వీరసింహారెడ్డి: పూనకాలు తెప్పించాడా... రొటీన్ కథతో బోర్ కొట్టించాడా

ఫొటో సోర్స్, Gopichand Malineni/Facebook
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
తెలుగు తెరపై ఫ్యాక్షన్ కథను ఓ కమర్షియల్ వస్తువుగా వాడుకొని విజయాన్ని అందుకొన్న కథానాయకుడు... బాలకృష్ణ.
ఆయన బాడీ లాంగ్వేజ్‌కి, ఇమేజ్‌కి, సంభాషణలు పలికే తీరుకి... ఫ్యాక్షన్ కథలు భలే సరిపోతాయి. ఓ రకంగా.. బాలయ్యకు అవి రెడీమేడ్ పాత్రలు.
సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, సింహా, లెజెండ్... ఇవన్నీ యాక్షన్, ఫ్యాక్షన్ మిక్స్ అయిన సినిమాలే. వాటితో ‘అఖండ’ విజయాల్ని అందుకొన్నారు బాలయ్య. ఇప్పుడు మరోసారి... రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో చేసిన సినిమా... 'వీర సింహారెడ్డి'.
'నాది ఫ్యాక్షన్ కాదు... సీమపై ఎఫెక్షన్' అంటూ ఫ్యాక్షనిజానికి సరికొత్త నిర్వచనం ఇవ్వడానికి ప్రయత్నించిన బాలయ్య... ఆ దారిలో సక్సెస్ అందుకొన్నారా? సంక్రాంతికి తిరుగులేని విజయాల్ని అందుకొన్న చరిత్ర ఉన్న బాలయ్యకు.. ఈ సంక్రాంతీ కలిసొచ్చిందా? లేదా?

ఫొటో సోర్స్, Mythri Movie Makers/Facebook
జై... వీర సింహా!
జై (బాలకృష్ణ), అమ్మ (హనీ రోజ్)తో కలిసి ఇస్తాంబుల్‌లో జీవిస్తుంటాడు.
అయితే 30లలో ఉన్న హనీ రోజ్, తనకంటే దాదానె రెట్టింపు వయసున్న బాలకృష్ణ(62) తల్లిగా నటించారు. ఆ పాత్రకు తగినట్లుగా ఆమెకు ఎంత మేకప్ వేసినప్పటికీ అది అతకలేదు. కృతకంగా అనిపిస్తోంది.
ఇషా (శ్రుతిహాసన్) జైని ప్రేమిస్తుంది. ఇషా ఇంట్లోనూ ఈ పెళ్లికి ఒప్పుకొంటారు.
సంబంధం మాట్లాడడానికి ఇషా తల్లిదండ్రుల్ని జై తన ఇంటికి ఆహ్వానిస్తాడు. అప్పటికి తనకో తండ్రి ఉన్నాడన్న సంగతి కూడా జైకి తెలీదు. కానీ.. అదే సమయంలో జై తన తండ్రి (వీర సింహారెడ్డి) గురించి తల్లి ద్వారా తెలుసుకొంటాడు.
పొద్దుటూరులో వీర సింహారెడ్డిని దేవుడిలా కొలుస్తుంటారు. కానీ చెల్లాయి భానుమతి (వరలక్ష్మీ శరత్ కుమార్) మాత్రం పగ పెంచుకొంటుంది. భర్త వీర ప్రతాప్ రెడ్డి (దునియా విజయ్)తో కలిసి వీర సింహారెడ్డిని చంపాలనుకొంటుంది. వీర ప్రతాప్ రెడ్డిని ఎన్నిసార్లు చంపే అవకాశం వచ్చినా... వీర సింహారెడ్డి ప్రాణ భిక్ష పెట్టి వదిలేస్తుంటాడు.
