తక్కువ ఖర్చుతో ఇంట్లోనే కూరగాయలు పండిస్తూ లక్షల రూపాయలు సంపాదించొచ్చా...

- రచయిత, షకీల్ అక్తర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పొలంలో కూరగాయలు పండించడం కొత్త కాదు.
కానీ ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ నగరంలో రామ్‌వీర్ సింగ్ తన మూడు అంతస్తుల ఇంటిలో కూరగాయలు, పండ్లు పండిస్తున్నారు. తద్వారా లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. వీటిని ఇంటి లోపలే పెంచుతున్నారు. అది కూడా నేల అవసరం లేకుండా నీటితోనే పండిస్తున్నారు.

కూరగాయలను ఎలా పండిస్తారు?
హైడ్రోపోనిక్ పద్ధతిలో రామ్‌వీర్ సింగ్ కూరగాయలు, పండ్లు పండిస్తున్నారు. ఆయన మూడు అంతస్తుల ఇల్లు దూరం నుంచి చూస్తే ఆ ప్రాంతంలోని మిగిలిన ఇళ్ల కంటే ప్రత్యేకంగా కనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇల్లు మొత్తం పచ్చదనంతో కూడి ఉంటుంది. ఇంట్లోని ప్రతి అంతస్తులో ప్లాస్టిక్ పైపులలో వివిధ రకాల కూరగాయల తీగలు పెరుగుతున్నాయి.
ఇంటిలోని ప్రతి అంతస్తులోనూ, బయటా మందపాటి ప్లాస్టిక్ పైపులు వేశారు. ఇవి అన్ని సమయాల్లో నీటితో నిండి ఉంటాయి. ప్లాస్టిక్ బకెట్ల మాదిరిగా కనిపించే చిన్న బుట్టలలో కూరగాయల విత్తనాలు, కొబ్బరి బెరడు, పర్వతాల నుంచి తెచ్చిన ఒక రకమైన నాచు ఉంచుతారు. అనంతరం పైపు రంధ్రంలో బకెట్ బిగిస్తారు. ఆ విత్తనాలు నీటిలో మునిగిన తర్వాత మొలకెత్తుతాయి. మూడు, నాలుగు వారాల్లో కూరగాయలు చేతికి వస్తాయి.

ఈ వ్యవసాయం ఎక్కడ నేర్చుకున్నారు?
రామ్‌వీర్ సింగ్ వృత్తిరీత్యా జర్నలిస్టు అయినప్పటికీ కొత్తగా ఏదైనా చేయాలనుకున్నారు. దుబాయ్‌లో జరిగిన వ్యవసాయ ప్రదర్శనలో ఆయన 'హైడ్రోపోనిక్' వ్యవసాయం గురించి తెలుసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునేందుకు థాయ్‌లాండ్‌కు కూడా వెళ్లినట్లు ఆయన చెప్పారు.
ఈ రకమైన వ్యవసాయం భారతదేశంలో కొత్త. కానీ కొన్ని యూరోపియన్ దేశాలలో ఈ 'హైడ్రోపోనిక్' పద్ధతిలో వ్యవసాయం చేస్తారు. ఇంటర్నెట్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఆ విషయాన్ని తెలుసుకున్న తర్వాత ప్రయోగాత్మకంగా తన ఇంటిలోని ఓ భాగంలో దీన్ని ప్రారంభించానని రామ్‌వీర్ తెలిపారు. ప్రయోగం విజయవంతమయ్యాక, ఇంటి మొత్తాన్ని పొలంగా మార్చాలని నిర్ణయించుకున్నారు.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
వంకాయ, క్యాబేజీ, మిరపకాయ, కొత్తిమీర, మెంతులు, బ్రకోలీ ఇలా రకరకాల కూరగాయలను రామ్‌వీర్ ఇంట్లో పండిస్తారు.
‘పైపు లోపల నిల్వ ఉన్న నీటిలో అవి పెరుగుతాయి. వాటికి మట్టి అవసరం లేదు. ఎరువు మట్టి వంటివి నీటిలో కలిసిపోయి ఉంటాయి. ఇందులో నీరు కూడా చాలా తక్కువ అవసరమవుతుంది.
నీటి పైపుల ఏర్పాటుకు ఒక్కసారి మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూరగాయలు నాటేందుకు మాత్రమే ఖర్చు అవుతుంది’ అని ఆయన వివరించారు.
పైకప్పు మీద పాలిథిన్‌ను ఏర్పాటుచేశారు. ఇది కూరగాయల నుంచి కీటకాలను దూరంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఉడుతలు, కోతులు తినకుండా ఇంటి చుట్టూ వలలు ఏర్పాటుచేశారు.
‘మాములుగా పండించే కూరగాయలతో పోలిస్తే వీటి ధర ఎక్కువ. ఈ కూరగాయలు కంట్రోల్డ్ వాతావరణంలో పెరుగుతాయి. స్వచ్ఛమైన నీరు వాడతారు. వాటి నాణ్యత సాధారణ కూరగాయల కంటే మెరుగ్గా ఉంటుంది’ అని రామ్‌వీర్ అన్నారు.
ఈ కూరగాయలను కొనడానికి వినియోగదారులు ఆయన ఇంటికి వస్తారు. పెద్ద హోటళ్లకు కూడా సరఫరా చేస్తారు.

లక్షల్లో సంపాదన.. శిక్షణా కేంద్రం
హైడ్రోపోనిక్ పద్ధతిలో కూరగాయలు, పండ్లు పండించడం ద్వారా ఏడాదికి కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తున్నానని రామ్‌వీర్ చెబుతున్నారు. దీన్ని మరింత విస్తారిస్తామని తెలిపారు.
హైడ్రోపోనిక్ వ్యవసాయ పద్ధతి మీద ప్రజల్లో ఆసక్తి పెరుగుతోందని, దీని గురించి తెలుసుకోవడానికి వ్యవసాయ శాస్త్రాన్ని చదివే విద్యార్థులు, రైతులు ఏడాది పొడవునా తన ఇంటికి వస్తుంటారని ఆయన వెల్లడించారు. ఇటీవలె పొలంలో శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
నగరంలో కూరగాయల తీగలతో అల్లుకుని ఉన్న ఆయన ఇంటిని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తుంటారు.
ఇవి కూడా చదవండి
- దర్గా ముందు తిండి కోసం ఎదురు చూసే ఈ చిన్నారి మిలియనీర్ ఎలా అయ్యాడు?
- భోపాల్ గ్యాస్ విషాదం: 39 ఏళ్లయినా తేలని మృతుల సంఖ్య, అందని పరిహారం
- గోదావరి తీరంలో ఎండు చేపల కథ
- మంచినీటి ట్యాంకులో మలం: ‘‘నా చేతితోనే పిల్లాడికి విషం ఇచ్చినట్లు అనిపించింది’’
- 2022లో లక్షల వ్యూస్ కొల్లగొట్టిన 6 వైరల్ వీడియోలు ఇవే...
- ‘‘నాకు 60 మంది పిల్లలు.. నాలుగో పెళ్లి చేసుకుని, ఇంకా పిల్లలను కంటాను...’’ అంటున్న సర్దార్ హాజీ జాన్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














