కిసాన్ మాన్‌ధన్ యోజన: ఉద్యోగుల్లాగే రైతులు నెలనెలా పెన్షన్ పొందడం ఎలా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఎ.కిశోర్‌బాబు
- హోదా, బీబీసీ కోసం
వృద్ధాప్య పింఛన్లు, వితంతు పింఛన్లు, చేనేతల పింఛన్లు, వికలాంగ పింఛన్లు...ఇలా పలు వర్గాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తుంటడం మనందరికీ తెలిసిందే.
మరి ఆరుగాలం కష్టపడి, చెమటోడ్చే అన్నదాతలకు ప్రత్యేక పింఛన్లు ఉన్నాయా? ఈ మాటంటే రైతులకూ ప్రత్యేకంగా పింఛన్లు ఉన్నాయా అని ఆశ్చర్యకరంగా చూసేవాళ్లూ నేటికీ ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలోని చిన్న, సన్నకారు రైతులకు పింఛను సదుపాయం కల్పించే ఒక ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది. అయితే దీని గురించి చాలా మంది రైతులకు కూడా అవగాహన లేదు.
ప్రభుత్వ ఉద్యోగికి లాగే రైతు కూడా తనకు 60 సంవత్సరాల వయసు వచ్చిన తరువాత తాను మరణించేంత వరకు రూ.3000ల నుంచి రూ.5000ల వరకు పింఛను పొందే సదుపాయం కల్పించే పథకమే ప్రధానమంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన (Pradhan Mantri Kisan Maan-Dhan Yojana -PM-KMY)
ఎన్నో ప్రత్యేకతలున్న ఈ ప్రధానమంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన (Pradhan Mantri Kisan Maan-Dhan Yojana -PM-KMY) అంటే ఏమిటి? దానికి అర్హులు ఎవరు?
ఈ పథకంలో చేరదలచుకున్న రైతు ఏమేమీ పత్రాలు పొందుపరచాలి? ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి తదితర వివరాలను తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, Getty Images
ఏమిటి ప్రధానమంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన?
దేశంలో వృద్ధాప్యంలోకి అడుగుపెట్టే రైతులకు సామాజిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే ఈ ప్రధానమంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన (Pradhan Mantri Kisan Maan-Dhan Yojana -PM-KMY).
2019లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. భారత జీవిత బీమా సంస్థ (LIC) ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.
నెలకు ఎంత పింఛను ఇస్తారు?
ఈ పథకంలో చేరిన ప్రతి రైతుకు 60 సంవత్సరాల వయసుకు చేరుకున్న తరువాత ఆ రైతు జీవించి ఉన్నంత కాలం నెలకు రూ.3000ల నుంచి రూ.5 వేల వరకు పింఛను చెల్లిస్తారు.
రైతు ప్రీమియం చెల్లించాలా?
- ఈ పథకంలో చేరే ప్రతి రైతు ప్రతి నెలా కనీసం రూ.55లు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది
- మీ వయసు మారే కొద్ది మీరు చెల్లించాల్సిన ప్రీమియం సొమ్ము కూడా మారిపోతుంటుంది.
- మీ వయసును బట్టి ప్రతి నెలా చెల్లించాల్సిన ప్రీమియం రూ.55ల నుంచీ గరిష్ఠంగా రూ.200 వరకు ఉంటుంది.
- ప్రీమియం సొమ్ము పెరిగే కొద్దీ పింఛను కూడా ఎక్కువగా పొందవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రీమియం ఒక్కటే సరిపోతుందా?
ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే పథకంలో చేరిన రైతు తాను ఎంతైతే ప్రీమియం చెల్లిస్తాడో, అంతే ప్రీమియం సొమ్మును కేంద్ర ప్రభుత్వం రైతు పేరిట అదనంగా జీవిత బీమా సంస్థకు చెల్లిస్తుంది.
ఉదాహరణకు 18 సంవత్సరాల నిండిన ఒక యువ రైతు ఈ పథకంలో చేరి ప్రతి నెలా రూ.55లు ప్రీమియం చెల్లిస్తున్నారనుకోండి.
అప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రైతు పేరిట మరో రూ.55లు అదనంగా ప్రీమియం చెల్లిస్తుంది.
అంటే అప్పుడు రైతు మొత్తం రూ.110 లు ప్రీమియం కింద చెల్లించినట్లన్నమాట.
