వాట్సాప్ ప్రైవసీ: వినియోగదారుల నంబర్లు గూగుల్ సెర్చ్‌లో పెట్టేస్తున్నారా - Press review

వాట్సాప్

ఫొటో సోర్స్, Getty Images

వాట్సాప్ ప్రైవసీ పాలసీ దుమారం ఇంకా సద్దుమణగకముందే మరో వివాదం మొదలైందని ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది. గూగుల్ సెర్చ్‌లో ఇండెక్సింగ్ ద్వారా వాట్సాప్ వెబ్ యూజర్ల పర్సనల్ నంబర్లు దర్శనమిచ్చాయని తెలిపింది.

దేశంలో 400 మిలియన్ల మంది వాట్సాప్‌ను ఉపయోగిస్తుండగా, చాలామంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ తమ ఇన్‌స్టాంట్ చాట్‌ కోసం డెస్క్‌టాప్, పీసీలను ఉపయోగిస్తుంటారు. ఇండిపెండెంట్ సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు రాజశేఖర్ రాజహరియా శుక్రవారం.. గూగుల్ సెర్చ్‌లో కనిపించిన వాట్సాప్ వెబ్ యూజర్ల వ్యక్తిగత ఇండెక్సింగ్ నంబర్లను షేర్ చేశారు.

ఎవరైనా వెబ్ వెర్షన్ ద్వారా వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నప్పుడు గూగుల్ సెర్చ్‌లో మొబైల్ నంబర్లు ఇండెక్స్ అవుతాయి. లీకైన ఇండెక్సింగ్ నంబర్లు బిజినెస్ నంబర్లు కావని, వ్యక్తిగతమైనవని రాజహరియా తెలిపారు. గతవారం ప్రైవేటు గ్రూప్ చాట్ లింక్స్ గూగుల్ సెర్చ్‌లో కనిపించి కలకలం రేపాయి. దీంతో స్పందించిన వాట్సాప్.. ఇలాంటి చాట్‌లను ఇండెక్స్ చేయవద్దని గూగుల్‌ను కోరినట్టు తెలిపింది. అంతేకాదు, గ్రూప్ చాట్ లింకులను బహిరంగ యాక్సెస్ కలిగే వెబ్‌సైట్లలో షేర్ చేయవద్దని సూచించింది.

ప్రైవేట్ వాట్సాప్ గ్రూప్ చాట్స్ ఆహ్వాన లింకులను గూగుల్ ఇండెక్స్ చేసింది. అంటే దీనర్థం.. ఎవరైనా సింపుల్ సెర్చ్‌తో ప్రైవేట్ గ్రూప్ చాట్స్‌లో చేరొచ్చు. అయితే, ప్రస్తుతం ఈ ఇండెక్స్ వాట్సాప్ గ్రూప్ చాట్స్ లింకులను గూగుల్ తొలగించింది. అయితే, వాట్సాప్ చెప్పినప్పటికీ గూగుల్ ఇంకా ఇండెక్స్ చేస్తూనే ఉందని రాజహరియా తెలిపారు.

లైంగిక దాడి

ఫొటో సోర్స్, Getty Images

బాలుడికి లింగ మార్పిడి చేసి.. మూడేళ్లుగా లైంగికదాడి

ఒక బాలుడికి బలవంతంగా లింగ మార్పిడి ఆపరేషన్‌ చేయించిన నలుగురు నిందుతులు మూడేళ్లుగా లైంగిక దాడికి పాల్పడ్డారని నమస్తే తెలంగాణ ఓ కథనం ప్రచురించింది.

‘‘దేశ రాజధాని దిల్లీలో ఈ దారుణం వెలుగుచూసింది.

13 ఏళ్ల బాలుడికి డ్యాన్స్‌ అంటే ఇష్టం. మూడేళ్ల కిందట లక్మీనగర్‌లో జరిగిన డ్యాన్స్‌ కార్యక్రమంలో పరిచయమైన ఒక వ్యక్తి, శిక్షణ ఇస్తానని చెప్పి ఆ బాలుడ్ని తన వెంట తీసుకెళ్లాడు. అనంతరం ఆ బాలుడితో కొన్ని డ్యాన్స్‌ కార్యక్రమాలు ఇప్పించి డబ్బులు సంపాదించాడు.

అయితే తన బృందంతో కలిసి డ్యాన్స్‌ చేసి జీవిస్తానని ఆ బాలుడు ఒక రోజు అతడితో చెప్పాడు. దీంతో ఆ వ్యక్తి ఆ బాలుడ్ని నిర్బంధించి కొన్ని రోజులు మత్తుపదార్థాలు ఇచ్చాడు. అనంతరం బలవంతంగా లింగ మార్పిడి ఆపరేషన్‌ చేయించాడు. హార్మోన్‌ ఇంజక్షన్లు కూడా ఇవ్వడంతో ఆ బాలుడి శరీరంలో మార్పులు సంభవించాయి.

అనంతరం ఆ వ్యక్తి , ముగ్గురు స్నేహితులు కలిసి కొన్ని ఏళ్లుగా బాలుడిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కొందరు విటుల వద్దకు కూడా పంపారు. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద యాచించాలని డిమాండ్‌ చేశారు. ఆ వ్యక్తి కూడా మహిళల దుస్తులు ధరించి రోడ్డుపై కనిపించే వారి నుంచి డబ్బులు డిమాండ్‌ చేసేవాడు. కొన్ని రోజుల తర్వాత బాధిత బాలుడికి తెలిసిన మరో బాలుడ్ని ఆ వ్యక్తి తీసుకొచ్చాడు.

