Donald Trump: ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నపుడు కమోడ్‌లో అధికారిక పత్రాలు వేసి ఫ్లష్ చేసేవారా? ‘కాన్ఫిడెన్స్ మ్యాన్’ వెల్లడిస్తున్న విషయాలేమిటి?

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

'డోనల్డ్ ట్రంప్, తన కూతుర్ని దాదాపుగా ఉద్యోగం నుంచి తీసేసినంత పని చేశారు.'

'ఎప్పటిలాగానే డాక్యుమెంట్లను టాయిలెట్‌లో వేసి ఫ్లష్ నొక్కారు.'

‘పచ్చబొట్టు వేసుకున్న కొన్ని జంతువులు, మీ కూతుర్ని రేప్ చేశాయని ఊహించుకోండి, అప్పుడు ఆ అమ్మాయి గర్భవతి అయితే?’

న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్ట్ మాగీ హేబర్‌మన్ రాసిన, 'కాన్ఫిడెన్స్ మ్యాన్: ది మేకింగ్ ఆఫ్ డోనల్డ్ ట్రంప్ అండ్ ది బ్రేకింగ్ ఆఫ్ అమెరికా' అనే పుస్తకంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు సంబంధించిన ఇలాంటి ప్రస్తావనలు చాలానే ఉన్నాయి.

అమెరికాలో ఎంతగానో ఆసక్తిని రేపిన ఈ పుస్తకం మంగళవారం విడుదలైంది.

న్యూయార్క్‌లో వ్యాపారవేత్తగా ఉన్న నాటి నుంచి అమెరికా మాజీ అధ్యక్షునిగా మారినంత వరకు ట్రంప్ జీవితంలోని ప్రధాన ఘట్టాలను ఈ పుస్తకం ఆవిష్కరించింది.

ఈ పుస్తకం రాయడం కోసం సుమారు 200 మందితో మాగీ హేబర్‌మన్ మాట్లాడారు. వీరిలో ట్రంప్ మాజీ సహాయకులు ఉన్నారు. స్వయంగా ట్రంప్ ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి.

'నిజమో కాదో తెలుసుకోకుండానే అనేక కథలను వండి వార్చారు' అంటూ హేబర్‌మన్ రాసిన పుస్తకం మీద సోషల్ మీడియాలో విమర్శించారు డోనల్డ్ ట్రంప్.

కూతురు ఇవాంక ట్రంప్‌తో డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

హేబర్‌మన్ రాసిన పుస్తకంలోని కొన్ని కీలక విషయాలు...

1. వైట్ హౌస్ నుంచి కూతురు, అల్లుడులను పంపించేయాలని అనుకున్నారు

తన కూతురు ఇవాంక ట్రంప్, అల్లుడు జారెడ్ కుష్నర్... అమెరికా అధ్యక్ష కార్యాలయంలోని తమ పదవుల నుంచి తప్పుకుంటున్నారంటూ ట్వీట్ చేయాలనుకున్న డోనల్డ్ ట్రంప్ చివరి క్షణంలో ఆగిపోయారు.

డోనల్డ్ ట్రంప్ ట్వీట్ చేయకుండా చీఫ్ ఆఫ్ స్టాఫ్ జాన్ కెల్లీ అడ్డుకున్నారు. ట్వీట్ చేసే ముందు ఇవాంక, కుష్నర్‌లతో ఒకసారి మాట్లాడాలని కెల్లీ కోరారు. అయితే డోనల్డ్ ట్రంప్ వారితో ఎప్పుడూ మాట్లాడలేదు. అమెరికా అధ్యక్షునిగా ఆయన పదవి కాలం ముగిసే అంత వరకు ఇవాంక, ఆమె భర్త తమ పదవుల్లో కొనసాగారు.

చీఫ్ ఆఫ్ స్టాఫ్ జాన్ కెల్లీ, వైట్ హౌస్ కౌన్సిల్ డాన్ మెక్‌గాన్‌తో మాట్లాడి ఈ విషయాలు రాసినట్లు హేబర్‌మన్ చెప్పారు.

డోనల్డ్ ట్రంప్, తన అల్లుడు కుష్నర్‌ను ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడుతూ ఉండేవారు. 2017లో కుష్నర్ ఇచ్చిన ఒక పబ్లిక్ స్పీచ్ తరువాత, 'అచ్చం చిన్న పిల్లల మాదిరిగా మాట్లాడుతున్నాడు' అని ట్రంప్ అన్నారు.

