2022 టాలీవుడ్ రివ్యూ: తెలుగు చిత్రసీమలో మెరుపులు ఇవీ

- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
2022కి `శుభం` కార్డు పడిపోతోంది. ఒక్కసారి ఈ ఏడాదిని రివైండ్ చేసుకొనే తరుణం ఇది. అన్ని రంగాల్లానే తెలుగు చిత్రసీమ కూడా ఈ యేడాది ఎగుడుదిగుడుల ప్రయాణం సాగించింది.
విజయాలు వచ్చాయి.. పరాజయాలూ వెక్కిరించాయి. ఏమాత్రం అంచనాలు లేని చిత్రాలు సంచలన విజయాలు సాధిస్తే, ఆశల పల్లకిలో ఊరేగిన కొన్ని గట్టి కాంబినేషన్లు బాక్సాఫీసు ముందు పల్టీలు కొట్టాయి.
2022 టాలీవుడ్‌కు ఏమిచ్చింది? ఈ యేడాది మర్చిపోలేని సినిమాలేమిటి?

ఫొటో సోర్స్, FACEBOOK/RRR MOVIE
ఆర్‌ఆర్‌ఆర్
ఈ ఏడాది అందరి నోళ్లలో నాని, ఎక్కువ చర్చనీయాంశమైన చిత్రంగా `ఆర్‌ఆర్‌ఆర్` నిలుస్తుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో రాజమౌళి ఓ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారు అనగానే అందరి దృష్టీ... ఈ సినిమాపై పడింది.
రాజమౌళి ఎవరితో సినిమా చేసినా సంచలనమే. అలాంటిది ఇద్దరు స్టార్ హీరోలతో జట్టు కడితే.. ఆ క్రేజే వేరు. అంచనాలకు తగ్గట్టుగానే `ఆర్‌ఆర్‌ఆర్` ఘన విజయాన్ని సాధించింది.
దేశవ్యాప్తంగా తెలుగు సినిమాకున్న క్రేజ్... ఆర్‌ఆర్‌ఆర్‌తో మరోసారి తెలిసొచ్చింది. ఉత్తరాది ప్రేక్షకులు కూడా ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. విదేశాల్లోనూ కాసుల వర్షం కురిసింది.
ఇటీవల చైనాలో విడుదల చేస్తే... అక్కడ కూడా అపూర్వ స్పందన లభించింది. ఇప్పుడు ఆస్కార్ బరిలో కూడా నిలిచింది. `బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ఆఫ్ ద ఇయర్` విభాగంలో... ఆస్కార్ కోసం `నాటు నాటు` అనే పాట పోటీ పడుతోంది.
సాంకేతికంగానూ, కథ చెప్పే విధానంలోనూ రాజమౌళి ఈ సినిమాతో తెలుగు సినిమాను కొత్త పుంతలు తొక్కించారు. ఈ ఏడాది భారత చలన చిత్రసీమలోనే భారీ విజయంగా `ఆర్‌ఆర్‌ఆర్` తన పేరు నమోదు చేసుకొంది.

ఫొటో సోర్స్, SITARAMAM/POSTER
సీతారామం
ఈ యేడాది...తెలుగు తెరపై చూసిన గొప్ప ప్రేమ కథా చిత్రంగా`సీతారామం` మిగిలిపోతుంది. ప్రేమకథా చిత్రాలు తీయడంలో నిపుణుడిగా పేరొందిన హను రాఘవపూడి నుంచి వచ్చిన సినిమా ఇది.
యుద్ధ నేపథ్యాన్ని, ప్రేమకథతో ముడిపెట్టిన తీరు, పాటలు, దుల్కర్, మృణాల్ ఠాకూర్‌ల నటన, సాంకేతిక నిపుణుల ప్రతిభ.. ఇవన్నీ కలిసి ఈ సినిమాకు క్లాసిక్ టచ్ ఇచ్చాయి.
వింటేజ్ లుక్‌తో సాగిన సన్నివేశాలు...ప్రేక్షకుల్ని ఆ కాలంలోకి తీసుకెళ్లిపోయాయి. ఓ మలయాళీ నటుడు తెలుగులో చేసిన ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడితే... మలయాళంలో మాత్రం ఈ సినిమా నిరాశాజనకమైన వసూళ్లు సాధించింది.
తమిళ నాట కూడా పెద్దగా ఆదరణ లభించలేదు. కాకపోతే.. తెలుగులో వచ్చిన ఈ ఏటి మేటి చిత్రాల్లో సీతారామం ఒకటి.

