దక్షిణాఫ్రికా: బహుభర్తృత్వాన్ని చట్టబద్ధం చేయాలనే ప్రభుత్వ ప్రతిపాదనపై హాహాకారాలు

ఓ పెళ్లికూతురు, నలుగురు పెళ్లికొడుకుల వెడ్డింగ్ కేక్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, పమ్జా ఫిహ్లానీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి, దక్షిణాఫ్రికా

ఒక మహిళ ఒకరి కన్నా ఎక్కువ మంది భర్తలను కలిగి ఉండడాన్ని చట్టబద్ధం చేయాలని దక్షిణాఫ్రికా ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు సంప్రదాయ వర్గాల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది.

ఇందులో ఆశ్చర్యమేమీ లేదని ప్రొఫెసర్ కాలిస్ మచోకో అంటున్నారు.

"బహుభర్తృత్వాన్ని అంగీకరిస్తే మహిళలపై పురుషులు పట్టు కోల్పోతారని భయం. ఆఫ్రికా సమాజం పూర్తి సమానత్వాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేదు" అని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రపంచంలోకెల్లా అత్యంత ఉదారవాద, స్వేచ్ఛాయుత రాజ్యాంగాలలో దక్షిణాఫ్రికా ఒకటి. స్వలింగ వివాహాలు సహా పురుషుల్లో బహుభార్యత్వాన్ని కూడా అది ఆమోదిస్తుంది.

అయితే, ఇప్పుడు బహుభర్తృత్వానికి మాత్రం తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.

ఈ ప్రతిపాదనను వ్యతిరేకించిన వారిలో నలుగురు భార్యలున్న ప్రముఖ వ్యాపారవేత్త, టీవీ సెలబ్రిటీ మూసా మెసెలెకు కూడా ఒకరు.

"ఇది ఆఫ్రికా సంస్కృతిని నాశనం చేస్తుంది. వారికి పుట్టే పిల్లల గతేంటి? వాళ్ల గుర్తింపేంటో వాళ్లకి ఎలా తెలుస్తుంది? స్త్రీలు, పురుషుల పాత్రను పోషించలేరు. ఇలాంటిది ఎక్కడా వినలేదు. అంటే, ఇప్పుడు ఆడవాళ్లు లోబోలా (కన్యాశుల్కం) ఇవ్వడం మొదలుపెడతారా? భర్తలకు, వాళ్ల భార్యల ఇంటిపేర్లు వస్తాయా?" అని మెసెలెకు అంటున్నారు.

ఇదే మెసెలెకు, గతంలో తన నలుగురు భార్యలతో కలిసి ఒక టీవీ రియాలిటీ షోలో గొప్పగా పాల్గొన్నారు.

నలుగురు భార్యలతో రియాల్టీ షో హోస్ట్ మూసా

ఫొటో సోర్స్, Musa Mseleku

ఫొటో క్యాప్షన్, నలుగురు భార్యలతో రియాల్టీ షో హోస్ట్ మూసా

రహస్య సమాజాలు

తన మాతృదేశమైన జింబాబ్వేలో బహుభర్తృత్వంపై మచోకో పరిశోధన చేశారు. బహుభర్తృత్వాన్ని పాటించే 20 మంది మహిళలు, 45 మంది పురుషులతో ఆయన మాట్లాడారు.

అయితే, ఈ వివాహాలు చట్టబద్దం కావు. సామాజికంగా ఆమోదం పొందవు.

"బహుభర్తృత్వాన్ని సమాజంలో వ్యతిరేకిస్తారు కాబట్టి ఇది రహస్యంగా జరుగుతోంది. కొత్తవాళ్లు లేదా దీనిపై నమ్మకం లేనివాళ్లు కనిపిస్తే, అలాంటి వివాహాలు జరగలేదని చెప్పేస్తారు. వాళ్లకు భయం. సమాజం వాళ్లపై పగబట్టి హింసిస్తుందేమోనని భయపడతారు" అంటూ మచోకో వివరించారు.

అయితే, ప్రొఫెసర్ మచోకో కలిసినవాళ్లంతా వేరు వేరుగా నివసిస్తున్నారు. కానీ, వాళ్లల్లో వాళ్లు బహుభర్తృత్వాన్ని పాటిస్తున్నారు.

