపట్టిన క్రూరమైన చర్యలకు మద్దతు పలికేవారు ఉన్నారు.

'డ్రగ్స్‌పై యుద్ధం వల్ల సంఘ విద్రోహుల సంఖ్య తగ్గింది' అని ఒఫీలియా అన్నారు. ఒకప్పుడు డ్రగ్స్ సంబంధిత నేరాలతో అట్టుడికిన ఉత్తర మనీలాలోని పిన్యాహాన్‌లో ఒఫీలియా నివసిస్తారు. ఆమెకు నలుగురు పిల్లలు.

2020 కోవిడ్ మహమ్మారి ఉద్ధృతంగా ఉన్న సమయంలో ఒఫీలియా ఇంటికి కేవలం 30 మీటర్ల దూరంలో ఉన్న బుల్‌డాగ్ అనే ఒక డ్రగ్స్ యూజర్‌ను చంపడానికి ముసుగులు ధరించిన ఇద్దరు వచ్చారు. వారు పోలీసులు ఏర్పాటు చేసిన క్వారంటైన్ చెక్ పాయింట్లు దాటుకుంటూ వెళ్లారు.

ఎన్నికల్లో డ్యుటెర్ట్‌కు మద్దతుగా ఓటు వేసిన ఒఫీలియా మాత్రం బుల్‌డాగ్‌ను చంపడంపై ఆవేదన చెందారు. బుల్‌డాగ్‌తో ఆమెకు పరిచయం ఉండడంతో ఆయన మరణం ఆమెను బాధించింది.

''ఇది చాలా బాధాకరం, ఆయన మారడానికి రెండో అవకాశం ఇవ్వాల్సింది'' అన్నారామె.

2016లో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిగా ఎన్నికైన 77 ఏళ్ల రోడ్రిగో 'డిగాంగ్' డ్యుటెర్టే.. డ్రగ్స్, నేరాలను అరికట్టే పని పెట్టుకున్నారు.

'వార్ ఆన్ డ్రగ్స్' పేరిట ఆయన అనుసరించిన వివాదాస్పద విధానంలో భాగంగా పోలీసులు చేపట్టిన చర్యలలో మాదకద్రవ్యాలు వాడుతారని అనుమానం ఉన్నవారు, డ్రగ్ డీలర్లన్న అనుమానం ఉన్నవారు వేలాది మంది హతమయ్యారు. గుర్తుతెలియని ముసుగు సాయుధుల చేతుల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ముసుగు సాయుధులను ఫిలిప్పీన్స్ మీడియా 'విజిలెంట్స్' అని పిలుస్తుంది.

Rodrigo Duterte

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రోడ్రిగో డ్యుటెర్టె

మాదకద్రవ్యాలపై యుద్ధం పేరిట పోలీసులు ఏం చేసినా శిక్షలు లేకుండా తప్పించుకున్నారంటూ ప్రజలు చాలా ఆధారాలు చూపిస్తున్నారు. డ్యూటీలో లేని ఓ పోలీస్ అధికారి తన పొరుగువారితో గొడవ పడిన తరువాత వారిని కాల్చి చంపిన ఘటన ఒకటి కెమేరాలలో రికార్డయింది.

దీనిపై ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో ఆ పోలీస్ అధికారికి కోర్టులో జీవిత ఖైదు శిక్ష వేశారు.

''2017లో నేను మనీలా వచ్చిన కొద్దిరోజులకే 'డ్రగ్ వార్, డబుల్ బ్యారెల్ రీలోడెడ్' పేరిట చేపట్టిన పోలీస్ ఆపరేషన్‌లో ఒకే రోజు సాయంత్రం 32 మంది డ్రగ్ డీలర్లను చంపేశారు.

హతులలో చాలామంది కుటుంబీకులు తమవారు అమాయకులని చెప్పారు. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలూ ఈ హింసను ఖండించాయి.

'ఫిలిప్పీన్స్‌లోని 30 లక్షల మంది మాదకద్రవ్యాల బానిసలను చంపడం సంతోషంగా ఉంది' అంటూ డ్యుటెర్ట్ ఓసారి అన్నారు. అంతేకాదు... తన 'వార్ ఆన్ డ్రగ్స్'ను జర్మనీలోని హోలోకాస్ట్‌(రెండో ప్రపంచ యుద్ధంలో యూదుల హననం)తో పోల్చుకున్నారు.

