వాట్సాప్: త్వరలో రాబోతున్న కీలక మార్పులేంటి, ఎలా ఉపయోగపడతాయి?

ఫొటో సోర్స్, EPA
- రచయిత, పూర్ణిమా తమ్మిరెడ్డి
- హోదా, బీబీసీ కోసం
మన జీవితంలో నిత్యావసరంగా మారిపోయిన యాప్స్‌లలో అతి ముఖ్యమైనది వాట్సాప్.
కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాటామంతీ కోసమే కాదు బిజినెస్‍ల నుంచి కోవిడ్-19 లాంటి విషమ పరిస్థితుల్లో వనరుల గురించి వివరాలు తెల్సుకోవడంలో విపరీతంగా ఇది ఉపయోగపడింది.
ప్రపంచంలో అత్యధికంగా “మంత్లీ యాక్టివ్ యూజర్స్” (ప్రతీ నెలా వాట్సాప్ వాడేవారి సంఖ్యలో ఇండియా మొదటి స్థానంలో ఉంది. 39 కోట్లమంది భారతీయులు వాట్సాప్ వాడుతున్నారు.
సోషల్ మీడియా యాప్స్ వాడేవారిలో 81% శాతం భారతీయులు వాట్సాప్‍నే వాడటాానికి మక్కువ చూపిస్తున్నారు.
ఈ డిమాండ్‍ను దృష్టిలో పెట్టుకునే వాట్సాప్‌ను మెటా కంపెనీ ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తూ వస్తోంది.
ఈ ఏడాది (మరికొన్ని వారాల నుంచి నెలలలోపు) రాబోతున్న కొన్ని కొత్త ఫీచర్ల వివరాలు ఇవి.

ఫొటో సోర్స్, Getty Images
వాట్సాప్ ఆండ్రాయిడ్ ట్రాన్స్‌ఫర్
ప్రస్తుతం వాట్సాప్ చాట్స్ బ్యాకప్ అంటే గూగుల్ డ్రైవ్‍లో బ్యాకప్ చేసుకుని, దాని నుంచి డౌన్లోడ్ చేసుకోవడం. ఫోన్లు మార్చాల్సి వచ్చినప్పుడు ముఖ్యంగా ఇలానే చేయాల్సి వస్తుంది.
ఆ పరిస్థితిని మార్చడానికి ఒక ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి మరో ఆండ్రాయిడ్ ఫోన్‍కు చాట్స్‌ను నేరుగా తరలించే వీలు రాబోతుంది. ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సరిపోతుంది.
కంపానియన్ మోడ్
వాట్సాప్ అకౌంట్ ఒక ఫోన్ నెంబర్‍తో లింక్ అయ్యుంటుంది. డివైస్‌లో ఏ సిమ్ ఉంటే ఆ నెంబర్ ఉన్న వాట్సాప్ అకౌంట్‌ను వాడుకోగలం. ఇంకో డివైజులో లాగిన్ అయితే మొదటి ఆటోమాటిక్‍గా లాగవుట్ అయిపోతుంది.
ఒకే అకౌంట్‌ను రెండు ఫోన్ల మీద వాడాల్సి వస్తే ప్రస్తుతం అది వీలు కాదు. దాన్ని అధిగమించేలా “కంపానియన్ మోడ్” ప్రవేశబెట్టబోతున్నారు. ఒకటే అకౌంట్‍ను ఇప్పుడు ఆండ్రాయిడ్, ఐఫోన్ డివైస్‌ల మీద లాగిన్ అవ్వచ్చు.
ఈ ఫీచర్ ఆల్రెడీ వాట్సాప్ బీటాలో ఉంది. అంటే త్వరలో అందుబాటులో ఉండే అవకాశాలు ఎక్కువ.

