టూత్ బ్రష్ సరిగ్గా వాడడం ఎలాగో మీకు తెలుసా... దంతాల ఆరోగ్యానికి ఏం చేయాలి?

ఫొటో సోర్స్, Alamy
చిన్నప్పటి నుంచి అందరూ పళ్ళను బ్రష్ చేస్తూనే ఉన్నారు. అయితే, టూత్ బ్రష్ చేయడంలో మనం అంత బెటర్ అయితే కాదు.
కాగా, ప్రతీ పదిమందిలో ఒక్కరే సరిగ్గా పళ్లు తోముకుంటున్నారని స్వీడన్‌కు చెందిన ఓ అధ్యయనం పేర్కొంది.
ఇంగ్లాండ్‌లో 2 వేల మందిపై ఈ టీమ్ సర్వే జరిపింది. దీనిలో దాదాపు సగం మందికి వారి దంతాలను ఎలా బ్రష్ చేయాలో తెలియదని బ్రిటిష్ ఆరోగ్య బీమా సంస్థ ‘బుపా’ కనుగొంది.
ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ యూనివర్సిటీలో రిస్టొరేటీవ్ డెంటిస్ట్రీలో అసోసియేట్ ప్రొఫెసర్, స్పెషలిస్ట్ అయిన జోసెఫిన్ హిర్ష్‌ఫెల్డ్ మాట్లాడుతూ, "తమ దంత వైద్యుడి సూచనలను పట్టించుకోకపోవడం, శుభ్రమైన బ్రష్‌లను వాడకపోవడం దీనికి దారి తీసే అవకాశం ఉంది. అనుభవంతో చెబుతున్నా ఏ దేశంలోనైనా ఇలాంటి వారు అత్యధికంగా ఉంటారు" అని అన్నారు.
మీరు దంతాలను ఎలా బ్రష్ చేయాలి అనేదానిపై అందుబాటులో ఉన్న వివిధ రకాల సమాచారాన్ని బట్టి చూసినా తెలుస్తుంది.
ఒక అధ్యయనం ప్రకారం నిపుణుల వద్ద నుంచి కనీసం 66 విభిన్నమైన, కొన్ని విరుద్ధమైన సలహాలు వచ్చాయి.
"ఇది వినియోగదారుడిని చాలా గందరగోళ పరుస్తుంది" అని ఇంగ్లాండ్‌లోని ఓరల్ హెల్త్ ఫౌండేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిగెల్ కార్టర్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
నాలుక-స్క్రాపర్‌ల నుంచి ఇంటర్‌డెంటల్ వాటర్‌జెట్ వరకు గల దంత ఉత్పత్తుల కారణంగా ఈ గందరగోళం ఏర్పడింది.
మనలో చాలామంది ఎలాంటి తప్పులు చేస్తున్నారు? సమర్థవంతంగా పళ్ళు తోముకునేలా ఉండటానికి దినచర్యను ఎలా మార్చుకోవచ్చు? తెలుసుకుందాం.
హిర్ష్‌ఫెల్డ్ మాట్లాడుతూ.. "దంతాలపై నుంచి ఆహారాన్ని తొలగించడం కంటే బ్యాక్టీరియాను తొలగించడం చాలా ముఖ్యం. ఈ బాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు ప్రతి ఒక్కరి నోటి లోపల పెరుగుతాయి. డెంటల్ ప్లేక్ అని పిలువబడే ఒక క్లాగీ బయోఫిల్మ్‌ను ఏర్పరుస్తాయి.
ఇది దాదాపు 700 రకాల బ్యాక్టీరియాలతో రూపొందించబడింది. ఇది పేగు తర్వాత మానవ శరీరంలో రెండో అతిపెద్ద వైవిధ్యం. అలాగే శిలీంధ్రాలు, వైరస్‌లకు ఆశ్రయం ఇచ్చేది కూడా.
ఇవి దంతాలకు, మృదు కణజాలాలకు అంటుకున్న స్టిక్కీ ఫిల్మ్‌లలో కూడా నివసిస్తాయి" అని చెప్పారు.
"ఈ స్టిక్కీ ఫిల్మ్‌ను సులభంగా కడగలేం. మాన్యువల్‌గా శుభ్రం చేయాలి.