అయితే తాను ఎన్నడూ ఇవాంక, ఆమె భర్తను తీసేయాలని అనుకోలేదని ట్రంప్ అన్నారు. 'ఇదంతా ఒట్టి కట్టు కథ. నాకు కలలో కూడా ఆ ఆలోచన ఎన్నడూ రాలేదు' అని తెలిపారు.

మెక్సికో

ఫొటో సోర్స్, Getty Images

2. మెక్సికో డ్రగ్ ల్యాబ్స్ మీద బాంబులతో దాడి చేయాలనుకున్నారు

మెక్సికో డ్రగ్స్ తయారీ కేంద్రాల మీద బాంబులతో దాడి చేయాలని ట్రంప్ చాలా సార్లు అనుకున్నారు. ఆయనకు వచ్చిన ఈ ఆలోచనతో అమెరికా మాజీ రక్షణమంత్రి మార్క్ ఎస్పర్‌ నిర్ఘాంత పోయారు.

అమెరికా ప్రభుత్వ ఆరోగ్య విభాగం అధికారి అయిన బ్రెట్ గిరయిర్‌తో మాట్లాడిన తరువాత మెక్సికో డ్రగ్ ల్యాబ్స్ మీద బాంబు దాడులు చేయాలనే ఆలోచన డోనల్డ్ ట్రంప్‌కు వచ్చింది.

యూఎస్ పబ్లిక్ హెల్త్ సర్వీస్ కమిషన్డ్ కాప్స్‌కు అడ్మిరల్‌గా కూడా బ్రెట్ ఉన్నారు. అమెరికాలోని యూనిఫామ్డ్ సర్వీస్ విభాగాల్లో ఇది ఒకటి. అమెరికా అధ్యక్షున్ని కలిసేటప్పుడు ఆ విభాగానికి చెందిన అధికారులు యూనిఫాంలో వెళ్లడం ఆనవాయితీ.

అలా బ్రెట్ యూనిఫాం ధరించి డోనల్డ్ ట్రంప్‌ను కలిశారు. ఆ సందర్భంగా ట్రంప్‌తో మాట్లాడుతూ మెక్సికో నుంచి అక్రమంగా వస్తున్న డ్రగ్స్‌ను టార్గెట్ చేసి వాటిని సరిహద్దులు దాటి రాకుండా చూడాలని బ్రెట్ అన్నారు.

అయితే యూనిఫాం చూసి బ్రెట్‌ను సైనిక అధికారి అనుకున్న ట్రంప్, మెక్సికో డ్రగ్ ముఠాల మీద దాడి చేయాలని అధికారులకు సూచించారు.

ఈ ఘటన తరువాత ఇకపై ట్రంప్‌ను కలిసేటప్పుడు యూనిఫాం వేసుకోవద్దని అమెరికా అధ్యక్ష కార్యాలయం కోరింది.

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

3. కోవిడ్-19తో చనిపోతానని ట్రంప్ భయపడేవారు

2020 అక్టోబరులో డోనల్డ్ ట్రంప్‌కు కరోనా సోకింది. నాడు ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిన సమయంలో కరోనాతో చనిపోతానేమో అని ట్రంప్ భయపడ్డారు.

చివరకు డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ టోనీ ఒరన్టో, డోనల్ ట్రంప్ కోలుకోక పోతే ప్రత్యమ్నాయ చర్యలు చేపట్టాలనే ఆలోచన కూడా చేశారు.

'మీ ఆరోగ్యం ఇలాగే క్షీణిస్తూ పోతూ ప్రభుత్వం కొనసాగడం కోసం ప్రాసెస్‌ను మొదలు పెట్టాల్సి వస్తుంది' అని డోనల్డ్ ట్రంప్‌తో టోనీ అన్నారు.

నాడు కరోనావైరస్‌ను తేలికగా కొట్టిపారేసే ప్రయత్నం చేశారు డోనల్డ్ ట్రంప్. కానీ తన ఇమేజ్‌ను, రాజకీయ ఆకాంక్షలను దెబ్బకొడుతుందని ట్రంప్ భయపడ్డారు.

తన సహాయకులను మాస్క్ ధరించ కూడదని ట్రంప్ ఆదేశించారు. అలాగే న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యుమోను కరోనావైరస్ గురించి మాట్లాడొద్దని కూడా చెప్పారు.

