పాకిస్తాన్ ఆర్ధికంగా దివాలా తీస్తుందా, చేతిలో డాలర్లున్నా ఖర్చు చేయలేని స్థితిలో ఎందుకు పడింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఉమర్ దరాజ్ నంగియానా, ఇమాద్ ఖాలీద్
- హోదా, బీబీసీ ఉర్దూ
గత ఎనిమిది నెలలుగా పాకిస్తాన్‌లో అస్థిరత రాజ్యమేలుతోంది.
ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్న దేశాన్ని పోయిన ఏడాది వచ్చిన వరదలు మరింత దెబ్బతీశాయి.
పెట్టుబడులు తగ్గిపోయాయి. ఆర్థికలోటు పెరిగిపోతోంది. పాకిస్తాన్ రూపాయి అంతకంతకూ క్షీణిస్తూ పోతోంది.
ప్రస్తుతం పాకిస్తాన్‌కు ఏ అంతర్జాతీయ సంస్థ నుంచి ఆర్థిక సాయం అందడం లేదు. విదేశీ మారకపు నిధులు వేగంగా అడుగంటుతున్నాయి.
మరి కొద్ది నెలల్లో పాకిస్తాన్ 30 బిలియన్ డాలర్లను విదేశాలకు చెల్లించాల్సి ఉంది. గడువు దగ్గర పడుతున్న కొద్దీ అప్పులు తీర్చలేక దేశం దివాలా తీస్తుందనే భయాలు పెరుగుతున్నాయి.
కానీ దివాలా తీసే పరిస్థితి రాదని పాకిస్తాన్ చెబుతోంది. ‘కొందరు రాజకీయ లబ్ధి కోసం దేశం దివాలా తీస్తుందని ప్రచారం చేస్తున్నారు’ అంటూ పాకిస్తాన్ ఆర్థికశాఖ మంత్రి ఇషాక్ దర్ అన్నారు.
విదేశీ మారకపు నిధులు ఆరు బిలియన్ డాలర్లు మాత్రమే ఉన్న పాకిస్తాన్, ఈ అప్పులను ఎలా తీర్చగలుగుతుంది? పాకిస్తాన్ దివాలా అంచున ఉన్నట్లేనా?

ఫొటో సోర్స్, Getty Images
‘70ఏళ్ల చరిత్రలో దివాలా తీయలేదు’
అయితే పాకిస్తాన్ దివాలా తీసే అవకాశాలు తక్కువని ఆర్థికరంగ నిపుణుడు డాక్టర్ సాజిద్ ఆమిన్ అన్నారు.
‘70ఏళ్ల చరిత్రలో ఇప్పటి వరకు పాకిస్తాన్ ఒక్కసారి కూడా దివాలా తీయలేదు. గతంలో చాలా సార్లు ఇప్పటి కంటే తక్కువ విదేశీ మారకపు నిల్వలను పాకిస్తాన్ చూసింది. అప్పులను రెన్యూవల్ చేస్తారు. రుణాలు తీర్చే గడువును పెంచుతారు’ అని సాజిద్ తెలిపారు.
అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) సంస్థ ‘బెయిల్ అవుట్’ ప్యాకేజీ ఇచ్చి ఆదుకుంటుందనే దీమాతో పాకిస్తాన్ ఉందని సాజిద్ అభిప్రాయపడ్డారు.
ఐఎంఎఫ్‌తోపాటు ఇతర మిత్రదేశాల నుంచి కూడా సాయం అందొచ్చని ఆయన అంచనా వేస్తున్నారు.
అయితే ఐఎంఎఫ్ కేంద్రంగా పాకిస్తాన్ రాజకీయాలు చేయడం మంచిది కాదని సాజిద్ అన్నారు.
‘‘గతంలో కూడా ఇలాగే రాజకీయాలు చేసింది. ఇప్పుడు అదే చేస్తోంది. ఐఎంఎఫ్‌ను సాయం అడగాల్సిన పరిస్థితులు ఉంటే వెళ్లి అడగాలి. అంతే కానీ పుకార్లకు చోటు ఇవ్వకూడదు’’ అని ఆయన సూచించారు.
‘పాకిస్తాన్ అనే పేషెంట్‌కు ఊపిరి పోసే డాక్టరే ఐఎంఎఫ్’ అని పాకిస్తాన్ ఆర్థికశాఖ మాజీ ప్రతినిధి డాక్టర్ ఖాకన్ నజీబ్ అన్నారు.