అసలు... సీమ మొత్తానికి దేవుడి లాంటి వీర సింహారెడ్డి చెల్లెకు మాత్రం ఎందుకు శత్రువు అయ్యాడు? వీర సింహారెడ్డి లక్ష్యం ఏమిటి? దాన్ని జై ఎలా పూర్తి చేశాడు? .. ఈ ప్రశ్నలకు సమాధానం తెరపై చూసి తెలుసుకోవాలి.

ఫొటో సోర్స్, Mythri Movie Makers/Facebook
పవర్‌ఫుల్.. ఎలివేషన్లు
బాలకృష్ణ లాంటి మాస్ హీరోకి.. ఏం కావాలి? ఆయన నుంచి అభిమానులు ఏం ఆశిస్తారు? ఈ రెండే రెండు అంశాల చుట్టూ గిరి గీసుకొని, ఆ గిరిలోనే కథని ఇరికించాడు దర్శకుడు. బాలయ్య సినిమా అంటే పాటలు, ఫైట్లు, ఎలివేషన్లు, డైలాగులు, హీరోయిన్లతో రొమాన్స్.. కాస్త ఎమోషన్.. ఇవన్నీ ఉండాలి. అవన్నీ ఈ వీర సింహారెడ్డిలోనూ కనిపిస్తాయి.
నిజంగానే ఈ సినిమాలో బాలయ్య ఎలివేషన్లు గూజ్‌బమ్స్ తెప్పిస్తాయి. ఫైట్లు వస్తున్నప్పుడు వెండి తెరకు కళ్లప్పగించేస్తారు అభిమానులు. బాలయ్య ప్రధాన బలం.. డైలాగ్ డెలివరీ. వాటిని దృష్టిలో ఉంచుకొని పవర్ ఫుల్ డైలాగులు రాశారు రచయిత బుర్రా సాయిమాధవ్. వాటిని బాలయ్య పలికిన విధానం కూడా బాగుంది. ఇవన్నీ ఓకే... కానీ వాటి మధ్య కథే... మరీ చిన్నదైపోయిన ఫీలింగ్ కలుగుతుంది.
వీర సింహారెడ్డి మీద ప్రతాపరెడ్డి పగతో ఎలా రగిలిపోతున్నాడో.. ప్రారంభ సన్నివేశంలో చెప్పిన దర్శకుడు కథకు ఓ టేకాఫ్ ఇవ్వగలిగాడు. వీర సింహారెడ్డి, ప్రతాపరెడ్డికి మధ్య వైరం ఎలా మొదలైందో తెలుసుకోవాలన్న ఆసక్తి కలుగుతుంది.
కట్ చేస్తే.. ఈ కథ ఇస్తాంబుల్‌కి షిఫ్ట్ అవుతుంది. అక్కడ శ్రుతి హాసన్‌ని ఓ సింగర్‌గా చూపించే ప్రయత్నం చేశారు. అది కామెడీ కోసమే.. కాకపోతే.. ఆ కామెడీనే రాదు. ఎఫ్2లో సరిగమల్ని ఖూనీ చేసే మెహరీన్ పాత్ర కళ్ల ముందు మెదులుతుంది.
బుల్లెట్ సౌండ్‌కి.. చెవులు పనిచేయకపోవడం, డ్రగ్స్ మత్తులో డాన్స్ చేయడం, అది కాస్త వైరల్ అయిపోవడం, ఆ వెంటనే హీరోపై హీరోయిన్ ప్రేమ పెంచేసుకోవడం.. ఇవన్నీ సిల్లీగా అనిపిస్తాయి. బాలయ్య - శ్రుతిల లవ్ ట్రాక్ విసిగిస్తుంది. అయితే.. దాన్ని త్వరగా ముగించి వీర సింహారెడ్డిని తెరపై తీసుకొచ్చి ప్రేక్షకులకు రిలీఫ్ ఇస్తాడు దర్శకుడు.
అక్కడి నుంచి వీర సింహారెడ్డి ఎలివేషన్లు మొదలైపోతాయి. అఖండలో... బాలయ్య ఎలివేషన్లు చూస్తే అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి. ఈసారి కూడా దర్శకుడు గోపీచంద్ మలినేని అంతకు తక్కువ చేయలేదు. కాకపోతే.. అంతటి ఇంపాక్ట్ ఉండదు.
