బ్రిట్నీ స్పియర్స్: 'నా ప్రియుడ్ని పెళ్లి చేసుకుని మరో బిడ్డను కనాలని ఉంది... నా తండ్రి ఒప్పుకోవడం లేదు'

ఫొటో సోర్స్, Reuters
లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఓ విచారణ సందర్భంగా అమెరికా పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ తన కన్సర్వేటర్‌షిప్‌కు వ్యతిరేకంగా మాట్లాడారు.
అమెరికాలో కన్సర్వేటర్‌షిప్ అంటే ఒక వ్యక్తిపై, మరొక వ్యక్తి చట్టపరంగా సర్వాధికారాలు కలిగి ఉండడం.
తన తండ్రి, తనను "1,00,000%" నియంత్రణలో పెట్టారని, అది కూడా "ఎంతో ఇష్టంగా చేశారని" ఆమె బహిరంగపరిచారు.
"నా మనసు చాలా గాయపడింది. తిరిగి నా జీవితం నాకు కావాలి" అని బ్రిట్నీ స్పియర్స్ అన్నారు.
బ్రిట్నీ తండ్రి జామీ స్పియర్స్‌కు తన కూతురి వ్యక్తిగత, వ్యాపార వ్యవహారాలపై పూర్తి నియంత్రణ ఉంటుందని తెలుపుతూ కోర్టు 2008లో ఆయనకు సర్వాధికారాలను అప్పగించింది.
బ్రిట్నీ మానసిక అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడంతో కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది.
అప్పటినుంచి, 39 ఏళ్ల ఈ పాప్ స్టార్ తన కన్సర్వేటర్‌షిప్ గురించి ఎలా స్పందిస్తారనే విషయంలో ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి.
సోషల్ మీడియాలో ఆమె దీని గురించి ఏమైనా క్లూ ఇస్తారేమోనని అభిమానులు వెతుకుతూనే ఉన్నారు.

ఫొటో సోర్స్, Reuters
'కన్సర్వేటర్‌షిప్ దుర్వినియోగం అవుతోంది'
తన తండ్రి తన మీదున్న సర్వాధికారాలను దుర్వినియోగం చేస్తున్నారంటూ బ్రిట్నీ కోర్టుకెక్కారు.
"ఫలితాలతో నిమిత్తం లేకుండా ఈ కన్జర్వేటర్‌షిప్‌ను ముగించాలని కోరుకుంటున్నా" అని ఆమె కోర్టుకు తెలిపారు.
"నా జీవితాన్ని నాకు నచ్చినట్టు గడిపే అర్హత నాకుంది. నేను జీవితమంతా కష్టపడి చేశాను. ఓ రెండు మూడేళ్లు విశ్రాంతి తీసుకునే అర్హత నాకుంది" అంటూ కోర్టు విచారణ సందర్భంగా ఆమె భావోద్వేగంతో మాట్లాడారు.
బ్రిట్నీ తన ప్రియుడిని పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు జన్మనివ్వాలని కోరుకుంటున్నట్లు బ్రిట్నీ తెలిపారు.
అయితే, కన్సర్వేటర్‌షిప్ అందుకు అనుమతించట్లేదు.
ఆమె గర్భనిరోధక ఇంట్రాయూటెరిన్ కాంట్రాసెప్టివ్ డివైస్ (ఐయూసీడీ) వాడుతున్నారని, దాన్ని తొలగించి గర్భం దాల్చడానికి తన కన్సర్వేటర్ (తండ్రి) ఒప్పుకోవట్లేదని బ్రిట్నీ తెలిపారు.
"ఈ కన్సర్వేటర్‌షిప్ వలన నాకు కలిగే లాభాల కన్నా నష్టాలే చాలా ఎక్కువ" అని ఆమె అన్నారు.
కన్న కూతురి ఆరోపణలు జామీ స్పియర్స్‌కు మనస్తాపం కలిగించాయని ఆయన తరపు లాయర్ కోర్టుకు తెలిపారు.
"జామీ స్పియర్స్‌కు తన కూతురు అంటే ఎంతో ప్రేమ, ఆమెను చాలా మిస్ అవుతున్నారు" అని లాయర్ అన్నారు.