"వాళ్లల్లో ఒకామెకు 12 ఏళ్లు ఉన్నప్పుడే బహుభర్తృత్వాన్ని పాటించాలన్న ఆలోచన వచ్చింది. తేనేటీగల్లో ఈ వ్యవస్థ ఉంటుంది. రాణి తేనెటీగ, అనేక మగ తేనెటీగలను ఆహ్వానిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న తరువాత ఈమెకు కూడా అలా బహుభర్తృత్వాన్ని పాటించాలనే ఆలోచన కలిగింది."

ఆమె యుక్తవయసుకు వచ్చిన తరువాత అనేకమంది పురుషులతో సంభోగించడం మొదలుపెట్టారు. ఈ విషయం ఆ అబ్బాయిలందరికీ తెలుసు.

"ప్రస్తుతం ఆమెకు ఉన్న తొమ్మిది మంది భర్తలలో నలుగురు, తన తొలి బాయ్‌ఫ్రెండ్స్ గుంపులోవారే."

బహుభర్తృత్వంలో సాధారణంగా స్త్రీలే సంబంధాలను కలుపుకుంటారు. తనకు భర్తగా ఉంటూ, తన ఇతర భర్తలతో కూడా కలిసిమెలిసి ఉండమని ఆహ్వానిస్తారు.

కొందరు పురుషులు కన్యాశుల్కం చెల్లిస్తారు. కొందరు భార్యను జీవితాంతం పోషించేందుకు ఒప్పుకుంటారు.

ఏ భర్త అయినా కుటుంబంలో కలకలం రేపుతున్నాడని తెలిస్తే తనను కుటంబం నుంచి తొలగించే అధికారం ఆ భార్యకు మాత్రమే ఉంటుంది.

ప్రొఫెసర్ మచోకో ఇంటర్వ్యూ చేసిన పురుషులలో దాదాపు అందరూ బహుభర్తృత్వాన్ని ఒప్పుకోవడానికి కారణం "ప్రేమ" అనే చెప్పారు.

తన భార్య ఎంతమంది భర్తలను కట్టుకున్నా ఫరవాలేదని, తనతో ప్రేమగా ఉంటే చాలని, ఆమెను వదిలేసుకోవాల్సి వస్తుందనే భయంతోనే ఈ సంబంధంలో ఉన్నట్లు వారంతా తెలిపారు.

కొందరు పురుషులు, తమ భార్యలను లైంగికంగా సంతృప్తిపరచలేకపోయారనే విషయాన్ని కూడా ప్రస్తావించారు. విడాకులు లేదా అఫైర్స్ నివారించడానికి తన భార్య మరొక పురుషుడిని వివాహమాడడానికి అంగీకరించారని తెలిపారు.

సంతానం కలగకపోవడం కూడా మరో కారణం. తమ వల్ల బిడ్డలు పుట్టడం లేదని తెలిసినవారు, తన భార్య వేరొక పురుషుడిని వివాహం ఆడేందుకు అంగీకరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ రకంగా నలుగురిలో నగుబాటును వారు తప్పించుకోగలరు. సంతానం కలిగించలేకపోవడాన్ని సమాజంలో చిన్నచూపు చూస్తారు.

బహుభర్తృత్వం

మతాధికారులఆందోళన

దక్షిణాఫ్రికాలో బహుభర్తృత్వం ఉన్నట్లు తనకు తెలియదని ప్రొఫెసర్ మచోకో చెప్పారు.

అయితే, స్వేచ్ఛ, సమానత్వాలను సాధించడానికి బహుభర్తృత్వాన్ని చట్టబద్ధం చేయాలని జెండర్ హక్కుల కార్యకర్తలు, ప్రభుత్వాన్ని కోరారు. బహుభార్యత్వం చట్టబద్ధం అయినప్పుడు బహుభర్తృత్వం కూడా చట్టబద్ధం కావాలన్నది వారి వాదన.

'గ్రీన్ పేపర్' అని పిలిచే అధికార పత్రంలో వారు ఈ ప్రతిపాదనను సమర్పించారు.

ఆ అంశంపై తమ అభిప్రాయం తెలుపమని ప్రభుత్వం ప్రజలను కోరింది.

1994లో తెల్లవాళ్ల పాలన ముగిసినప్పటి నుంచి దక్షిణాఫ్రికాలో వివాహ చట్టాల్లో పెద్ద పెద్ద మార్పులు తీసుకొస్తున్నారు.