కాగా, గత ఏడాది మార్చిలో కరోనా లాక్‌డౌన్‌ సమయంలో వీరిద్దరు పారిపోయారు. బాధిత బాలుడు తన తల్లి వద్దకు వెళ్లి జరిగింది చెప్పి కుటుంబంతో కలిసి ఇద్దరు ఉండసాగాడు. అయితే డిసెంబర్‌లో బాలుడి అడ్రస్‌ కనిపెట్టిన ఆ వ్యక్తి ఇంటికి వచ్చాడు. తల్లిని తుపాకీతో బెదిరించి కొంత డబ్బులు దోచుకున్నాడు. ఇద్దరు బాలురను తన వెంట తీసుకుపోయాడు.

రెండు రోజుల అనంతరం ఆ ఇద్దరు బాలురు అతడి చెర నుంచి తప్పించుకుని పారిపోయారు. ఢిల్లీ రైల్వే స్టేషన్‌కు వెళ్లి దాక్కున్నారు. మరునాడు ఒక న్యాయవాది వారిని గమనించి ఆరా తీయగా జరిగిన దారుణాన్ని చెప్పారు. దీంతో ఆ న్యాయవాది వారిద్దరిని దిల్లీ మహిళా కమిషన్‌ (డీసీడబ్ల్యూ)కు అప్పగించారు’’ అని ఆ కథనంలో రాశారు.

బర్డ్‌ ఫ్లూ

ఫొటో సోర్స్, Chickens - generic

మహారాష్ట్రలో విజృంభిస్తోన్న బర్డ్ ఫ్లూ

మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ కేసులు విజృంభిస్తున్నాయని వెలుగు దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

గురువారం ఒక్కరోజే తొమ్మిది జిల్లాల్లో 382 పక్షులు చనిపోయాయి. దాంతో రాష్ట్రవ్యాప్తంగా చనిపోయిన పక్షుల సంఖ్య 3,378కి చేరింది. రాష్ట్రంలోని లాతూర్, నాందేడ్, నాసిక్, అహ్మద్‌నగర్ జిల్లాల్లో కొత్తగా బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి.

‘జనవరి 14న మొత్తం 382 పక్షులు చనిపోయాయి. ఈ నమూనాలను పుణె, భోపాల్‌లలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్‌కు పంపారు. జనవరి 8 నుంచి 14 వరకు వివిధ రకాలకు చెందిన 3,378 పక్షుల మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు తొమ్మిది జిల్లాలు పక్షుల ఫ్లూ బారిన పడ్డాయి’ అని రాష్ట్ర శాఖ తెలిపింది.

ముంబయి, ఘోడ్ బందర్, దాపోలి ప్రాంతాల్లో కాకులు, కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకింది. పర్బనీ, లాతూర్, బీడ్, నాందేడ్ జిల్లాలో కోళ్ళకు బర్డ్ ఫ్లూ సోకింది. అకోలా, అమరావతి, అహ్మద్‌నగర్, పుణె, షోలాపూర్ నగరాల్లోని కోళ్ల నుంచి సేకరించిన నమూనాలు బర్డ్ ఫ్లూ నెగిటివ్‌గా తేలింది. ముంబయి, బీడ్, ఠానే, రత్నగిరి, నాసిక్, నాందేడ్ ప్రాంతాల్లోని కాకుల నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించగా బర్డ్ ఫ్లూ పాజిటివ్ అని వెల్లడైంది.

బస్సు ప్రమాదం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

విహారయాత్రలో 10 మంది బాల్య స్నేహితురాళ్లతో సహా 13 మంది దుర్మరణం

విహారయాత్ర కోసం గోవా వెళ్తున్న 16 మంది మహిళలు ప్రయాణిస్తున్న బస్సుకు ఘోర ప్రమాదం సంభవించిందని ఈనాడు ఓ కథనం ప్రచురించింది.

శుక్రవారం ఉదయం కర్ణాటకలోని ధార్వాడ నగర శివార్లలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో 13 మంది కన్నుమూశారు.

మృతుల్లో టిప్పర్‌ డ్రైవరు కూడా ఉన్నారు. మరికొద్ది సమయంలో మరొక స్నేహితురాలి నివాసంలో అల్పాహారానికి దిగాల్సి ఉండగా.. ఈలోపే వారిని మృత్యువు కబళించింది.

ఎదురుగా వచ్చిన టిప్పర్‌ వీరి టెంపో ట్రావెలర్‌ మినీ బస్సును ఢీకొంది. ఓ వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసే ప్రయత్నంలో ఎదురుగా వచ్చిన మినీ బస్సును టిప్పర్‌ అత్యంత వేగంగా ఢీకొంది.

దాదాపు 35నుంచి 38 ఏళ్ల మధ్యనున్న మృతులంతా దావణగెరె నగర పరిధి విద్యానగరకు చెందిన ఎంసీసీ బ్లాక్‌ నివాసులని గుర్తించారు.

గాయాలైన వారి పరిస్థితి కూడా విషమంగా ఉంది. స్థానికులకు అందిన సమాచారం ప్రకారం.. బాల్య స్నేహితురాళ్లు కొంతకాలంగా చిట్టీలు వేసుకున్నారు. అలా సమకూర్చుకున్న ఆదాయంతో సంక్రాంతినాడు గోవా యాత్రకు బయలుదేరారు. ఈ సమయంలోనే ప్రమాదం చోటుచేసుకుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)