అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ హిందువుల ఓట్లు కీలక పాత్ర పోషించనున్నాయా?

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ అమెరికన్ ఇండియన్స్ కోసం ఒక విజన్ డాక్యుమెంట్ విడుదల చేశారు.
కరోనా మహమ్మారితో పోరాటం మొదలుకొని, ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడంతో పాటూ, వలస సంబంధిత సంస్కరణల వరకు అన్ని విషయాల్లోనూ ప్రవాసభారతీయులు జో బిడెన్, కమలా హ్యారిస్ల పాలన మీద భరోసా ఉంచవచ్చని అందులో పేర్కొన్నారు.
అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న కమలా హ్యారిస్ భారతీయ సంతతికి చెందినవారే.
దీనికి ముందు అమెరికాలో ఉంటున్న ముస్లింలకోసం ఒక విజన్ డాక్యుమెంట్ను విడుదల చేసారు. అందులో కశ్మీర్ సమస్యల గురించి, జాతీయ పౌరసత్వ రిజిస్టర్ గురించి ప్రస్తావించారు. ఆ విజన్ డాక్యుమెంట్ పట్ల అనేకమంది అమెరికన్ భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఫొటో సోర్స్, EPA
ఆగస్ట్ 15 న భారత స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా, జో బిడెన్, కమలా హారిస్ లు అమెరికన్ ఇండియన్లకు ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని అందించారు. ‘‘అమెరికన్లు, ఇక్కడ నివసిస్తున్న భారతీయులు కలిసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి కృషిచెయ్యాలి’’ అని పిలుపునిచ్చారు.
అయితే, అమెరికాలో ఉంటున్న భారత హిందువులలో అధికశాతం ట్రంప్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.
కశ్మీర్ సంబంధిత అంశాలు, పౌరసత్వ సవరణ చట్టంపై ట్రంప్ బృందం చాలాసార్లు మౌనం వహించింది. కాని డెమొక్రటిక్ పార్టీ నాయకులు ప్రమీలా జయ్పాల్, బెర్నీ సాండర్స్లాంటి వాళ్లు ఈ అంశాలపై మాట్లాడుతున్నారు.
అంతేకాకుండా, ట్రంప్ ప్రస్తుత భారత ప్రభుత్వానికి గట్టి మద్దతిస్తున్నారని అనేకమంది అభిప్రాయపడుతున్నారు. 2019 సెప్టెంబర్లో ట్రంప్ హ్యూస్టన్లో భారత ప్రధానిని కలవడం, 2020 ఫిబ్రవరిలో ట్రంప్ భారత పర్యటన సానుకూల అంశాలుగా భావిస్తున్నారు.

అమెరికన్ ఇండియన్ల విజన్ డాక్యుమెంట్ ముఖ్యాంశాలేంటి?
- అమెరికా మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామా, మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ భారత్, అమెరికాల్లో ఉగ్రవాదాన్ని అడ్డుకోవడంలో పరస్పర సహకారాన్ని పెంపొందించడానికి కృషి చేసారు. దక్షిణ ఆసియా అంతటా కూడా సరిహద్దు ఉగ్రవాదాన్ని సహించబోమని జో బిడెన్ ఈ ఎన్నికల పత్రంల్లో పేర్కొన్నారు.
- ఇండియా చుట్టుపక్కల ప్రశాంత వాతావరణం నెలకొనేలా భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని తెలిపారు. చైనాతో సహా మరే దేశమూ పొరుగు దేశాన్ని బెదిరించే అవకాశం లేకుండా చేసేందుకు కృషి చేస్తామని అన్నారు.
- హిందువులు, ముస్లింలు, సిక్కులు, జైనులు అందరిమీదా హింస పెరిగింది. ఈరోజు వాషింగ్టన్లో ఉన్న నాయకులు వాళ్లందరికీ రక్షణ కల్పిస్తారనే భరోసా ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది.
- దేశాధ్యక్షుని హోదాలో విద్వేషాన్ని రెచ్చగొట్టే చర్యలను జో బిడెన్ ఖండిస్తారని అన్నారు. ద్వేషంతో ఘర్షణకు, హింసకు పాల్పడేవారికి ఆయుధాలు అందకుండా ఉండేలా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
- ప్రవాస భారతీయులు తమ కుటుంబంతో కలిసి జీవించగలిగేలా ప్రవాస నియమాలపై దృష్టి పెడతామని, కుటుంబ సభ్యుల వీసాల విషయంలో ఉన్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దేశాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని శాశ్వత వీసాలు, ఉద్యోగ వీసాలు పెరిగేలా చూస్తామని తెలిపారు. సైన్స్, ఇంజినీరింగ్, గణిత రంగాల్లో పనిచేయాలనుకునే పిహెచ్డీ విద్యార్థులపై ఉన్న నిషేధాన్ని తొలగిస్తామని తెలిపారు.
- అధిక నైపుణ్యం కలవారి తాత్కాలిక వీసా నియమాల్లోని సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని, గ్రీన్ కార్డ్ల సంఖ్య పెంచుతామని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికన్ ముస్లింల కోసం విడుదల చేసిన హామీ పత్రంలో ఏముంది?