ఫొటో సోర్స్, FACEBOOK/AAARTSOFFICIAL
కార్తికేయ 2
సినిమా చిన్నదా, పెద్దదా అనే తేడా లేకుండా నచ్చితే ప్రేక్షకులు నెత్తిమీద పెట్టుకొంటారు అని చెప్పడానికి ఉదాహరణగా కార్తికేయ-2 నిలుస్తుంది.
పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర గొప్ప విజయాన్ని అందుకొంది.
ముఖ్యంగా ఉత్తరాదిలో ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. హిందీ బెల్ట్‌లో `కార్తికేయ 2` వసూళ్లు చూసి చిత్రసీమే ఆశ్చర్యపోయింది.
ఓ పురాన ఇతిహాస ఘట్టాన్ని థ్రిల్లర్ నేపథ్యంలో చెప్పడంలో దర్శకుడు చందూ మొండేటి విజయాన్ని అందుకొన్నారు. ఈ సినిమాతో నటుడు నిఖిల్ సిద్ధార్థ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పించారు.
ఇప్పుడు కార్తికేయ-3 కథా చర్చలు కూడా జరుగుతున్నాయి. 2023లో ఇది పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, ADIVISESH/TWITTER
హిట్ 2
ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్‌కి తెలుగులోనూ ఆదరణ ఉంటుంది అని నిరూపించిన చిత్రం `హిట్(HIT)`. విశ్వక్‌సేన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి నాని నిర్మాతగా వ్యవహరించారు.
‘హిట్’ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో... `హిట్ 2` ఆలోచన పురుడు పోసుకుంది. ఈ ఫ్రాంచైజీలోకి అడవి శేష్ వచ్చి చేరారు.
కథానాయకుడు మారారు. మళ్లీ అదే ఫలితం. హిట్ 2 కూడా బాక్సాఫీసు దగ్గర మెరిసింది. చిన్న సినిమాల్లో మంచి విజయం సాధించిన చిత్రంగా హిట్-2 నిలిచింది.
దర్శకుడు ఈ కథను నడిపిన విధానం, కథనంలో బిగి ఆకట్టుకొన్నాయి. హిట్ 3లో నాని నటిస్తున్నారని చిత్రబృందం ప్రకటించడంతో రాబోయే ఈ ఫ్రాంచైజీ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి.

ఫొటో సోర్స్, FACEBOOK/NANDAMURI KALYANRAM
బింబిసార
చాలా కాలం నుంచి సరైన విజయం కోసం ఎదురు చూస్తున్న నటుడు కల్యాణ్ రామ్. ఈ ఏడాది బింబిసారతో తన ఆకలి తీరింది.
సోషియో ఫాంటసీ టచ్ ఉన్న సినిమా ఇది. అంతగా అంచనాలేమీ లేకుండా బాక్సాఫీసు ముందుకు వచ్చింది. కల్యాణ్ రామ్ కెరీర్‌లో అతి పెద్ద కమర్షియల్ విజయంగా నిలిచింది.
ప్రేక్షకులకు ఓ చక్కటి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిన సినిమా ఇది. ఈ సినిమాతో దర్శకుడిగా వశిష్ట పేరు మార్మోగింది. ఇప్పుడు తనకు పెద్ద హీరోల నుంచి అవకాశాలు వస్తున్నాయి.
బింబిసార 2కి కూడా ఇప్పుడు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

ఫొటో సోర్స్, FACEBOOK/SESHADIVI
మేజర్
26/11 ముంబయి దాడుల్లో తీవ్రవాదులపై పోరాటంలో అసువులు బాసిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన సినిమా `మేజర్`.
పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం.. అన్ని చోట్లా మంచి విజయాన్ని అందుకొంది. విడుదలకు 7 రోజుల ముందే దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రీమియర్ షోలు వేసి, ఓ కొత్త పోకడకు `మేజర్` నాంది పలికింది.
మహేష్ బాబు ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించడం కూడా ప్రచారానికి బాగా పనికొచ్చింది.
దర్శకుడు కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ తీసుకొన్నప్పటికీ... ఉన్నికృష్ణన్ జీవితాన్ని ఓ భావోద్వేగ ప్రయాణంగా మలచడంలో విజయం సాధించారు.