దంతాల నుంచి తొలగించడమే కాదు చిగుళ్ళ నుంచీ తొలగించాలి. ఇక్కడే సూక్ష్మజీవులు కణజాలంలోకి చొరబడి మంటను కలిగిస్తాయి.
చివరికి పీరియాంటైటిస్ వంటి పరిస్థితులను కలిగిస్తాయి. నిజానికి "పళ్ళు తోముకోవడం" అనేది అసంబద్ధం.
దంతాలు కాకుండా మీ గమ్‌లైన్‌ను బ్రష్ చేయడం గురించి ఆలోచించాలి.
దంతాలు వాటికవే బ్రష్ చేయబడతాయి." అని హిర్ష్‌ఫెల్డ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Alamy
ఎంతసేపు బ్రష్ చేయాలి?
అమెరికన్ డెంటల్ అసోసియేషన్, ఎన్‌హెచ్‌ఎస్, ఇండియన్ డెంటల్ అసోసియేషన్, ఆస్ట్రేలియన్ డెంటల్ అసోసియేషన్, అనేక ఇతర జాతీయ ఆరోగ్య సంస్థలు చెప్పేదేంటంటే కనీసం 2 నిమిషాలు, ప్రతిరోజూ రెండుసార్లు బ్రష్ చేయాలి.
మనలో చాలా మంది నిజంగా 2 నిమిషాలు ఎంతసేపు ఉంటుందో అంచనా వేయడంలో పొరబడుతున్నారు.
వివిధ అధ్యయనాల ప్రకారం మనం బ్రష్ చేసే సగటు వ్యవధి 33 సెకన్లు, 45 సెకన్లు, 46 సెకన్లు, 97 సెకన్ల వరకు మారుతూ ఉంటుంది.
జర్మనీలోని జస్టస్-లీబిగ్ యూనివర్సిటీ గీస్సెన్‌లో సంప్రదాయవాద, ప్రివెంటీవ్ డెంటిస్ట్రీ విభాగంలో ప్రొఫెసర్ కరోలినా గాన్స్. ఆమె నేతృత్వంలోని ఒక అధ్యయనం ప్రకారం కేవలం 25% మంది ప్రజలు మాత్రమే సరిగ్గా పళ్ళు తోముకుంటారు. దీనికోసం మీ ఫోన్‌లోని యాప్‌ని ఉపయోగించడం, బాత్రూం గోడకు అతికించిన చిన్న అవర్ గ్లాస్ (నేను ఎంచుకున్నట్లు) లేదా ఇన్‌బిల్ట్ టైమర్‌ని కలిగి ఉన్న ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ వంటివి వాడొచ్చు.
సాధారణంగా ఎక్కువ సమయం పాటు బ్రష్ చేస్తే బయోఫిల్మ్ ఎక్కువ మోతాదులో తొలిగిపోతుందని కార్టర్ చెప్పారు. అయితే దంతాలు, చిగుళ్లను శుభ్రం చేయడానికి రెండు నిమిషాల సమయం అవసరం.
చిగుళ్ల వ్యాధి లేదా ఇతర నోటి వ్యాధులు ఉన్న వ్యక్తులకు బయోఫిల్మ్ పూర్తిగా తొలగించడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు.
"వాస్తవానికి బ్రష్ చేసే సమయం వారి పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. దానిని నిర్వచించలేం, ఎందుకంటే ప్రతి వ్యక్తి దంత, నోటి పరిస్థితి భిన్నంగా ఉంటుంది.
విషయం ఏంటంటే దంతాలు, వాటి ఉపరితలాలు శుభ్రం కావడానికి రెండు నిమిషాల కంటే ఎక్కువ సమయం పడుతుంది." అని హిర్ష్‌ఫెల్డ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Alamy
రోజుకు ఎన్నిసార్లు బ్రష్ చెయ్యాలి?
అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో అక్కడి నిపుణులు రోజుకు రెండుసార్లు జాగ్రత్తగా బ్రష్ చేయాలని సూచిస్తున్నారు.
