2022లో చరిత్ర సృష్టించిన భారత క్రీడాకారిణులు వీరే

- రచయిత, దీప్తి పట్వర్ధన్
- హోదా, బీబీసీ కోసం
2022లో స్పోర్ట్స్‌లో కొంతమంది మహిళా క్రీడాకారిణులు చరిత్ర సృష్టించారు. మరికొందరు రికార్డులను బద్దలుకొట్టారు.
ఈ ఏడాది స్పోర్ట్స్‌లో సంచలనంగా మారిన భారత మహిళలను ఒకసారి చూద్దామా..

ఫొటో సోర్స్, SPORTS AUTHORITY OF INDIA
నిఖత్ జరీన్
భారత బాక్సింగ్‌లో ఏళ్ల నుంచీ మేరీ కోమ్ ఆధిపత్యం కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు అదే విభాగంలో నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది.
తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన 26 ఏళ్ల నిఖత్ కృషి ఈ ఏడాది ఫలించింది. 52 కేజీల కేటగిరీలో ఆమె వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకుంది.
మేలో జరిగిన ఐబీఏ విమెన్స్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్ ఫైనల్స్‌లో నిఖత్ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది.
మొత్తం 5 మ్యాచ్‌లలోనూ గెలిచి, 5-0 స్కోర్‌తో ఆమె పతకం తీసుకొచ్చింది.
బాక్సింగ్ వరల్డ్ చాంపియన్‌షిప్ గెలుచుకున్న భారతీయ మహిళల వరుసలో నిఖత్ 5వ స్థానంలో ఉంది.
భారత్‌కు వెలుపల జరిగిన చాంపియన్‌షిప్ గెలిచిన భారత మహిళల జాబితాలో మేరీ కోమ్ తర్వాత స్థానం ఆమెదే.
మతపరమైన ఉద్రిక్తతలు, మహిళలపై హింస లాంటి వార్తలు తరచూ వినిపిస్తున్న నేపథ్యంలో.. నిఖత్ విజయం ప్రజలకు మంచి సందేశం ఇస్తోంది.
ప్రపంచ చాంపియన్‌షిప్ విజయం తర్వాత రెండు నెలలకు కామన్వెల్త్ గేమ్స్‌లోనూ 50 కేజీల విభాగంలో నిఖత్ స్వర్ణ పతకం గెలుచుకున్నారు. ఈ ఏడాది ఆమెకు బాగా కలిసి వచ్చిందని చెప్పుకోవాలి.

ఫొటో సోర్స్, CLIVE BRUNSKILL
మీరాబాయి చాను
వెయిట్‌లిఫ్టింగ్‌లో రజతంతో గత ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాను తెరిచిన మీరాబాయి చాను 2022లో రెండు మైలురాళ్లను అధిగమించింది.
వీటిలో మొదటిది బర్మింగ్హమ్ కామన్వెల్త్ గేమ్స్‌లో ఆమె తన బరువుకు దాదాపు రెండు రెట్ల బరువును ఎత్తి చరిత్ర సృష్టించారు. అది కూడా ఆమె చేతికి గాయమైనప్పుడు ఈ ఘనత సాధించింది.
49 కేజీల కేటగిరీలో బరిలోకి దిగిన ఆమె 88 కేజీలు, 113 కేజీలను ఎత్తి బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. ఆమె ఎత్తిన మొత్తం బరువు ఇక్కడ 201 కేజీలు. తన సమీప అభ్యర్థి కంటే ఇది 29 కేజీలు ఎక్కువ.
అయితే, బోగోటాలో జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్‌లకు ముందుగా అంటే సెప్టెంబరులో ఆమె చేతికి గాయమైంది. దీంతో ఆమె 87 కేజీలను ఎత్తడానికి కాస్త కష్టపడాల్సి వచ్చింది.
రెండో ప్రయత్నం మాత్రం విజయవంతం కాలేదు. మూడో ప్రయత్నంలో మళ్లీ ఆమె విజయం సాధించారు. దీంతో మొత్తంగా 113 కేజీలను ఎత్తి రజత పతకాన్ని ఆమె గెలిచింది.