పాకిస్తాన్ దివాలా తీయకుండా ప్రపంచంలో ఐఎంఎఫ్ మాత్రమే కాపాడగలదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
‘ఐఎంఎఫ్ ప్రోగ్రాం చాలా కీలకం’
గత ఏడాది నవంబరులో జరగాల్సిన ఐఎంఫ్ ప్రోగ్రాం సమీక్ష రెండు నెలలపాటు వాయిదా పడింది. ఆ సమీక్ష జరిగితే నిధులు రావడం మొదలవుతుందని నజీబ్ తెలిపారు.
‘రాబోయే ఆరు నెలల పాటు ఐఎంఎఫ్ ప్రోగ్రాం చాలా కీలక మైనది. ఐఎంఎఫ్ సమీక్షకు సంబంధించిన సమస్యలను పాకిస్తాన్ విజయవంతంగా పరిష్కరించుకోగలిగితే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. స్టాక్ మార్కెట్‌లోకి నిధులు వస్తాయి. కరెన్సీ మార్కెట్స్, క్రెడిట్ మార్కెట్స్‌లో పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తాయి.
ఐఎంఎఫ్ నుంచి తాము ఏం కోరుకుంటున్నారో పాకిస్తాన్ పాలకులకు స్పష్టత ఉండాలి. వరదలతో కలిగిన భారీ నష్టం తరువాత దేశాభివృద్ధి ఎలా ఉంటుంది? ఈ విషయం గురించి ఐఎంఎఫ్‌కు స్పష్టంగా పాకిస్తాన్ చెప్పగలగాలి’ అని నజీబ్ అన్నారు.
‘విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, దిగుమతులు తగ్గించి ఎగుమతులు పెంచుకోవడం, ఫారిన్ ఎక్స్ఛేంజ్ రిసిప్ట్స్ వంటి వాటి ద్వారా పరిస్థితిని కాస్త మెరుగుపరచుకోవచ్చు. కానీ ఇంత తక్కువ సమయంలో అది సాధ్యం కాదు.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం ఉన్నందున ఎగుమతులు పెంచుకోవడం అంత సులభం కాదు. ప్రస్తుతం విదేశీ పెట్టుబడులు రావడం లేదు’ అని సాజిద్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
డాలర్లు ఉన్నా ఖర్చు పెట్టలేరు
అప్పులు తీర్చడానికి లేదా దిగుమతి చేసుకునే వస్తువులకు చెల్లింపులు చేయడానికి దేశాలు విదేశీ మారకపు నిల్వలను ఉపయోగిస్తుంటాయి.
పాకిస్తాన్ విషయంలో డాలర్లు ఎక్కువగా మిత్ర దేశాల నుంచి వస్తున్నాయి.
కానీ ఆ మిత్ర దేశాలు ఇచ్చే డాలర్లతో పాకిస్తాన్ అప్పులు తీర్చడానికి లేదు. వస్తువులు కొనకూడదు. మరి వాటి వల్ల ఉపయోగం ఏమిటి? అంటే...
‘‘పాకిస్తాన్ కరెన్సీ విలువ పడిపోకుండా చూసేందుకు మిత్రదేశాలు ఆ డాలర్లను ఇచ్చాయి. పాకిస్తాన్ వద్ద ఒక్క డాలర్ కూడా లేకపోతే దాని కరెన్సీ అయిన రూపాయి చాలా ఒత్తిడికి లోనవుతుంది. రూపాయి విలువ పడిపోతే మార్కెట్‌లో దాని మీద నమ్మకం పోతుంది. ఈ పరిస్థితి రాకుండా చూసేందుకు మిత్ర దేశాలు బిలియన్ డాలర్లను పాకిస్తాన్ వద్ద ఉంచుతున్నాయి.
ఆ డాలర్లను చూసి ఐఎంఎఫ్ వంటి సంస్థలు మరింత సాయం చేస్తాయని పాకిస్తాన్ భావిస్తోంది’’ అని సాజిద్ వివరించారు.
ఇవి కూడా చదవండి:
- కాపు రిజర్వేషన్లు: కేంద్రం ప్రకటనలో మతలబు ఏమిటి? బీజేపీ వ్యూహం ఏమిటి?
- మోదీ ప్రధాని అవుతారని హీరాబెన్ 2002లోనే చెప్పారా?
- 2022లో మరిచిపోలేని 5 అత్యంత దారుణ హత్యలు ఇవే...
- అమెరికా మహిళల క్రికెట్ జట్టులో సగం మంది తెలుగు అమ్మాయిలే...
- ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీలు ఇరుకు సందులు, రోడ్లపైనే సభలు ఎందుకు పెడుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