ఫొటో సోర్స్, NEHA SSHETTY/TWITTER
డీజే టిల్లు
2022లో చిన్న సినిమాల్లో పెద్ద మెరుపు- డీజే టిల్లు. `అట్లుంటది మనతోని..` అంటూ టిల్లుగా సిద్దు జొన్నలగడ్డ ప్రదర్శించిన హావభావాలూ, మేనరిజం, డైలాగ్ డెలివరీ... ఇవన్నీ థియేటర్లో ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి.
కథ గొప్పదేం కాదు. కేవలం హీరో క్యారెక్టరైజేషన్‌పై ఆధారపడిన సినిమా ఇది. అదే బలం కూడానూ.
`డీజే టిల్లు చూడూ..` అనే పాట కూడా ఈ ఏడాదంతా మార్మోగిపోయింది. ఈ సినిమాతో సిద్దు.. రేంజ్ పెరిగింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ కూడా పట్టాలెక్కేసింది.

ఫొటో సోర్స్, PDV PRASAD
భీమ్లా నాయక్
పవన్ కల్యాణ్ ఎప్పుడూ రీమేక్ చిత్రాలనే ఎంచుకొంటారన్న ఓ విమర్శ టాలీవుడ్‌లో వినిపిస్తుంటుంది.
అయితే రీమేక్‌లు ఆయనకు చాలా విజయాలే అందించాయి. వాటిలో ఈ ఏడాది విడుదలైన `భీమ్లా నాయక్` ఒకటి. రానాతో కలిసి నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర ఓకే అనిపించుకొంది.
ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్ల వివాదం కూడా ఈ సినిమాతోనే విశ్వరూపం దాల్చింది. టికెట్ రేట్లు తక్కువ ఉన్నప్పటికీ, ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు.
మలయాళం సినిమా `అయ్యప్పయునుమ్ కోషియమ్` చూసిన వాళ్లకు `భీమ్లా నాయక్` అంత గొప్పగా అనిపించకపోవచ్చు.
కానీ పవన్ అభిమానులకు కావల్సిన అన్ని అంశాలూ ఈ కథలో ఉండడంతో.. నిలబడగలిగింది.

ఫొటో సోర్స్, GMBENTERTAINMENT/FB
సర్కారు వారి పాట
బాక్సాఫీసు దగ్గర బొటాబొటీ మార్కులతో గట్టెక్కిన తెలుగు చిత్రాల్లో `సర్కారు వారి పాట` ఒకటి.
మహేష్ బాబు - పరశురామ్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ఇది. బ్యాంకుల్లో అప్పులు చేసి, చెల్లించకుండా ఎగ్గొట్టే.. బడా బాబులపై ఓ రకంగా ఇది సైటెర్ అనుకోవాలి.
పాయింట్ మంచిదే అయినా.. కమర్షియల్ కొలతల కోసం దర్శకుడు ఎక్కువ సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోవడంతో కథనం గతి తప్పింది.
హీరో క్యారెక్టరైజేషన్‌లోనూ లోపాలు కనిపిస్తాయి. కథానాయిక కీర్తి సురేష్ పాత్రని మరీ పేలవంగా తీర్చిదిద్దారనన్న విమర్శలు వినిపించాయి.
కాకపోతే.. మహేష్ ఇమేజ్, ఈ సినిమాకు ఉన్న క్రేజ్.. కమర్షియల్‌గా ఈ సినిమాని గట్టెక్కించాయి.