ఈ పథకానికి ఎవరు అర్హులు?
ఇది పూర్తిగా వ్యవసాయం చేస్తున్న చిన్న, సన్నకారు రైతు కోసం ప్రవేశపెట్టిన పథకం.
చిన్న, సన్నకారు రైతులు తప్ప మిగిలిన ఎవరూ ఈ పథకానికి అర్హులు కారు.

చిన్న, సన్నకారు రైతులు అంటే ఎవరు?
రైతులు ఎవరైతే 2 హెక్టార్లు అంటే 5 ఎకరాలకు తక్కువగా వ్యవసాయ భూమిని కలిగి ఉండి వ్యవసాయం చేసుకుంటూ ఉంటారో అలాంటి రైతులు.
ఈ పథకంలో చేరడానికి వయో పరిమితి ఎంత?
18 సంవత్సరాల నుంచీ 40 సంవత్సరాల వయసులోపు ఉన్న రైతులందరూ ఈ పథకంలో చేరడానికి అర్హులే.
40 సంవత్సరాలు దాటిన రైతులు అర్హులేనా?
40 సంవత్సరాలు దాటిన రైతులు ఎవరూ కూడా ఈ పథకాన్ని పొందలేరు.

రైతు ప్రీమియం చెల్లిస్తూ మధ్యలో ఆపేస్తే?
రైతు అప్పటి వరకు ఎంత ప్రీమియం చెల్లించారో అంత సొమ్మును, దానికి వడ్డీ కలిపి రైతుకు తిరిగి చెల్లిస్తారు. అయితే, రైతు చెల్లించిన ఈ ప్రీమియంను బీమా సంస్థ వద్ద 5 సంవత్సరాలు కచ్చితంగా ఉంచాల్సిందే..
ప్రీమియం చెల్లిస్తున్న రైతు మరణిస్తే?
ప్రీమియం చెల్లిస్తున్న రైతు మరణిస్తే రైతు చెల్లించిన బీమా సొమ్మును ఆయన భార్య లేదా నామినీకి వడ్డీతో సహా కలిపి చెల్లిస్తారు.
పింఛను తీసుకుంటున్న రైతు మరణిస్తే?
ఈ పథకం కింద ఇప్పటికే నెలకు రూ.3000 పింఛను పొందుతున్న రైతు మరణించినా కూడా వారి కుంటుంబ సభ్యులకు లబ్ధి చేకూర్చేలా పథకం ఉంటుంది.
మరణించిన రైతు భార్యకు ఆమె జీవించి ఉన్నంత కాలం రైతుకు చెల్లిస్తున్న రూ.3000 పింఛనులో సగం అంటే రూ.1500 పింఛను ప్రతి నెలా ఆమెకు చెల్లిస్తారు.
ఒకవేళ ప్రీమియం చెల్లిస్తున్న రైతు రిటైర్మెంట్‌కు ముందే మరణిస్తే ఆయన భార్య ఈ పథకాన్ని కొనసాగించవచ్చా?
కొనసాగించవచ్చు. అప్పటి వరకు రైతు చెల్లించిన ప్రీమియం పోగా మిగిలిన ప్రీమియం ఆమె చెల్లించాల్సి ఉంటుంది.
ఒకవేళ ఆ ప్రీమియం చెల్లించడానికి రైతు భార్య అంగీకరించకపోతే?
అప్పటి వరకు రైతు చెల్లించిన ప్రీమియం మొత్తం వడ్డీతో కలిపి ఆమెకు చెల్లిస్తారు.
ఒకవేళ మరణించిన రైతుకు భార్య లేకపోతే ఆయన సూచించిన నామినీలకు చెల్లిస్తారు.
ఈ పథకానికి ఎలాంటి రైతులు అర్హులు కారు?
- సన్నకారు, చిన్నకారు రైతులు ఎవరైతే ఇప్పటికే జాతీయ పింఛను పథకంలో (National Pension Scheme - NPS) నమోదు చేసుకుని ఉన్నారో అలాంటి వారు అనర్హులు
- రాష్ట్ర బీమా సంస్థలకు చెందిన ఉద్యోగులు, ఫండ్ ఆర్గనైజేషన్ స్కీమ్ ఉద్యోగులు ఈ పథకం పొందలేరు.
