బిడెన్‌కు ట్రంప్ సవాల్: 'ఇద్దరం డ్రగ్స్ పరీక్ష చేయించుకుందాం'

ఫొటో సోర్స్, REUTERS/GETTY
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్‌కు దేశాధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఒక సవాల్ చేశారు.
వచ్చే నెలలో తమ ఇద్దరి మధ్య జరగబోయే మొదటి సంవాదానికి ముందుగా.. ఇద్దరమూ మాదకద్రవ్యాల వినియోగంపై పరీక్షలు చేయించుకుందామని ట్రంప్ ప్రతిపాదించారు.
''డెమొక్రటిక్ పార్టీ పాల్గొంటున్న టీవీ చర్చల్లో బిడెన్ సామర్థ్యం అకస్మాత్తుగా మెరుగయినట్టు కనిపిస్తోంద''ని ట్రంప్ 'వాషింగ్టన్ ఎగ్జామినర్' పత్రికతో వ్యాఖ్యానించారు.
బిడెన్ డ్రగ్స్ వాడుతుండవచ్చుననే అర్థంలో మాట్లాడిన ట్రంప్.. అందుకు ఎలాంటి రుజువులు చూపలేదు. "నేను ఇలాంటి విషయాలను బాగా పసిగట్టగలను" అని మాత్రమే అన్నారు.
నవంబర్ 3 న జరగబోయే అధ్యక్ష పదవి ఎన్నికలకు ముందు ట్రంప్, బిడెన్‌ల మధ్య మూడు డిబేట్లు జరుగుతాయి.
ట్రంప్ 2016లో కూడా ఎన్నికలకు ముందు డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు ఇదే విధంగా సవాలు విసిరారు. ఆమె మాటల్లో కూడా ఆకస్మిక ఉత్తేజం కనిపిస్తోందని, అందుకు డ్రగ్స్ తీసుకోవడమే కారణమయ్యుండొచ్చని, చర్చలకు ముందు క్లింటన్ డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలని ట్రంప్ సూచించారు. అయితే క్లింటన్ వర్గం ట్రంప్ వ్యాఖ్యలను కొట్టిపారేసింది.
గురువారం నాడు రిపబ్లిక్ పార్టీ సదస్సులో డోనాల్డ్ ట్రంప్ ప్రసంగించనున్నారు.
అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు బిడెన్ చివరి డిబేట్‌లో వాదనా పటిమ గణనీయంగా మెరుగుపడిందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష పదవికి అభ్యర్థిగా ఎన్నికయ్యే ముందు పార్టీలో తన ప్రత్యర్థులతో 11 లైవ్ టీవీ డీబేట్లలో పాల్గొన్న బిడెన్.. కొన్నింట్లో ఏమాత్రం పొంతన లేకుండా మాట్లాడారని ఆయన పేర్కొన్నారు.
చివరిగా మార్చి 15వ తేదీన బెర్నీ సాండర్స్ ఒక్కరితోనే బిడెన్ డిబేట్‌లో పాల్గొన్నారు.

''ముందు డిబేట్లలో అంత అసమర్థంగా కనిపించిన ఆయన (బిడెన్) బెర్నీతో డిబేట్‌లో అకస్మాత్తుగా ఎలా మెరుగయ్యారో నాకు తెలియదు'' అని 'వాషింగ్టన్ ఎగ్జామినర్'తో మాట్లాడుతూ ట్రంప్ వ్యాఖ్యానించారు.
''అదేం అద్భుతం కాదు కానీ.. మాదకద్రవ్యాల పరీక్ష చేయించాలని మేం డిమాండ్ చేయబోతున్నాం. ఎందుకంటే.. అలా జరగటానికి మరో దారి లేదు.. అలా జరగదు'' అని ట్రంప్ పేర్కొన్నారు.
అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా.. ప్రధాన అభ్యర్థుల మధ్య జరిగే మూడు డిబేట్లు వరుసగా సెప్టెంబర్ 29న ఓహాయోలోని క్లీవ్‌ల్యాండ్‌లో, అక్టోబర్ 15న ఫ్లోరిడాలోని మియామీలో, అక్టోబర్ 22న టెన్నెసీలోని నాష్‌విల్‌లో జరగనున్నాయి.
బిడెన్‌తో మరిన్ని డిబేట్లు ఏర్పాటు చెయ్యాలని ట్రంప్ కోరారు. అందుకు ప్రెసిడెన్షియల్ డిబేట్స్ కమిషన్ తిరస్కరించింది. దీంతో.. మొదటి డిబేట్ తేదీని ముందుకు జరపాలని ట్రంప్ కోరారు. దానికి కూడా కమిషన్ సమ్మతించలేదు.
74 యేళ్ల ట్రంప్, 77 యేళ్ల బిడెన్ - ఇద్దరు కూడా తమ ప్రత్యర్థి డిమెన్షియా (మతి భ్రమణం) వ్యాధితో బాధపడుతున్నారని పరస్పరం విమర్శించుకున్నారు.
అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ బుధవారం రిపబ్లికన్ సదస్సులో ప్రధాన వక్తగా ప్రశంగించారు.
ఈ నెలాఖరులో పదవి నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించిన అధ్యక్ష భవనం వైట్ హౌస్ సలహాదారు కెలియాన్ కాన్వే కూడా ఈ సదస్సులో మాట్లాడారు.
ఇవి కూడా చదవండి:
- భవిష్యత్తులో ఉద్యోగాల పరిస్థితి ఏమిటి? ఏయే రంగాల్లో అవకాశాలు ఉంటాయి?
- కృష్ణా జలాలు కడలి పాలు.. రాయలసీమలో కరవు కష్టాలు.. ఎందుకిలా? పరిష్కారం లేదా?
- పార్టీ సమావేశంలో ప్రత్యక్షమైన కిమ్ జోంగ్ ఉన్... ఇంతకీ ఆయనకేమైంది?
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- చైనాను ఎదుర్కోవడంలో భారత్ ముందున్న ‘సైనిక ప్రత్యామ్నాయాలు’ ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