కథలో బలం ఉన్నప్పుడు, సన్నివేశం గట్టిగా డిమాండ్ చేసినప్పుడు ఎలివేషన్లు బాగుంటాయి. చిటికీ మాటికీ అవే అయితే... బోర్ కొట్టేస్తాయి. వీరసింహారెడ్డి విషయంలోనూ అదే జరిగింది. ఎలివేషన్లు బాగానే ఉన్నా - సినిమా మొత్తం అవే ఉండడంతో ఫ్యాన్స్‌కు కూడా విసుగు పుట్టిస్తుంది.

ఫొటో సోర్స్, Mythri Movie Makers/Facebook
బాగున్న వీర సింహారెడ్డి క్యారెక్టర్
వీర సింహారెడ్డి గెటప్, ఆ క్యారెక్టర్‌ని డిజైన్ చేసిన విధానం బాగున్నాయి. అందుకే ఆ పాత్ర కనిపించినప్పుడల్లా.. కథలో వేగం వచ్చినట్టు కనిస్తుంది. కాకపోతే.. కథ అక్కడక్కడే తిరుగుతుంది. వీర సింహారెడ్డి రావడం, కొట్టడం.. లేదంటే వార్నింగ్ ఇవ్వడం, వెళ్లడం.. ఇదే జరుగుతుంటుంది. హోం మినిస్టర్ (అయ్యప్ప శర్మ)కి వార్నింగ్ ఇచ్చే సీన్ బాగా డిజైన్ చేసుకొన్నాడు దర్శకుడు. ఈ సీన్‌లో... బాలయ్య పలికే సంభాషణలు చప్పట్లు కొట్టిస్తాయి. అధికార పార్టీపైనా కొన్ని సైటైర్లు పడ్డాయి. `నువ్వు సవాలు విసిరితే.. నేను సవాలు విసురుతా`.. లాంటి వన్స్ మోర్ పలికించే లైన్లు చాలా ఉన్నాయి.
రాయలసీమని `రాయల్ సీమ` అనడం బాగుంది. విశ్రాంతి ఘట్టం దగ్గర ఓ ట్విస్టు వస్తుంది. ఇక్కడ కూడా ఫైట్‌లో ఎమోషన్ మిక్స్ చేయాలని చూశారు. ఇస్తాంబుల్ నేపథ్యంలో తీసిన ఈ సీన్‌ని సీజీలో తీసినట్టు స్పష్టంగా అర్థమవుతుంటుంది. ఇలాంటి చిన్న చిన్న తప్పుల వల్ల.. ప్రేక్షకులను కథలోంచి బయటకు లాగేసే ప్రమాదం ఉంది.

ఫొటో సోర్స్, Mythri Movie Makers/Facebook
ఫ్లాష్ బ్యాక్... వీక్!
తొలి సగంలో... మాస్‌కి కావల్సిన అన్ని అంశాలూ దట్టంగానే అందించేలా చేశాడు దర్శకుడు. ఇక ఈ సినిమా బలాన్ని నిర్ణయించేది ద్వితీయార్థమే. అక్కడ అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేశాడు. నిజానికి అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్‌కు తిరుగులేదు. బాలయ్యకు బాగా అచ్చొచ్చిన జోనర్ అది.
ఫ్యాక్షన్ కథలో సిస్టర్ సెంటిమెంట్ మేళవింపు కాస్త కొత్తగా ఉండేదే. కాకపోతే.. ఆ ఫ్లాష్ బ్యాక్‌లో పదును లేదు. చెల్లెలి కోపంలో న్యాయం ఉన్నట్టు కనిపిస్తే.. ఆ పాత్రపై సింపతీ పెరిగేది. కానీ ఇక్కడ అది జరగలేదు. అన్నయ్యని అనవసరంగా అపార్థం చేసుకొంది అనే ఫీలింగ్ కూడా రాదు.
