క్లిటొరొమెగాలీ: యోనిలో క్లిటోరిస్ సైజును సర్జరీతో తగ్గించుకున్న ఓ యువతి కథ

క్లిటొరోమెగాలీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రెడేషియన్
    • హోదా, బీబీసీ ముండో

మహిళల లైంగిక భావప్రాప్తిలో ప్రధాన పాత్ర పోషించే, యోని లోపల ఉండే క్లిటోరిస్ కొంతమందికి కాస్త పెద్దగా ఉంటుంది.

ఇలా క్లిటోరిస్ పెద్దగా ఉండటానికి చాలా కారణాలు ఉండొచ్చు. జన్యుపరమైన రుగ్మతలతో మొదలుపెట్టి, హార్మోన్ అసమతుల్యం, స్టెరాయిడ్లను ఉపయోగించడం ఇలా చాలా అంశాలు దీనిపై ప్రభావం చూపిస్తాయి.

ఇటీవల బ్రెజిల్‌లోని ఫెడరల్ యూనివర్సిటీ ఆఫ్ సియేరా ఆసుపత్రిలో ఇద్దరి మహిళల్లో క్లిటోరిస్‌ పరిమాణాన్ని సరిచేందుకు క్లిటోరోప్లాస్టీ శస్త్రచికిత్స నిర్వహించారు.

ఈ శస్త్రచికిత్స చేయించుకున్న వారిలో ఒకరైన 22 ఏళ్ల మరియాతో బీబీసీ న్యూస్ బ్రెజిల్ మాట్లాడింది.

డిసెంబరు 2021 నుంచి ఆ ఆసుపత్రిలో హార్మోన్ చికిత్స చేయించుకుంటున్నానని ఆమె తెలిపారు. ‘‘నా క్లిటోరిస్ కాస్త పెద్దగా ఉండేది. సెక్స్ సమయంలో ఇది మరింత పెద్దది అయ్యేది. దీంతో నాకు చాలా అసౌకర్యంగా అనిపించేది’’ అని ఆమె వివరించారు.

‘‘18 ఏళ్ల వయసులో సెక్స్ మొదలుపెట్టినప్పుడు, నా క్లిటోరిస్ అసాధారణంగా ఉబ్బుతున్నట్లు గుర్తించాను. ఈ సమస్య నన్ను చాలా ఇబ్బంది పెట్టేది’’ అని తెలిపారు.

క్లిటొరోమెగాలీ

ఫొటో సోర్స్, Getty Images

పరిష్కారం కోసం..

ఈ క్లిటోరిస్ సమస్య ఏళ్లపాటు ఆమెను వేధించింది. తను ఒకసారి గైనకాలజిస్టు దగ్గరకు వెళ్లినప్పుడు.. క్లిటోరిస్‌ పరిమాణాన్ని తగ్గించే చికిత్స ఏమైనా ఉందా? అని అడిగారు. అప్పుడే ఈ చికిత్స గురించి తెలుసుకున్నారు.

మరియాలో క్లిటోరిస్ పెద్దది కావడానికి ఒక జన్యుపరమైన సమస్య కారణమని వైద్యులు చెప్పారు. ఆ సమస్య వల్ల క్లిటోరిస్ హైపర్‌ట్రోఫీగా పిలిచే రుగ్మత ఆమెకు వచ్చినట్లు వెల్లడించారు. ఈ సమస్యతో బాధపడేవారిలో క్లిటోరిస్ అసాధారణంగా పెరుగుతుంది.

‘‘నేను రోజూ దీని గురించి ఆలోచించే దాన్ని కాదు కానీ, సెక్స్ సమయంలో మాత్రం చాలా ఇబ్బందిగా అనిపించేది. దాన్ని చూసినప్పుడల్లా చాలా అసాధారణంగా కనిపించేది. అందుకే దాని పరిమాణాన్ని తగ్గించుకోవాలని భావించాను’’ అని ఆమె తెలిపారు. అయితే, దీని వల్ల ఆమె జీవిత భాగస్వామికి సెక్స్ సమయంలో పెద్దగా ఇబ్బంది ఉండేదికాదని ఆమె చెప్పారు.