ఫొటో సోర్స్, Getty Images
పీవీ సింధు
ఇటీవల కాలంలో స్థిరంగా మంచి ప్రతిభ కనబరుస్తున్న భారత క్రీడాకారిణుల్లో పీవీ సింధు ఒకరు. కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల సింగిల్స్‌లో ఆమె తన తొలి స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. ఫైనల్స్‌లో కెనడాకు చెందిన మిషెల్లీ లీపై 21-15, 21-13 తేడాతో ఆమె గెలిచింది.
2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో సింధు కాంస్యం గెలిచారు, 2018 గోల్డ్ కోస్ట్‌లో రజతం గెలిచారు, దీంతో బర్మింగ్హమ్‌లో ఈ సారి బంగారం వస్తుందని ఆశలను ఆమె నిజం చేసింది.
రెండుసార్లు ఒలింపిక్ పతకాలు గెలిచిన ఆమెకు కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం సాధించడం అంత కష్టమేమీ కాకపోవచ్చు. అయితే, తీవ్రమైన ఒత్తిడిలోనూ ఆమె పతకాన్ని గెలిచింది.
సింగపూర్ ఓపెన్ (జులై), స్విస్ ఓపెన్ (మార్చి), సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ (జనవరి) టైటిళ్లు కూడా ఆమె గెలుచుకుంది.
ప్రియాంకా గోస్వామి
టోక్యో స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా నేతృత్వంలో ఈ ఏడాది భారత అథ్లెట్లు మంచి ప్రదర్శన కనబరిచింది.
కామన్వెల్త్ గేమ్స్‌లో పది మీటర్ల రేస్‌వాక్‌లో ప్రియాంకా గోస్వామి రజతాన్ని గెలుచుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన జెమీమా మోంటాగ్‌తో పోటీపడి ఆమె గెలిచింది
ఉత్తర్ ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన 26 ఏళ్ల ప్రియాంకా ఒక బస్సు కండక్టర్ కుమార్తె. ఇదివరకు ఆమె జిమ్నాస్టిక్స్ ఈవెంట్స్‌లోనూ పాల్గొన్నారు. ఆ తర్వాత రేస్‌వాకింగ్ దిశగా అడుగులు వేసింది.
టోక్యో ఒలింపిక్స్‌లోనూ భారత్‌కు ఆమె ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం పది కి.మీ. రేసును 43.31 నిమిషాలు, 20 కి.మీ.ను 1.28 గంటల్లో పూర్తిచేసిన రికార్డు ఆమె పేరిట ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
అన్ను రాణి
ప్రియాంకా గోస్వామి తరహాలోనే కామన్వెల్త్ గేమ్స్‌లో అన్ను రాణి చరిత్ర సృష్టించారు. జావెలిన్ త్రోలో పతకం గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణి ఆమె.
బర్మింగ్హమ్‌లో నాలుగో ప్రయత్నంలో 60 మీ.కు జావెలిన్‌ను విసిరి ఆమె రజత పతకాన్ని గెలిచింది.
30ఏళ్ల రాణి స్వస్థలం ఉత్తర్ ప్రదేశ్‌లో మేరఠ్. ఆమెది వ్యవసాయ కుటుంబం. పూట గడవడం కష్టమయ్యే ఇంటి నుంచి వచ్చిన ఆమె టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది.
కామన్వెల్త్ గేమ్స్‌కు ముందుగా ఆరేగాన్‌లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లోనూ రాణి పాల్గొన్నారు. ఫైనల్స్ వరకు ఆమె వెళ్లగలిగింది.

