క్రికెట్: ‘వృద్ధిమాన్ సాహా మాటలతో నాకేం బాధ లేదు, నేను చెప్పాల్సింది చెప్పా’ అని కోచ్ రాహుల్ ద్రవిడ్ ఎందుకు అన్నారు? ఇద్దరి మధ్య ఏం జరిగింది?

ఫొటో సోర్స్, ANI
- రచయిత, మనోజ్ చతుర్వేది
- హోదా, బీబీసీ కోసం
భారత వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ వృద్ధిమాన్ సాహా వివాదం పతాక శీర్షికలకు చేరింది.
రిటైర్మెంట్ గురించి ఆలోచించాలని తనకు టీమ్ మేనేజ్‌మెంట్, దక్షిణాఫ్రికా పర్యటన ముగిసిన తర్వాత సూచించిందని సాహా ఆరోపించారు. ఈ అంశంపై భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా స్పందించారు.
టీమిండియాకు చాలాకాలంగా రిషభ్ పంత్ తొలి ప్రాధాన్య వికెట్‌కీపర్‌గా ఉన్నాడు. గత దక్షిణాఫ్రికా పర్యటనలోనూ మూడు టెస్టు మ్యాచ్‌ల్లోనూ పంత్‌నే తుదిజట్టులోకి ఎంపిక చేసి, సాహాను బెంచ్‌కే పరిమితం చేశారు.
శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ఇటీవల ప్రకటించిన భారత జట్టులో సాహాకు చోటు దక్కలేదు. దీంతో అసహనం చెందిన సాహా... ''భవిష్యత్‌లోనూ నా పేరును పరిగణలోకి తీసుకోబోమని టీమ్ మేనేజ్‌మెంట్ చెప్పింది. రిటైర్మెంట్ గురించి ఆలోచించాలని సూచించింది'' అని వెల్లడించారు.
''కాన్పూర్‌లో న్యూజీలాండ్‌తో టెస్ట్ మ్యాచ్‌లో నేను పెయిన్ కిల్లర్స్ తీసుకొని అజేయంగా 61 పరుగులు చేసినప్పుడు, దాదా (సౌరవ్ గంగూలీ) చాలా ప్రశంసించారు. కానీ ఇంత వేగంగా పరిస్థితులు మారిపోవడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది'' అని అన్నారు.
శ్రీలంక సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంతో, రంజీ ట్రోఫీలోనూ ఆడకూడదని సాహా నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయాన్ని ఆయన బహిరంగంగానే వెల్లడించారు.
ఈ మొత్తం అంశం గురించి భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించారు. ''సాహా మాటలు నాకు బాధ కలిగించలేదు. సాహా సాధించిన ఘనతలు, భారత క్రికెట్‌కు ఆయన చేసిన సేవ కారణంగా తనంటే నాకు చాలా గౌరవం. అందుకే తనతో చాలా స్పష్టంగా చెప్పాల్సింది చెప్పాను. మీడియా ద్వారా ఈ అంశాలు సాహాకు తెలియకూడదని నేను భావించాను'' అని ద్రవిడ్ స్పష్టం చేశారు.
రిషబ్ పంత్ జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. అతనికి తోడుగా మరో యువ వికెట్ కీపర్‌ను తయారు చేయాల్సిన అవసరం ఉందని కోచ్‌గా ద్రవిడ్ భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, ANI
బీసీసీఐ ఆలోచనలో మార్పు
దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని అంచనాలకు తగినట్లుగా రాణించలేకపోయినప్పడు రిటైర్మెంట్ గురించి తరచుగా మీడియాలో వార్తలు వచ్చేవి. అప్పుడు బీసీసీఐ నుంచి ఒక ప్రకటన వస్తుండేది.
''ఎప్పుడు ఏం చేయాలో వారికి బాగా తెలుసు. తమ నిర్ణయాలను వారే సొంతంగా తీసుకోగలరు. ఆడలేమని అనిపించినప్పుడు వారే రిటైర్మెంట్ గురించి ప్రకటిస్తారు'' అని బీసీసీఐ చెబుతుండేది.
ఇప్పుడు కూడా సాహా భవిష్యత్ గురించి టీమ్ మేనేజ్‌మెంట్, బీసీసీఐ సెలెక్టర్లు స్పందించాలని డిమాండ్లు వస్తున్నాయి.
భారత క్రికెట్‌ను గమనించేవారికి, ద్రవిడ్ సూటిగా మాట్లాడటాన్నే ఇష్టపడతాడనే సంగతి తెలిసి ఉంటుంది.
అందుకే ఆయన, టీమిండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత తుది జట్టులో ఎంపిక కాని ఆటగాళ్లతో మాట్లాడటం మొదలుపెట్టారు. దీనివల్ల ఆటగాళ్లు నిరాశకు గురికాకుండా ఉంటున్నారు.