భానుమతి పాత్ర చూడ్డానికి తెరపై శక్తిమంతంగా ఉన్నా.. ఆ పాత్రని మలచడంలో లోపాలున్నాయి. అదే..సెకండాఫ్‌ని ట్రాక్ తప్పేలా చేసింది. వీర సింహారెడ్డి తన మరదలకి దూరమయ్యే సీన్ కూడా బలవంతంగా జొప్పించినట్టే అనిపిస్తుంది. ఇక పాటలంటారా? అవి చూడ్డానికి, వినడానికి బాగానే ఉన్నా - తెరపై రాంగ్ టైమింగ్‌లో వస్తుంటాయి. ఉదాహరణకు `మా బావ మనోభావాలు` పాటకి అస్సలు స్క్రీన్ పై స్పేసే ఉండదు. దాన్ని ఇరికించారు. `మాస్ మొగుడు` పాట కూడా అంతే. క్లైమాక్స్ అందరి ఊహకు అందినట్టే సాగుతుంది. అప్పటి వరకూ చూసిన భీకరమైన ఫైట్లతో పోలిస్తే.. క్లైమాక్స్ ఫైట్ తేలిపోతుంది.
‘సీమలో మరెవర్వరూ కత్తి పట్టకూడదని నేను పట్టా...’ అనే డైలాగ్ ఈ సినిమాలో ఉంది. నిజానికి ఈ కథని ఆ కోణం లోంచి నడిపారేమో అనిపిస్తుంది. కానీ.. దాన్ని కేవలం ఓ సంభాషణకు మాత్రమే పరిమితం చేశారు. ఎవరూ కత్తి పట్టకూడదనే బాధ్యతతో... ఓ వ్యక్తి కత్తి పట్టి శత్రు సంహారం చేస్తే- ఫ్యాక్షనిజానికి ఓ కొత్త అర్థం, దానికో ముగింపు ఇచ్చిన కథానాయకుడ్ని తెరపై చూసే వీలు దక్కేది. కానీ... ఇంతటి ఆదర్శవంతమైన పాయింట్‌ని కేవలం సంభాషణకే పరిమితం చేసి, కథంతా అన్నాచెల్లెళ్ల ఎమోషన్ చుట్టూ నడిపేందుకు ప్రయత్నించారు.
వన్ మాన్ షో
ఇది కచ్చితంగా బాలయ్య వన్ మాన్ షో అనాలి. రెండు పాత్రలున్నా.. వీర సింహారెడ్డి పాత్రకే ఎక్కువ మార్కులు ఇవ్వాలి. అసలు ఈ కథకు ప్రాణం ఆ పాత్రే. వీర సింహారెడ్డిగా ఆయన గెటప్ బాగుంది. స్టైల్ బాగుంది. చాలా హుందాగా ఆ పాత్రని చేసుకొంటూ వెళ్లారు బాలయ్య. జై పాత్ర.. బాలయ్యకు రొటీనే. ఆ పాత్రకు అంత స్కోప్ కూడా ఉండదు.
రొటీన్ కమర్షియల్ సినిమాలలో కథానాయిక పాత్రకు స్కోప్ దొరకడం కష్టం. ఈసారీ అదే జరిగింది. శ్రుతి పాత్ర చాలా వీక్‌గా రాసుకొన్నారు. సెకండాఫ్‌లో `మాస్ మొగుడు` పాట ఉంది కాబట్టి శ్రుతి గుర్తొచ్చి ఉంటుంది. లేదంటే... ఆమె ఫస్టాఫ్‌లోనే కట్ అవ్వాలి. హనీరోజ్‌ది `త్యాగశీలి` పాత్ర. తను చూడ్డానికి అందంగా ఉంది. అమ్మ పాత్రలో ఆమె మేకప్ తేలిపోయింది. ఓ ఇరవై ఏళ్ల అమ్మాయికి.. మేకప్ వేసినట్టు అత్యంత స్పష్టంగా అర్థమైపోతోంది.