ఇక భారత డెంటల్ అసోసియేషన్ మాత్రం రోజుకు మూడు సార్లు (లంచ్ తర్వాత బ్రష్‌తో సహా) బ్రష్ చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని సలహా ఇస్తోంది.
ఎలాంటి నోటి సమస్యలు లేనివారు ఇంతకంటే ఎక్కువ మార్గదర్శకాలు పాటించవలసిన అవసరం కూడా లేదు.
‘‘దంతాల నుంచి బ్యాక్టీరియాను తొలగించడానికి రోజుకు రెండు కంటే ఎక్కువ సార్లు బ్రష్ చేయడం హానికరం కావచ్చు. ఎందుకంటే అధికంగా బ్రష్ చేయడం వల్ల దంతాలకు రాపిడి ఏర్పడుతుంది'' అని హిర్ష్‌ఫెల్డ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
"దంతాలకు బ్రేసెస్ ధరించే వారికి ఆహారం సులభంగా చిక్కుకునే అవకాశం ఎక్కువ, అలాంటి వారు ప్రతి భోజనం తర్వాత బ్రష్ చేయమని సలహా" ఇచ్చారు హిర్ష్‌ఫెల్డ్ .
"మీరు కచ్చితంగా రోజుకు ఒకసారి బ్రష్ చేస్తే సరిపోతుందని" అని కార్టర్ చెప్పారు.
"రెండు సార్లు బ్రష్ ఎందుకు చెయ్యమంటారంటే.. మీరు ఇంతకు ముందు దంతాలపై మిస్ అయిన ఫలకాలను కూడా తొలగిస్తారు. ఇలా ప్రతిదీ శుభ్రం చేస్తారు" అని అన్నారు

ఫొటో సోర్స్, Alamy
తిన్నాక బ్రష్ చేస్తే మంచిదా? తినకముందా?
టూత్‌పేస్ట్ తయారీదారుల నుంచి డెంటల్ హాస్పిటల్స్ వరకు అల్పాహారం కంటే ముందు దంతాలు తోముకోవడం మంచిదని చెబుతుంటారు. అయితే ఇది ఇప్పటికీ చర్చనీయాంశం.
"నిర్దిష్ట బలమైన సిఫార్సు లేదు" అని హిర్ష్‌ఫెల్డ్ చెప్పారు.
"చాలా మంది దంత వైద్యులు అల్పాహారం తర్వాత బ్రష్ చేయమని సిఫారసు చేస్తారు. ఎందుకంటే అలా చేస్తే ఫలకాన్ని మాత్రమే కాకుండా ఆహార అవశేషాలను కూడా తొలగిస్తాయి."
అయితే అల్పాహారానికి ముందు బ్రష్ చేయాలా లేదా తర్వాత చెయ్యాలా అనేది మీరు ఏం తింటారు? ఎప్పుడు తింటారు? అనే దానిపై ఆధారపడి ఉంటుంది.
ఎందుకంటే ఒక బయోఫిల్మ్ అభివృద్ధి చెందడానికి సూక్ష్మజీవులు, అవి తినడానికి ఆహారం రెండూ కారణాలే.
"బ్యాక్టీరియా, ఆహారం లేకుండా మీరు కావిటీస్ అభివృద్ధి చేయలేరు" అని హిర్ష్‌ఫెల్డ్ చెప్పారు.
"అల్పాహారానికి ముందు మీరు సరిగా బ్రష్ చేస్తే నోటిలో బ్యాక్టీరియా పోతుంది. అనంతరం ఎంత చక్కెర తిన్నా ఫర్వాలేదు.
అయితే బ్రేక్‌ఫాస్ట్‌కు ముందు ఒకే బ్రషింగ్ సెషన్‌లో 100 శాతం బయోఫిల్మ్ ఖచ్చితంగా తొలగిపోతుందని చెప్పలేం. ఎందుకంటే చాలామంది బ్రష్ సరిగా చేయరు.
అందుకే అల్పాహారం తర్వాత బ్రష్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
"బ్యాక్టీరియా పైన చక్కెరలు ఉంటే వాటిని బ్రష్ చేసి తొలగించినా సమంజసంగానే ఉంటుంది" అని హిర్ష్‌ఫెల్డ్ చెప్పారు.
