టాటా నానో: కొత్త ఎలక్ట్రిక్ కారుతో రతన్ టాటా కల ఇప్పటికైనా నెరవేరుతుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గుల్షన్ కుమార్ వనకర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అది 2008 జనవరి 10. దిల్లీ ప్రగతి మైదాన్‌లో ఆటో ఎక్స్‌పో జరుగుతోంది. టాటా మోటార్స్ కొత్తగా ఏం తీసుకురాబోతోందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అప్పటికే సుమో, సియారా, సఫారీ, ఇండికా లాంటి మోడళ్లతో మార్కెట్‌లో టాటా ఆధిపత్యం కొనసాగుతోంది. కానీ, జనవరి 10న మాత్రం చాలామంది మధ్యతరగతి ప్రజల్లో ఆశలు నింపుతూ కొత్త మోడల్‌ను ఆవిష్కరించాలని సంస్థ భావించింది.
ఇది టాటా చైర్మన్ రతన్ టాటా కల. కేవలం రూ. లక్షకే మధ్యతరగతి ప్రజల కోసం ఒక మంచి కారును తీసుకురావాలని ఆయన ఎప్పటినుంచో భావించారు. అయితే, ఆయన కల నెరవేరుతుందా? అని ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆశలు, ఆకాంక్షల నడుమ ఒక చిన్న కారులో రతన్‌టాటా చాలా ఉత్సాహంతో వేదికపైకి వచ్చారు. నిజానికి అక్కడ చాలా మందిని ఆ కారు తొలి చూపులోనే ఆకట్టుకోగలిగింది. దీని పేరే నానో. దీని ధర కూడా రతన్ టాటా చెప్పినట్లే రూ.లక్ష అని ప్రకటించారు. దీనిపై అప్పట్లో మీడియాలో విపరీతంగా చర్చ జరిగింది.
ఆ వెంటనే తమ ఇంటిలోకి తొలి కారుగా నానోను ఆహ్వానించేందుకు చాలా మంది బుకింగ్‌లు చేసుకున్నారు. కొంతమంది ఇంట్లో కారు ఉన్నప్పటికీ, నానోపై ఇష్టంతో బుకింగ్ చేశారు. అయితే, బుకింగ్ నుంచి డెలివరీ మధ్య ఈ కారు చాలా మారింది. దీనికి కారణం ఏమిటి?

ఫొటో సోర్స్, Getty Images
నానో ఎలా తయారుచేశారు?
రూ. లక్షకు కారును మార్కెట్‌లోకి తీసుకురావడం అంత తేలిక కాదు. దీనికి ముందుగా ఒక మినీ ట్రక్కు టాటా ‘‘ఎస్’’ను తీసుకువచ్చారు. దీన్ని మార్కెట్‌లో ‘‘ఛోటా హాథి’’గా అంటే చిట్టి ఏనుగుగా పిలుచుకునేవారు. ఇది అప్పట్లో ఒక సంచలనం అని చెప్పుకోవాలి.
ఛోటా హాథి తర్వాత అదే విజయాన్ని కార్లలోనూ పునరావృతం చేసేందుకు గిరీశ్ వాఘ్ నేతృత్వంలో టాటా మోటార్స్ ఒక యువ బృందాన్ని నియమించింది. రతన్ టాటా ‘‘నానో’’ కలను నెరవేర్చే బాధ్యతలను ఈ బృందానికి అప్పగించింది.