‘‘ఒకవేళ నీకు ఇబ్బందిగా అనిపిస్తే, నువ్వు ఆ చికిత్స చేయించుకో’’ అని అతడు సూచించాడని ఆమె తెలిపారు.

క్లిటొరోమెగాలీ

ఫొటో సోర్స్, Getty Images

అయితే, సియేరాలో ఈ చికిత్స చేసే నిపుణులు లేకపోవడంతో దీన్ని చేయించుకోవటానికి కాస్త సమయం పట్టింది.

మొత్తానికి ఒక స్పెషల్ గైనకాలజిస్టు సవ్‌పాలో నుంచి 3,000 కి.మీ. ప్రయాణించి ఈ చికిత్స చేయటానికి సియేరాకు వచ్చారు.

‘‘ఆపరేషన్ ఎలాంటి ఇబ్బందీ లేకుండా పూర్తయింది. ఇప్పుడు నేను కోలుకుంటున్నాను. నేడు నేనొక పూర్తి మహిళగా మారినట్లు అనిపిస్తోంది. ఎందుకంటే ఇదివరకు చాలా అసాధారణంగా అనిపించేది. చాలా మందికి ఇది చిన్న సమస్య కావొచ్చు. కానీ, ఈ సమస్యతో జీవించేవారికే దీని బాధ తెలుస్తుంది’’ అని ఆమె చెప్పారు.

‘‘పూర్తిగా కోలుకోవడానికి రెండు నెలలు పట్టొచ్చు. అయితే, ఇకపై సెక్స్ సమయంలో నేను ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు’’ అని ఆమె వివరించారు.

‘‘క్లిటోరిస్ పరిమాణం పెద్దగా ఉండటం అనేది డెవలప్‌మెంట్ డిజార్డర్. దీన్ని వ్యాధిగా చూడకూడదు’’ అని ఈ చికిత్స నిర్వహించిన గైనకాలజిస్టు మర్సెలో ప్రాక్సెడెస్ మోంటిరో ఫిల్హో చెప్పారు.

క్లిటొరోమెగాలీ

ఫొటో సోర్స్, Getty Images

క్లిటోరోప్లాస్టీ అంటే ఏమిటి?

క్లిటోరిస్ పరిమాణాన్ని తగ్గించేందుకు క్లిటోరోప్లాస్టీని నిర్వహిస్తారు. దీనివల్ల క్లిటోరిస్ పనితీరులో ఎలాంటి మార్పూ ఉండదు.

క్లోటోరిస్‌లో దాదాపు 8,000 నరాల మొనలు ఉంటాయి. సెక్స్ సమయంలో భావప్రాప్తిని ఇవ్వడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి.

ఇదొక ‘‘చిన్న బటన్’’లా పనిచేస్తుంది. అయితే, ఇది ఒక్కొక్కరిలో ఒక్కో పరిమాణంలో ఉంటుంది.

దీని పరిమాణం విపరీతంగా పెరిగే సమస్య అంటే క్లిటోరిస్ హైపర్‌ట్రోఫీ (క్లిటొరోమెగలీ)కి గల కారణాలను మోంటిరో ఫిల్హో వివరించారు. అవేమిటంటే..

  • జన్యుపరమైన రుగ్మతలు, వీటిలో కొన్ని పుట్టుకతోనే వస్తాయి.
  • శరీరంలో పురుష హార్మోన్ల (ఆండ్రోజెన్ల) స్థాయిలు పెరగడం.
  • ఎనబాలిక్ స్టెరాయిడ్ల వినియోగం. కొన్ని చికిత్సల్లో కండరాల సమస్యలకు టెస్టోస్టెరాన్ ఇస్తారు. దీనివల్ల ఆ మహిళల్లో హార్మోన్ సమతుల్యం దెబ్బతింటుంది.
  • గర్భధారణ సమయంలో హార్మోన్లు ఉపయోగించడం.
  • హార్మోన్ల సమతుల్యాన్ని దెబ్బతీసే కణితులు ఏర్పడటం.
  • పాలిసిస్టెక్ ఒవేరియన్ సిండ్రోమ్ లాంటి అండాశయ సంబంధిత వ్యాధులు.
క్లిటొరోమెగాలీ

ఫొటో సోర్స్, Getty Images

పాలిసిస్టెక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీవోఎస్) వచ్చినప్పుడు కూడా సదరు మహిళల్లో ఆండ్రోజెనిక్ హార్మోన్ల స్థాయిలు పెరుగుతాయని మోంటిరో ఫిల్హో చెప్పారు.

