‘‘నాకు 60 మంది పిల్లలు.. నాలుగో పెళ్లి చేసుకుని, ఇంకా పిల్లలను కంటాను...’’ అంటున్న సర్దార్ హాజీ జాన్

ఫొటో సోర్స్, JAN MOHAMMAD
- రచయిత, మహమ్మద్ ఖాజీం
- హోదా, బీబీసీ ఉర్దు ప్రతినిధి
- నుంచి, క్వెట్టా
సర్దార్ హజీ జాన్ మహమ్మద్. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలో ఉంటున్నారు. ఇటీవలే తాను 60వ బిడ్డకు తండ్రి అయినట్లు వెల్లడించారు.
వారిలో ఐదుగురు పిల్లలు చనిపోయారని, 55 మంది తనతో జీవిస్తున్నారని ఆయన బీబీసీకి చెప్పారు.
‘‘అల్లా దయ ఉంటే ఇంకా పిల్లలకు జన్మనిస్తాను.. ఆపేది లేదు’’ అని హజీ జాన్ చెప్పారు. అందుకోసం నాలుగో పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు.
సర్ధార్ జాన్ మహమ్మద్ ఖాన్ ఖిల్జీకి 50 ఏళ్లు. క్వెట్టా నగరంలో నివసించే ఆయన వృత్తి రీత్యా డాక్టర్. అదే ప్రాంతంలో ఓ క్లినిక్ ఉంది.
తన 60వ సంతానంగా పుట్టిన కొడుకుకి కుషాల్ ఖాన్ అని పేరు పెట్టినట్లు హజీ జాన్ మహమ్మద్ చెప్పారు.
కుషాల్ పుట్టడానికి ముందు అతని తల్లిని మక్కా యాత్రకు తీసుకెళ్లానని అందుకే అతన్ని హజీ కుషాల్ ఖాన్ అని పిలుస్తామని చెప్పారు హజీ జాన్ మహమ్మద్.
‘‘మీ పిల్లలందరి పేర్లు మీకు గుర్తుంటాయా?’’ అని అడిగనపుడు.. ‘‘ఎందుకు ఉండవు?’’ అని గట్టిగా నవ్వుతూ బదులిచ్చారు.
నాలుగో పెళ్లి కోసం వెయిటింగ్..

ఫొటో సోర్స్, JAN MOHAMMAD
నాలుగో పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిని వెతుకుతున్నట్లు సర్దార్ హజీ జాన్ మహమ్మద్ చెబుతున్నారు.
''నాలుగో పెళ్లికి నా కోసం అమ్మాయిని వెతికి పెట్టాల్సిందిగా నా స్నేహితులందరినీ అడిగాను. జీవితం చెయ్యి దాటి పోతోంది. నా నాలుగో పెళ్లి త్వరలో జరుగుతుంది'' అని పేర్కొన్నారు.
తానొక్కడినే పిల్లలు కావాలని కోరుకోవడం లేదని, తన భార్యలూ అదే కోరుకుంటున్నారని హాజీ జాన్ చెప్పారు. ఇంటిలో కొడుకుల కంటే కుమార్తెలు ఎక్కువ ఉన్నారని తెలిపారు.
తన బిడ్డల్లో కొంతమంది 20 ఏళ్ల వయసు గల వారు కూడా ఉన్నారన్నారు. కానీ, వారిలో ఒక్కరికి కూడా పెళ్లి కాలేదని అందరూ చదువుకుంటున్నారని స్పష్టంచేశారు.
హాజీ జాన్ మహమ్మద్ తనకు ఎలాంటి పెద్ద వ్యాపారాలు లేవని, తన క్లినిక్ సంపాదనతోనే బతుకుతున్నామని చెప్పారు.
చుట్టుముడుతున్న ఆర్థిక సమస్యలు..