బ్రిటన్ మాజీ ప్రధాని టెరిసా మేతో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

4. బ్రిటన్‌లో ప్రాపర్టీ గురించి ఆ దేశ ప్రధానితో చర్చ

థెరిసా మే బ్రిటన్ ప్రధానిగా ఉన్నప్పుడు ఒకసారి ఆమెను ట్రంప్ కలిశారు. అదే వారి తొలి సమావేశం.

ఆ సమావేశంలో ముందు ఆయన అబార్షన్ గురించి మాట్లాడారు.

'కొందరు జీవించే హక్కు ఉందని వాదిస్తున్నారు. మరికొందరు గర్భం ఉంచుకోవాలా వద్దా అనే చాయిస్ ఉండాలని కోరుతున్నారు.

ఒకసారి ఊహించుకోండి... పచ్చబొట్లు వేసుకున్న కొన్ని జంతువులు మీ అమ్మాయిని రేప్ చేశారు. దాంతో ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది?' అని మేతో ట్రంప్ అన్నారు.

ఆ తరువాత ఆయన సబ్జెక్ట్‌ను మార్చేశారు. నార్త్ ఐర్లండ్‌లో తన ప్రాపర్టీకి సమీపంలో నిర్మించాలని భావిస్తున్న విండ్ పవర్ ప్రాజెక్ట్‌ను ఎలా అడ్డుకోవాలో ఆమెతో చర్చించారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

ఫొటో సోర్స్, Getty Images

5. 'ఏమైనా చేసి 2020 ఎన్నికలు తారుమారు చేయండి'

2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ఓడిపోతున్నట్లు డోనల్డ్ ట్రంప్‌కు దాదాపుగా అర్థమైంది. అప్పుడు ఆయన, న్యూయార్క్ మేయర్ రూడీకి ఫోన్ చేశారు.

'రూడీ, ఇక నువ్వు చార్జ్ తీసుకో. నీ ఇష్టం... ఏది కావాలంటే అది చెయ్. నేనేమీ పట్టించుకోను' అని రూడీకి ట్రంప్ చెప్పారు.

ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు సహకరించాలని తన లాయర్లను ట్రంప్ కోరగా వారు నిరాకరించారు. ఆ తరువాత ఆయన రూడీతో మాట్లాడారు.

'నా లాయర్లు చాలా చెడ్డ వాళ్లు' అని రూడీ ట్రంప్ అన్నారు.

అమెరికా అధ్యక్ష కార్యాలయం

ఫొటో సోర్స్, Getty Images

6. టాయిలెట్‌లో డాక్యుమెంట్లు వేసేవారు

అమెరికా అధ్యక్షునిగా డోనల్డ్ ట్రంప్ ఉన్నప్పుడు తరచూ ఆయన బాత్రూం కమోడ్‌లో పేపర్లు ఇరుక్కొని పోయి ఉండటాన్ని సిబ్బంది గమనించేవారు.

అప్పుడప్పుడూ ఆయన అధికారక పత్రాలను చింపి వేస్తారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వాస్తవానికి ద ప్రెసిడెన్సియల్ రికార్డ్స్ యాక్ట్ ప్రకారం ఇలా చేయడం తప్పు.

అమెరికా అధ్యక్షునికి వచ్చే పత్రాలు లేదా ఎవరికైనా పంపే పత్రాలను అమెరికా ప్రభుత్వ ఆస్తిగా చూస్తారు. అధ్యక్షుని పదవి కాలం అయిపోగానే అమెరికా నేషనల్ ఆర్కైవ్స్ అధీనంలోకి ఆ పత్రాలను వెళ్తాయి. వాటి నిర్వహణ అదే చూసుకుంటుంది.

డోనల్డ్ ట్రంప్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు కొన్ని పత్రాలు కనిపించకుండా పోయాయనే ఆరోపణలు వచ్చాయి. అవి నిజమేనని నేషనల్ ఆర్కైవ్స్ కూడా తేల్చింది.

అధ్యక్ష పదవి కాలం పూర్తి అయిన తరువాత కూడా ప్రభుత్వ రికార్డులను ఫ్లోరిడాలోని తన ప్రైవేటు ఎస్టేట్‌లో ఉంచినందుకు ట్రంప్ మీద జస్టిట్ డిపార్ట్‌మెంట్ విచారణ చేపట్టింది.

వీడియో క్యాప్షన్, రాయలసీమలో కొరియా రుచులు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)