Naatu Naatu Song: తెలుగు సినీ సంగీత ప్రపంచానికి 'పెద్దన్న' ఎంఎం కీరవాణి

ఫొటో సోర్స్, MMKEERAVNI/FACEBOOK
- రచయిత, ఆలమూరు సౌమ్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
పూచింది పూచింది పున్నాగ, పూసంత నవ్వింది నీలాగ..
వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి..
తెలుసా మనసా.. ఇది ఏ జన్మ అనుబంధమో..
రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజా పువ్వా..
బంగారు కోడిపెట్ట వచ్చెనండీ..
ఏలే ఏలే మరదలా.. వాలే వాలే వరదలా..
భళి భళి భళిరా భళి సాహోరే బాహుబలి..
ఇలాంటి ఎన్నో హిట్ పాటలు స్వరపరచిన ఎంఎం కీరవాణి పేరు తెలుగువారికి తెలియనిది కాదు.
కీరవాణి అనేది ఒక రాగం పేరు. పేరుకు సార్థకత చేకూరుస్తూ జీవితాన్ని స్వరాలకు, రాగాలకే అంకితం చేశారాయన.
1990ల మొదలుకొని, నేటివరకు ఎన్నో మంచి పాటలు అందించారు. కీరవాణి పాటలు హిట్ అయి సినిమాని ఆడించిన సందర్భాలూ ఉన్నాయి.
తెలుగులో ఎంఎం కీరవాణి, తమిళంలో మరకతమణి, హిందీలో ఎంఎం క్రీమ్.. పేరు ఏదైనా పాట హిట్ కొట్టాల్సిందే.
కీరవాణి మంచి గాయకుడు కూడా. ఆయన సంగీతం స్వరపరిచే సినిమాల్లో ఆయన పాడతారు.
మెలోడీ పాటలే హిట్ అవుతాయని, మెలోడీకే విజయం సాధించే సత్తా ఉంటుందని కీరవాణి ఒక ఇంటర్వ్యూలో అన్నారు. బీట్ ఉన్న పాటలు డాన్స్ వల్ల, బీట్ వల్ల హిట్ అవుతాయని, మెలోడీ పాటలు కేవలం అందులో మెలోడీ వల్లే హిట్ అవుతాయని అన్నారు.
తనకు హాస్యమంటే చాలా ఇష్టమని, తనపై ఎవరైనా జోకులు వేసినా ఎంజాయ్ చేస్తానని అంటారాయన.