2018 దిల్లీ ఆటో ఎక్స్‌పోలో బీబీసీతో గిరీశ్ వాఘ్ మాట్లాడారు. ‘‘మేం ఆ ప్రాజెక్టుపై పని మొదలుపెట్టినప్పుడు మాతో సంస్థ చైర్మన్ రతన్ టాటా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవికాంత్ మాట్లాడారు. ఇది మనకు చాలా ముఖ్యమైన ప్రాజెక్టని చెప్పారు. ఆ తర్వాత దాదాపు ఏడాదిపాటు మేం ఈ ప్రాజెక్టుపై పనిచేశాం. పేపర్‌పై డిజైన్ నుంచి కొత్త ఫ్యాక్టరీ నిర్మాణం వరకు చాలా సమయం పట్టింది’’అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
సింగూర్ నుంచి సాణంద్
పశ్చిమ బెంగాల్‌లోని సింగూర్‌లో మొదట నానో ప్లాంటు ఏర్పాటుచేశారు. దీని కోసం స్థానిక రైతుల నుంచి భూమిని సేకరించారు. ఇక్కడ పూర్తిస్థాయి ఫ్యాక్టరీ ఏర్పాటుతో నానో తయారీ ప్రక్రియలు మొదలయ్యాయి. అయితే, ఈ పనులు కొద్దికాలంలోనే నిలిచిపోయే పరిస్థితి వచ్చింది.
అప్పట్లో ప్రతిపక్షం లోనున్న తృణమూల్ నాయకురాలు మమతా బెనర్జీ నేతృత్వంలో రైతులు ఇక్కడ పెద్దయెత్తున నిరసనలు చేపట్టారు.
మొత్తానికి భారీ నిరసనల నడుమ తమ ఉద్యోగులకు ముప్పు పొంచివుందని సింగూర్ ప్లాంటును సెప్టెంబరు 2008లో మూసేస్తున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. అప్పుడే కొత్త ప్రాంతంలో ఈ ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.
అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉండేవారు. తమ రాష్ట్రంలోని సాణంద్‌లో ప్లాంటు ఏర్పాటుచేసేందుకు తాము భూమి ఇస్తామని ఆయన ప్రకటించారు.
అయితే, సింగూర్ నుంచి సాణంద్‌ల మధ్య దూరం దాదాపు రెండు వేల కి.మీ.. అక్కడి నుంచి ఇక్కడకు ఆ ప్లాంటును తీసురావడం అంత తేలిక కాదు. దీని కోసం కొన్ని ప్రతిపాదనలు తీసుకొచ్చారు.
వీటిలో మొదటిది మెషీన్లు, విడి భాగాలు, ఇతర మెటీరియల్స్ ఇలా మొత్తం అన్నింటినీ రోడ్డు మార్గంలో సింగూర్ నుంచి సాణంద్‌కు తీసుకెళ్లాలి. ఇక రెండోది ఉత్తరాఖండ్‌లోని పంత్‌నగర్, మహారాష్ట్రలోని పుణెల్లోని ఫ్యాక్టరీల్లో నానో తయారీ మొదలయ్యేలా కొన్ని భాగాలను ముందుగా అక్కడకు పంపించడం. ఫలితంగా బుకింగ్‌లకు అనుగుణంగా అక్కడ తయారీ మొదలుపెట్టొచ్చు.

ఫొటో సోర్స్, AP
అయితే, మొత్తంగా 3,340 ట్రకులు, 495 కంటైనర్లలో ఏడు నెలల్లో మొత్తం ఫ్యాక్టరీని సింగూర్ నుంచి సాణంద్‌కు తరలించారు. అలా ఆ రూ.1800 కోట్ల ఫ్యాక్టరీ సాణంద్‌కు చేరింది.
2009 నవంబరులో అంటే సింగూర్‌లో తయారీ ప్రక్రియలు నిలిపివేసిన 14 నెలల తర్వాత, సాణంద్‌లో మళ్లీ నానో పనులు మొదలయ్యాయి.
అయితే, అదే ఏడాది ఇండియన్ కార్ ఆఫ్ ద ఇయర్ అవార్డును నానో గెలుచుకుంది.
కారు ఆవిష్కరణ సమయంలో అత్యంత చవకైన కారుగా అంతర్జాతీయ స్థాయిలో నానో వార్తల్లో నిలిచింది. 1930ల్లో ఫోక్స్‌వ్యాగన్, 1950ల్లో ఫియట్ కార్ల తరహాలో మార్కెట్లో ఇది అందరి నోళ్లలోనూ నానింది.