ఫొటో సోర్స్, Purnima Tammireddi
పైన బొమ్మలో చూపించినట్టు “లింక్ ఏ డివైస్” అన్న ఆప్షన్ కనిపిస్తే, మీకు ఈ ఫీచర్ అందుబాటులో ఉన్నట్టు. ఆ తర్వాత స్క్రీన్‍పై ఉన్న సూచనలు ఫాలో అయితే వేరే ఫోనుని లింక్ చేయవచ్చు. లింక్ చేయగానే చాట్స్, మీడియా వంటివి సింక్ అయ్యి కొత్త డివైజ్‍లో కూడా సిద్ధంగా ఉంటాయి. ఇలా నాలుగు ఫోన్ల వరకూ లింక్ చేసుకోవచ్చు.
లింక్ చేసిన తర్వాత ఎవరన్నా మెసేజ్ పంపిస్తే, అది అన్ని డివైజుల్లోనూ ఆటోమాటిక్‍గా కనిపిస్తుంది.
వాట్సాప్ చెప్పే ఎండ్-టు-ఎండ్ ఎన్‍క్రిప్షన్ ఇక్కడా వర్తిస్తుంది. అందుకని మెసేజీలు లీక్ అవుతాయన్న భయం అవసరం లేదని ఆ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు.
స్టేటస్‍ల రిపోర్ట్
మెసెజీల్లో, అకౌంట్లు ఫేక్/స్పామ్ లేదా అభ్యంతరకర కంటెంట్ ఉంటే వాటిని రిపోర్ట్ చేసే సౌకర్యం ప్రస్తుతం అందుబాటులో ఉంది.
వాట్సప్ స్టేటస్‍లు ఆదరణ పొందుతున్న సమయంలో, ఒకవేళ స్టేటస్‍లో హేట్ స్పీచ్, లేదా అడల్ట్ కంటెంట్ లాంటివి ఉంటే వాటిని రిపోర్ట్ చేసే విధంగా కొత్త ఫీచర్‍ని రూపొందించబోతున్నారు.
స్టేటస్‍లలో వాయిస్ నోట్స్ పెట్టగలగడం
స్టేటస్‍లలో ఇప్పుడు ఇమేజ్‌లు, వీడియోలు, టెక్స్ట్ మెసేజీలు, లింకులు మాత్రమే ఇవ్వవచ్చు. దానిని ఇంకో అడుగు ముందుకు తీసుకెళ్తూ 30 సెకన్లకు మించని “వాయిస్ నోట్” కూడా పెట్టేలా ఏర్పాటు చేస్తున్నారు.
దీనివల్ల టైప్ చేసే పని తప్పుతూ మన గొంతుతోనే మన భావాలు పంచుకునే సౌలభ్యం కలుగుతుంది. తక్కిన వాటిని అప్‍లోడ్ చేసినప్పటిలానే వాయిస్ నోట్స్ స్టేటస్‍లను కూడా ఎవరు చూడవచ్చు అనేది నిర్ధారించుకునే సెట్టింగ్ ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
“వ్యూ వన్స్ టెక్ట్స్” ఫీచర్
ఏవన్నా ఇమేజీలు అవతలివారు ఒకసారి చూడగానే డిలీట్ అయిపోవాలని అనుకుంటే “వ్యూ వన్స్” ఫీచర్ ఉంది. కాకపోతే కేవలం ఇమేజీలకే వర్తిస్తూ వచ్చింది. దాన్ని ఇప్పుడు టెక్ట్స్ మెసేజ్‌లకు కూడా అమలు అయ్యేట్టు చేస్తున్నారు. ఏదన్నా సీక్రెట్, లేదా వేరే వాళ్ళకి ఫార్వాడ్ చేయకూడని విషయం, లేదా స్క్రీన్‍షాట్ తీసుకునే అవకాశం ఇవ్వకూడదనుకుంటే ఈ ఫీచర్‍ని వాడుకోవచ్చు.
డిసప్పియరింగ్ మెసేజ్‌లను సేవ్ చేసుకోవచ్చు
చాట్స్‌లో మాట్లాడుకునేవి ఎప్పటికి నిలిచిపోయి అటు ఫోన్ స్టోరేజీని తినేయడంతో పాటు, పంచుకున్న విషయాలను స్క్రీన్‌షాట్స్ తీసి బెదిరింపులకు పాల్పడే లాంటి విపరీత పరిణామాలు కూడా ఉండడాన్ని గ్రహించి డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ తీసుకొచ్చారు. ఇది ఎనేబుల్ చేసుకుంటే కొంతకాలానికి మెసేజీలన్నీ వాటంతట అవే డిలీట్ అయిపోతాయి.
అయితే, ప్రస్తుతం ఈ సెట్టింగ్‍తో ఉన్నప్పుడు అన్ని మెసేజీలు డిలీట్ అయిపోయేలా ఉంది. ఒకవేళ వాటిల్లో ఏమన్నా జాగ్రత్త పర్చుకోవాల్సినవి ఉంటే “సేవ్” ఆప్షన్ రాబోతోంది.
అవసరంలేనివి అన్నీ డిలీట్ అయిపోయి, కేవలం పనికొచ్చే మెసేజ్‌లే అకౌంట్‌లో మిగులుతాయి.
డేట్‍తో మెసేజ్ సెర్చ్
వాట్సాప్‌లో మెసేజ్ సెర్చ్ చేయాలంటే తలనొప్పి. ఏం మాట్లాడుకున్నామో అందులో కొన్ని పదాలన్నా కరెక్టుగా గుర్తుంటే తప్ప ఆ మెసేజీలకు వెళ్ళలేము. అది కూడా ఓపిగ్గా వెతుక్కోవాలి.
ఉదాహరణకి “డిసంబర్ 2021లో బుక్ ఫెయిర్‍లో కలిసిన వాళ్ల పేర్లు” వెతకాలి అనుకోండి, వారి పేర్లు గుర్తుండాలి. కానీ, త్వరలో డేట్‍తో వెతుక్కునే వీలు కల్పించే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ఏఏ డేట్స్‌లో వెతకాలో చెప్తే అదే వెతికి త్వరగా రిజల్ట్స్ ఇస్తుంది.
వాట్సాప్ వెబ్‍లోనూ కాల్ సౌకర్యం
వాట్సాప్‍ను లాప్‍టాప్ మీద కూడా వాడవచ్చు. వాట్సాప్ వెబ్ అంటారు దాన్ని. కానీ ప్రస్తుతం అందులో కాల్ చేసుకునే అవకాశం లేదు.
వాట్సాప్‍ను ముఖ్యంగా కాల్స్, గ్రూప్ కాల్స్ చేయడానికే ఉపయోగిస్తారు కాబట్టి ఆ సౌకర్యాన్ని వాట్సాప్ వెబ్‍కూ తీసుకొచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- దేశానికి రక్షణగా పెట్టని గోడలు - ధ్వంసం చేస్తున్న అక్రమార్కులు...
- గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏమిటి? నీటి నుంచి ఎలా ఉత్పత్తి చేస్తారు?
- తెలంగాణ: గణేశ్ చందా ఇవ్వనందుకే టీచర్‌ను వివాదంలోకి లాగారా... బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ప్రజల కష్టాలేమిటి? మునిసిపాలిటీ పరిధిలోకి వస్తే ఏం జరుగుతుంది?
- తెలంగాణ: ఇంటర్ విద్యార్థులకు హెచ్‌సీఎల్‌లో సాఫ్ట్వేర్ జాబ్... ఎంపిక ఎలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