అయితే ఉదయం టిఫిన్ తర్వాత బ్రష్ చేయడంలో ఇబ్బంది ఏంటంటే మీరు తినడం, బ్రష్ చేయడం మధ్య సమయం ఉండాలి.
అమెరికన్ డెంటల్ అసోసియేషన్ 60 నిమిషాల గ్యాప్ ఉండాలని సిఫార్సు చేస్తోంది. కారణం ఏంటంటే ఆహారంలోని ఆమ్లాలు, సూక్ష్మజీవుల కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ ఉప-ఉత్పత్తులు తాత్కాలికంగా దంతాలకు హాని చేస్తాయి.
"యాసిడ్లు దంతాల ఎనామిల్ పొరపై దాడి చేస్తాయి. కొంత సమయం వరకు వాటిని అవి మృదువుగా చేస్తాయి" అని హిర్ష్‌ఫెల్డ్ చెప్పారు.
ఇది ఎనామిల్‌లోని కొన్ని ముఖ్య భాగాలను తొలగిస్తుంది. కాల్షియం, ఫాస్ఫేట్ అయితే కొన్ని గంటల వ్యవధిలో లాలాజలంలోని ఖనిజాల ద్వారా భర్తీ చేయబడతాయి. ఇది ఆటోమేటిక్‌గా జరుగుతుంది. అందుకే అవి భర్తీ అయ్యే వరకు మీరు వేచి ఉండాలి.

ఫొటో సోర్స్, Alamy
రాత్రిళ్లు ఎందుకు బ్రష్ చెయ్యాలి?
అల్పాహారానికి ముందు లేదా తర్వాత బ్రష్ చేయాలా? వద్దా? అనే ప్రశ్న చాలా చిన్నదని, మీరు ఏం తింటారనే దానిపై అది ఆధారపడి ఉంటుందని కార్టర్ అభిప్రాయపడ్డారు.
అల్పాహారానికి ముందు బ్రష్ చేయడానికి సిట్రస్ పండు, పండ్ల రసం, కాఫీ వంటి ఆమ్ల పానీయాలు కూడా ఓ కారణం.
సాయంత్రం బ్రష్ చేయడం అన్నింటికంటే ముఖ్యం. ఎల్లప్పుడూ పడుకునే ముందు బ్రష్ చేసుకుంటే మంచిది.
"మీ లాలాజలమే మీ సహజ రక్షిత యంత్రాంగం" అని కార్టర్ అంటున్నారు. ఇది బ్యాక్టీరియా పెరుగుదల, దంత క్షయాన్ని నిరోధిస్తుంది.
"రాత్రిపూట లాలాజల ప్రవాహం తగ్గుతుంది, అందుకే, మీరు నిద్రపోయే ముందు బ్రష్ చేయడం ముఖ్యం."

ఫొటో సోర్స్, Alamy
బ్రష్ చెయ్యడానికి ఉత్తమ పద్ధతి ఏంటి?
దంతాలు శుభ్రం చేసుకోవడంలో భాగంగా బయోఫిల్మ్‌ను తొలగించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి "మాడిఫైడ్ బాస్ టెక్నిక్".
మనలో చాలా మంది ఉపయోగించే పుట్-ది-బ్రష్-ఇన్-యువర్-మౌత్-అండ్-లుక్-బిజీ పద్ధతి కంటే దీనికి చాలా ఎక్కువ సామర్థ్యం అవసరం.
హిర్ష్‌ఫెల్డ్ మాట్లాడుతూ.. నా బాత్రూంలో నైలాన్-బ్రిస్టల్ టూత్ బ్రష్‌తో మాడిఫైడ్ బాస్ టెక్నిక్ ప్రయత్నించా.
అవర్ గ్లాస్ (మినియేచర్ అవర్ గ్లాస్)ను ప్రారంభించి అద్దం దగ్గరే రెండు నిమిషాలు బ్రష్ చేశా. అనంతరం అవర్ గ్లాస్ తిప్పి, మళ్లీ ప్రారంభించా.
మాడిఫైడ్ బాస్ టెక్నిక్‌లో టూత్ బ్రష్‌ను పంటికి 45-డిగ్రీల కోణంలో ఉంచాలి.