‘‘ప్రత్యుత్పత్తి దశలో ఉండే మహిళల్లో ఎక్కువ మందిని వేధించే హార్మోన్ల సమస్యల్లో పీసీవోఎస్ ఒకటి. దీని వల్ల రుతుచక్రం క్రమం తప్పుతుంది. ముఖంపై మొటిమలు, శరీరంపై వెంట్రుకలు రావడం లాంటి సమస్యలతోపాటు కొందరిలో క్లిటోరిస్ పరిమాణం కూడా పెరగొచ్చు’’ అని ఫిల్హో వివరించారు.

క్లిటోరిస్‌లో కండరాలు ఉంటాయి. మహిళలు లైంగికంగా ఉద్రేకమైనప్పుడు వీటిల్లో రక్తం ప్రసరిస్తుంది. ఫలితంగా ఇవి ఉబ్బినట్లుగా కనిపిస్తాయి.

క్లిటోరిస్ ఉబ్బడం అనేది అందరి మహిళల్లోనూ కనిపిస్తుంది. అయితే, క్లిటొరోమెగాలీ వచ్చే వారిలో క్లిటోరిస్ పరిమాణం అసాధారణంగా ఉంటుంది. ఫలితంగా సెక్స్ సమయంలో కాస్త ఇబ్బందిగా అనిపించొచ్చు.

ఈ సమస్యతో బాధపడే చాలా మంది మహిళలు బికినీలు, శరీరానికి అతుక్కుపోయే బట్టలు వేసుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే వీటి వల్ల వీరి మర్మాంగాల్లో భాగాలు ఉబ్బెత్తుగా బయటకు కనపడే అవకాశముంటుంది.

‘‘బయటకు ఉబ్బెత్తుగా కనిపించే భాగాలను శస్త్రచికిత్సతో తొలగిస్తాం. అయితే, సున్నితమైన లోపలి భాగాలను అలానే ఉంచుతాం. ఎందుకంటే ఇవి చాలా ముఖ్యమైనవి’’ అని ఫిల్హో తెలిపారు.

వీడియో క్యాప్షన్, మొదటి కలయిక తర్వాత కన్నెపొరకు ఏమవుతుంది, అసలు కన్యత్వంతో దానికి లింకేంటి?

పరిమాణం ఎంత ఉంటే అసాధారణం?

నిజానికి క్లిటోరిస్ ఇంత పరిమాణం ఉండాలనేమీ లేదు. చూడటానికి మరీ ఉబ్బెత్తుగా లేదా అసౌకర్యంగా అనిపిస్తే వైద్యులను సంప్రదించడం మంచిది.

‘‘అసలు తమ క్లిటోరిస్ పరిమాణం ఎంత ఉంది? అని ఎవరూ కొలుచుకోకూడదు. ఎందుకంటే ఇది వ్యక్తిని బట్టీ మారుతూ ఉండొచ్చు. కొంతమందిలో ఇది కాస్త ఉబ్బెత్తుగా ఉండొచ్చు. అదేమీ పెద్ద సమస్య కాదు’’ అని ఫిల్హో తెలిపారు.

అయితే, వైద్య పరిభాషలో క్లిటోరిస్ పరిమాణాన్ని నిర్ధారించేందుకు ఒక స్కేల్ ఉంది. దీనిలో ఒకటి నుంచి 4 వరకు నంబర్లు ఉంటాయి. అయితే, దీన్ని నిపుణులు మాత్రమే నిర్ధారించాల్సి ఉంటుంది.

క్లిటోరిస్ పెద్దగా కనిపించే సమస్య చాలా మందిని వేధించేటప్పటికీ, దీని పరిమాణాన్ని తగ్గించుకొనే చికిత్సలు మాత్రం చాలా అరుదుగా జరుగుతుంటాయి.

నోట్: ఇంటర్వ్యూ ఇచ్చిన యువతి పేరు మార్చాం.

వీడియో క్యాప్షన్, ప్రేమలో పడ్డారా, కామంలో కూరుకుపోయారా... ఎలా తెలుస్తుంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)