రోడ్రిగో ప్రభుత్వం మాదకద్రవ్యాల బానిసలు, డీలర్లతో అమానవీయంగా వ్యవహరించింది. అంతేకాదు, రోడ్రిగో మద్దతుదారులు కూడా సోషల్ మీడియాలో డ్రగ్ యూజర్లు, డీలర్లను రేపిస్ట్‌లు, కిల్లర్లుగా అంటూ అలాంటివారిని చంపినా తప్పులేదన్న ప్రచారం పెద్ద ఎత్తున చేపట్టేవారు.

యూదుల విషయంలో నాజీలు అనుసరించిన విధానం మాదిరిగానే డ్రగ్స్ వినియోగించేవారు, అమ్మేవారి విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలంటూ రోడ్రిగో ప్రభుత్వంలోని విదేశీవ్యవహారాల మంత్రి లాక్సిన్ చేసిన వరుస ట్వీట్లు అంతర్జాతీయంగా వివాదాస్పదమయ్యాయి.

ఫిలిప్పీన్స్ 'వార్ ఆన్ డ్రగ్స్'‌లో ప్రాణాలు కోల్పోయిన వారి అసలైన సంఖ్య ఎప్పటికీ తెలియదు. పోలీసులు నేరుగా చేపట్టిన ఆపరేషన్స్, ముసుగు సాయుధుల కాల్పుల్లో మరణించినవారికి(దర్యాప్తులో ఉన్న మరణాలు - డెత్స్ అండర్ ఇన్వెస్టిగేషన్- డీయూఐ) సంబంధించి అధికారులు మొదట చెప్పిన లెక్కల ప్రకారం ఈ సంఖ్య 10 వేలు.

కానీ ప్రభుత్వం ఆ తరువాత దర్యాప్తులో ఉన్న మరణాలను ఈ లెక్కల నుంచి తప్పించింది. దీంతో మరణాల సంఖ్య తగ్గింది.

Rodrigo Duterte

ఫొటో సోర్స్, Reuters

2016 జులై నుంచి 2022 ఏప్రిల్ మధ్య హతమైన డ్రగ్ డీలర్లు, డ్రగ్ యూజర్ల సంఖ్య 6,248 అని అధికారులు చెబుతున్నారు. అయితే, మానవ హక్కుల సంస్థలు మాత్రం ఈ సంఖ్య 30,000కు పైగా ఉంటుందని అంటున్నాయి.

ఆత్మరక్షణలో భాగంగానే మాదక ద్రవ్యాల నేరస్థులను హతమార్చామని పోలీసులు ప్రతిసారీ చెబుతున్నరు. కానీ, సీసీ టీవీ ఫుటేజ్, బాధితుల ఫొటోల ప్రకారం చూస్తే అలా కనిపించడంలేదు. ఈ హత్యలు దారుణంగా జరిగాయని విజిల్ బ్లోయర్ల సోషల్ మీడియా ఖాతాలూ చెబుతున్నాయి. ముసుగులు ధరించి హత్యలు చేస్తున్నది అధ్యక్షుడి ఆదేశాల మేరకు పనిచేస్తున్న అధికారులేనని 2019లో వచ్చిన ఓ డాక్యుమెంటరీలో మనీలాకు చెందిన పోలీస్ అధికారి ఒకరు చెప్పారు.

ప్రజాదరణ గల నేత

అయితే ఇదంతా రోడ్రిగో ప్రజాదరణపై ఏమాత్రం ప్రభావం చూపలేదు. మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్నా, అంతర్జాతీయ సమాజం నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నా కూడా రోడ్రిగో రేటింగ్ ఏమాత్రం తగ్గలేదు.

న్యాయవ్యవస్థపై విశ్వాసం తక్కువగా ఉండే ఫిలిప్పీన్స్ వంటి పేద దేశంలో తన దూకుడుతో రోడ్రిగో మరింత ప్రజాదరణ సంపాదించుకున్నరని కొందరు చెబుతారు.

