వరుడు కావలెను: '30 ఏళ్ల మహిళకు 25-28 ఏళ్ల అందమైన, ఆస్తిపరుడైన, వంట చేయగల కుర్రాడు కావాలి'

- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ ప్రతినిధి
వరుడు కావలెను: కచ్చితమైన అభిప్రాయాలున్న స్త్రీవాది, చెవి-ముక్కు పోగులు, పొట్టి జుత్తు కలిగిన విద్యావంతురాలు, క్యాపిటలిజానికి వ్యతిరేకంగా సామాజిక సంస్థలో పని చేస్తున్న 30 ఏళ్లకు పైబడిన మహిళకు అందమైన, చక్కటి శరీర నిర్మాణం కలిగిన 25-28 ఏళ్ళ యువకుడు కావాలి. వ్యాపారం, బంగళా, కనీసం 20 ఎకరాల ఫార్మ్ హౌజ్ ఉన్న ఏకైక కుమారుడై ఉండాలి. అతనికి వంట చేయడం కూడా రావాలి. ఆసక్తి ఉన్నవారు సంప్రదించండి.
ఇది పత్రికల్లోని పెళ్లి సంబంధాల పేజీలో వచ్చిన ప్రకటన.
సాధారణంగా భారతదేశంలో స్త్రీవాదులు జీవిత భాగస్వామి కోసం వార్తా పత్రికలలోని మ్యాట్రిమోనియల్ ప్రకటనలను చూడరు. ఎందుకంటే అందులో చాలా వరకు కులం, జెండర్ ప్రాతిపదికన వచ్చే ప్రకటనలు వస్తుంటాయి. అప్పుడప్పుడూ శారీరక అందం, రంగు, ఉద్యోగం, జీతం, ఆస్తి గురించి కూడా ప్రత్యేకంగా రాస్తుంటారు.
అయితే, ఒక 'స్త్రీవాది' ఇచ్చిన ఈ చిత్రమైన ప్రకటన గత వారం పత్రికల్లో కనిపించింది. బాగా డబ్బున్న, అందమైన, వంట తెలిసిన కుర్రాడే కాదు, అతనికి తేన్పులు, ఆపాన వాయువు వదిలే సమస్యలు కూడా ఉండకూడదని కూడా ఆ ప్రకటనలో కండిషన్ పెట్టారు.
ఇండియాలో అత్యధికంగా అమ్ముడుపోయే ఓ వార్తాపత్రికలో వచ్చిన ఈ ప్రకటన వెంటనే వైరల్ అయిపోయింది. కమెడియన్ అదితి మిట్టల్ దీనిపై స్పందింస్తూ "నా కోసం ఎవరైనా ఈ ప్రకటన ఇచ్చారా?" అంటూ సరదాగా ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్‌కు అనేకమంది స్పందించారు. బాలీవుడ్ నటి రిచా చడ్డా కూడా సరదాగా ట్వీట్ చేస్తూ, "మీ కోసమే ఎవరో ఇక్కడ వెయిట్ చేస్తున్నారు" అని రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
సోదరికి పుట్టినరోజు కానుక
అయితే, ఇది నిజమైన ప్రకటనా లేక ఎవరైనా ఆటలాడుతున్నారా అంటూ అనేకమంది సందేహం వ్యక్తం చేశారు. వారి అనుమానమే నిజం అయింది.
ఒక అన్న, తన చెల్లి కోసం, ఆమె స్నేహితురాలితో కలిసి సరదాగా ఈ ప్రకటన ఇచ్చారు. ఈ ప్రకటనలో ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్ ఆధారంగా బీబీసీ ఈ ఒపీనియేటెడ్ ఫెమినిస్టును సంప్రదించింది.
సాక్షి, ఆమె సోదరుడు శ్రీజన్, స్నేహితురాలు దమయంతి కలిసి చేసిన అల్లరి పని ఇదని తేలింది.
అయితే, ఇవి వారి నిజమైన పేర్లు కావు. అసలు పేర్లు బయపెట్టడం ఇష్టం లేదంటూ వారు తమ పేర్లు మార్చమని కోరారు. "మేమంతా మా ప్రొఫెషనల్ కెరీర్‌లో స్థిరంగా ముందుకు సాగుతున్నవాళ్లం. భవిష్యత్తులో ఇంకా ఏదో సాధించాలని ఆశపడుతున్నాం. మా అసలు పేర్లు బయటపెట్టి సోషల్ మీడియా ట్రోల్స్‌కు బలైపోవాలని కోరుకోవట్లేదు." అన్నారు సాక్షి
"సాక్షి 30వ పుట్టిన రోజు సందర్భంగా మేం సరదాగా ఈ పని చేశాం" అని శ్రీజన్ చెప్పారు.