కూతురి ఆర్థిక వ్యవహారాలను జామీ చక్కదిద్దారని ఆయన లాయర్లు వాదించారు.
కన్సర్వేటర్‌షిప్ అంటే ఏమిటి?
మనో వైకల్యం లేదా ఇతర మానసిక అనారోగ్యాల కారణంగా సొంత నిర్ణయాలు తీసుకోలేనివారికి కోర్టు కన్సర్వేటర్‌షిప్‌ను మంజూరు చేస్తుంది.
బ్రిట్నీ కన్సర్వేటర్‌షిప్‌ను రెండు భాగాలుగా విభజించారు. ఒకటి ఆమె ఎస్టేట్, ఆర్థిక వ్యవహారాల నిమిత్తం, మరొకటి, ఆమె వ్యక్తిగత ఆలనా పాలనా చూసేందుకు.
2008లో ఈ చట్టం మంజూరు అయిన దగ్గర నుంచి ఆర్థిక వ్యవహారాలు ఆమె నియంత్రణలో లేవు.
కెవిన్ ఫెడర్లిన్‌తో విడాకులు, వారి ఇద్దరి పిల్లల కస్టడీ గురించి పోరాటం ఆమెను మానసికంగా బాగా కుంగదీశాయి. ఆ సమయంలో ఆమె రెండుసార్లు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందవలసి వచ్చింది. అదే సమయంలో కోర్టు, జామీ స్పియర్స్‌కు బ్రిట్నీపై సర్వాధికారాలను అప్పగించింది.
బ్రిట్నీ కన్సర్వేటర్‌షిప్ వివరాలు ఎప్పుడూ బయటకి రాలేదుగానీ అందులో ఉన్న రెండు విభాగాలపై జామీకి సర్వాధికారాలు ఉన్నట్లు తెలిసింది.
2019లో ఆరోగ్య కారణాల వలన జామీ తాత్కాలికంగా తన కూతురి కన్సర్వేటర్‌షిప్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
ఆయన శాశ్వతంగా ఈ బాధ్యతల నుంచి వైదొలగాలని బ్రిట్నీ కోరారు.

ఫొటో సోర్స్, Reuters
‘ఫ్రీ బ్రిట్నీ’
‘ఫ్రీ బ్రిట్నీ’ (#FreeBritney) నినాదంతో డజన్లకొద్దీ అభిమానులు కోర్టు బయట గుమికూడారు.
"ఫ్రీ బిట్నీ నౌ", " బ్రిట్నీ జీవితం నుంచి వైదొలగండి" అని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని తమ అభిమాన గాయకురాలికి మద్దతు పలికారు.
"బ్రిట్నీ చెప్పిన వివరాలు విని నా గుండె బద్దలైపోయింది. నేను ఊహించినదాని కన్నా చాలా ఎక్కువగా ఆమె కష్టాలు పడుతున్నారు. ఈ నిజాలన్నీ ఇప్పటికైనా బయటకి రావడం సంతోషం" అంటూ ‘ఫ్రీ బ్రిట్నీ’ ఉద్యమాన్ని ప్రారంభించినవారిలో ఒకరైన మేగన్ రాడ్‌ఫోర్డ్ అన్నారు.
బ్రిట్నీపై సర్వాధికారాలను తన తండ్రికి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ 2009లోనే అభిమానులు ప్రచారం మొదలుపెట్టారని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.
ఆమెను బలవంతంగా ఇందులోకి లాగారని వారు అభిప్రాయపడ్డారు. కోర్టు విచారణ జరిగిన ప్రతిసారీ వారంతా కోర్టు బయట గుమికూడి బ్రిట్నీకి మద్దతు తెలిపారు.
ఆమెపై కన్సర్వేటర్‌షిప్‌ను రద్దు చేయాలని వేల కొద్దీ సంతకాలు సేకరించి వైట్ హౌస్‌కు సమర్పించారు.
పారిస్ హిల్టన్, బెట్టే మిడ్లర్, మిలే సైరస్‌తో సహా పలువురు ప్రముఖులు బ్రిట్నీకి మద్దతు పలికారు.

