ప్రియుడు చేసిన నేరానికి.. ఉరికంబం ఎక్కిన భార్య – వందేళ్ల కిందటి తీర్పుపై ఇప్పటికీ చర్చ

ఫొటో సోర్స్, RENÉ WEIS
- రచయిత, టిమ్ స్టోక్స్
- హోదా, బీబీసీ న్యూస్
ఎడిథ్ థాంప్సన్, ఆమె ప్రియుడు ఫ్రెడరిక్ బైవాటర్స్‌లను 1923 జనవరి 9న ఉరి తీశారు.
ఎడిథ్ థాంప్సన్ భర్తను హత్య చేసిన కేసులో వీరిద్దరికీ ఉరిశిక్ష పడింది.
ఆయన కత్తిపోట్లకు గురవుతాడని ఆమెకు కూడా తెలుసనడానికి ఎలాంటి ఆధారం లేనప్పటికీ ఆమెను దోషిగా నిర్ధరించి ఉరితీయడంపై సుమారు శతాబ్ద కాలం తరువాత ఇప్పటికీ చర్చ నడుస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
1923 జనవరి 9న ఉదయం ఎడిథ్ థాంప్సన్‌ను ఉంచిన లండన్‌లోని హోలోవే జైలు గది దగ్గరకు ఉరితీసే తలారి, ఆయన సహాయకులు వచ్చారు.
అప్పటికే మత్తు ఇంజెక్షన్లు ఇవ్వడంతో స్పృహ లేకుండా పడి ఉన్న 29 ఏళ్ల ఎడిథ్ వారి ముందు ఉంది. అక్కడి నుంచి ఆమెను ఉరి తీసే షెడ్ దగ్గరకు తీసుకెళ్లారు. కొన్ని నిమిషాల్లోనే ఆ పనంతా పూర్తయిపోయింది. ఆమె నిర్జీవంగా వేలాడింది.
అదే సమయంలో అక్కడికి అర మైలు దూరంలో ఉన్న పెంటన్‌విలే జైలులో ఆమె ప్రేమికుడు 20 ఏళ్ల ఫ్రెడ్డీ బైవాటర్స్‌నూ తలారులు ఉరి తీశారు.
అక్కడికి మూడు నెలల కిందట ఎడిథ్ భర్త పెర్సీని ఫ్రెడ్డీ కత్తితో పొడిచిపొడిచి చంపాడు. పెర్సీ, ఎడిథ్‌లు థియేటర్‌కు వెళ్లి వస్తుండగా ఫ్రెడ్డీ దాడి చేసి పెర్సీని చంపాడు.
అయితే.. తాను కత్తితో దాడి చేస్తానన్న విషయం ఎడిథ్‌కు తెలియదని ఫ్రెడ్డీ విచారణలో పదేపదే చెప్పాడు.
అయినప్పటికీ ఫ్రెడ్డీతో పాటు ఎడిథ్‌కూ ఉరిశిక్ష పడింది.

ఫొటో సోర్స్, RENÉ WEIS
నవలా రచయిత, స్క్రీన్ రైటర్ ఎడ్గర్ వలాస్ ఈ ఉదంతంపై వ్యాఖ్యానిస్తూ.. ‘ఈ దేశంలో చిన్న సాక్ష్యం కూడా లేనప్పటికీ అవగాహన లేనివారు పక్షపాతంతో ఎవరికైనా ఉరిశిక్ష వేశారంటే అది ఎడిథ్ థాంప్సన్‌కే’ అన్నారు.
శ్రామికవర్గ మహిళలు ఎలాంటి జీవితం గడపాలని అప్పటి సమాజం అనుకుందో అందుకు భిన్నమైన జీవితాన్ని ఎడిథ్ గ్రేడాన్ (థాంప్సన్) కోరుకున్నారు.
1893లో డిసెంబర్ 25న క్రిస్మస్ రోజున తూర్పు లండన్ శివారులోని మేనర్ పార్క్ ప్రాంతంలో ఎడిథ్ జన్మించారు. అయిదుగురు పిల్లల్లో ఆమే అందరి కంటే పెద్ద. తన చెల్లెలు, ముగ్గురు తమ్ముళ్ల బాగోగులు చూడడంలో తల్లికి సహకరించేవారు ఎడిథ్.
స్కూలు చదువు పూర్తి చేసుకున్న తరువాత ఉద్యోగం కోసం లండన్ నగరానికి వెళ్లిన ఆమె కార్ల్‌టన్ అండ్ పామర్ సంస్థలో చేరారు. ఆక్కడ ఆమె చాలావేగంగా ఎదుగుతూ సంస్థ ‘చీఫ్ బయ్యర్’గా నియమితులయ్యారు.
ఈ కేసు గురించి రెండు పుస్తకాలు రాసిన రచయిత లారా థాంప్సన్.. ‘ఎడిథ్ థాంప్సన్ సాధారణ మహిళే కానీ అసాధారణంగా ఉండాలని తపించేవారు’ అన్నారు.

ఫొటో సోర్స్, RENÉ WEIS
1916 జనవరిలో ఎడిథ్ షిప్పింగ్ క్లర్క్ పెర్సీ థాంప్సన్‌ను పెళ్లాడారు.
ఇద్దరూ కలిసి ఇల్‌ఫోర్డ్‌లోని కెన్సింగ్టన్ గార్డెన్స్‌లో ఇల్లు కొన్నారు. తన భర్త కంటే, తండ్రి కంటే ఎక్కువ జీతం సంపాదించే ఎడిథ్ ఆ ఇంటి కొనుగోలు వ్యయంలో సగం కంటే ఎక్కువ తానే భరించారు. అయితే.. ఇల్లు మాత్రం పెర్సీ థాంప్సన్ పేరిటే రిజిష్టరైంది.
ఎడిథ్ మంచి డ్యాన్సర్.. లండన్‌లోని విలాసవంతమైన హోటల్‌లు, డ్యాన్స్ హాల్స్‌లో నైట్ లైఫ్‌ను ఆమె ఎంజాయ్ చేసేవారు.
వెస్ట్‌ఎండ్ థియేటర్లు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లలో స్నేహితులతో కలిసి ఆమె గడిపేవారు.
అప్పటి సంప్రదాయాలను అనుసరించి బతకడం ఎడిథ్‌కు ఇష్టం లేదు. ఆమె అందరిలాంటి సాధారణ భార్య కాదు. ఆమెకు తకంటే ఎనిమిదేళ్లు చిన్నవాడైన ఒక ప్రియుడు ఉండేవాడు.
ఫ్రెడ్డీకి ఎడిథ్ కుటుంబం గురించి తెలుసు. ఎడిథ్ తమ్ముళ్లలో ఒకరితో కలిసి ఫ్రెడ్డీ చదువుకున్నాడు. ఆయన తన 13 ఏళ్ల వయసులో మర్చంట్ నేవీలో జాయిన్ కావడానికి లండన్ విడిచివెళ్లాడు.
1921 జూన్‌లో పెర్సీ, ఎడిథ్, ఆమె సోదరి అవీస్ గ్రేడాన్‌లతో కలిసి వారం రోజులు ఉండేందుకు ఆయన్ను ఆహ్వానించారు.
ఆ వారం రోజులు పూర్తయ్యేసరికి ఫ్రెడ్డీ, ఎడిథ్‌ల మధ్య ప్రేమ మొదలైంది.
దాంతో పెర్సీతో గొడవ జరిగి ఫ్రెడ్డీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
పెర్సీ చాలాసార్లు తన భార్య ఎడిథ్ పట్ల దురుసుగా ఉండేవారు. ఈ గొడవ సమయంలో ఎడిథ్‌ను పెర్సీ గదిలో విసిరికొట్టడంతో ఆమె గాయపడ్డారు.
ఫ్రెడ్డీ దూరంగా ఉండడంతో ఇద్దరూ ఒకరికొకరు లేఖలు రాసుకునేవారు. అయితే.. ఆ లేఖలను చదివేసిన తరువాత ఎడిథ్ భర్తకు తెలియకుండా వాటిని చించేసేవారు.

ఫొటో సోర్స్, RENÉ WEIS
ఎడిథ్ థాంప్సన్ కేసుపై పుస్తకం రాసిన లారా థాంప్సన్ ఈ లేఖలను క్షుణ్ణంగా పరిశీలించారు. ‘అవన్నీ చాలా ప్రత్యేకమైనవని.. అందులో ఎడిథ్ తనను తాను మరోరకంగా ఆవిష్కరించుకున్నారని.. ఆమె చాలా ఎక్స్‌ప్రెసివ్’ అని లారా చెప్పారు.
ఎడిథ్ లేఖల్లో ఉద్వేగాలు కనిపిస్తాయి.. వాస్తవాలు, ఊహలు అన్నీ ఉంటాయి.. ఒక లేఖలో ఆమె తన దైనందిన జీవితంలోని విషయాలన్నీ చెప్పడంతో పాటు సెక్స్, అబార్షన్, ఆత్మహత్యలు వంటి తన ఆలోచనలన్నీ రాసినట్లు లారా చెప్పారు.
కాల్పనిక సాహిత్యాన్ని ఎక్కువగా చదివే ఎడిథ్ అలాంటి నవలలోని పాత్రలను ఊహించుకున్నట్లుగా కొన్ని లేఖలలో ఉంది. వాటిలో ఆమె పెర్సీని ఎలాగైనా వదిలించుకోవాలని, ఆయన తినే ఆహారంలో గాజు ముక్కలు కలిపి చంపాలనిపిస్తోందని రాశారు.
ఓ లేఖలో ఆమె ఇలా రాశారు.. ‘నిన్న ఓ మహిళను కలిశాను. ఆమె ముగ్గురు భర్తలు చనిపోయారు. ఇద్దరు నీటిలో మునిగి చనిపోయారు. ఇంకొకరు ఆత్మహత్య చేసున్నారు. అదేంటో... కొందరికి మాత్రం ఉన్న ఒక్క భర్త కూడా చనిపోడు. ఎంత అన్యాయం ఇది’ అని ఆ లేఖలో ఆమె రాశారు.
దశాబ్దాల పాటు ఈ కేసును అధ్యయనం చేసిన యూనివర్సిటీ కాలేజ్ లండన్ ప్రొఫెసర్ రెనే వీస్ దీనిపై మాట్లాడుతూ.. ఈ లేఖలలో మితిమీరిన శృంగార ఊహలు తప్ప ఇంకేమీ లేదన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పెర్సీని ఫ్రెడ్డీ ఎలా చంపాడు?
బెల్‌గ్రేవ్ రోడ్‌లో 1922 అక్టోబర్ 3న పెర్సీపై దాడి చేసి హత్య చేయడానికి ముందు ఫ్రెడ్డీ అక్కడికి సమీపంలోని ఓ తోటలో దాక్కున్నాడు.
ఆ రోజు సాయంత్రం ఎడిథ్, పెర్సీలు క్రైటీరియన్ థియేటర్‌లో ‘ది డిప్పర్స్’ కామెడీ షో చూస్తూ గడిపారు. అది పూర్తయిన తరువాత వారు ఇల్‌ఫోర్ట్ వెళ్లే రైలు అందుకోవడం కోసం లివర్‌పూల్ స్ట్రీట్‌కు ట్యూబ్(భూగర్భ రైలు) ఎక్కారు.
ప్రయాణం తరువాత వారు బెల్‌గ్రేడ్ రోడ్‌లోని తమ ఇంటి వైపు వెళ్తుండగా ఓ వ్యక్తి ఆ జంటపై అమాంతం దూసుకొచ్చాడు.
ఆ తరువాతా పోలీసులు ఎడిథ్‌ను విచారించినప్పుడు ఆమె.. తాను కిందపడిపోయానని, లేచి చూసేసరికి తన భర్త కుప్పకూలిపోయి ఉన్నాడని చెప్పారు. వెంటనే వైద్యుడిని పిలవగా అప్పటికే పెర్సీ చనిపోయినట్లు చెప్పారని ఎడిథ్ విచారణలో వెల్లడించారు.
32 ఏళ్ల పెర్సీ ఆకస్మిక రక్తస్రావం వల్ల చనిపోయాడని తొలుత భావించారు. కానీ, పోలీసులు ఆయన మృతదేహాన్ని బాగా పరిశీలించినప్పుడు మెడపై కత్తిగాయాలు కనిపించాయి. అంతేకాదు.. ఆయన చనిపోయిన రోడ్డుపై కొంతదూరం వరకు చిమ్మిన రక్తం కనిపించింది.
దాంతో పెర్సీది హత్య అనే కోణంలో విచారణ మొదలైంది.

ఫొటో సోర్స్, Getty Images
ఫ్రెడ్డీని విచారించాలని పెర్సీ సోదరుడు పోలీసులను కోరారు. దాంతో పోలీసులు ఫ్రెడ్డీ గదిని వెతికారు. అక్కడ వారికి ఎడిథ్ రాసిన లేఖ దొరికింది. దాంతో ఎడిథ్‌పైనా పోలీసులకు అనుమానం మొదలైంది.
ఇద్దరినీ ఒకేసారి విచారించడానికి పోలీసులు వారిని ఇల్‌ఫోర్డ్ ఠానాకు తీసుకొచ్చారు. అక్కడ ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ‘అతడు ఎందుకిలా చేశాడు? ఇలా చేసిఉండాల్సింది కాదు. దేవుడా నేనిప్పుడు ఏం చేయాలి?’ అంటూ ఎడిథ్ రోదించారు.
ఆ తరువాత ఫ్రెడ్డీ పనిచేసే నౌకలో ఆయన క్యాబిన్‌ను పోలీసులు వెతికారు. ఎడిథ్ రాసిన మరిన్ని లేఖలు అక్కడ వారికి దొరికాయి. తాళం వేసిన పెట్టెలో ఉన్నాయి ఆ లేఖలు. వారిద్దరి మధ్య నుంచి పెర్సీని తప్పించాలని ఎడిథ్ కోరుకున్న విషయం రాసిన లేఖ కూడా అందులో ఉంది.
విచారణలో ఫ్రెడ్డీ తాను పెర్సీపై కత్తి వేటు వేసిన విషయాన్ని అంగీకరించాడు. అయితే, పెర్సీ తనపై దాడి చేయడం వల్లే ఆత్మరక్షణ కోసం అలా చేయాల్సి వచ్చిందని ఫ్రెడ్డీ చెప్పాడు.
ఎడిథ్‌పైనా కేసు పెడతామని పోలీసులు చెప్పినటప్పుడు ఫ్రెడ్డీ వ్యతిరేకించాడు. తన కదలికలేవీ ఆమెకు తెలియదని, ఇదంతా ఆమెకు తెలియకుండానే జరిగిందని ఫ్రెడ్డీ చెప్పుకొచ్చాడు.

ఫొటో సోర్స్, Getty Images
1922 డిసెంబర్ 6న ఎడిథ్, ఫ్రెడ్డీలను విచారణ కోసం ఓల్డ్‌బెయిలీలోని న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ కేసుపై ప్రజలకు విపరీతమైన ఆసక్తి ఏర్పడడంతో కోర్టు హాల్‌లోని గ్యాలరీ కిక్కిరిసిపోయింది. కోర్టు బయట కూడా పెద్దసంఖ్యలో ప్రజలు గుమిగూడారు. మైనపు బొమ్మల మ్యూజియం ‘మేడమ్ టుస్సాడ్స్’కు చెందిన కళాకారులు కూడా వచ్చారు. ఎడిథ్, ఫ్రెడ్డీల మైనపు బొమ్మలను ఆ మ్యూజియంలో ఏర్పాటుచేసేందుకు వారు స్కెచ్ వేయడానికి వచ్చారు.
తొమ్మిది రోజుల పాటు సాగిన ఈ విచారణపై ఆసక్తి ఎంతగా ఏర్పడిందంటే... కోర్టులోపల గ్యాలరీలో సీటు సంపాదించడానికి వీలుగా ముందు రోజు రాత్రి నుంచే నిరుద్యోగ యువకులు కోర్టు బయట లైన్లలో నుల్చునేవారు... ఈ కేసు విచారణ చూడ్డానికి లోనికి వెళ్లేందుకు ఆసక్తి చూపే ధనికుల దగ్గర డబ్బు తీసుకుని ఆ సీట్లు ఇచ్చేవారు. సాధారణంగా ఒక వారంలో ఎంత సంపాదిస్తారో అంతకంటే ఎక్కువే ఇలా ఒక చోటు విక్రయించడం ద్వారా సంపాదించేవారు నిరుద్యోగులు.

ఫొటో సోర్స్, Getty Images
కేసు విచారణలో కీలక సాక్ష్యాలుగా పేర్కొన్న ఎడిథ్, ఫ్రెడ్డీల ప్రేమ లేఖలను కోర్టులో చదివి వినిపించారు.
‘కోర్టులో ఆ లేఖలు చదివి వినిపించడం భయంకరంగా అనిపించింది. కోర్టులో వాటిని చదవడంతోనే నన్ను వారు చంపినట్లయింది. పూర్తిగా ప్రైవేట్, సన్నిహిత పదాలను పబ్లిక్ గ్యాలరీలో చదవడం.. ప్రజలు పిచ్చెక్కినవారిలా వాటిని వినడం.. ఇదంతా నన్ను హింసించడానికి చేసిన పనిగానే కనిపించింది’ అని ఎడిథ్ థాంప్సన్ అన్నారు.
మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన కొద్దికాలానికి జరిగిన ఈ కేసు ఎడిథ్ పట్ల ప్రజల్లో తీవ్ర ద్వేష భావం కలిగించిందని ప్రొఫెసర్ వీస్ అభిప్రాయపడ్డారు.
‘‘మొదటి ప్రపంచ యుద్ధంలో పెద్దసంఖ్యలో సైనికులు చనిపోవడంతో బ్రిటన్ అంతా యుద్ధం కారణంగా వితంతువులైన మహిళలు ఉన్న సమయం అది. అలాంటి సమయంలో సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన ఉత్సాహవంతురాలైన, స్వార్థపరురాలైన మహిళ అందం, డబ్బు, ఇల్లు, మంచి భర్త, విందులు, వినోదాలు అన్నీ ఉన్నా కూడా ఒక మంచి భర్త చాలక ఇంత పనిచేసింది’’ అనే అభిప్రాయం ప్రజల్లో ఉందని వీస్ చెప్పారు.
ఇందులో ఫ్రెడ్డీ తప్పు కంటే ఎడిథ్‌దే తప్పని ప్రజలు భావించారని.. 20 ఏళ్ల యువకుడిని మోహంలో ముంచెత్తి భర్త మరణానికి కారణమైందని, ఇప్పుడా కుర్రాడికి ఉరిశిక్ష పడడానికీ ఆమే కారణమని అప్పటి సమాజం భావించినట్లు వీస్ చెప్పారు.

ఫొటో సోర్స్, MUSEUM OF LONDON/GETTY IMAGES
‘ఆమె దోషి కాదు’
నిజానికి ఎడిథ్‌కు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలేమీ దొరకలేదు. పెర్సీ మృతదేహానికి జరిపిన పరీక్షలలో ఆయన శరీరంలో ఎలాంటి విషం జాడలు కనిపించలేదు. అలాగే, ఎడిథ్ తన లేఖలో ఆయన తినే తిండిలో గాజు ముక్కలు కలపాలనిపిస్తోంది అని రాసినట్లుగా ఆయన శరీరంలో గాజు ముక్కల ఆనవాళ్లూ లేవు.
అంతేకాదు సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలు కూడా ఆమెకు అనుకూలంగానే ఉన్నాయి. పెర్సీ కత్తిపోట్లకు గురై చనిపోయిన రోజున ఆమెను సర్‌ప్రైజ్ చేస్తూ థియేటర్‌కు తీసుకెళ్లారే కానీ.. వాళ్లు ముందే నిర్ణయించుకున్న ప్రకారం అక్కడికి వెళ్లలేదని సాక్షులు చెప్పారు.
అయితే, ఆమెకు వ్యతిరేకంగా కేసు వాదించిన న్యాయవాదులు ఆమె లేఖలను తారుమారు చేశారు. ఆమెను కేసులో పూర్తిగా ఇరికించేలా వాటిని తెలివిగా వాడుకున్నారు.
డిసెంబర్ 11న విచారణ పూర్తిగా ముగిసిన తరువాత ఎడిథ్, ఫ్రెడ్డీలు ఈ హత్య చేసినట్లు కోర్టు తేల్చింది.
న్యాయమూర్తి ఆ తీర్పు చెప్పగానే కోర్టు హాల్‌లో ఫ్రెడ్డీ బిగ్గరగా అరిచాడు.. ‘ఆమె నేరం చేయలేదు. కోర్టు తీర్పు తప్పు’ అంటూ కేకలు వేశాడు. అయితే... న్యాయమూర్తి జస్టిస్ షీర్‌మన్ మాత్రం ఎడిథ్, ఫ్రెడ్డీలే దోషులని నిర్ణయించి వారిని ఉరి తీయాలని తీర్పు చెప్పారు.
తీర్పు తరువాత ఎడిథ్‌ను జైలుకు తీసుకెళ్తున్నప్పుడు ఆమె కూడా బాధతో గట్టిగా కేకలు వేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎడిథ్‌ను ఉరి తీయడానికి ముందు రోజు జైలులో ఆమెను తల్లిదండ్రులు కలిశారు.
ఫ్రెడ్డీకి వేసిన ఉరిశిక్ష రద్దు చేయాలంటూ వేసిన ఒక పిటిషన్‌పై పది లక్షల మందికిపైగా సంతకాలు చేశారు. కానీ, ఎడిథ్ కోసం వేసిన అలాంటి పిటిషన్‌కు ప్రజల నుంచి సానుకూల స్పందన రాలేదు.
‘ముఖ్యంగా ఆడవాళ్లు ఎవరూ ఆమెను ఇష్టపడలేదు’ అని లారా థాంప్సన్ చెప్పారు.
ఎడిథ్ జైలులో ఉన్నప్పుడు లేఖలు రాశారు. మరణ శిక్ష పడిన ఒక మహిళగా తన వేదనను అందులో ఆమె తీవ్రంగా వ్యక్తీకరించారు. తన తల్లిదండ్రులకు రాసిన ఓ లేఖలో ఎడిథ్.. ‘‘ఈ రోజు అన్నిటికీ ఒక ముగింపు కనిపిస్తోంది. నేనిక ఆలోచించలేను. నా ఎదురుగా బలమైన గోడ ఉంది. దాన్ని దాటుకుని నా చూపులు కానీ, ఆలోచనలు కానీ వెళ్లలేవు. నేను చేయని తప్పుకు శిక్ష ఎందుకు అనుభవిస్తున్నాను అనే వాస్తవం అర్థం చేసుకోవడం నా శక్తికి మించిన పని’’ అని రాశారు.
అంతకుముందు దశాబ్దంలో మరణశిక్ష పడిన ప్రతి మహిళకూ అనంతరం శిక్ష రద్దయింది.. కానీ, ఎడిథ్‌కు క్షమాభిక్ష పెట్టాలంటూ వచ్చిన అభ్యర్థలను మాత్రం న్యాయస్థానం తిరస్కరించింది.
‘ఎడిథ్‌ను ఎలాగైనా ఉరితీయాలనే ప్రయత్నంలో హోం ఆఫీస్ చేసిన వక్రీకరణలు నిజంగానే భయానకం. ఎడిథ్ వివాహేతర సంబంధాన్ని నైతికతపై దాడిగా భావించారు. వివాహ వ్యవస్థను నాశనం చేస్తుందని భావించారు’ అని లారా థాంప్సన్ అభిప్రాయపడ్డారు.
కాగా ఉరి తీసిన తరువాత ఎడిథ్ మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రుల సమక్షంలో ఖననం చేయడానికి లండన్ స్మశానవాటికకు తరలించారు.

ఎడిథ్, ఫ్రెడ్డీలను ఉరి తీసిన తరువాత మేడమ్ టుస్సాడ్స్‌లోని వారి బొమ్మలను చూడ్డానికి జనం ఎగబడేవారు.
అయితే, వారిద్దరి బొమ్మలను మ్యూజియం నుంచి తొలగించాలని 1980లో నిర్ణయించారు. అక్కడి నుంచి వాటిని స్టోర్ రూమ్‌కు తరలించారు. బొమ్మల మైనం కొంతవరకు కరిగిపోయింది, వాటి రంగు వెలిసిపోయింది.
ఎడిథ్‌ను క్షమించాలంటూ ప్రొఫెసర్ వీస్ చాలా కాలం పోరాడారు.
2018లో మేనర్ పార్క్‌లోని సిటీ ఆఫ్ లండన్ స్మశానవాటికలో ఆమె మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రుల సమాధులలో తిరిగి ఖననం చేశారు. అలా చేయడం వల్ల ఆమెను తల్లిదండ్రులలో కలిపి ఉంచినట్లవుతుందన్నది ప్రొఫెసర్ వీస్ భావన.
ఇవి కూడా చదవండి:
- షబ్నమ్: స్వతంత్ర భారతదేశంలో ఉరి శిక్షను ఎదుర్కొంటున్న ఈ తొలి మహిళ చేసిన నేరమేంటి?
- ‘నా భర్తను చంపినవాడిని పెళ్లాడాను, తరువాత ఒక రాత్రి చంపేశాను’
- 88 ఏళ్ల కిందటే భారత్‌లో జరిగిన ఒక దారుణ బయో మర్డర్ కుట్ర కథ
- భర్తను చంపిన హంతకుడి కూతురితో తన కుమారుడికి పెళ్లి చేసిన మహిళ, అలా ఎందుకు చేశారంటే
- ‘30 లక్షల మందిని చంపేశా’ అని ఘనంగా చెప్పుకునే ఈ లీడర్‌కు ఇంత ప్రజాదరణ ఎందుకు?
- 30 సంవత్సరాలలో 31 మందిని రేప్ చేశాడు.. పోలీసులు కనిపెట్టే సమయానికి మరణించాడు
- చార్లెస్ శోభరాజ్: పదేళ్లలో 20 మర్డర్లు, 5కిపైగా దేశాల్లో హత్య కేసులు, 4 దేశాల జైళ్ల నుంచి పరారీ.. ఎవరీ ‘బికినీ కిల్లర్’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