ఫొటో సోర్స్, MMKEERAVANI/FACEBOOK
మ్యూజిక్ డైరెక్టర్‌గా రంగప్రవేశం
బాహుబలి సినిమాలో 'మమతల తల్లి' పాట రాసిన శివశక్తి దత్త, కీరవాణి తండ్రి. శివశక్తి దత్త అనేక సినిమాల్లో పాటలు రాశారు.
1961 జూలైన 4న పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టిన కీరవాణి అసలు పేరు కోడూరి మరకతమణి కీరవాణి. దాన్ని కుదించి ఎంఎం కీరవాణిగా తెలుగు తెరపై కనిపిస్తారాయన.
తన తండ్రికి కీరవాణి రాగం మీద ఉన్న మక్కువతో తనకు ఆ పేరు పెట్టారని కీరవాణి చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు.
తండ్రి ద్వారానే తనకు సంగీతంపై అభిరుచి కలిగిందని, రెండేళ్లు వయొలిన్ నేర్చుకున్నానని పలు ఇంటర్వ్యూలలో చెప్పారు కీరవాణి.
సంగీత దర్శకుడు చక్రవర్తి దగ్గర అసిస్టెంట్‌గా చేరడంతో ఆయన సినీప్రస్థానం ప్రారంభమైంది. సుమారు 60 చిత్రాలకు చక్రవర్తి దగ్గర పనిచేశారు. ఆ అనుభవంతో సంగీత దర్శకుడిగా మారారు.
మొదట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కున్నా, ప్రతిభకు శ్రమ తోడైతే విజయం సాధించవచ్చని నిరూపించారు కీరవాణి.
గేయ రచయిత వేటూరి తన గురువు అని కీరవాణి చెబుతుంటారు. సాహిత్యాన్ని ఆయన దగ్గరే అభ్యసించానని చెబుతారు.
1990లో 'మనసు మమత' సినిమాకు తొలిసారిగా సంగీత దర్శకత్వం వహించారు.
1991లో విడుదలైన 'సీతారామయ్యగారి మనుమరాలు' సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టింది. అప్పటినుంచి ఆయన తిరిగి చూసుకోలేదు.
అదే ఏడాది రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'క్షణ క్షణం' సినిమాలో పాటలు సూపర్ హిట్ కావడంతో కీరవాణికి ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చి పడ్డాయి.
అప్పటి నుంచి తెలుగు సినీ సంగీత ప్రపంచాన్ని ఏలుతూనే ఉన్నారు.
కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్నో సినిమాలకు కీరవాణి పాటలు స్వరపరిచారు. ఘరానా మొగుడు, సుందరాకాండ, అల్లరి మొగుడు, అల్లరి ప్రియుడు, మేజర్ చంద్రకాంత్, పెళ్లిసందడి, బొంబాయి ప్రియుడు, అన్నమయ్య, రామదాసు వంటి చిత్రాలకు సంగీతం అందించారు.
ఎన్‌టీ రామారావు తన అభిమాన నటుడు, వ్యక్తి అని కీరవాణి గతంలో చెప్పారు. 'మేజర్ చంద్రకాంత్' సినిమాకు సంగీతం స్వరపరచిన సమయంలో ఎన్‌టీఆర్‌ను కలవడం మరపురాని అనుభూతి అని చెప్పారు.
తెలుగుదనంతో పాటలు స్వరపరుస్తున్న సంగీత దర్శకుల్లో కీరవాణి ముందుంటారని 'పాడుతా తీయగా' కార్యక్రమంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం అన్నారు.
కీరవాణి తెలుగులోనే కాకుండా కొన్ని తమిళ, హిందీ సినిమాలకు కూడా సంగీతం అందించారు.
క్రిమినల్, జిస్మ్, సుర్, పహేలి, స్పెషల్ 26 వంటి హిందీ సినిమాలకు స్వరపరచిన పాటలు ప్రజాదరణ పొందాయి.

ఫొటో సోర్స్, Jr NTR/TWITTER
అవార్డులు
2023లో ఆర్ఆర్ఆర్ సినిమాలో 'నాటు నాటు' పాటకు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ట్మాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్నారు కీరవాణి.
అవార్డ్ అందుకున్న తరువాత కీరవాణి ప్రసంగిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.
‘‘ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవార్డు నాకు మాత్రమే సొంతం కాదు. నా సోదరుడు, చిత్ర దర్శకుడు రాజమౌళికి, నాటు నాటు పాటకు ఏనిమేషన్ అందించిన ప్రేమ్ రక్షిత్‌కు, అరేంజ్మెంట్స్ సమకూర్చిన కాలభైరవకు, గేయ రచయిత చంద్రబోస్‌కు, పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవలకు, పాటకు జోష్‌తో డాన్స్ చేసిన జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు, ఈ పాటను ప్రోగ్రాం చేసిన సాలూరి సిద్ధార్థ్, జీవన్ బాబులకు ఈ అవార్డ్ దక్కుతుంది. ప్రత్యేకంగా నా భార్య శ్రీవల్లికి కృతజ్ఞతలు" అని అన్నారు.
అంతకుముందు 1997లో అన్నమయ్య సినిమాకు గాను నేషనల్ అవార్డ్ అందుకున్నారు.
11 నంది అవార్డులు, 13 సౌంత్ ఇండియన్ ఫిల్మ్ ఫేర్ అవార్డులు సొంతం చేసుకున్నారు.
1991లో 'అళగన్' అనే తమిళ సినిమాకు తమిళనాడు ప్రభుత్వం నుంచి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డ్ అందుకున్నారు.