అసలు ఈ రూ.లక్ష కారు ఎప్పుడు బుక్ చేసుకుందామా? ఎప్పుడు ఇది ఇంటికి వస్తుందా? అని మధ్యతరగతి ప్రజల్లో ఆసక్తిని టాటా మోటార్స్ మరింత పెంచింది. బుకింగ్స్ విపరీతంగా పెరగడంతో లక్కీడ్రాలు తియ్యడం కూడా మొదలుపెట్టారు. అయితే, ఈ కారును రూ.లక్షకు అందించడం సంస్థకు కష్టమైంది. దీంతో ధరలు పెంచడం అనివార్యమైంది.

ఎందుకు విఫలమైంది?
రతన్ టాటా చెప్పిన తర్వాత, ఈ కారు మార్కెట్‌లోకి రావడానికి దాదాపు నాలుగైదేళ్లు పట్టింది. ఈ మధ్యలో కారులో ఉపయోగించే విడి భాగాల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో టాటా మోటార్స్ కూడా ధరను పెంచాల్సి వచ్చింది.
ధరలు పెంచడంతో మారుతి 800, మారుతి ఆల్టోకు మధ్య తేడా తగ్గిపోయింది. ఫలితంగా మళ్లీ అందరూ మారుతీ వైపు వెళ్లడం మొదలుపెట్టారు.
మరోవైపు అప్పుడే నానోలో చాలా లోపాలున్నాయంటూ వార్తలు రోజూ రావడం మొదలైంది. వీటిని సరిచేస్తూ వచ్చేసరికి డెలివరీ కూడా ఆలస్యం అయ్యేది. ప్రజల్లో ఆసక్తి తగ్గడానికి ఇది కూడా ఒక కారణం.
మొడటి మోడల్‌లో వెనుక ట్రంక్ లేదు. ఇంజిన్ కూడా పెద్ద శబ్దం చేసేది. కారులోపల ప్లాస్టిక్స్ కూడా తేలిగ్గా పాడయ్యేవి.. ఇలా వార్తలు వచ్చాయి.
2014లో కార్ల సేఫ్టీకి రేటింగ్ ఇచ్చే గ్లోబల్ ఎన్‌సీఏ ఏకంగా నానోకు జీరో రేటింగ్ ఇచ్చింది. కొన్ని నానోల్లో ప్రయాణంలోనే అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయనే వార్తల నడుమ ఈ రేటింగ్ వచ్చింది. ఇది నానోపై చావు దెబ్బకొట్టిందని చెప్పాలి. ఆ జీరో రేటింగ్ తర్వాత చాలా మంది బుకింగ్‌లను రద్దు చేసుకున్నారు.
అదే సమయంలో మార్కెట్‌లో తమ బ్రాండ్‌ను కాపాడుకోవడానికి నానో ట్విస్ట్, జెన్-ఎక్స్ నానో లాంటి కార్లను టాటా తీసుకొచ్చింది. వీటిలో ఏఎంటీ గేర్‌బాక్స్ టెక్నాలజీ లాంటివి అదనంగా చేర్చారు. మరోవైపు సీఎన్‌జీతో నడిచే కార్లను కూడా ప్రవేశపెట్టారు. ఏంచేసినా మార్కెట్‌లో నానో కొనుగోళ్లు మాత్రం పెరగలేదు.
మొత్తానికి నానో ప్రయోగం విఫలమైందని ఒక ఇంటర్వ్యూలో రతన్ టాటా కూడా అంగీకరించారు. ‘‘మేం చవకైన ధరకు మాత్రమే కారును తీసుకురావాలని అనుకోలేదు. అందరూ మెచ్చే, అందుబాటులో ఉండే కారును మేం తీసుకురావాలని అనుకున్నాం’’అని ఆయన చెప్పారు.
