కనీస వేతనాలతో జీవిస్తున్న మహిళలు 2022లో ఏమేం వదులుకున్నారు?

జీవన వ్యయం
    • రచయిత, జమిలి రిబేరో బాస్టోస్ డొ కార్నో
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది మహిళలు కనీస వేతనాలకు లేదంటే అంతకన్నా తక్కువ వేతనాలకు పనిచేస్తున్నారు.

జీవన వ్యయం పెరగటం కారణంగా... ఆ మహిళలకు ఏడాది కిందట అందుబాటులో ఉన్న చాలా సౌకర్యాలు ఇప్పుడు అందుబాటులో లేకుండా పోయాయి.

పెరిగిన ఖర్చు వల్ల జీవితంలో కొన్నింటిని వదులుకోవాల్సిన నాలుగు దేశాల మహిళలతో మేం మాట్లాడాం.

అలాగే, స్థానిక ప్రభుత్వ విధానంలో మార్పు వల్ల ఆదాయం పెరిగిన మరొక దేశపు మహిళతో కూడా మేం మాట్లాడాం. వారు ఏమన్నారో చూడండి.

వాషింగ్ లిక్విడ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జుసారా బసెలో తన ఇంట్లో సబ్బులు, డిటర్జెంట్లు కొనటం మానేసి, తయారు చేసుకుంటున్నారు

‘సబ్బులు కొనడం లేదు... తయారు చేసుకుంటున్నాం’

జుసారా బసెలో బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో నివసిస్తున్నారు. తను షాపింగ్ వెళ్లినపుడు ఏడాది కిందటి కన్నా సగం వస్తువులనే కొనగలుగుతున్నానని ఆమె చెప్పారు.

ఈ పరిస్థితుల్లో తను కొనటం మానేసిన వస్తువుల్లో ఇంట్లో శుభ్రత కోసం ఉపయోగించే సోపులు, డిటర్జెంట్లు వంటివి ఒకటి అని ఆమె తెలిపారు.

బాగా వేయించిన నూనెను పారవేయకుండా, దానిని తన పొరుగున నివసించే ఒక వ్యక్తికి ఇచ్చి దానితో సోప్ తయారు చేయించుకుంటున్నారు.

‘‘నేను వంటకు ఉపయోగించే నూనె ఇక పనికిరాదని భావించినపుడు.. ఆ నూనెను ఒక ప్లాస్టిక్ బాటిల్‌లో పోసి, సోప్ తయారు చేయటం కోసం ఒక ఫ్రెండ్‌కు ఇస్తాను’’ అని ఆమె చెప్పారు.

  • కనీస వేతనం: 1,212 రియాల్స్ (రూ. 18,600) నెలకు
  • చివరిసారి వేతన పెంపు: 2021 డిసెంబర్‌ (10 శాతం పెరిగింది) ఈ నెలలో మళ్లీ జీతం పెరగాల్సి ఉంది
  • వార్షిక ద్రవ్యోల్బణం: 5.9 శాతం 2022 నవంబర్‌లో

ఆమె ఫ్రెండ్ ఒక రీసైక్లింగ్ కంపెనీలో పనిచేస్తూ ఈ కిటుకు నేర్చుకున్నారు. చిప్స్, చికెన్ వంటి వేపుళ్ల కోసం ఉపయోగించిన నూనెలో ఆల్కహాల్, కాస్టిక్ సోడాలతో పాటు, సువాసన ద్రవ్యాలను కొనితెచ్చి కలుపుతారు.

‘‘ఘాటైన కాస్టిక్ సోడా వాసన పోవటానికి ఆమె సువాసన ద్రవ్యం కలుపుతుంది’’ అని జుసారా తెలిపారు.

జుసారా ఒక ఇంజనీరింగ్ సంస్థలో క్లీనర్‌, కుక్‌గా పనిచేస్తున్నారు. ఆమె నెల జీతం బ్రెజిల్‌లో కనీస వేతనమైన 1,212 రియాళ్లు. అందులో పెన్షన్ కత్తిరింపులు ఉంటాయి. ఈ జీతంతో ఏడాది కిందట ఆమె తన చిన్నకొడుకును తీసుకుని సినిమాకు కూడా వెళ్లగలిగేవారు. ఇళ్లులేని వారికి అప్పుడప్పుడు ఏవైనా ఆహారాలు కూడా పట్టుకెళ్లి ఇవ్వగలిగేవారు. కానీ ఇప్పుడవేవీ చేయలేకపోతున్నానని ఆమె చెప్పారు.