ఫొటో సోర్స్, Mythri Movie Makers
భానుమతి పాత్ర తెరపై చూడ్డానికి బాగుంది. వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా బాగా చేసింది. కాకపోతే.. ఈ పాత్రని మరింత బాగా డిజైన్ చేసి ఉండాల్సింది. అది చేయగలిగితే.. నరసింహాలో నీలాంబరిలా తయారయ్యేది. దునియా విజయ్ చూడ్డానికి క్రూరంగా ఉన్నాడు. అతనికి మాటలు తక్కువ.. అరుపులు ఎక్కువ. డబ్బింగ్ కూడా డామినేట్ చేసింది. తెరపై చూడ్డానికి చాలా పాత్రలున్నాయి. కానీ.. వాళ్లకు ఒకటో అరో డైలాగులు ఇచ్చారంతే. కొన్ని పాత్రలకు అవి కూడా లేవు. బ్రహ్మానందం ఒకే ఒక్క సీన్‌లో కనిపించాడు. అలీ కూడా అంతే.
తమన్ విజృంభణ
ఈసారి కూడా బాక్సులు బద్దలైపోతాయి.. అంటూ తమన్ ముందే హింట్ ఇచ్చాడు. అదే నిజమైంది. బాలయ్య ఎలివేషన్లకు, ఫైట్ సీన్లకూ తమన్ ఇచ్చిన ఆర్.ఆర్.. అదనపు ఆకర్షణగా నిలిచింది. అదే బలంగా మారింది. జై.. బాలయ్య పాట అభిమానులకు ఓ పండగలా ఉంటుంది.
బుర్రా సాయిమాధవ్ సంభాషణలు ప్రత్యేకంగా నిలుస్తాయి. ‘ఆకలి విలువ తెలియనివాడు అన్నానికి పనికిరాడు.. అమ్మ విలువ తెలియని వాడు భూమికే పనికిరాడు` లాంటి సంభాషణలు ఆయన మాత్రమే రాయగలరు అనిపించేలా ఉన్నాయి. విజువల్‌గా సినిమా అంతా భారీదనం నిండిపోయింది. నిర్మాతలు ఖర్చుకి ఎక్కడా వెనుకంజ వేయలేదు. ఏ ఫ్రేము చూసినా వందలాది మంది కనిపిస్తారు. దర్శకుడు గోపీచంద్ మలినేని కేవలం బాలయ్య ఇమేజ్‌ని దృష్టిలో ఉంచుకొని రాసిన కథ ఇది.
కథ కంటే.. వీర సింహారెడ్డి క్యారెక్టర్‌ని నమ్ముకొని.. ఈ సినిమా తీసినట్టు అనిపిస్తుంది. ఆ పాత్ర వరకూ అభిమానులు ఖుషీ అయిపోతారు కూడా. కానీ.. మిగిలిన కథ, మిగిలిన పాత్రలూ.. వాళ్లకు సైతం రుచించేలా లేవు.
ఇవి కూడా చూడండి:
- జిలేబీ బాబా: సమస్యలతో వచ్చిన మహిళలపై ఎలా అఘాయిత్యాలకు పాల్పడ్డాడు?
- జోషీమఠ్: కుంగిపోతున్న ఈ నగరానికి మహాభారతానికి ఏంటి సంబంధం?
- నాటు నాటు సాంగ్‌కు దక్కిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ప్రత్యేకలేంటి ?
- ఆస్కార్-ఆర్ఆర్ఆర్: ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల ‘నాటు నాటు’ పాట ఎలా పుట్టింది?
- తెలంగాణ: ఇంటర్ విద్యార్థులకు హెచ్‌సీఎల్‌లో సాఫ్ట్వేర్ జాబ్... ఎంపిక ఎలా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