ఫొటో సోర్స్, MMKEERAVANI/FACEBOOK
గేయ రచయితగా..
కీరవాణికి తెలుగు, సంస్కృత భాషలపై మంచి పట్టుంది. సుమారు 15 సినిమాలలో పాటలు రాశారు కూడా.
తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాలో 'జననీ..' పాట రాసింది ఆయనే.
బాహుబలి సినిమాలో 'ఒక ప్రాణం', 'కన్నా నిదురించరా, 'దండాలయ్యా' పాటలు కీరవాణి రాసినవే.
బాహుబలి-2 సినిమాకు బెస్ట్ గేయ రచయితగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు.
సంగీత దర్శకుడిగా, గాయకుడిగా కన్నా ఒక రచయితగా తాను గర్వపడతానని కీరవాణి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తనకు బాగా రాయడం వచ్చు అన్నది అన్నిటికన్నా సంతోషం కలిగించే విషయమని చెప్పారు.
ఆయన కొన్ని చిన్న కథలు రాశారు. వాటిని పుస్తకంగా తీసుకురావలనే ఆలోచన ఉందని చెప్పారు.

ఫొటో సోర్స్, MMKEERAVANI/FACEBOOK
కుటుంబానికి ‘పెద్దన్న’గా
కీరవాణి కుటుంబంలో చాలామంది సినిమా ప్రపంచంలో వివిధ రంగాలలో పనిచేస్తున్నారు.
ఆయన చిన్నాన్న విజయేంద్ర ప్రసాద్ కథా రచయిత. రాజమౌళి ఈయన కొడుకే.
కుటుంబంలో, సినిమాలో ఆయనే తనకు 'పెద్దన్న' అని రాజమౌళి చెబుతుంటారు.
కీరవాణి భార్య శ్రీవల్లి పలు సినిమాలకు లైన్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు.
ఆయన తమ్ముడు కోడూరి కల్యాణి మాలిక్ సంగీత దర్శకుడు. అమృతం సీరియల్, మనసు మాట వినదు, ఆంధ్రుడు, అష్టాచెమ్మా, ఊహలు గుసగుసలాడే, జో అచ్యుతానంద మొదలైన సినిమాలకు సంగీతం అందించారు.
కీరవాణి కొడుకు కాలభైరవ సంగీత దర్శకుడు, గాయకుడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో రాహుల్ సిప్లిగంజ్‌తో కలిసి 'నాటు నాటు' పాట పాడారు. బాహుబలి సినిమాలో 'దండాలయ్యా', 'ఒక ప్రాణం' పాటలు పాడారు.
మత్తు వదలరా, కార్తికేయ-2, గుర్తుందా శీతాకాలం వంటి చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు.
కీరవాణి చిన్నకొడుకు శ్రీ సింహ 'యమదొంగ' సినిమలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపిస్తారు. 2019లో 'మత్తు వదలరా' సినిమాతో యాక్టర్ అయ్యారు. ఈ సిన్మాకు బెస్ట్ మేల్ డెబ్యూ యాక్టర్‌గా సైమా అవార్డ్ అందుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆహారం: క్యాలరీలు లెక్కపెట్టుకుని తినడం ప్రమాదకరమా? ఎందుకు? నిపుణులు ఏమంటున్నారు
- ప్రియుడు చేసిన నేరానికి.. ఉరికంబం ఎక్కిన భార్య – వందేళ్ల కిందటి కోర్టు తీర్పుపై ఇప్పటికీ చర్చ
- కామారెడ్డి: మాస్టర్ ప్లాన్‌ను రైతులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ప్రభుత్వం ఏం చెబుతోంది?
- ఆంధ్రప్రదేశ్: ఫ్యామిలీ డాక్టర్ విధానం ఎలా అమలవుతోంది, పూర్తిస్థాయిలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?
- కిసాన్ మాన్‌ధన్ యోజన: ఉద్యోగుల్లాగే రైతులు నెలనెలా పెన్షన్ పొందడం ఎలా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