"ఈ గ్రీన్ పేపర్ మానవ హక్కులను సమర్థిస్తుందని గుర్తుంచుకోవాలి. సమాజంలో ఉన్న కొన్ని పితృస్వామ్య ఆలోచనలను సవాలు చేస్తోందనే కారణంతో చట్ట సంస్కరణలను తిరస్కరించలేం" అని చార్లీన్ మే అన్నారు. ఆమె, మహిళల హక్కుల కోసం పోరాడే సంస్థ 'వుమెన్స్ లీగల్ సెంటర్‌'లో న్యాయవాదిగా పనిచేస్తున్నారు.

బహుభర్తృత్వంతో పాటుగా, ముస్లిం, హిందూ, యూదు, రాస్తాఫేరియన్ వివాహాలకు కూడా చట్టపరమైన గుర్తింపు ఇవ్వాలని ఈ పత్రంలో ప్రతిపాదించారు.

ఈ ప్రతిపాదనను సంబంధిత సంఘాలు ఆహ్వానించినప్పటికీ, బహుభర్తృత్వాన్ని చట్టబద్దం చేయడాన్ని పార్లమెంటు సభ్యులైన మతాధికారులు ఖండించారు.

"ఇది సంస్కృతిని నాశనం చేస్తుంది. నాతో కాకుండా, వాళ్లతోనే ఎక్కువ సమయం గడుపుతున్నావు అంటూ భర్తలు ఫిర్యాదులు చేసే రోజులు వస్తాయి. భర్తలు వారిలో వారు కీచులాడుకుంటారు" అని ప్రతిపక్ష ఆఫ్రికన్ క్రిస్టియన్ డెమోక్రటిక్ పార్టీ నాయకుడు రివరెండ్ కెన్నెత్ మెషో అన్నారు.

"పిల్లలు పుట్టాక ఎవరికి పుట్టారో తెలుసుకోవడానికి భారీగా డీఎన్ఏ పరీక్షలు జరపాల్సి ఉంటుంది. ఆ పరిస్థితిని ఊహించుకోండి" అని ఇస్లామిక్ అల్-జమా పార్టీ నాయకుడు గనీఫ్ హెన్డ్రిక్స్ అన్నారు.

బహుభర్తృత్వం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బహుభర్తృత్వం వల్ల పిల్లలు ఎవరి సంతానమో తెలుసుకోవడానికి డీఎన్ఏ పరీక్షలు అవసరమవుతాయంటున్న విమర్శకులు

'ఆ కుటుంబానికి చెందిన పిల్లలే అవుతారు'

సమానత్వాన్ని మరీ దూరం లాగకూడదని మెసెలెకు అన్నారు.

"రాజ్యాంగంలో ఉంది కాబట్టి అది ప్రజలకు మేలు చేస్తుంది అనుకోలేం."

పురుషులు అనేకమంది మహిళలను వివాహం చేసుకోగా లేనిది, మహిళలు చేసుకుంటే తప్పేంటి అని అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ.. "నేను నలుగురిని పెళ్లి చేసుకుంటే నన్ను హిపోక్రట్ అన్నారు. కానీ, ఇప్పుడు మౌనం వహించడం కన్నా మాట్లాడడమే ముఖ్యం. నేనొక్కటే చెప్పదలుచుకున్నాను, ఇది ఆఫ్రికా సంస్కృతికి విరుద్ధం. మనం ఎవరం, మన పద్ధతులేంటి అనేవి గుర్తుంచుకోవాలి. మనం వాటిని మార్చలేం" అని మెసెలేకు అన్నారు.

కెన్యా, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, నైజీరియాల్లో ఒకప్పుడు బహుభర్తృత్వం ఉండేదని ప్రొఫెసర్ మచోకో చెప్పారు.

గాబన్‌లో ఇప్పటికీ పాటిస్తున్నారు. అక్కడ అది చట్టబద్ధం కూడా.

"క్రిస్టియానిటీ, వలస రాజ్య పాలన వలన సమాజంలో స్త్రీ పాత్ర తగ్గిపోయింది. వాళ్లు పురుషులకు సమానం కాదు. పురుషాధికార పరంపరను కొనసాగించడానికి వివాహం ఒక సాధనంగా మారింది.

బహుభర్తృత్వ వ్యవస్థలో పుట్టిన పిల్లల గురించి వస్తున్న ఆందోళనలన్నీ పితృస్వామ్య భావజాలంలోంచి వచ్చినవే.

ఇందులో పెద్ద సమస్యేం లేదు. బహుభర్తృత్వం పాటిస్తున్న కుటుంబంలో పుట్టిన పిల్లలు ఆ కుటుంబానికి చెందిన పిల్లలే అవుతారు" అని ప్రొఫెసర్ మచోకో అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)