ఫొటో సోర్స్, Reuters
ఈ విచారణ ఎందుకంత ప్రాముఖ్యం?
ఫ్రీ బ్రిట్నీ నినాదం, ఇటీవల న్యూయార్క్ టైమ్స్‌లో బ్రిట్నీపై విడుదల అయిన డాక్యుమెంటరీ ఈ కేసుపై ప్రజల్లో ఆసక్తి రేపింది.
అయితే, బ్రిట్నీ ఈ కన్సర్వేటర్‌షిప్ గురించి బహిరంగంగా మాట్లాడింది తక్కువే కానీ, ఆమె కుటుంబ సభ్యులు కోర్టు ఆదేశాలను వ్యతిరేకిస్తూ పలుమార్లు గొంతెత్తారు.
2019లో ఈ కేసు విచారణ విషయాలు బయటకు రాలేదు. సోషల్ మీడియాలో బ్రిట్నీకి పెద్ద ఫాలోయింగ్ ఉన్నప్పటికీ, ఆమె ఈ కేసు వివరాలను ఎప్పుడూ బయటపెట్టలేదు.
కాగా, బ్రిట్నీ 2014 నుంచి కన్సర్వేటర్‌షిప్‌ను వ్యతిరేకిస్తూ వచ్చారని తెలిపే రహస్య పత్రాలు తమకు లభించినట్లు ఈ వారం న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.
బ్రిట్నీ ఇప్పుడెందుకు బహిరంగంగా మాట్లాడుతున్నారు?
కోర్టు నియమించిన న్యాయవాది ద్వారా బ్రిట్నీ తన వాదనను వినిపించవచ్చని ఈ ఏప్రిల్‌లో ఆదేశాలు జారీ చేశారు.
తన కెరీర్ విషయంలో తన తండ్రి తలదూర్చడం ఆమెకు ఏ మాత్రం ఇష్టం లేదని బ్రిట్నీ గత విచారణల్లో పలుమార్లు లాయర్ల ద్వారా వెల్లడించారు.
బ్రిట్నీకి "తన తండ్రి అంటే భయం" అని, ఆయన చేతిలో అధికారాలు ఉన్నంతవరకు ఆమె మళ్లీ స్టేజి ఎక్కరని ఆమె తరపు లాయరు కోర్టుకు తెలిపారు.
తన తండ్రికి బదులు కేర్ ప్రొఫెషనల్ అయిన జోడి మోంట్‌గోమేరీకి తన కన్సర్వేటర్‌షిప్ అప్పగించాలని బ్రిట్నీ ఇప్పుడు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- భారత సైన్యంలో నేపాలీ మహిళల నియామకంపై వివాదం ఏమిటి?
- లక్షద్వీప్: సినీనటి ఆయేషా సుల్తానాపై దేశద్రోహం కేసు ఎందుకు పెట్టారు?
- డెల్టా ప్లస్: ఈ కోవిడ్-19 కొత్త వేరియంట్‌కు ప్రపంచం భయపడాల్సిందేనా?
- అధికారులను జైలుకి పంపినంత మాత్రాన ఆక్సిజన్ కొరతకు పరిష్కారం దొరకదు: జస్టిస్ చంద్రచూడ్
- కరోనావైరస్: గర్భిణులు వ్యాక్సీన్ తీసుకోకూడదా... డాక్టర్లు ఏమంటున్నారు?
- ప్రభుత్వాన్ని విమర్శించే వ్యక్తులు శత్రువులు, రాజద్రోహులా? :అభిప్రాయం
- భారత ఉన్నత న్యాయవ్యవస్థలో మహిళా న్యాయమూర్తుల సంఖ్య తక్కువగా ఉంది ఎందుకు?
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- మావోయిస్టు హరిభూషణ్ మృతి-కరోనా లేదా గుండెపోటుతో మరణించి ఉండొచ్చన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ
- ఇస్రో గూఢచర్యం కేసు: కేరళ పోలీసుల పాత్రపై దర్యాప్తునకు సుప్రీం ఆదేశం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- UAPA చట్టం కింద నమోదైన 97.8 శాతం కేసుల్లో ఆరోపణలు నిరూపితం కాలేదు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