- ప్రధానమంత్రి శ్రమ్ మాన్‌ధన్ యోజన (Pradhan Mantri Shram Yogi Maan Dhan Yojana - PMSYM), అలాగే ప్రధాన మంత్రి లఘు వ్యాపారి మాన్-ధన్ యోజన (Pradhan Mantri Laghu Vyapari Maan-Dhan Yojana (PM-LVM) పథకాల్లో నమోదు చేసుకున్న రైతులు.
- ఇప్పటికే సామాజిక భద్రత పింఛన్లు పొందుతున్న రైతులు కూడా అనర్హులే.
- ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారు, ఉద్యోగం చేస్తున్నవారు కూడా అనర్హులే.

ఫొటో సోర్స్, Getty Images
నాకు పొలం ఉంది, కానీ కౌలుకిచ్చా, నేను ఈ పథకంలో చేరవచ్చా?
చేరలేరు. కేవలం 5 ఎవరాల్లోపు పొలం ఉండి, వ్యవసాయం చేసుకుని జీవిస్తున్న చిన్న, సన్నకారు రైతులు మాత్రమే ఈ పథకంలో చేరడానికి అర్హులు.
ప్రీమియం ఎప్పుడు చెల్లించాలి?
మీరు పథకంలో ఏ నెలలో చేరి మొదటగా ఏ తేదీన ప్రీమియం చెల్లించారో మరుసటి నెల నుంచీ అదే తేదీలోపు ప్రీమియం చెల్లించాలి.
ప్రీమియం ఎక్కడ చెల్లించాలి?
ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. లేదా మీకు దగ్గర్లోని మీ-సేవా కేంద్రాల్లోనూ చెల్లించవచ్చు. .
ఒకవేళ ఒక నెల ప్రీమియం చెల్లించలేకపోతే?
మరుసటి నెల అపరాధ రుసుంతో ప్రీమియం చెల్లించవచ్చు.
నేను ప్రతి నెలా ప్రీమియం చెల్లించలేను అప్పుడేం చేయాలి?
మీ అనుకూలతను బట్టి మూడు నెలలకు, ఆరు నెలలకు కూడా ఒకే సారి ప్రీమియం చెల్లించవచ్చు.
ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి?
- ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చ.
- కేంద్ర ప్రభుత్వం వారి కామన్ సర్వీస్ సెంటర్ (Common Service Centers Scheme- CSC) వెబ్‌సైటులో దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఇందులో ముందుగా మీరు లాగిన్ అవ్వాలి.
- తదుపరి అందులో ప్రధానమంత్రి కిసాన్ మాన్‌దన్ యోజన ను క్లిక్ చేసి ఆ పథకం విండోలోకి ప్రవేశించాలి
- అక్కడ అడిగిన వివరాలను మీరు నమోదు చేయాల్సి ఉంటుంది.
ఈ-సేవా కేంద్రాల ద్వారా ధరకాస్తు చేసుకోవచ్చా?
ఈ-సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కేంద్రాల ద్వారా ప్రీమియంలు కూడా చెల్లించవచ్చు.
ఏమేమి పత్రాలు పొందుపరచాల్సి ఉంటుంది?
ఈ పథకంలో చేరడానికి
- మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, మీ బ్యాంకు ఖాతా పాసు పుస్తకం
- మీ భూమికి సంబంధించి పట్టాదారు పాసుపుస్తం.
- మీ పుట్టిన తేదీ
- ఆధార్‌కు అనుసంధానమైన మీ మొబైల్ నెంబరు.
ఇవి కూడా చదవండి:
- దేశానికి రక్షణగా పెట్టని గోడలు - ధ్వంసం చేస్తున్న అక్రమార్కులు...
- జోషిమఠ్: ఈ హిమాలయ నగరం ఎందుకు కుంగిపోతోంది? జనం ఎందుకు ఇళ్లు వదిలి పోతున్నారు?
- అస్సాం: ‘మా ఇళ్లు కూల్చడానికి బదులు మమ్మల్ని చంపేయండి’
- తెలంగాణ: గణేశ్ చందా ఇవ్వనందుకే టీచర్‌ను వివాదంలోకి లాగారా... బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ: ‘నల్ల జీవో తెచ్చి ఉన్మాదుల్లా వ్యవహరిస్తున్నారు.. జీవో-01 ని అడ్డుకోవడంపై చర్చించాం’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