ఫొటో సోర్స్, AFP
రిటైర్మెంట్‌పై క్రికెటర్లకు స్పష్టత ఉండాలి...
భారత క్రికెట్ చరిత్రను పరిశీలిస్తే, సరైన రిటైర్మెంట్ ప్రణాళికలు లేకపోవడం వల్లే భారత క్రికెటర్లు బాధితులైనట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది.
దేశానికి తొలి ఐసీసీ టైటిల్‌ను అందించిన కపిల్ దేవ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, భారత విజయవంతమైన సారథిగా పేరు తెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోని... వీరంతా కూడా రిటైర్మెంట్‌కు సంబంధించిన ఒత్తిడిని ఎదుర్కొన్నవారే.
భారత క్రికెట్‌కు కొత్త దిశానిర్దేశం చేసిన ఆటగాడిగా కపిల్ దేవ్‌ను పరిగణిస్తారు. కానీ కెరీర్ చివరి దశలో ప్రదర్శన అనుకున్న స్థాయిలో లేకపోవడంతో కపిల్ అనేక విమర్శలను ఎదుర్కొన్నారు. ఆయన ఇక రిటైర్ అయితే బావుంటుందని అందరూ అనుకున్నారు.
కానీ, టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రికార్డును అందుకోవడం కోసం ఆయన ఆటను కొనసాగించారు. మైదానంలో అనుకున్న స్థాయిలో రాణించలేకపోవడంతో ఆ రికార్డు దూరమవుతూనే వచ్చింది. చివరకు 434 టెస్టు వికెట్లను తన ఖాతాలో వేసుకున్న ఆయన రిటైర్మెంట్ ఇవ్వక తప్పలేదు.

ఫొటో సోర్స్, Getty Images
సచిన్ పరిస్థితి కూడా అంతే...
ప్రపంచ ప్రసిద్ధి చెందిన భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు ఐసీసీ ప్రపంచకప్ టైటిల్‌ను అందుకోవడం ఒక కల. 2011లో మహేంద్ర సింగ్ సారథ్యంలోని భారత జట్టు ప్రపంచకప్‌ను గెలిచిన తర్వాత, సచిన్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడని క్రికెట్ అభిమానులు అనుకున్నారు.
విమర్శలు వస్తున్నప్పటికీ సచిన్ తన ఆటను కొనసాగించారు. చివరకు 200వ టెస్ట్ మ్యాచ్ ఆడిన తర్వాత, 2013 నవంబర్ 16న వాంఖెడే మైదానంలో సచిన్ రిటైర్ అయ్యారు. అంటే భారత్, ప్రపంచకప్ గెలిచిన రెండేళ్ల తర్వాత సచిన్ జట్టు నుంచి తప్పుకున్నారు.
ఇక ధోని విషయానికొస్తే, టెస్ట్‌ల నుంచి ఆయన అనూహ్యంగా తప్పుకున్నారు. కానీ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో మాత్రం రిటైర్మెంట్ ప్రకటించకుండా కొన్నిరోజులు జట్టుకు దూరంగా ఉన్నారు.
ధోని, గొప్ప మ్యాచ్ ఫినిషర్ అనే సంగతి అందరికీ తెలుసు. ధోని సిక్సర్ కొట్టాలని తలుచుకుంటే బంతి మైదానం అవతల పడుతుందని ఆయన గురించి చెప్పేవారు.
కానీ కొన్నాళ్లకు సిక్స్‌లు కొట్టే క్రమంలో ధోని అవుటయ్యే పరిస్థితి తలెత్తింది. అయినప్పటికీ ఆయన చాలా ఆలస్యంగానే పరిమిత ఓవర్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ పలికారు. అనూహ్యంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. భారత విజయవంతమైన సారథి అయినప్పటికీ ఆయనకు తగు రీతిలో వీడ్కోలు కూడా లభించలేదు.