ముస్లింల హామీ పత్రంలో కశ్మీర్ సమస్యలు, ఎన్ఆర్సీ అంశాలు ప్రస్తావించారు. ఇది చాలామందికి ఆగ్రహం తెప్పించింది. గతంలో కమలా హ్యారిస్ కశ్మీర్ సమస్యలపై స్పందించిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఈ రెండిటికీ సంబంధం ఉందని భావిస్తున్నారు.
కశ్మీర్లో నివసించే ప్రజల హక్కులను పునరుద్ధరించడానికి ప్రభుత్వం అన్ని చర్యలనూ తీసుకోవాలని ఈ హామీ పత్రంలో పేర్కొన్నారు.
"శాంతియుతంగా నిరసనలు తెలిపేవారిని నిరోధించడం, ఇంటర్నెట్ నిలిపివేయడం, విభేదించినవారిని అదుపులోకి తీసుకోవడం వంటి చర్యలవలన ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుంది" అని పేర్కొన్నారు.
సెక్షన్ 370 తొలగింపు, దాని తరువాత విధించిన ఆంక్షల పట్ల కమలా హ్యారిస్ వ్యతిరేకత వెలిబుచ్చారు.
సెప్టెంబర్ 2019 లో హ్యూస్టన్లో జరిగిన ఒక అంతర్జాతీయ సదస్సులో కశ్మీర్లో ప్రజలను నిర్బంధించడంపై, ఫోన్, ఇంటర్నెట్ నిషేధించడంపై కమలా హ్యారిస్ స్పందిస్తూ "ప్రజలకు నేను చెప్పదలుచున్నదేమిటంటే వారు ఒంటరివారు కాదు, మేము తోడున్నాం, మేమంతా గమనిస్తునాం. ఒక ప్రజాస్వామ్య దేశంగా మానవహక్కుల ఉల్లంఘన గురించి స్పందించడం, అవసరమైతే జోక్యం కలుగజేసుకోవడం మా బాధ్యత" అని అన్నారు.
వివాదాస్పద ఎన్ఆర్సీపై స్పందిస్తూ "అసోంలో ఎన్ఆర్సీ జారీ చెయ్యడం, పౌరసత్వ సవరణ బిల్లుని ప్రవేశపెట్టడం దురదృష్టకరమని జో బిడెన్ భావిస్తున్నారు" అని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
జో బిడెన్‌కు పెరుగుతున్న సవాళ్లు...
ముస్లింల కోసం హామీ పత్రం విడుదల చేసాక, అమెరికాలోని హిందువుల కోసం కూడా ఒక హామీ పత్రాన్ని విడుదల చెయ్యాలంటూ పలుచోట్ల హిందువులు డిమాండ్ చేసారు.
ఓటర్లలో 13.1 లక్షలమంది అమెరికన్ ఇండియన్లు ఉన్నారు. ఎనిమిది నియోజక వర్గాల్లో వీరు ముఖ్య పాత్ర పోషించనున్నారని భావిస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కశ్మీర్ సమస్య, ఎన్ఆర్సీలను ప్రస్తావించిన తరువాత అమెరికాలో ఉన్న భారత హిందువులపై ఎక్కువ దృష్టిపెట్టడం మొదలుపెట్టారు.
14, 15 ఆగస్టులలో భారతీయులకోసం, పాకిస్తానీయులకోసం ప్రత్యేకంగా, విడిగా వర్త్యువల్ కార్యక్రమాలు నిర్వహించారు.
మరో పక్క ట్రంప్ బృందం అమెరికన్ భారతీయుల మద్దతు తమకే ఉంటుందని భావిస్తోంది.
ట్రంప్ విక్టరీ ఇండియన్ అమెరికన్ ఫైనాన్స్ కమిటీ ప్రకారం ప్రవాస భారతీయుల్లో సగమంది ట్రంప్కే ఓటు వేస్తారని అంచనా.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: భారత్‌లో గల్లంతవుతున్న కోవిడ్ మరణాలు ఎన్ని?
- ఉత్తరప్రదేశ్: రేప్‌లు, మహిళలపై నేరాలు పెరుగుతోంటే.. రామరాజ్యం అంటున్న యోగి
- సముద్రంలో ఆపదలో ఇద్దరు మహిళలు.. ఈదుతూ వెళ్లి రక్షించిన దేశాధ్యక్షుడు
- భారత్‌లో కోవిడ్-19 వ్యాక్సీన్ హ్యూమన్ ట్రయల్స్ రెండు, మూడు దశలకు డీసీజీఐ అనుమతి
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- అమిత్ షాకు కరోనా పాజిటివ్.. అమితాబ్ బచ్చన్‌కు నెగటివ్
- శకుంతలా దేవిని హ్యూమన్ కంప్యూటర్ అని ఎందుకు పిలుస్తారంటే..
- సౌదీ అరేబియాను పాకిస్తాన్ నుంచి భారత్ తనవైపు లాగేసుకుందా?
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- కెప్టెన్‌గా ధోనీ తీసుకున్న 10 అసాధారణ నిర్ణయాలు
- కేరళ విమాన ప్రమాదంలో రియల్ హీరోలు వీళ్లే.. సెల్యూట్ చేసిన పోలీసు అధికారి
- తన కుమార్తెకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చామన్న పుతిన్... ఇంతకీ ఆమె ఎవరు? ఏం చేస్తారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








