డోనల్డ్ ట్రంప్: ‘జో బైడెన్ ఒక సోషలిస్ట్ కొయ్యగుర్రం.. ఆయనకు అధికారమిస్తే అమెరికన్ల కలలు ఛిద్రమవుతాయి’

ట్రంప్ ప్రసంగం

ఫొటో సోర్స్, Getty Images

వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ గెలిస్తే అమెరికన్ల కలలన్నీ చెదిరిపోతాయని ప్రస్తుత అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ హెచ్చరించారు.

రిపబ్లికన్ కన్వెన్షన్ చివరిరోజు సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ తన ప్రత్యర్థి బైడెన్‌ను అమెరికా ఘనతను నాశనం చేసే వ్యక్తిగా చిత్రీకరించారు.

అమెరికా నగరాలపైకి డెమొక్రట్లు ఒక అరాచకవాదిని వదులుతున్నారని అన్నారు.

కాగా ట్రంప్‌పై బైడెన్ స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి.

నవంబరులో జరగబోయే ఎన్నికల్లో ఓటర్లు తమ తుది తీర్పు ఇవ్వనున్నారు.

ఈ నేపథ్యంలో ఎన్నికలకు ఇంకా 10 వారాలు మిగిలి ఉండడంతో ప్రచారం ముమ్మరం చేయాలని రిపబ్లికన్ కన్వెన్షన్ నిర్ణయించింది.

ట్రంప్ ప్రసంగం

ఫొటో సోర్స్, Getty Images

మరో నాలుగేళ్లు అవకాశం ఇవ్వండి: ట్రంప్

గురువారం రాత్రి నిర్వహించిన సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ మరో నాలుగేళ్లు పదవిలో ఉండే అవకాశం ఇవ్వమని ఓటర్లను కోరారు.

మరో అవకాశం ఇస్తే కరోనావైరస్ వల్ల కుదేలైన ఆర్థిక వ్యవస్థను మళ్లీ నిలబెడతామని, జాత్యాహంకార ధోరణుల వల్ల ఏర్పడిన సాంఘిక కలహాలు సద్దుమణిగేలా చేస్తామని మాటిచ్చారు.

‘దేశ గౌరవాన్ని దెబ్బ తీస్తున్నవారికి అధికారం ఇస్తారా?

గురువారం రాత్రి వైట్ హౌస్ సౌత్ లాన్‌లో నిర్వహించిన సమావేశంలో 2020 ఎన్నికల్లో రిపబ్లికన్‌ల తరఫున అమెరికా అధ్యక్ష పదవికి తన అభర్థిత్వాన్ని ట్రంప్ అంగీకరించారు.

"అమెరికా కలలను మనం కాపాడుకోగలమో లేదో ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయి. లేదా ఒక సామ్యవాది చేతిలో ఆ కలలన్ని నలిగిపోవడానికి అనుమతిస్తామా అనేది తేలుతుంది" అని ట్రంప్ అన్నారు.

"చట్టాన్ని గౌరవించే అమెరికా పౌరులను కాపాడుకుంటామా లేక అరాచకవాదులకు, నేరస్తులకు, దేశ పౌరులను భయపెట్టేవారి చేతికి దేశాన్ని అప్పగిస్తామా అనేది మీ ఓటు నిర్ణయిస్తుంది."

"గత వారం జరిగిన డెమొక్రట్ పార్టీ కన్వెన్షన్‌లో అమెరికాను సాంఘిక, ఆర్థిక, జాత్యహంకార అన్యాయాల పుట్టగా వర్ణిస్తూ చులకన చేశారని అన్నారు. "

"ఈ రాత్రి నేను మీ అందరినీ ఒక్క ప్రశ్న అడుగుతున్నాను...దేశ గౌరవాన్ని దెబ్బ తీసే ప్రయత్నాలు చేస్తున్న డెమొక్రటిక్ పార్టీకి దేశాన్ని నడిపించే బాధ్యతలు ఎలా అప్పగించగలం?"

"వామ పక్షవాదులు వారి తిరోగమన దృష్టితో అమెరికాను ఒక స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన, అసాధారణమైన దేశంగా పరిగణించరు. బదులుగా పాపాలతో నిండిన ఒక దుష్ట దేశంగా చూస్తారు" అని ట్రంప్ అన్నారు.

తన ప్రత్యర్థి జో బైడెన్ రాజకీయ జీవితంపై దాడి చేస్తూ "బైడెన్ కెరీర్ మొత్తం అమెరికా పౌరుల కలలను అవుట్ సోర్సింగ్ చెయ్యడానికే వినియోగించారు. వారిని దేశం వదిలి పోయేలా చేసి, సరిహద్దులు తెరిచి, పిల్లలను విదేశాల్లో అంతులేని పోరాటాలకు గురి చేసి, వారి కలలను చిదిమేయడంలోనే అతని కెరీర్ గడిచిపోయింది" అని అన్నారు.

బైడెన్‌ను సోషలిజానికి కొయ్యగుర్రంగా పేర్కొన్నారు.

ట్రంప్ మొత్తం ప్రసంగంలో బైడెన్ ప్రస్తావనను కనీసం 40 సార్లు తీసుకువచ్చారు. కానీ గతవారం జరిగిన డెమొక్రట్ సమావేశంలో బైడెన్ ఒక్కసారి కూడా ట్రంప్ ప్రస్తావన తేలేదు.

గంటసేపు సాగిన ట్రంప్ మొత్తం ప్రసంగం గత నాలుగేళ్లల్లో అమెరికా అధ్యక్షుడిగా తాను చేపట్టిన విధానాలను పదే పదే ప్రస్తావించడంతోనూ, జో బైడెన్‌పై విమర్శలు గుప్పించడంతో పాటుగా అతన్ని రోడ్లపై ఉద్యమాలు చేపట్టే నిరసనకారుడిగా చిత్రీకరించడంతోనూ నిండిపోయింది.

జో బైడెన్

బైడెన్ వర్గం స్పందన ఏమిటి?

"జో బైడెన్ సారథ్యంలో మీరు అమెరికాలో సురక్షితంగా ఉండలేరని డోనాల్డ్ ట్రంప్ అన్నప్పుడు, ఒకసారి మీ చుట్టూ చూసి చెప్పండి...ఇప్పుడు ట్రంప్ సారథ్యంలో మీరెంత సురక్షితంగా ఉన్నారో చెప్పండి" అని జో బైడెన్ ట్వీట్ చేసారు.

బైడెన్ గురువారం రాత్రి వీడియో ద్వారా మాట్లాడుతూ ప్రచారాలను మళ్లీ జోరుగా కొనసాగించనున్నామని తెలిపారు.

డెమొక్రట్ పార్టీ ఉపాధ్యక్ష పదవి అభ్యర్థి కమలా హ్యారిస్ గురువారం ఒక సమావేశంలో మాట్లాడుతూ "డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవిని సరిగ్గా అర్థం చేసుకోలేదని" అన్నారు.

"అమెరికా అధ్యక్షుడి ముఖ్యమైన, ప్రాథమికమైన బాధ్యత ప్రజలను కాపాడడం. అందులో ట్రంప్ విఫలమయ్యారు" అని ఆవిడ అన్నారు.

శుక్రవారం జో బైడెన్ 160 మంది సభ్యుల ఆమోదముద్రను పొందినట్లుగా సమాచారం. వీరంతా గతంలో మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్‌తో పనిచేసినవారు లేదా గతంలో అధ్యక్ష పదవికి పోటీ చేసిన మిట్ రోమ్నీ, జాన్ మెక్కైన్‌తో కలిసి పనిచేసినవారూ కావడం విశేషం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)