మళ్లీ ఇప్పుడు కొత్తగా..
ఏడాదికి మూడు లక్షల కార్ల విక్రయాలే లక్ష్యంగా నానోను టాటా మోటార్స్ మార్కెట్‌లోకి దించింది. కానీ, ఈ లక్ష్యం నెరవేరలేదు.
టాటా గ్రూప్ నాయకత్వ బాధ్యతలు సైరస్ మిస్త్రి తీసుకున్న తర్వాత, తమ దగ్గర నష్టాలు తెచ్చే ప్రాజెక్టులను మూసేద్దామని ముందుగా ఆయన సూచించారు. ఆ నష్టాలు తెచ్చే ప్రాజెక్టుల్లో రతన్ టాటా నానో కూడా ఒకటి.
ఈ విషయంలో రతన్ టాటా, మిస్త్రిల మధ్య విభేదాలు కూడా వచ్చాయి. మొత్తానికి ఈ వివాదాల నడుమ పదవి నుంచి మిస్త్రిని తప్పించారు.
కంపెనీ నాయకత్వం మారినప్పటికీ డిసెంబరు 2019లో దాదాపుగా నానోకు తెరపడింది. మొత్తంగా పదేళ్లలో మూడు లక్షల నానో కార్లు అమ్ముడుపోయాయి.
అయితే, ఇప్పుడు మళ్లీ ఎలక్ట్రిక్ నానోను తీసుకురాబోతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, వీటిని టాటా గ్రూప్ ఖండించడంలేదు. మరోవైపు ధ్రువీకరించడంలేదు కూడా.
2010 జెనీవా మోటార్ షోలోనే నానా ఎలక్ట్రిక్ వేరియంట్‌ను టాటా మోటార్స్ ప్రదర్శనకు పెట్టింది. 160 కి.మీ. రేంజ్‌లో కేవలం పది సెకన్లలోనే 60 కి.మీ.ల గరిష్ఠ వేగాన్ని అందుకునేలా దీన్ని సిద్ధంచేసినట్లు తెలిపింది. అయితే, ఇప్పటికీ దాదాపు 13 ఏళ్లు గడిచాయి.
గత ఏడాది తాజ్ హోటల్‌కు ఎలక్ట్రిక్ నానోలో వెళ్తూ రతన్ టాటా కనిపించారు. దీంతో మళ్లీ మార్కెట్‌లోకి ఎలక్ట్రిక్ నానో వస్తుందనే వార్తలు మొదలయ్యాయి.
ప్రస్తుతం మార్కెట్‌లోని ప్రధాన కార్ల తయారీ సంస్థల్లో టాటా మోటార్స్ కూడా ఒకటి. ఇప్పటికే నెక్సన్, టైగర్, టియాగో ఎలక్ట్రిక్ కార్లను సంస్థ అమ్ముతోంది. మార్పుల తర్వత కొత్తగా ముస్తాబై వచ్చే ఎలక్ట్రిక్ నానోకు మార్కెట్‌లో మంచి స్పందన రావొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- స్వామి వివేకానంద: గోరక్షకుడిని అంటూ భిక్షకు వచ్చిన వ్యక్తిని ఏమని ప్రశ్నించారు?
- ‘‘నన్ను కెమెరా ముందు కూర్చోబెట్టి నీ సెక్స్ సంబంధాల గురించి చెప్పు అని అడిగారు’’
- ఆస్కార్-ఆర్ఆర్ఆర్: ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల ‘నాటు నాటు’ పాట ఎలా పుట్టింది?
- నాటు నాటు సాంగ్‌కు దక్కిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ప్రత్యేకలేంటి ?
- తెలంగాణ: ఇంటర్ విద్యార్థులకు హెచ్‌సీఎల్‌లో సాఫ్ట్వేర్ జాబ్... ఎంపిక ఎలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