‘‘ఇప్పుడు నేను ఎవరికైనా అలా సాయం చేస్తే, ఇంట్లో నాకు తిండి లేకుండా పోతుంది’’ అన్నారామె.

మొక్కజొన్నలు

ఫొటో సోర్స్, Getty Images

‘మొక్కజొన్నలు దంచి జావ చేసి పిల్లలకు పెడుతున్నా’

నైజీరియాలో నివసించే రెబెకా ఒగ్బొనా.. టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆమె తన పిల్లలకు చాలా ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్ సెరియల్ తినిపించి ఏడు నెలలు అవుతోంది.

వార్షిక ద్రవ్యోల్బణం 23 శాతంగా ఉన్నట్లు అక్టోబర్‌లో అంచనా వేశారు.

‘‘ఏడాది కిందట 1,000 నాయిరాలకు (రూ. 185) కొన్న వస్తువులకు ఇప్పుడు 3,000 నాయిరాల కన్నా ఎక్కువ ఖర్చవుతోంది’’ అని రెబెకా చెప్పారు.

అంటే.. తన నలుగురు పిల్లలకు చాలా ఇష్టమైన ‘గోల్డెన్ మామ్’ సెరియల్‌ను ఆమె కొనలేరు. నెస్లే కంపెనీ తయారు చేసే మొక్కజొన్న జావ ఇది. ఆమె పిల్లలు రోజూ స్కూలుకు వెళ్లే ముందు ఈ జావ తిని వెళ్లేవారు.

ఇప్పుడు రెబెకా తనే సొంతగా మొక్కజొన్న జావ తయారు చేస్తున్నారు.

‘‘మొక్కజొన్న పొత్తులు, బీన్స్ తీసుకొస్తాను. వాటిని పిండి చేసి, ఇంట్లో నానబెడతాను’’ అని ఆమె వివరించారు.

  • కనీస వేతనం: 30,000 నాయిరాలు (రూ. 5,800) నెలకు, కొన్ని రాష్ట్రాల్లో ఇంకాస్త ఎక్కువగానే ఉంది
  • చివరిసారి పెంపు: 2019లో
  • వార్షిక ద్రవ్యోల్బణం: 2022 నవంబర్‌లో 21.5 శాతం

కానీ ఆమె సొంతంగా తయారుచేసిన ఈ బ్రేక్‌ఫాస్ట్ ఆమె పిల్లలకు అంతగా ఇష్టంలేదు.

‘‘ఇది తయారు చేసి ఇవ్వటం మొదలుపెట్టినపుడు.. ‘నాకు బాగోలేదు. ఇదింక నేను తినలేను’ అని పిల్లలు చెప్పేవాళ్లు. కానీ వారు తినాల్సి వచ్చింది’’ అని రెబెకా తెలిపారు.

ఆమె టీచర్‌గా పనిచేస్తున్నారు. నైజీరియా కనీస వేతనం 45,000 నాయిరాల కన్నా (రూ. 8,270) ఒకటిన్నర రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారు. అయినా కూడా తన కుటుంబం గడవటానికి సరిపోవటం లేదని ఆమె చెప్తున్నారు.

‘‘నెల చివరికి రాకముందే ఇంట్లో అన్నీ అడుగంటిపోతున్నాయి’’ అన్నారామె.

దుస్తులు

ఫొటో సోర్స్, Getty Images

‘డబుల్ షిఫ్టులు పని చేస్తూన్నా కొత్త బట్టలు కొనలేకపోతున్నా’

ఈక్వెడార్‌కు చెందిన 56 ఏళ్ల జెస్సికా రాకోమ్ లండన్‌లో నివసిస్తున్నారు. ఒక ఆన్‌లైన్ రిటైల్ గిడ్డంగిలో క్లీనర్‌గా పనిచేస్తున్నారు. ఆమె వేతనం గంటకు 9.50 పౌండ్లు (రూ. 950). ఏడాది కిందట ఈ వేతనంతో ఆమె సరిపెట్టుకోగలిగేవారు. కానీ ఇప్పుడు ఎక్కువ గంటలు పనిచేస్తున్నా కానీ ఇబ్బందులు తప్పటం లేదు.