మీరు చిగుళ్ల వద్ద ముందుకు, వెనుకకు బ్రష్ చేస్తారు. అనేక వీడియోలను నిశితంగా అధ్యయనం చేసిన తర్వాత నేను దాన్ని ఉపయోగించాను.
కొన్ని క్షణాల తర్వాత నా అద్దం తెల్లటి టూత్‌పేస్ట్‌తో స్ప్రే చేయబడింది. నా బ్రష్ కింద పడిపోయింది.
అనంతరం చిగుళ్లు శుభ్రం చేసుకున్నాను.
నిరుత్సాహపడకుండా నేను నా టూత్ బ్రష్‌ని కడిగి మళ్లీ ప్రయత్నించాను.
సున్నితంగా ప్రయత్నించడం చాలా కష్టం.
ఇది కుడిచేతి వాటం ఉన్న నాకు ఎడమ చేతితో ఏదో రాయడానికి ప్రయత్నించినట్లు అనిపిస్తోంది.
చిగుళ్ల కింద, పైన, లోపల, బయట కొంచెం శ్రమించి మాడిఫైడ్ బాస్ టెక్నిత్‌తో బ్రష్ చేశాను. ఆ తర్వాత అవర్ గ్లాస్‌ను చెక్ చేశాను. రెండు నిమిషాలు అయిపోయింది. ఎంతసేపయిందో ఎవరికి తెలుసు. నేనింకా శుభ్రం చేయడం కూడా మొదలుపెట్టలేదు.
బయోఫిల్మ్‌ను తొలగించడంలో మాడిఫైడ్ బాస్ కాకుండా ఇతర పద్ధతులూ ఉన్నాయి.
మరొక సందర్భంలో నేను 'మాడిఫైడ్ స్టిల్‌మ్యాన్'ని ప్రయత్నించాను. ఇది కూడా మాడిఫైడ్ బాస్ మాదిరిగానే ఉంటుంది కాకపోతే చిగుళ్లకు కొంచెం దూరంగా వంపుల్లో చేయాలి.
బ్రష్ చేస్తుండగా సూక్ష్మజీవుల బయోఫిల్మ్ నురుగుతో వచ్చేస్తుందని భావించా.
ఒక వారం తర్వాత నా చిగుళ్ళు కొద్దిగా నొప్పిగా అనిపించడం ప్రారంభించాయి.
ఉత్సాహంతో నేను చాలా ఒత్తిడిని ప్రయోగిస్తున్నానని అనిపించింది.
దంతాలపై ప్రయోగించే ప్రెషర్ 150-400గ్రాముల కంటే ఎక్కువ ఉండకూడదన్నారు హిర్ష్‌ఫెల్డ్.
చాలా గట్టిగా బ్రష్ చేయడం ద్వారా చిగుళ్లకు గాయం అవుతుంది. అతిగా బ్రషింగ్ చేయడం వల్ల మృదు కణజాలంలో నీళ్లు ఏర్పడుతాయి. బాక్టీరియా రక్తప్రవాహంలోకి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది.
ఎనామిల్‌పై గట్టిగా బ్రష్ చేయడం వల్ల పంటిలో చిన్న చిన్న గీతలు ఏర్పడతాయి. ఇది కాలక్రమేణా పంటి కోతకు కారణమవుతుంది.
మామూలు టూత్ బ్రష్‌ను ఉపయోగించే వ్యక్తులు ఎలక్ట్రిక్ బ్రష్‌ను ఉపయోగించే వారి కంటే గట్టిగా చేస్తారు. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు హెచ్చరించడానికి ఎలక్ట్రిక్ బ్రష్‌లలో సెన్సార్లు ఉంటాయి.
కొన్ని రోజులు పిల్లలు, తక్కువ మాన్యువల్ సామర్థ్యం ఉన్న వ్యక్తుల కోసం నేను కొత్త టెక్నిక్ ప్రయత్నించా.
అదే 'ఫోన్స్ పద్దతి'. బ్రష్‌ను 90 డిగ్రీల కోణంలో పట్టుకోవాలి. వృత్తాకార దిశలో దంతాలు, చిగుళ్లను క్లీన్ చేస్తూ బ్రష్ చేయాలి.