"జీవితంలో 30 ఏళ్లు పూర్తవడం ఒక మైలు రాయి. ముఖ్యంగా మన సమాజంలో పెళ్లి, పిల్లల గురించి ఉన్న ఆలోచన దృష్ట్యా ఈ వయసు చాలా ముఖ్యమైనది. 30 ఏళ్లు వచ్చేసరికల్లా పెళ్లి చేసుకుని, జీవితంలో స్థిరపడాలని అందరూ ఒత్తిడి తెస్తారు" అని శ్రీజన్ అన్నారు.
తనకు పొట్టి జుత్తు ఉందని, పంతం పట్టుదల ఉన్నాయని, సోషల్ సెక్టర్‌లో పని చేస్తున్నానని సాక్షి తెలిపారు. అవన్నీ నిజమేగానీ ఆపానవాయువు-తేన్పు గురించి చెప్పినది మాత్రం వాళ్ల కుటుంబంలో చెప్పుకునే ఒక జోకని ఆమె వివరించారు.
ఈ ప్రకటన ఉన్న వార్తాపత్రిక ఉత్తర భారతదేశంలోని ఒక డజను నగరాల్లో వెలువడింది. ఇది వేయడానికి రూ. 13,000 ఖర్చు అయింది.
లాక్‌డౌన్ లేకపోతే ఆ డబ్బును సాక్షికి బహుమతులు కొనడానికి, పుట్టినరోజు వేడుక జరుపుకోవడానికి ఖర్చు చేసి ఉండేవాళ్లమని శ్రీజన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కుప్పలుతెప్పలుగా ఈమెయిల్స్
పుట్టినరోజుకు ముందురోజు రాత్రి సాక్షికి, తన అన్న ఒక పేపర్ చుట్టి ఇచ్చారు. అందులో ఒక ఈమెయిల్ అడ్రస్, పాస్‌వర్డ్ ఉన్నాయి.
"అవేం చేసుకోవాలో నాకర్థం కాలేదు. పొద్దున్న లేచాక శ్రీజన్ ఆ వార్తాపత్రిక తెచ్చి అందులో పడిన మేట్రిమోనియల్ ప్రకటన చూపించాడు. మేం పడి పడి నవ్వుకున్నాం. నా పుట్టినరోజు కానుకగా తను చేసిన అల్లరి పని అది" అని సాక్షి వివరించారు.
అయితే, ఇది వారి మధ్యే ఆగిపోకుండా సోషల్ మీడియా మొత్తం వైరల్ అయింది. సెలబ్రిటీలు కూడా షేర్ చేసేసరికి అనేకమంది కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. వీళ్లు ప్రకటనలో సృష్టించి ఇచ్చిన ఈమెయిల్ ఐడీకి కుప్పలుతెప్పలుగా మెయిల్స్ వచ్చి పడసాగాయి.
"నాకు ఇప్పటివరకూ 60 కన్నా ఎక్కువే ఈమెయిల్స్ వచ్చాయి. అయితే, చాలామందికి ఇది జోక్ అని అర్థమైపోయింది. వాళ్లంతా సరదాపడ్డారు."
"ఒక వ్యక్తి తను చాల నమ్రతగలవాడినని, అసలు పంతం లేనివాడినని చెప్తూ, నేనే మీకు తగినవాడిని అని రాశారు. మరొక ఆమె ఆ ప్రకటన ఇచ్చినందుకు థాంక్స్ చెప్తూ, నేను కూడా అలాంటి అమ్మాయినే అని అన్నారు."
అయితే, భారతదేశంలో ఇప్పటికీ స్త్రీవాదాన్ని అపార్థం చేసుకునేవారే ఎక్కువ. స్త్రీవాది అంటే కొందరు చెడుగానే భావిస్తారు. మగవాళ్లను అసహ్యించుకునేవాళ్లుగా పరిగణిస్తారు.
ఈ ప్రకటన చూసి మరింకెంతోమంది ఇలాగే దూషణకు దిగారు.