‘‘పనిచేయటానికి తగినంత మంది జనం లేరు. దీంతో నా షిఫ్టులను రెట్టింపు చేస్తున్నారు. నేను అంగీకరిస్తున్నాను. ఎందుకంటే అన్నీ చాలా ఖరీదైపోయాయి’’ అని జెస్సికా తెలిపారు.

‘‘రోజుకు 15 నుంచి 16 గంటలు పని చేస్తున్నాను. ఎంతగా అలసిపోతానో ఊహించుకోవచ్చు’’ అన్నారామె.

ఆమె ఇంత పనిచేశాక విశ్రాంతి తీసుకోవటం కూడా ఈజీ కాకుండా పోయింది. ఎందుకంటే పాతబడిపోయిన పరుపు వల్ల వెన్నునొప్పి వస్తోంది. కొత్తది కొనుక్కునే స్తోమత ఆమెకు లేదు.

‘‘గత ఏడాది వరకూ అప్పు మీద కొనుక్కుని, చిన్న చిన్న వాయిదాలుగా కట్టగలిగేదాన్ని. కానీ ఇప్పుడు నేను ఎంత పని చేసినా అద్దె కట్టటానికి, సరకులు కొనటానికి సరిపోతోంది. ఏమీ మిగలటం లేదు’’ అని వివరించారు.

  • కనీస వేతనం 9.50 పౌండ్లు (రూ. 950) గంటకు
  • చివరిసారి పెంపు: 2022 ఏప్రిల్ (6.6 శాతం) మళ్లీ ఏప్రిల్‌లో 9.7 శాతం పెరగాల్సి ఉంది
  • వార్షిక ద్రవ్యోల్బణం: 10.7 శాతం - 2022 నవంబర్‌లో

అంటే.. ఆమె కొత్త బట్టలు కూడా కొనుక్కోలేకపోతున్నారు. ఆమెకు ఉన్న దుస్తులు పాతబడి పాడైపోతున్నాయి.

అధిక పని, ఒత్తిడికి సంబంధించిన సమస్యలతో పలుమార్లు ప్రమాద, అత్యవసర విభాగాలకు కూడా వెళ్లివచ్చానని జెస్సికా తెలిపారు.

‘‘నన్ను ఉద్యోగం మారాలని వాళ్లు సూచించారు. కానీ నా వయసులో ఉన్న వాళ్లకు అది సులభం కాదు’’ అంటున్నారామె.

రైలు ప్రయాణం

ఫొటో సోర్స్, Getty Images

‘పుట్టినరోజు వేడుకలకు వెళ్లడానికీ డబ్బులు లేవు’

ఉత్తర కొరియాకు చెందిన 29 ఏళ్ల డా వూన్ జోంగ్ సూపర్ మార్కెట్‌లో పనిచేస్తున్నారు.

ఆమె తన తల్లిదండ్రులను కలవటానికి తన ఊరు వెళ్లటం మానేశారు.

ఆమె ఇప్పుడు రాజధాని సోల్ నగరంలో నివసిస్తున్నారు. అక్కడి నుంచి తన ఊరికి వెళ్లిరావటానికి 1,50,000 వాన్లు (రూ. 9,500) ఖర్చవుతాయి. గత ఏడాది కాలంగా ఆమె దగ్గర అంత డబ్బు మిగలలేదు.

‘‘మా అమ్మానాన్న పుట్టినరోజులు, నా పుట్టిన రోజుల వంటి సందర్భాల్లో వాళ్ల దగ్గర ఉండాలని ఉంటుంది. కానీ నేను వెళ్లలేకపోతున్నాను. అది బాధ కలిగిస్తుంది’’ అని ఆమె చెప్పారు.

సూపర్‌మార్కెట్ ధరలు పెరగటం మాత్రమే కాదు, వడ్డీ రేట్లు పెరగటం వల్ల కూడా ఆమె ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం చూపింది. తన ఫ్లాట్‌కు డిపాజిట్ కట్టటానికి ఆమె అప్పు తీసుకున్నారు. ఆ అప్పు తీర్చటానికి చెల్లించే నెల వారీ వాయిదాలు పెరిగిపోయాయి.