ఈ ప్రయోగం చేయడం ఖచ్చితంగా సులభం. అయితే నా చిగుళ్లు యథాతథ స్థితికి వచ్చిన తర్వాత మాడిఫైడ్ బాస్ టెక్నిక్‌లో మాస్టర్ కావాలనుకుంటున్నా.
"మాడిఫైడ్ బాస్ టెక్నిక్ అత్యుత్తమమైన వాటిలో ఒకటి. ఇది పంటికి, చిగుళ్ళకు గాయం కాకుండా సాధ్యమైనంత ఉత్తమమైన మార్గంలో దంతాలను శుభ్రపరుస్తుంది" అని హిర్ష్‌ఫెల్డ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Alamy
ఏ రకమైన టూత్‌పేస్ట్ ఉత్తమం?
మార్కెట్‌లో కొన్ని టూత్ బ్రష్‌లు, టూత్‌పేస్టులు ఉన్నాయి. అవి దంతాలను సమర్థవంతంగా క్లీన్ చేస్తాయని హిర్ష్‌ఫెల్డ్ చెప్పారు.
దంతాలను తెల్లగా చేసే అధిక రాపిడితో కూడిన టూత్‌పేస్ట్‌లు, గట్టి ముళ్లతో కూడిన బ్రష్‌లు (బ్రిస్టల్ బ్రష్) వీటిలో ప్రముఖం.
మీడియం-బ్రిస్టల్ బ్రష్, చిన్న రాపిడి కణాలు లేని టూత్‌పేస్ట్‌లు పెద్దలకు ఉత్తమమైనవి.
సంప్రదాయ టూత్ బ్రష్‌లు, చూయింగ్ స్టిక్ లు (చెట్టు నుంచి వచ్చే మిస్వాక్‌లు) ముఖ్యంగా ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, దక్షిణాసియా దేశాల్లో వాడేవి ప్రభావవంతంగా పనిచేస్తాయి.
కానీ వాటిని సరిగ్గా ఉపయోగించకపోతే చిగుళ్లకు రాపిడి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మిగతా టూత్ బ్రష్‌ల కంటే ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ ప్రభావవంతమైనది, ఖరీదైనది కూడా.
కొన్ని సంవత్సరాల అధ్యయనాల తర్వాత దంతాలపై ఫలకాన్ని తొలగించడంతో ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌లు మరింత ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని మెటా విశ్లేషకులు వెల్లడించారు.
(ఈ మెటా-విశ్లేషణల రచయితలు గతంలో ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌ల తయారీదారుల నుంచి నిధులు పొందారని గుర్తించారు.)
అయితే ఇది ప్రెజర్ సెన్సార్‌లను కలిగి ఉంటుంది. వినియోగదారుడు గట్టిగా నొక్కినప్పుడు ఎనామెల్ దెబ్బతినే ప్రమాదం ఉంది.
సంప్రదాయ, మాన్యువల్ టూత్ బ్రష్‌లు వాడితే మంచి ఫలితముంటుందని హిర్ష్‌ఫెల్డ్ అంటున్నారు.
టూత్ పేస్టులో ఉండాల్సిన ముఖ్యమైన పదార్థం ఏంటి?
టూత్‌పేస్ట్ ప్యాకెట్ వెనుక ప్రత్యేకంగా చూడవలసిన ఒక పదార్ధం "ఫ్లోరైడ్ కంటెంట్" అని హిర్ష్‌ఫెల్డ్ చెప్పారు.
ఇది పెద్దలకు కనీసం 1,350 పార్ట్స్ పర్ మిలియన్ (పీపీఎం), పిల్లలకు 1,000 పీపీఎం ఉండాలి. ఇది యాసిడ్‌ల నుంచి ఎనామిల్‌ను రక్షిస్తుంది.
దంతాల ఎనామిల్ అనేది మానవ శరీరంలో అత్యంత కఠినమైన కణజాలం. ప్రకృతిలో కనిపించే కష్టతరమైన వాటిలో ఒకటి. "దాదాపు వజ్రం లాగా గట్టిది" అని హిర్ష్‌ఫెల్డ్ పేర్కొన్నారు.