సాక్షిని "డబ్బున్నవాడిని వల వేసి పట్టే వ్యక్తి" అని, "నంగనాచి" అని, "క్యాపిటలిస్టులకు వ్యతిరేకం అనే నీకు డబ్బున్న వాడు కావాలా?" అంటూ, "30 ఏళ్ల అమ్మాయికి 25-28 ఏళ్ల చిన్నవాడు కావాలా?" అంటూ దూషించారు. మరికొందరు, "ఫెమినిస్టులందరూ ఇడియట్స్" అని ఎగతాళి చేశారు. కొందరైతే శాపాలు పెట్టారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
'ఇదంతా హిపోక్రసీ'
"అందరికీ అందమైన, డబ్బున్న, జీవితంలో స్థిరపడిన వరుడే కావాలి. కానీ, అదే స్పష్టంగా, బహిరంగంగా ప్రకటిస్తే మాత్రం తప్పైపోయింది. అదే వీరి కోపానికి కారణం" అని దమయంతి అన్నారు.
"ఈ ప్రకటనతో చాలామందికి ఇగో దెబ్బతిన్నట్టుంది. నాకు ఇలాంటి భాగస్వామి కావాలి అని బహిరంగంగా చెప్పకూడదన్నమాట. మగవాళ్లు మాత్రం తెల్లగా, సన్నగా, అందంగా ఉండే అమ్మాయి కావాలని ప్రకటనలు ఇవ్వొచ్చు. వాళ్ల ఆస్తిపాస్తుల గురించి గొప్పలు చెప్పుకోవచ్చు. అమ్మాయిలు మాత్రం ఆ పని చేయకూడదు. సంప్రదాయం మంటగలిసిపోతుంది కాబోలు. ఇలాంటి ఆలోచనలపై సంధించిన విమర్శనాస్త్రమే ఆ ప్రకటన. ఇది చూసి కోపాలు తెచ్చుకున్న వాళ్లందరూ కూడా మాకు తెల్లగా, సన్నగా ఉండే అమ్మాయి కావాలి, అందమైన వధువు కావాలి అని ప్రకటనలు ఇచ్చినవాళ్లే అయ్యుంటారు" అని సాక్షి అన్నారు.
ఇలాంటి హిపోక్రసీ చూపిస్తున్న వాళ్లందరినీ సాక్షి ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నారు. "కులం, మతం ఆధారంగా వధువు కావాలని పేపర్లలో ప్రకటన ఇచ్చేవారిని, సెక్సిస్ట్ భావాలు ఉన్నవారిని ఇలాగే తిడుతూ ఈమెయిల్స్ పంపిస్తారా?"
"లేదు అనేది మీ జవాబు అయితే, మీరు పితృస్వామ్య భావజాలంలో కూరుకుపోయి ఉన్నారు. అందులోంచి బయటకు రండి" అంటూ సాక్షి ముగించారు.
ఇవి కూడా చదవండి:
- ఎమర్జెన్సీ: ‘అక్రమ నిర్బంధానికి బలైన’ స్నేహలతారెడ్డి జైలు డైరీ
- ఆధార్, పాన్ కార్డ్ వివరాలు ఇస్తే రూ. 500 ఇస్తామంటారు... ఆ తరువాత ఏం చేస్తారో తెలుసా?
- సోనాగచ్చి మహిళా సెక్స్ వర్కర్లు: ‘ఈసారి మా ఓటు నోటాకే.. ఎందుకంటే..’
- ఎమర్జెన్సీ రోజుల్లో సంజయ్ గాంధీ ఎలా ఆదేశాలు ఇచ్చేవారంటే...
- కోవిడ్ వ్యాక్సీన్ మూడో డోసు కూడా అవసరమా? - డాక్టర్స్ డైరీ
- డెల్టా ప్లస్: ఈ కోవిడ్-19 కొత్త వేరియంట్‌కు ప్రపంచం భయపడాల్సిందేనా
- సింగపూర్‌లో మిగిలిన ఒకే ఒక గ్రామం... దాన్ని కాపాడుతున్నదెవరు?
- గ్రహాంతరవాసులు ఉన్నారా....పెంటగాన్ విడుదల చేయబోయే రిపోర్టులో ఏముంది?
- అయోధ్య: రామ మందిరం ట్రస్ట్ భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయా? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- మిల్ఖా సింగ్: కోవిడ్ అనంతర సమస్యలతో చనిపోయిన భారత ప్రఖ్యాత అథ్లెట్
- టవోలారా: ప్రపంచంలోనే అతిచిన్న సామ్రాజ్యమిది.. ఇక్కడ ఎంతమంది నివసిస్తారో తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








