షాక్‌లో జపాన్ ప్రజలు: పెరిగిన నిత్యావసరాల ధరలు.. 30 ఏళ్లలో ఇదే తొలిసారి
టోక్యో నుంచి బీబీసీ ప్రతినిధి మరీకో ఓయ్ అందిస్తున్న కథనం.
పెరుగుతున్న ధరలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయపెడుతున్నాయి. జపాన్‌లోనైతే కొన్ని దశాబ్దాలుగా జనాలకు ధరలు స్థిరంగా ఉండటం, లేదా తగ్గటం మాత్రమే తెలుసు. ఇప్పుడు ముప్పయ్యేళ్లలో మొదటిసారి అక్కడ ద్రవ్యోల్బణం పెరగటంతో ప్రజలు షాక్ తిన్నారు.
సెంట్రల్ టోక్యోకు 30 నిమిషాల దూరంలో ప్రశాంతంగా ఉండే ఓ నివాస ప్రాంతం.
టకాకో కుటుంబం నడిపే ఫుడ్ స్టాల్... ఇక్కడి గృహిణులకు కొన్ని దశాబ్దాలుగా సుపరిచితం.
వీళ్లకు గుర్తున్నంత వరకూ ఈ దుకాణంలో ధరలు ఎన్నడూ పెరగలేదు.
''ఇప్పుడు మేం క్రియేటివ్‌గా ఉండాలి. కూరగాయల ధరలు బాగా పెరిగిపోతే మేం మరింత సీవీడ్ (సముద్ర నాచు) ఉపయోగిస్తాం. ప్రజల వేతనాలేమీ పెరగలేదు కాబట్టి పెరిగిన ధరలకు అనుగుణంగా మమ్మల్ని మేం మల్చుకునేందుకు శక్తిమేరకు ప్రయత్నిస్తున్నాం'' అని వాకో స్టోర్ యజమాని టకాకో ఇమూరా బీబీసీతో అన్నారు.
ఇటీవలి చరిత్రలో ఇలా ధరలు పెంచింది ఒక్క వ్యాపారులు మాత్రమే కాదు.
40 ఏళ్లకు పైగా ఇక్కడ కార్న్ స్నాక్ ధర 10 యెన్‌లే ఉండేది. ఇప్పుడు 12 యెన్‌లు. అంటే రెండు శాతం పెరిగిందన్న మాట. ఇది పెద్ద పెరుగుదలేం కాదు గానీ జపాన్‌లో ధరలు పెరగటం అనేది చాలా పెద్ద విషయం. దానికి ఒక కారణం.... 1990ల తర్వాత ఇక్కడ జనాలకు వేతనాలు కూడా ఎన్నడూ పెరగలేదు. అంతకన్నా ముఖ్యంగా, సామాజిక బాధ్యతలను పరస్పరం పంచుకోవడాన్ని ఇక్కడి సమాజం ఇష్టపడుతుంది. కాబట్టి ఇలా ధరలు పెంచడం అనేది సాంస్కృతికంగానే పొసగని విషయం. అందుకే, ఈ స్నాక్ తయారు చేసే కంపెనీ... ధర ఎందుకు పెంచాల్సి వచ్చిందో వివరిస్తూ ఒక యాడ్ క్యాంపెయిన్ కూడా ప్రారంభించింది.
జపాన్‌లో దాదాపు దశాబ్దకాలంగా మొదలైన ద్రవ్యోల్బణం ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 2 శాతానికి చేరుకుంది.
అయితే, దీనికి వినియోగదారుల డిమాండ్‌కన్నా ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ధరలే ప్రధాన కారణం. కానీ ఈ స్థాయి ద్రవ్యోల్బణాన్ని జపాన్ తట్టుకోగలదా అని ఇక్కడ చాలా మంది ప్రశ్నిస్తున్నారు.
''ఎకానమీలో స్థిరమైన పాజిటివ్ ఔట్‌లుక్ సాధించాలనేది లక్ష్యం. తద్వారా జనం ఎక్కువ ఖర్చు చేయాలి, మరింత ఇన్వెస్ట్ చేయాలి. పెరిగే ధరలకు అనుగుణంగా వేతనాలు కూడా పెరగాలి. అయితే, పెరుగుదల స్వల్పంగానే ఉండాలి, విచ్చలవిడిగా కాదు. అప్పుడే మూడు దశాబ్దాలుగా పీడిస్తున్న డిఫ్లేషనరీ చక్రంలోంచి జపాన్ బయటపడగలుగుతుంది'' అని ఈవై - పార్థెనాన్ కి చెందిన నొబుకో కోబయాషి బీబీసీతో అన్నారు.
సుంటోరీ హోల్డింగ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టకేషి నీనామి మాట్లాడుతూ.. ''సమాజం నుంచీ, ప్రభుత్వం నుంచీ వేతనాలు పెంచాలనే ఒత్తిడి చాలా వస్తోంది. కానీ మేం ఉత్పాదకతను పెంచాల్సిన అవసరం ఉంది'' అన్నారు.
జపాన్‌లోని అతి పెద్ద పానీయాల తయారీదారు కంపెనీ సుంటోరీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టకేషి నీనామి... ఇక్కడి వ్యాపార సంస్థలు ఎదుర్కొంటున్న చిక్కు సమస్యేంటో చెప్పారు.
''ఇప్పటికిప్పుడే ఉత్పాదకతను పెంచాలంటే మాకు చాలా కష్టం. మేం దానిపై పని చేస్తున్నాం. కానీ ఒకే పరిశ్రమలో పరస్పరం పోటీ పడే భాగస్వాములు ఇక్కడ చాలా మంది ఉన్నారు.''
ఈ సమస్య జపాన్‌ను కొన్ని దశాబ్దాలుగా పట్టి పీడిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అధికధరలు కొనసాగే పరిస్థితి ఉన్నందున, ఈ చక్రాన్ని ఛేదించుకోవడానికి జపాన్‌కు సమయం సరిపోకపోవచ్చు. కాబట్టి వినియోగదారులకు కష్టాలు తప్పవనే అనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- మ్యాపుల్లో ఉత్తరం దిక్కునే పైభాగంలో చూపుతారెందుకు? నార్త్ అంటే ఆధిపత్యమా? పేదవాళ్లంతా సౌత్‌లోనే ఉంటారా?
- జగ్గీ వాసుదేవ్: ‘ధ్వంసమైన ఆలయాలన్నీ పునర్నిర్మించలేం, అలా చేయాలంటే దేశమంతా తవ్వుకుంటూ రావాలి’
- Viagra: మహిళల్లో సెక్స్ కోరికలు పెంచే ‘వయాగ్రా’ను తయారుచేయడం ఎందుకంత కష్టం
- పిల్లల ఉన్నత విద్య ఖర్చుల కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
- 'మాది ప్రపంచంలోనే సూపర్ సైన్యం అనుకున్నా. కానీ..' - యుక్రెయిన్ యుద్ధంలో పాల్గొన్న రష్యా సైనికుడి అనుభవాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)