ఫొటో సోర్స్, @THEDEVERAKONDA
నిరాశపరిచిన చిత్రాలివీ
ఈ ఏడాది భారీ అంచనాలతో వచ్చి... నిరాశ పరిచిన చిత్రాలైతే చాలానే ఉన్నాయి. లైగర్, రాధే శ్యామ్, ఆచార్య, ఘోస్ట్ లాంటి చిత్రాలు ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాయి.
లైగర్, ఆచార్య విషయంలో బయ్యర్లకూ నిర్మాతలకూ మధ్య వివాదం చోటు చేసుకొంది. తమ నష్టాల్ని నిర్మాతలే భర్తీ చేయాలంటూ బయ్యర్లు గొడవకు దిగడం చర్చనీయాంశమైంది.
ప్రభాస్ హీరోగా వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం రాధే శ్యామ్, ఆశించిన మేర ఫలితాన్ని అందుకోలేకపోయింది.
తొలి రోజు మంచి టాక్ తెచ్చుకొన్న `గాడ్ ఫాదర్` ఆ ఊపును, ఆ ఉత్సాహాన్ని చివరి వరకూ కొనసాగించడంలో విఫలమై... పరాజయం బాట పట్టింది.
రవితేజ నుంచి వచ్చిన ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ డిజాస్టర్ల లిస్టులో చేరిపోయాయి.

ఫొటో సోర్స్, FACEBOOK/KGFMOVIE
ఆ ట్యాగ్ లైన్ ఒత్తిడి పెంచిందా?
‘పాన్ ఇండియా’ అనే ట్యాగ్ లైన్ తెలుగు చిత్రసీమకు ఎంత మేలు చేసిందో అంతే ఒత్తిడి కలిగించిందని సినీ విమర్శకుడు వీఎస్ఎన్ మూర్తి అభిప్రాయపడ్డారు.
“అన్ని భాషల్లోనూ తమ సినిమా ప్రేక్షకుల్ని అలరించాలన్న ఉద్దేశంతో కథలో అవసరం లేని మార్పులు చేస్తున్నారు. కథ, పాత్రలు డిమాండ్ చేయకపోయినా పక్క భాషల నుంచి నటీనటుల్ని భారీ పారితోషికాలు ఇచ్చి మరీ తెచ్చుకొంటున్నారు. దాని వల్ల బడ్జెట్ పెరగడమే కాదు. అనవసరంగా లేని ఒత్తిడి కొని తెచ్చుకోవాల్సివస్తోంది. కొన్ని చిత్రాలకు అదే అవరోధంగా మారింది``అని ఆయన విశ్లేషించారు.