ఇది హైడ్రాక్సీఅపటైట్ (ఒక రకమైన కాల్షియం ఫాస్ఫేట్) అని పిలువబడే ఖనిజంతో తయారవుతుంది.
కానీ ఎనామిల్ సులభంగా యాసిడ్‌లో కరిగిపోతుంది. "టూత్‌పేస్ట్‌లో ఫ్లోరైడ్‌లు ఉంటే, కావిటీస్ తగ్గుతాయి" అని హిర్ష్‌ఫెల్డ్ స్పష్టంచేశారు.
బొగ్గు. చాలా ఏళ్లుగా దంతాలను శుభ్రం చేయడానికి ఉపయోగించబడింది. వాణిజ్య టూత్‌పేస్ట్‌లలో బాగా ప్రాచుర్యం పొందింది.
బొగ్గు దంతాలను తెల్లగా మారుస్తుందనే సాక్ష్యం చాలా తక్కువగా ఉంది. ఇది దంతాల కోత, ఇతర సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.
చాలా బొగ్గు టూత్‌పేస్టులు ఫ్లోరైడ్‌ను కలిగి ఉండవు. అందువల్ల కావిటీస్ నుంచి తక్కువ రక్షణను అందిస్తాయి.
అయితే, ఎవరైనా ఫ్లోరైడ్ లేని టూత్‌పేస్ట్‌తో పళ్ళు తోముకున్నా వారు కొంత ప్రయోజనమైతే పొందుతారు.
ఓ మెటా-విశ్లేషణ రచయితల ప్రకారం బేకింగ్ సోడా (సోడియం బైకార్బోనేట్ యొక్క చిన్న స్ఫటికాలు) కలిగిన టూత్‌పేస్ట్‌లు దంతాలపై పొరను తొలగించగలుగుతాయి.
అయితే, దీన్ని నిర్ధారించడానికి మరిన్ని అధ్యయనాలు అవసరమని వారు గుర్తించారు. (వారు గతంలో టూత్ బ్రష్, టూత్‌పేస్ట్ తయారీదారుల నుంచి నిధులు పొందారు).
అదే విశ్లేషణలో బేకింగ్-సోడా టూత్‌పేస్ట్‌లు చిగురువాపు కారణంగా వచ్చే రక్తస్రావాన్ని కొద్దిగా తగ్గించగలవని చెప్పారు.
మౌత్ వాష్ ఉపయోగించాలా?
దంతాల మీది పొరను తొలగించడంలో బ్రష్ చేయడంతో పోల్చితే మౌత్ వాష్ ప్రభావం తక్కువేనని కార్టర్ చెప్పారు.
అయితే, ఈ రెండూ చేస్తే ఫలితంగా మెరుగ్గా ఉంటుంది. ఇది చిగురువాపు చికిత్సకూ ఉపయోగపడుతుంది. ఇందుకోసం మన వాడే పేస్టు కనీసం 100 పీపీఎం ఫ్లోరైడ్‌ను కలిగి ఉండాలి.
ఇది పొరను తగ్గిస్తుందని వైద్యపరంగా నిరూపించబడింది. మీ చిగుళ్లలో ఇప్పటికే రక్తస్రావం ఉన్నట్లయితే దీన్ని ఉపయోగించడం ఉత్తమం.
దంతాలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం ద్వారా చిగుళ్ళ వాపు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
- కరెంటు, తిండీ లేకుండా సముద్రంలోనే నెల రోజులు, చివరికి ఎలా బయటపడ్డారు?
- కోవిడ్-19 బీఎఫ్7: ఆక్సిజన్ సిలిండర్, మందులు కొని ఇంట్లో పెట్టుకోవాలా?
- అమ్మ ఒడి : బడికి వెళ్లే పిల్లలకు ఇచ్చే రూ.15 వేలు తీసుకోవడం ఎలా?
- క్రికెట్: ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 భారత ఆటగాళ్లు వీళ్లే...
- చార్లీ చాప్లిన్ శవపేటికను దొంగతనం చేసి, అతడి భార్యను బ్లాక్ మెయిల్ చేసిన దొంగల కథ మీకు తెలుసా..?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