తనది కూడా సుదీర్ఘ రాజకీయ జీవితం అయినప్పటికీ దశాబ్దాలపాటు ఫిలిప్పీన్స్‌ను పాలించిన ఆక్వినో, మార్కోస్ కుటుంబాల తరహా నేతను కానని ఆయన ప్రజలకు సంకేతాలిచ్చారని మరికొందరు చెబుతున్నారు.

నియమాలను ఉల్లంఘిస్తూ తాను ఎవరినైనా శిక్షించగలననే ఒక ముద్రను ఆయన ఏర్పరుచుకున్నారు. మహిళలపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు, సెక్సిస్ట్ వ్యాఖ్యలను కూడా ఆయన మద్దతుదారులు ఏదో సరదాకి అన్న మాటలుగా చెబుతుంటారు.

కానీ, హింసను ప్రోత్సహించడం.. రెచ్చగొట్టే వ్యక్తిత్వం ఆయనకు కొత్తగా వచ్చిందేమీ కాదు.

1980లలో ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో ఫిలిప్పీన్స్ అందులో మునిగితేలుతున్న సమయంలో రోడ్రిగో డ్యుటెర్టె అధికారంలోకి వచ్చారు.

1988లో ఆయన దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని దావో నగరానికి మేయర్‌గా ఎన్నికయ్యారు. అప్పటికి అక్కడ సాయుధ కమ్యూనిస్ట్ విప్లవకారులు, పోలీసుల మధ్య పోరు సాగుతుండేది.

ఈ ప్రతిఘటనలో ఎక్కువ భాగం అల్సా మాసా (జనం నుంచి వచ్చినవారు) అని పిలిచే పౌరుల సమూహాలకు ఆయుధాలు ఇచ్చి కమ్యూనిస్టులపై పోరాటం చేయించేవారు. కొన్ని నివేదికల ప్రకారం కమ్యూనిస్టులతో పోరాడటానికి ప్రజలను బలవంతం చేసేవారు.

ఇందులో అమెరికా పాత్ర కూడా ఉందనే వాదన ఒకటి ఉంది.

ప్రస్తుత విజిలెంట్ గ్రూపులు, డెత్‌స్క్వాడ్‌లకు మూలం డ్యుటెర్టో కనుసన్నల్లో పురుడుపోసుకున్న అల్సా మాసాయేనని చాలామంది విశ్వసిస్తారు.

అల్సామాసా బాధితుల్లోల అత్యధికులు వామపక్షవాదులు, మాదకద్రవ్యాల వినియోగదారులు, డ్రగ్ డీలర్లు, ఇతర నేరస్థులేనని చెబుతుంటారు.

దావోలో వెయ్యి మందికి పైగా హతమవడం, అదృశ్యం కావడంపై ఐరాస చేసిన దర్యాప్తులో వేళ్లన్నీ రోడ్రిగో వైపే చూపించాయి.

అయితే, చంపమని తాను ఎణ్నడూ ఆదేశాలు ఇవ్వలేదని రోడ్రిగో ప్రతిసారీ చెప్పుకొస్తున్నారు.

2018లో మాత్రం ఓసారి ఆయన 'నేను చేసిన ఏకైక పాపం చట్టవిరుద్ధమైన హత్యలు' అని అన్నారు.

సారా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫిలిప్పీన్స్ ఉపాధ్యక్షురాలిగా ప్రమాణం చేస్తున్న సారా(రోడ్రిగో కుమార్తె)

ప్రజాస్వామ్యానికి పాతర

మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేయడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై పరిమితులను సడలించడం వంటి హామీలను ఇచ్చినప్పటికీ కోవిడ్ ప్రభావం, ఆ తరువాత మాంద్యం ఆయన ఆర్థిక రికార్డును అనుకున్నట్లుగా సాగనివ్వలేదు.

దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించడంలో రోడ్రిగో పనితీరు బాగుందని మనీలాలోని 'సీఓఎల్ ఫైనాన్షియల్' చీఫ్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ ఏప్రిల్ తాన్ అన్నారు. 'పన్ను వ్యవస్థను విజయవంతంగా సరళీకరించారు. తన సాంకేతిక బృందం సహాయంతో అనుకున్నవన్నీ చేశారు. సులభ వాణిజ్యానికి వీలుగా అనేక చర్యలు చేపట్టారు' అన్నారు తాన్.