ఫొటో సోర్స్, TWITTER/RISHAB SHETTY
మాయ చేసిన డబ్బింగ్ చిత్రాలు
కొన్నేళ్లుగా అనువాద చిత్రాలు తెలుగునాట బాక్సాఫీసు దగ్గర ప్రభావాన్ని చూపించలేకపోతున్నాయి.
2022లో మాత్రం డబ్బింగ్ చిత్రాలకు కొన్ని మంచి విజయాలు దక్కాయి.
కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన కేజీఎఫ్ 2, కాంతార తెలుగునాట వసూళ్ల మోత మోగించాయి.
కాంతార విజయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. తక్కువ బడ్జెట్ లో రూపొందించిన ఈ చిత్రం కనీవినీ ఎరుగని విజయాన్ని అందుకొంది.
సీనియర్ నటుడు కమల్ హాసన్‌కు కూడా 2022 గుర్తుండిపోతుంది. తన `విక్రమ్` ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకొంది.
కార్తి ద్విపాత్రాభినయం చేసిన తమిళ స్పై థ్రిల్లర్ `సర్దార్` కూడా ప్రేక్షకులను మెప్పించింది.
బాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిన `బ్రహ్మాస్త్ర` తెలుగులో మంచి వసూళ్లను రాబట్టుకోగలిగింది.
ఇక `అవతార్ 2` సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. ఓ తెలుగు సినిమాకి ఎలాంటి ప్రారంభ వసూళ్లు వస్తాయో.. దానికి తగ్గని రాబడిని ఈ హాలీవుడ్ డబ్బింగ్ చిత్రం దక్కించుకొంది.
ఓటీటీ ప్రభావం ఎంత?
కరోనా సమయంలో... ఓటీటీలు ఆధిపత్యం ప్రదర్శించాయి. థియేటర్లు మూతపడడంతో... ఓటీటీ మార్కెట్ విస్త్రృతమయ్యింది. కొన్ని చిత్రాలు నేరుగా ఓటీటీలోనే విడుదలయ్యాయి.
ప్రేక్షకులు కూడా ఓటీటీలకు అలవాటు పడ్డారు. నిర్మాతలు కూడా విడుదలైన మూడు వారాలకే తమ సినిమాల్ని ఓటీటీల్లో అందుబాటులో ఉంచేవారు. దాంతో థియేటర్ల వ్యవస్థ కుప్పకూలుతుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
అయితే.. థియేటర్లకు వచ్చే ముప్పేమీ లేదని ఈ ఏడాది విజయాలు, సాధించిన వసూళ్లు చెప్పకనే చెప్పాయి.
ఆర్‌ఆర్‌ఆర్, కాంతార, కేజీఎఫ్ లాంటి చిత్రాలకు థియేటర్ల దగ్గర టికెట్ల కోసం జనాలు బారులు తీరిన సంగతి మనకు గుర్తుండే ఉంటుంది.
ఓటీటీ అంశంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందిస్తూ- ``ఓటీటీలు మరో ఆప్షన్ అంతే. కొన్ని సినిమాలను ప్రేక్షకులు థియేటర్లోనే చూడ్డానికి ఇష్టపడతారు. ఓటీటీ ఎప్పటికీ థియేటర్‌కు ప్రత్యామ్నాయం కాదు``అని వ్యాఖ్యానించారు.
సోషియో ఫాంటసీ, పక్కా కమర్షియల్ కథలు, థ్రిల్లర్స్, లవ్ స్టోరీస్... ఇలా అన్ని రకాల జోనర్లకూ విజయాల జాబితాలో చోటు దక్కడాన్ని బట్టి చూస్తే ప్రేక్షకులు ఫలానా జోనర్‌కే ఓటేశారని చెప్పలేం.
మొత్తంగా చూస్తే ఈ ఏడాది దాదాపుగా 250 చిత్రాలు తెలుగులో విడుదలయ్యాయి. వాటిలో పేరెన్నదగిన విజయాలు సాధించిన చిత్రాల సంఖ్య 20కి కాస్త అటూ ఇటూగా ఉంది.
ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ చిత్రాలు ఘన విజయాలు సాధించినప్పటికీ... మొత్తమ్మీద సక్సెస్ రేటు దృష్ట్యా చూస్తే 2022లో టాలీవుడ్ నష్టాల బాటలో ప్రయాణించిందనే చెప్పాలి.
``సినిమా నుంచి ప్రేక్షకులు వినోదాన్ని ఆశిస్తారు. అది ఇస్తే చాలు. మరేం పట్టించుకోరు. కాకపోతే.. ఇప్పుడు ఓటీటీలు విస్త్రృతంగా అందుబాటులోకి వచ్చాయి. కంటెంట్‌లేని చిత్రాల్లో ఎంత తారాబలం ఉన్నా.. తిప్పికొడుతున్నారు. స్టార్ల వల్ల థియేటర్లు నిండుతాయన్నది పాత మాట. ఇప్పుడు కంటెంట్ మాత్రమే నిలబడుతుంది`` అని ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- కరెంటు, తిండీ లేకుండా సముద్రంలోనే నెల రోజులు, చివరికి ఎలా బయటపడ్డారు?
- కోవిడ్-19 బీఎఫ్7: ఆక్సిజన్ సిలిండర్, మందులు కొని ఇంట్లో పెట్టుకోవాలా?
- అమ్మ ఒడి : బడికి వెళ్లే పిల్లలకు ఇచ్చే రూ.15 వేలు తీసుకోవడం ఎలా?
- క్రికెట్: ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 భారత ఆటగాళ్లు వీళ్లే...
- చార్లీ చాప్లిన్ శవపేటికను దొంగతనం చేసి, అతడి భార్యను బ్లాక్ మెయిల్ చేసిన దొంగల కథ మీకు తెలుసా..?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