ఫొటో సోర్స్, INDRANIL MUKHERJEE
సవిత పూనియా
భారత మహిళల హాకీ జట్టు పేరు వినగానే చాలా మందికి సవితా పూనియా పేరు గుర్తుకు వస్తుంది. 2022 వరల్డ్ కప్‌కు ముందుగా రాణి రాంపాల్ నుంచి కెప్టెన్సీని ఆమె అందుకుంది
కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకాన్ని భారత్‌కు ఆమె తెచ్చిపెట్టారు. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్, నేషనల్స్ కప్‌లోనూ జట్టు మంచి ప్రదర్శన కనబరచడంలో ఆమె ప్రధాన పాత్ర పోషించింది.
కామన్వెల్త్ గేమ్స్‌లో న్యూజీలాండ్‌పై 2-1 తేడాతో విజయం సాధించడంలోనూ సవితది కీలక పాత్రే.
మొత్తంగా ఆడిన 14 గేమ్స్‌లో గోల్‌కీపర్‌గా గోల్‌ను ఆమె 57 సార్లు అడ్డుకుంది. .

ఫొటో సోర్స్, Getty Images
మణికా బాత్రా
నాలుగేళ్ల క్రితంలా కామన్వెల్త్ గేమ్స్‌లో ఈ సారి మణిికా ప్రదర్శన లేనప్పటికీ, ఆమె వెంటనే మళ్లీ పుంజుకుంది.
బ్యాంకాక్‌లో జరిగిన టేబుల్ టెన్నిస్ ఐటీటీఎఫ్-ఏటీటీయూ ఆసియా కప్‌లో ముగ్గురు ప్రపంచ అగ్రశ్రేణి క్రీడాకారులను ఓడించి ఆమె కాంస్య పతకాన్ని సాధించింది.
ఆ సమయంలో ఆమె ప్రపంచ ర్యాంకు 44. అయితే, చైనాకు చెందిన నంబర్ 7 చెన్ షింగ్‌టాంగ్, నంబరు 23 చెన్ సయులను ఆమె ఓడించారు. ఫైనల్స్‌లో జపాన్‌కు చెందిన నంబర్ 6 హీనాహయాటాపై గెలిచింది.

ఫొటో సోర్స్, Getty Images
వినేశ్ ఫోగట్
టోక్యో ఒలింపిక్స్‌లో నిరాశాజనక ప్రదర్శన తర్వాత వినేశ్ ఫోగట్ శారీరక, మానసిక ఆరోగ్యం చాలా ప్రభావితం అయ్యింది. అయితే, మళ్లీ ఆమె కూడా పుంజుకున్నారు.
కామన్వెల్త్‌లో బంగారం సాధించి ఆమె మొదట హ్యాట్రిక్ కొట్టారు. ఆ తర్వాత వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లోనూ కాంస్య పతకాన్ని సాధించారు.
కామన్వెల్త్ గేమ్స్‌లో 53 కేజీల కేటగిరీలో 30 సెకన్లలోనే సమాంతా స్టీవార్ట్‌ను వినేశ్ ఓడించింది. ఆ తర్వాత నైజీరియాకు చెందిన మెర్సీ డెకూరోయ్, శ్రీలంకకు చెందిన చమోద్య మదురవలగేలను ఓడించి స్వర్ణ పతకం గెలుచుకుంది.
బెల్‌గ్రేడ్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో స్వీడన్‌కు చెందిన ఎమ్మా మల్మెగ్రేన్‌పై గెలిచి కాంస్య పతకాన్ని సాధించింది వినేశ్.
కెరియర్‌లో మరింత దూకుడుగా ముందుకు వెళ్లేందుకు ఈ పతకాలు ఆమెలో స్ఫూర్తిని నింపాలి.
ఇవి కూడా చదవండి:
- వరల్డ్ కప్ ఫైనల్: ఇక ఫుట్‌బాల్ రారాజు మెస్సీయేనా
- ఖతార్‌లో ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌తో దుబాయ్ భారీగా ఎలా లబ్ధి పొందుతోందంటే
- Argentina vs France: అర్జెంటీనాకు యువ ఆటగాడు జులియన్ అల్వారెజ్ ఎలా కీలకం అయ్యాడు
- సోక్రటీస్: ప్రపంచంలోనే అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాడు.. ప్రపంచ కప్ గెలవలేకపోయాడు
- పీలే: ఫుట్‌బాల్ దిగ్గజం కన్నుమూత
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