ఫొటో సోర్స్, JAN MOHAMMAD
అంతకుముందు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తలేదని, అయితే పిల్లల సంఖ్య పెరగడంతో గత మూడేళ్లుగా ఇబ్బందులు మొదలయ్యాయని తెలిపారు.
"వ్యాపారం స్తంభించిపోయింది. పిండి, నెయ్యి, పంచదారతో సహా అన్ని నిత్యవసర వస్తువుల ధరలు మూడు రెట్లు పెరిగాయి. గత మూడు సంవత్సరాలుగా పాకిస్తానీయులతో సహా ప్రపంచంమంతా ఇబ్బందులు ఎదుర్కొంటుంది, నేను కూడా ఎదుర్కొంటున్నా" అని పేర్కొన్నారు.
తన ప్రయత్నాలన్నీ తన పిల్లలను సంతోషంగా ఉంచడానికే అంటున్నారయన. ఎవరినీ సాయం అడగనని, ఖర్చులు భరించడానికి శాయశక్తులా పనిచేస్తానని స్పష్టంచేశారు.
తన పిల్లలందరినీ చదివిస్తున్నానని, వారి విద్య కోసం చాలా ఖర్చు చేస్తున్నానని చెప్పారు. తన పిల్లలు పౌరులుగా తమ హక్కులను ప్రభుత్వం నుంచి పొందాలన్నారు.
హజీ జాన్ మహమ్మద్ మాట్లాడుతూ.. తనకు ప్రయాణాలు చేయడమంటే ఇష్టమని, తన పిల్లలు కూడా పాకిస్తాన్ మొత్తాన్ని సందర్శించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
తన పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కారులో తీసుకెళ్లడం సులువుగా ఉండేదని, ఇప్పుడు కారులో తీసుకెళ్లడం కుదరడం లేదన్నారు. పిల్లల ప్రయాణానికి ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నట్లు తెలిపారు.
‘‘ప్రభుత్వం నాకు బస్సు ఇస్తే, నా పిల్లలందరినీ పాకిస్తాన్‌లో సులువుగా తిప్పగలను’’ అని అంటున్నారు హాజీ జాన్.
బలూచిస్థాన్‌లో ఎక్కువ మంది సంతనాన్ని కలిగిన వ్యక్తులలో రెండో వ్యక్తి హజీ జాన్ మహమ్మద్.
గతంలో అక్కడి నుష్కీ జిల్లాలో అబ్దుల్ మజీద్ మెంగల్ అనే వ్యక్తి ఆరు వివాహాలు చేసుకుని 54 మంది పిల్లలకు జన్మనిచ్చారు.
అబ్దుల్ మజీద్ మెంగల్ 75 సంవత్సరాల వయస్సులో గత నెలలో మరణించారు. ఆయన ఇద్దరు భార్యలు, 12 మంది పిల్లలు కూడా మృతిచెందారు.
2050 కల్లా ప్రపంచ జనాభాలో 50 శాతం మంది 8 దేశాల నుంచే ఉండవచ్చు. అందులో పాకిస్తాన్ కూడా ఒకటి.
ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం 1960 నుంచి ప్రపంచ జనాభాలో పెరుగుదల రేటు తగ్గుతోంది. 2020లో అది ఒక శాతం కంటే తక్కువ నమోదయింది. కానీ, పాకిస్తాన్‌లో మాత్రం జనాభా పెరుగుదల రేటు 1.9 శాతంగా ఉంది.
ఇవి కూడా చదవండి:
- న్యూయార్క్ మహా నగరం ‘ఖాళీ’ అయిపోతోంది... ఎందుకు?
- క్యాన్సర్ చివరి దశలో ఉన్న తండ్రి కోసం పెళ్లి కాకుండానే తల్లి అయిన కూతురు
- భారతరత్న పురస్కారానికి అర్హులను ఎలా ఎంపిక చేస్తారు... విజేతలకు కలిగే ప్రయోజనాలు ఏంటి?
- చెంఘిజ్ ఖాన్ ఓ బండి నిండా పురుగులను వెంటబెట్టుకుని ఎందుకు తిరిగేవాడు?
- నేషనల్ హైవేలపై డ్రైవింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన 5 జాగ్రత్తలు ఇవే....