ఫొటో సోర్స్, AFP
వాణిజ్యపరమైన కారణాలు
భారత క్రికెటర్లలో రిటైర్మెంట్ గురించి అనిశ్చితి ఏర్పడటానికి ప్రధాన కారణం డబ్బు.
ప్రపంచ క్రికెట్‌లో నగదు చలామణీ అధికంగా భారత్‌లోనే జరుగుతుంది. ఆట కన్నా కూడా వాణిజ్య ప్రకటనల ద్వారా క్రికెటర్లు అధికంగా ఆర్జిస్తారు. అన్ని రకాల బ్రాండ్ల ప్రకటనల్లో క్రికెటర్లు కనిపిస్తుంటారు.
క్రికెట్‌లో సాధించిన పాపులారిటీ ద్వారానే క్రికెటర్లకు వాణిజ్య ప్రకటనల ఆఫర్లు వస్తాయి. ఆటగాళ్ల ప్రదర్శనపై వారి పాపులారిటీ ఆధారపడి ఉంటుంది. రిటైర్మెంట్ ప్రకటిస్తే, ఎండార్స్‌మెంట్లు తగ్గిపోతాయని క్రికెటర్లు భావిస్తారు.
ఈ కారణంగానే, ప్రదర్శన సరిగా లేకపోయినప్పటికీ, జట్టులో చోటు దక్కుతుందనే ఆశ లేనప్పటికీ చాలామంది ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించకుండా ఆలస్యం చేస్తుంటారు.
కానీ కొందరు క్రికెటర్లు మాత్రం తమకు తిరిగి తుదిజట్టులో చోటు దక్కించుకునే అర్హత, సామర్థ్యం ఉందని భావిస్తుంటారు. టీమ్ మేనేజ్‌మెంట్ వేర్వేరు కారణాలతో ఇలాంటి క్రికెటర్లను విస్మరిస్తుంటుంది.
సెహ్వాగ్ జట్టు నుంచి తప్పుకున్న చాలా కాలం వరకు కూడా క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. భారత్‌కు మరింత కాలం ఆడే సత్తా సెహ్వాగ్‌లో ఉందని వారు నమ్మారు.

ఫొటో సోర్స్, Getty Images
నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి?
ఆస్ట్రేలియాకు చెందిన చాలామంది క్రికెటర్లు ప్రణాళిక ప్రకారం రిటైర్ కావడం మనం చూశాం. అందుకే వారికి వీడ్కోలు మ్యాచ్ ఆడే అవకాశం లభిస్తుంది.
పలానా సిరీస్ తర్వాత రిటైర్ అవుతామని ఇప్పటికే చాలామంది క్రికెటర్లు ప్రకటించారు. ఈ కారణంగానే గౌరవ మర్యాదలతో వీడ్కోలు మ్యాచ్ ఆడటం మనకు కనిపిస్తుంది.
కానీ భారత్‌లో మాత్రం ఇలా జరగడం లేదు. సెలెక్టర్లు పట్టించుకోకపోవడం, మ్యాచ్‌ల్లో చోటు దక్కకపోవడం వంటివి జరిగేంతవరకు ఆటగాళ్లు రిటైర్మెంట్ గురించి ఆలోచించకపోవడం ఇక్కడ తరచుగా కనిపిస్తుంది.
వృద్ధిమాన్ సాహా విషయంలో కూడా ఇలాగే జరిగినట్లుంది. రిషభ్ పంత్ ప్రధాన వికెట్‌కీపర్‌గా ఎదిగిన తర్వాత టీమ్ మేనేజ్‌మెంట్‌కు ఇక తన అవసరం లేదనే విషయాన్ని సాహా బాధపడకుండా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి.

ఇవి కూడా చదవండి:
- రష్యా, యుక్రెయిన్ ఉద్రిక్తతలు: గత కొన్ని గంటల్లో ఏం జరిగింది? 10 పాయింట్స్
- దుబాయ్‌లో 13 రోజుల సహవాసం, మాల్దీవుల్లో, మెక్సికోలో డేటింగ్, ఇండియాలో పెళ్లి
- కస్తూర్బా గాంధీ: శరీరం భస్మమైంది, ఆమె 5 గాజులు మిగిలే ఉన్నాయి
- యుక్రెయిన్-రష్యా ఉద్రిక్తతలపై భద్రతామండలి అత్యవసర సమావేశం: భారత్, చైనా ఏమన్నాయంటే..
- లఖీంపుర్ ఖీరీ: ‘ప్రభుత్వం డబ్బు తిరిగి తీసుకున్నా మంచిదే కానీ మాకు న్యాయం కావాలి’
- తల్లి కళ్లెదుటే కూతురి హత్య: ప్రేమించట్లేదని గొంతు కోశాడు, ప్రాణం పోయేదాకా ఎవర్నీ దగ్గరకు రానివ్వలేదు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