  • కనీస వేతనం: 9,160 వాన్లు (రూ. 560) గంటకు
  • చివరి సారి పెరిగింది: జనవరి 2022 (5 శాతం), మళ్లీ వచ్చే జనవరిలో 5 శాతం పెరగాల్సి ఉంది
  • వార్షిక ద్రవ్యోల్బణం: 5 శాతం – 2022 నంబవర్‌లో

‘‘ఇప్పుడు నేను కేవలం బతకటం కోసం పనిచేస్తున్నాను. ఇంతకుముందు నా తల్లిదండ్రులకు ఇవ్వటానికి కొన్ని డబ్బులు దాచగలిగేదాన్ని. కానీ ఈ ఏడాది అత్యవసర పరిస్థితుల కోసం, మా అమ్మానాన్నకు సాయం చేయటం కోసం దాచుకున్న డబ్బులన్నీ రోజు వారీ ఖర్చుల కోసమే అయిపోయాయి’’ అని వెల్లడించారు.

ప్రభుత్వం 2022లో కనీస వేతనాన్ని గంటకు 9,160 వాన్లకు (రూ. 560) పెంచింది. కానీ ధరలు అంతకన్నా వేగంగా పెరిగిపోయాయని ఆమె తెలిపారు.

‘‘ప్రభుత్వం, పేదలకు సాయం చేయటం కోసం సంపన్నుల నుంచి మరిన్ని పన్నులు వసూలు చేయాలి’’ అంటున్నారామె.

ఉపాధి హామీ పథకం

ఫొటో సోర్స్, Getty Images

‘ఎక్కువ పని చేస్తున్నాం, ఎక్కువ సంపాదిస్తున్నాం’

భారతదేశంలోని ఒడిషాలో నివసించే ఫార్బని ఛూరా వయసు 40 ఏళ్లు. ఆమె పనిచేసే ప్రతి రోజూ 333 రూపాయలు (4 డాలర్లు) సంపాదిస్తున్నారు. ఆ రాష్ట్రంలో నైపుణ్యంలేని వ్యవసాయ కూలీ కనీస వేతనం అది.

ఆ డబ్బు పెద్ద మొత్తమేమీ కాదు. కానీ ఆమెకు, ఆమె భర్తకు కనీసం పని దొరుకుతుందన్న భరోసా ఉంది.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నమోదు చేసుకున్న కార్మికులకు ఏడాదికి కనీసం 100 రోజులు వేతనంతో పని కల్పిస్తారు. అయితే ఫార్బని నివసించే ప్రాంతం నుంచి వలసలను తగ్గించటానికి రాష్ట్ర ప్రభుత్వం ఆ పని రోజులను 2020లో 200 రోజులకు, 2022 జూలైలో 300 రోజులకు పెంచింది.

దేశవ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా కార్మికులు ఈ పథకం కింద క్రియాశీలంగా పనిచేస్తున్నట్లు చెప్తున్నారు. ఒడిషాలో నాలుగు పశ్చిమ జిల్లాల్లో మాత్రమే ఏడాదికి 300 రోజుల పని హామీ అమలు చేస్తున్నారు. ఆ జిల్లాల్లో ఒకటైన బాలంగిర్ జిల్లాలో ఫార్బని నివసిస్తున్నారు.

  • కనీస వేతనం: ఒడిషాలో నైపుణ్యం లేని పనికి రోజుకు 333 రూపాయలు (4 డాలర్లు)
  • చివరిసారి పెంపు: ఒడిషాలో 2022 మే (3 శాతం), అక్టోబర్ (2 శాతం)
  • వార్షిక ద్రవ్యోల్బణం: 5.9 శాతం – 2022 నవంబర్‌లో

‘‘మార్కెట్‌లో గత ఆర్నెల్లలో కూరగాయలు, పప్పుల ధరలు చాలా పెరిగిపోయాయి. కానీ ఇప్పుడు మాకు పని ఉంది. కాబట్టి ధరలు పెరిగినా కొనుక్కోగలుగుతున్నాం’’ అని ఫార్బని చెప్పరు. ఆమె ఇద్దరు పిల్లలు ఆ పక్కనే ఆడుకుంటున్నారు.

నిజానికి తాను ఇప్పుడు తన తాతకు మందులు కొనటానికి మైక్రోఫైనాన్స్ బ్యాంక్ నుంచి అప్పు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదని ఆమె చెప్పారు.

‘‘ఎక్కువ కూలీలు వస్తుండటంతో ఆ అప్పులు కూడా తీర్చగలుగుతున్నాం’’ అన్నారామె.

ద్రవ్యోల్బణం అంకెలు Tradingeconomics.com నుంచి తీసుకున్నవి

ఇవి కూడా చదవండి: