జపాన్ వకారెససేయ: భార్యాభర్తల్ని, ప్రేమికుల్ని విడదీసే ఏజెంట్లు వీళ్లు.. మారు వేషాలు వేస్తారు, ప్రేమిస్తారు, హత్యలూ చేస్తారు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, క్రిస్టినీ రో
- హోదా, బీబీసీ వర్క్ లైఫ్
తకేషీ కువాబరాకు 2010లో తన ప్రియురాలు రై ఇసోహటా హత్య కేసులో శిక్ష పడింది.
నిజానికి కువాబారా ఒక ‘వకారేససేయ’ ఏజెంట్. తన భార్య ఇసోహటాతో సంబంధం తెగతెంపులు చేసుకునేందుకు వీలుగా ప్రేమ నాటకం ఆడించేందుకు కువాబరాను కిరాయికి కుదుర్చుకున్నాడు రై ఇసోహటా భర్త.
కానీ, కథ అడ్డం తిరిగి ఇసోహటాతో కువాబరా ప్రేమలో పడడం.. ఆ తరువాత విషయమంతా ఇసోహటాకు తెలియడంతో ఘర్షణ జరగడం.. ఆ ఘర్షణంలో కువాబరా ఇసోహటాను చంపేయడం జరిగిపోయాయి.
ఇంతకీ ‘వకారేససేయ’ అంటే ఏంటో చెప్పలేదు కదా. వకారససేయ ఏజెంట్లు అంటే డబ్బు తీసుకుని భార్యాభర్తలను, ప్రేమ జంటలను విడదీస్తారు. అందుకు వారితో ప్రేమ నటిస్తారు. ఒక్కోసారి హత్యలూ చేస్తారు.
ఇంతకీ కువాబరా కథేంటి?
ఈ వకారెససేయ ఏజెంట్ కువాబరా పెళ్లయి పిల్లలున్న వ్యక్తి. కానీ ఇసోహటా భర్తతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా పెళ్లి కాని ఐటీ ఉద్యోగిలా మారు వేషం వేసుకుని ఇసోహటాను కలిశాడు.
ఒక సూపర్ మార్కెట్‌లో అనుకోకుండా కలిసినట్టు నటించి, మెల్లిగా ఆమెను ప్రేమలోకి దించాడు.
అయితే కొన్నాళ్లకు కువాబరా నిజంగానే ఆమెతో ప్రేమలో పడ్డాడు.
ఒకరోజు వాళ్లిద్దరూ ఒక హోటల్ గదిలో ఏకాంతంలో ఉండగా కువాబారాతో పాటూ పనిచేసే మరో వకారేససేయా ఏజెంట్ ఫొటోలు తీశాడు. ఇదంతా ఇసోహటా భర్తతో చేసుకున్న ఒప్పందంలో భాగంగానే చేశారు.
ఆ ఫొటోలను తీసుకెళ్లి ఇసోహటా భర్తకు ఇచ్చారు. వాటి ఆధారంగా ఇసోహటా భర్త విడాకులకు అప్లయ్ చేశాడు.
జపాన్‌లో విడాకులు కావాలంటే ఇలాంటి ఆధారాలేమైనా చూపించాలి.
అయితే.. కువాబరా తనను మోసగించాడని అర్థం చేసుకున్న ఇసోహటా కోపంతో రగిలిపోయింది. ఆయనతో సంబంధం తెంచుకోవాలనుకుంది. కానీ, కువాబరా మాత్రం ఆమెను విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు.
దీంతో ఇద్దరి మధ్యా ఘర్షణ పెరిగింది.. కువాబరా ఆమె గొంతు కోయడంతో చనిపోయింది.
ఆ మరుసటి ఏడాది కువాబరాకు 15 ఏళ్ల జైలు శిక్ష పడింది.
వకారేససేయా రంగానికి పెద్ద దెబ్బ
ఇసోహటా హత్య తరువాత వకారేససేయ రంగానికి గట్టి దెబ్బే తగిలింది. ఇతర అనేక మోసాలతో పాటూ ఇసోహటా హత్య కూడా ఈ రంగంలో సంస్కరణలకు ప్రేరేపించింది.
ప్రైవేట్ డిటెక్టివ్ సంస్థలకు విధిగా లైసెన్స్ ఉండాలన్న నియమాన్ని తీసుకువచ్చారు. దీనివల్ల వకారేససేయ ఆన్‌లైన్ ప్రకటనలపై నియంత్రణ వచ్చిందనీ.. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండడం మొదలుపెట్టారని.. వకారేససేయ ఏజెంట్లకు వారి పనులు సాగించడం కష్టతరమైందని 'ఫస్ట్ గ్రూప్' ఏజెంట్ యూసుకే మొచిజుకి అన్నారు. 'ఫస్ట్ గ్రూప్' వీడ్కోలు సందర్భానికి తగ్గ వస్తువులను విక్రయించే దుకాణం.
అయితే, ఇది జరిగిన ఒక దశాబ్దం తరువాత వకారేససేయ వ్యాపారం మళ్లీ పుంజుకుంది. ఆన్‌లైన్ ప్రకటనలు ఊపందుకున్నాయి. అధిక ఖర్చు, అనేక వివాదాలు ఉన్నప్పటికీ వీరి వ్యాపారం అభివృద్ధి చెందుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఆన్‌లైన్ ప్రకటనలతో..
ఈ పరిశ్రమ, జనాభాలో కొన్ని ప్రత్యేక వర్గాలకే పరిమితం అయినా, 270 వకారేససేయ ఏజెన్సీలు ఆన్‌లైన్‌లో ప్రకటనలిస్తున్నాయని సర్వేలో తేలింది. వీటిల్లో చాలావరకు ప్రైవేట్ డిటెక్టివ్ సంస్థలకు అనుబంధ సంస్థలుగా పనిచేస్తున్నాయి.
"వకారేససేయా సేవలు వినియోగించుకోవాలంటే చాలా ఖర్చవుతుంది. వీరి వద్దకు వెళ్లాలంటే బాగా ధనవంతులై ఉండాలి" అని మొచిజుకి అంటున్నారు.
సంగీత కళాకారుడైన మొచిజుకి అపరాధ పరిశోధనపై ఉన్న ఆసక్తితో డిటెక్టివ్‌గా మారారు. చాలా సులువైన కేసుల్లో అంటే లక్ష్యం గురించి సమాచారం విరివిగా లభ్యమయ్యే కేసుల్లో 4 లక్షల యెన్‌లు(సుమారు రూ. 3 లక్షలు) ఫీజు తీసుకుంటానని మొచిజుకి చెప్పారు.
ఒకవేళ క్లయింట్ రాజకీయ నాయకుడు గానీ సెలబ్రిటీ గానీ అయితే ఫీజు రూ. కోటిపైనే ఉంటుంది. ఎందుకంటే వీరి పనులు అత్యంత రహస్యంగా జరగాలి. మొచిజుకి పనిచేస్తున్న సంస్థ విజయవంతమైన సంస్థగా మార్కెట్‌లో పేరు తెచ్చుకున్నప్పటికీ, ఇలాంటి సంస్థల సహాయం తీసుకుంటున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని, వైఫల్యాలు చవిచూసే అవకాశం ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోవాలని ఈ పరిశ్రమపై సలహాలు అందించే ఒక కన్సల్టెన్సీ హెచ్చరిస్తోంది.
వకారేససేయ సంస్థలు మార్కెట్‌లో ఉన్నాయంటే మనం గుర్తించినదానికంటే ఎక్కువగా డబ్బు, వంచన మానవ సంబంధాల్లోకి చొరబడే అవకాశాలున్నాయని అర్థం చేసుకోవాలి.
ఇటీవలే ఇసోహటా కేసు ఆధారంగా లండన్‌కు చెందిన రచయిత స్టెఫనీ స్కాట్ "వాట్స్ లెఫ్ట్ ఆఫ్ మీ ఈజ్ యువర్స్" అనే నవల రాశారు. ఈ పుస్తకం కోసం ఆమె ఎంత పరిశోధన చేశారంటే, ఇది రాశాక ఆమెను ‘బ్రిటిష్ జపనీస్ లా అసోసియేషన్’లో సహాయ సభ్యురాలిగా తీసుకున్నారు.

ఫొటో సోర్స్, Doubleday
విడాకులకు అంగీకారం
"వకారేససేయ సహాయం తీసుకుంటే ఘర్షణను తప్పించుకోవచ్చు. క్లిష్ట పరిస్థితుల్లో సంఘర్షణకు తావు లేకుండా త్వరగా పని జరిగిపోవాలనుకునేవాళ్లకి వకారేససేయ దారి చూపిస్తుంది. మీ భాగస్వామి మరొకరితో ప్రేమలో పడితే సులువుగా, త్వరగా విడాకులు ఇవ్వడానికి ఒప్పుకుంటారు" అని స్కాట్ అంటున్నారు.
అయితే మొచిజుకి దగ్గరకు వచ్చే క్లయింట్స్‌లో అత్యధికులు పెళ్లి కాని వారే. వారంతా తమ భాగస్వామికి ఉన్న ఇతర ప్రేమ సంబంధాలను తెంపేయమని కోరుతుంటారని చెబుతూ ఆయన ఇందుకు ఒక కేసును ఉదాహరణగా చెప్పారు.
భాగస్వామి వివాహేతర సంబంధాలను తెలుసుకోవడం
ఉదాహరణకు... అయా తన భర్త బుంగోకు వివాహేతర ప్రేమ వ్యవహారాలున్నాయని నమ్ముతున్నారనుకుందాం. ఆ విషయం నిర్ధరించుకోవడానికి ఆమె వకారెసెసేయ ఏజెంట్ చికాహిడేను కలుస్తారు.
చికాహిడే తన పరిశోధన మొదలు పెడతారు…అయా తనకు ఇచ్చిన సమాచారాన్ని అధ్యయనం చేయడం, బుంగో కదలికలను గమనించడం, అతని సోషల్ మీడియా అకౌంట్లను పరిశోధించడం, అతని స్నేహితులను, ఇతర రోజువారీ కార్యక్రమాలను పరిశీలించడం, బుంగోను ఫాలో అయ్యి అవసరమైన ఫొటోలు తీసుకోవడం మొదలైనవన్నీ చేస్తారు.
బుంగో క్రమం తప్పకుండా జిమ్‌కు వెళ్లే వ్యక్తి అయితే అతను ఏ జిమ్‌కు వెళ్తున్నాడో అక్కడకు తన తోటి ఉద్యోగిని పంపించి పరిచయం పెంచుకోమంటారు.
ఇలా వెళ్లేవాళ్లు బుంగో సొంత ఊరివాళ్లో లేదా అతని యాస మాట్లాడేవాళ్లో అయి ఉంటారు. అలాంటివారైతే తొందరగా స్నేహం కలుస్తుందన్నది లాజిక్.
ఈ కథలో డైసుకే అలాంటి వ్యక్తి అనుకుందాం. డైసుకే తరచుగా జిమ్‌కు వెళుతూ బుంగో దృష్టిలో పడే ప్రయత్నం చేస్తూ అతనితో పరిచయం పెంచుకుంటారు. ఇంతకుముందే చికాహిడే.. బుంగో గురించి సేకరించిన సమాచారం అంతా డైసుకేకి ఇస్తారు కాబట్టి, బుంగోకు ఎలాంటి అంశాలపై ఆసక్తి ఉంటుంది అనేది తెలుసు కాబట్టి అలాంటి అంశాలను సంభాషణల్లోకి తీసుకువస్తూ స్నేహాన్ని పెంచుకుంటూ ఉంటారు.
అలా మెల్లగా డైసుకే.. బుంగో ప్రేయసి ఎమీ గురించి తెలుసుకుంటారు. ఇప్పుడు ఒక అమ్మాయిని ఈ వ్యవహారంలోకి తీసుకొస్తారు. ఆమె ఫుమికా. ఫుమికా వెళ్లి ఎమీతో స్నేహం చేస్తారు. ఎమీ ఆసక్తులు, అభిరుచులు తెలుసుకుంటూ మెల్లమెల్లగా దగ్గరవుతారు. చివరికి ఫుమికా తన స్నేహ బృందానికి పార్టీ ఇస్తున్నానంటూ ఎమీని ఆహ్వానిస్తారు. ఆ పార్టీలో ఫుమికా సహోద్యోగులే ఉంటారు. అందులో గోరో అనే వ్యక్తికి ఎమీ గురించి పూర్తి సమాచారమిచ్చి ఆ అమ్మాయిని ప్రేమలోకి దింపమంటారు.
గోరో ఈ పని సులభంగా చేయగలుగుతాడు. (మొచిజుకీ తాను నిర్వహిస్తున్న ఏజెన్సీలో పనిచేసే ఏజెంట్లెవరూ తమ టార్గెట్లతో శృంగారం నెరపరాదని కఠినమైన సూచనలిస్తారు.) గోరోతో ప్రేమలో పడిన ఎమీ మెల్లగా బుంగోను వదిలేస్తుంది. అక్కడితో మొచిజుకి పని విజయవంతమవుతుంది.
ఆ తరువాత గోరో మెల్లమెల్లగా ఎమీతో ప్రేమ వ్యవహారంలోంచి బయటికొచ్చేస్తారు. అతను ఏజెంట్ అని ఎమీకి ఎప్పటికీ తెలీదు.
సాధారణంగా ఇలా ఉంటాయి ఈ వకారెసెసేయ కార్యక్రమాలు.

ఫొటో సోర్స్, Julius Honnor
ఈ మొత్తం వ్యవహారంలో నలుగురు ఏజెంట్ల సహాయం కావాలి. నాలుగు నెలలపాటూ శ్రమించాలి. జపాన్ చట్టాల గురించి క్షుణ్ణంగా తెలియాలి. ఎక్కడా నేరాల్లో చిక్కుకోకుండా జాగ్రత్తగా పని నెగ్గుకురావాలని మొచిజుకి అంటున్నారు.
జపాన్‌లో సంబంధాల విషయంలో సేవలకు ప్రాధాన్యం
ఈ వకారేసెసేయా పరిశ్రమ జపాన్‌కు మాత్రమే ప్రత్యేకమైనదిగా అనిపించినా ప్రపంచంలో ఇలాంటివి మరికొన్ని ఉన్నాయి అంటున్నారు స్కాట్. అవి వకారెసెసేయా అంత జనాదరణ పొందినవి కాకపోవచ్చు లేదా ప్రైవేట్ డిటెక్టివ్ ఏజన్సీలకు అనుబంధ సంస్థలుగా ఉండొచ్చు అంటున్నారు.
అయితే పాశ్చాత్త దేశాల్లో జపాన్‌కు సంబంధించిన విషయాలను సంచలనాత్మకం చేయడం పరిపాటి. అలాగే వకారేససేయా పరిశ్రమను కూడా సంచలనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని స్కాట్ హెచ్చరిస్తున్నారు.
ఇలాంటి సంస్థల వల్ల కలిగిన లాభమో నష్టమో అంచనా వేయడం కష్టం. ఎందుకంటే ఈ విషయాలు ఎవరూ బయటకు చెప్పరు. ఈ సంస్థ సేవలు వియోగించుకున్నట్టు ఎవరూ బయటపడరు అని స్కాట్ అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
టీవీ, రేడియో ప్రొడ్యూసర్ మై నిషియామా అన్నట్టు " జపాన్‌లో ప్రతీదానికీ మార్కెట్ ఉంటుంది". నకిలీ కుటుంబ సభ్యులను ఏర్పాటు చేయడం, పిల్లల ప్రేమ వ్యవహారాలను విడగొట్టడం, ఇద్దరి మధ్య ప్రేమ పుట్టేలా చెయ్యడం, వంచనతో శృంగార వీడియోలు తీయకుండా ఆపడానికి...ఇలా అన్ని సర్వీసులూ అక్కడ దొరుకుతాయి.
మరోసారి గుర్తుచేసుకోవలసిన విషయం...వకారెససేయలాంటి సంస్థలు మార్కెట్‌లో ఉన్నాయంటే మనం గుర్తించినదానికంటే ఎక్కువగా డబ్బు, వంచన మానవ సంబంధాల్లోకి చొరబడే అవకాశాలున్నాయని అర్థం చేసుకోవాలి.
వకారేససేయలాంటి సంస్థల ఉనికివల్ల విడాకుల చట్టాలు, సాంఘిక నియమాలు, వ్యభిచారం, కుటుంబ ఘర్షణల రూపు సమీప భవిష్యత్తులో మారే అవకాశం కనిపించడం లేదు.
ఇది చాలా ఆసక్తికరమైన ఉద్యోగం అని మొచిజుకి అంటున్నారు. మనుషులను లోతుగా పరిశీలించడానికి అవకాశముంది. ఎలా అబద్దాలు ఆడతారు, ఎలా మోసం చేస్తారు, ఎలాంటి సందర్భాల్లో ఘర్షణ పడతారు, ఒక్కో విషయాన్ని ఎలా అర్థం చేసుకుంటారు, ఎలా మాట్లాడతారు అనే విషయాలు అనేకం తెలుస్తాయి అని మొచిజుకి అంటున్నారు.
సహకారం: మయీ నిషియామా, రే అమానో
ఇవి కూడా చదవండి:
- రెండో ప్రపంచ యుద్ధం జపాన్ రాజకీయాలను ఎలా ప్రభావితం చేసింది?
- గిడుగు వెంకట రామమూర్తి తెలుగు భాషకు చేసిన కృషి ఇదీ..
- ట్రంపా, బైడెనా? అమెరికాకు అధ్యక్షుడు ఎవరైతే చైనాకు మేలు?
- గుండెల్ని పిండేసే వ్యథ: జైలుకు వెళ్లేందుకు పదేపదే నేరాలు చేస్తున్న జపాన్ వృద్ధులు.. ఎందుకంటే...
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- మరణ శిక్ష అమలుకు ముందు ఖైదీలు కోరుకున్న చివరి భోజనం ఏమిటో తెలుసా
- పదేళ్లలోపు పిల్లలు నేరాలు చేస్తే జైల్లో పెట్టాలా? వద్దా?
- దిల్లీ అల్లర్లపై ఆమ్నెస్టీ నివేదిక: పోలీసులు చేసిన తప్పులకు శిక్షలు ఉండవా?
- కరోనావైరస్: స్కూళ్లను కోళ్ల పరిశ్రమల్లా మార్చేస్తున్నారు
- సరకులు కొనేటప్పుడు ఆ ప్యాకెట్లను పట్టుకుంటే కరోనావైరస్ సోకుతుందా
- ’టెస్ట్ చేయకుండానే కోవిడ్ వార్డులో పెట్టారు... మా అమ్మా, నాన్న మరణంపై విచారణ జరిపించాలి’
- భవిష్యత్తులో ఉద్యోగాల పరిస్థితి ఏమిటి? ఏయే రంగాల్లో అవకాశాలు ఉంటాయి?
- ఫైనల్ పరీక్షలు రాయకుండా విద్యార్థుల్ని ప్రమోట్ చేయొద్దు - సుప్రీం కోర్టు తీర్పు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