ఆయుధాలు త్యజించిన ఫిలిప్పినో ముస్లింలతో శాంతి ఒప్పందం చేసుకోవడాన్ని కూడా రోడ్రిగో సాధించిన విజయంగా చెబుతారు.

అలాగే... బహిరంగ ప్రదేశాలలో పొగ తాగడాన్ని నిషేధించడం, యూనివర్సిటీలలో ఉచిత విద్య, ఆరోగ్య రంగాన్ని మెరుగుపర్చడం వంటివి ఆయన విజయాలుగా చెబుతారు.

రోడ్రిగో హామీలలో ప్రధానమైనది అవినీతిని అంతం చేయడం.. కానీ, 2021లో స్వయంగా ఆయన ప్రభుత్వమే అవినీతి ఆరోపణలను ఎదుర్కొంది. ఓ హెల్త్ కేర్ సప్లయర్‌కు కేటాయించిన వేల కోట్ల కాంట్రాక్టు విషయంలో రోడ్రిగో ప్రభుత్వం తీవ్ర అవినీతి ఆరోపణలను ఎదుర్కొంది.

మరోవైపు రోడ్రిగో పాలనలో వాక్‌స్వాతంత్ర్యం పూర్తిగా ప్రమాదంలో పడిందన్న ఆరోపణ ఉంది. గెమ్మా భర్త పాట్రీసియో కోసం ప్రార్థనలు చేసిన మత గురువు సహా అనేక మంది విపక్ష నాయకులు, ప్రభుత్వాన్ని విమర్శించేవారు జైలు పాలయ్యారు.

మీడియా స్వేచ్ఛ కూడా లేకపోయింది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, రాప్లర్ న్యూస్ వెబ్‌సైట్ సహ వ్యవస్థాపకురాలు మరియా రెస్సా సైబర్ నేరాల అభియోగాలు పాల్పడ్డారని తేల్చారు. అయితే, ఆమె ఈ ఆరోపణలను తిరస్కరిస్తూ కోర్టులో అప్పీల్ చేశారు. రోడ్రిగో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయడం వల్లే ఆమెను లక్ష్యంగా చేసుకున్నారన్న వాదన ఉంది. చివరకు ఆమె వెబ్‌సైట్‌ను మూసేయాలన్న ఆదేశాలు వచ్చాయి.

రోడ్రిగో ఏ రాజకీయ కుటుంబానికీ చెందినవారు కాకపోవచ్చు కానీ ఆయన మాత్రం తన రాజకీయాల్లో తన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన కుమార్తె సారా డ్యుటెర్టే-కార్పియో ఫిలిప్పీన్స్ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు.

భారీ మెజారిటీతో గెలుపొందిన ఆమె 2028లో అధ్యక్ష ఎన్నికల పోటీలో నిలిచే అవకాశం ఉంది.

కాగా రోడ్రిగో మద్దతుదారులు ఆయన సాధించిన విజయాలు చెబుతుంటారు. 'రోడ్రిగో ఎంతో లెగసీని అందించారు. అదంతా లెక్కించడానికి మీకు చాలా రోజులు పడుతుంది' అంటారు ఆయన మాజీ ప్రతినిధి సాల్వడార్ పనెలో.

కానీ రోడ్రిగో విమర్శకులు మాత్రం హింస కారణంగా ఆయన లెగసీ దెబ్బతింది అంటారు.

'ఇది హత్యా వారసత్వం.. మానవహక్కులను పణంగా పెట్టి కల్పిస్తున్న భద్రత.. దీన్ని నిజమైన భద్రత అనొచ్చా?' అని ఫిలిప్పీన్స్ మానవహక్కుల కమిషన్ హెడ్‌గా పనిచేసిన కరెన్ గోమెజ్ అన్నారు.

(ఫిలిప్పీన్స్‌లో రోడ్రిగో డ్యుటెర్ట్ పాలన ముగిసింది. ఎన్నికలలో గెలిచిన ఫెర్డినాండో మార్కోస్ జూనియర్ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. రోడ్రిగో ఈ ఎన్నికలలో పోటీ చేయలేదు. రోడ్రిగో కుమార్తె ఉపాధ్యక్ష పదవి చేపట్టారు)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)