క్రైస్తవ మిషనరీలు మత మార్పిడుల కోసం బుద్ధుడి జన్మస్థలాన్ని టార్గెట్ చేశాాయా?

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రైస్తవ సమాజాలలో నేపాల్ ఒకటి
ఫొటో క్యాప్షన్, ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రైస్తవ సమాజాలలో నేపాల్ ఒకటి
    • రచయిత, కెవిన్ కిమ్, రెబెక్కా హెన్‌ష్కే
    • హోదా, నేపాల్ నుంచి

నేపాల్‌లో మత మార్పిడులకు పాల్పడడం చట్టవిరుద్ధం. కానీ, క్రైస్తవ విశ్వాసాలను వ్యాప్తి చేయడానికి మిషనరీలు రిస్క్ తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నాయి.

కొరియా పాస్టర్ పాంగ్ చాంగ్ ఇన్, హిమాలయ సానువుల్లోని జర్లాంగ్ గ్రామంలో కొత్తగా ఏర్పాటైన చర్చిని ఆశీర్వదిస్తూ ‘విక్టరీ టు జీసెస్’ అంటూ ఏడుస్తారు.

కొత్తగా క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వారంతా చర్చిలో చేతులు పెకెత్తి ప్రార్థనలు చేస్తారు. వీరిలో చాలా మంది తమాంగ్ కమ్యూనిటీకి చెందినవారే. వీరంతా పురాతన ఆధ్యాత్మిక అభ్యాసమైన ‘లామా’ విశ్వాసాన్ని అనుసరించేవారు.

తమాంగ్ ప్రజలను ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా పేదవారిగా పాంగ్ భావిస్తారు.

‘‘ఒక అద్భుతం జరుగుతుంది. గ్రామం మొత్తం మతం మారుతుంది’’ అని పాంగ్ అన్నారు.

నేపాల్ ఒకప్పుడు హిందు రాజ్యం. బుద్ధుడి జన్మస్థలం. నేపాల్‌లో ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెరుగుతున్న ఒక క్రైస్తవ కమ్యూనిటీని నిర్మించడంలో మిషనరీలతో పాటు పాంగ్ వంటి చాలామంది దక్షిణ కొరియా పాస్టర్లు సహాయపడ్డారు.

నేపాల్‌లోని క్రైస్తవుల సంఖ్యలో ఎక్కువ భాగం దళితులే ఉన్నారు. సంప్రదాయిక హిందు కుల వ్యవస్థలో దళితులు అట్టడుగున ఉంటారు.

పాంగ్ చెప్పినట్లు వారు అద్భుతాలను విశ్వసించవచ్చు. కానీ మతం మారడం వల్ల వారికి వేళ్లూనుకున్న పేదరికం, వివక్ష నుంచి తప్పించుకునే అవకాశం వస్తుంది.

జార్లాంగ్‌‌లో ప్రారంభమైన కొత్త చర్చి
ఫొటో క్యాప్షన్, జార్లాంగ్‌‌లో ప్రారంభమైన కొత్త చర్చి

నేపాల్‌లో రెండు దశాబ్దాల కాలంలో దాదాపు 70 చర్చిల ప్రారంభోత్సవాలను పాంగ్ పర్యవేక్షించారు. రాజధాని ఖాట్మండ్‌కు రెండు గంటల దూరంలో ఉండే దాడింగ్ జిల్లాలో ముఖ్యంగా ఎక్కువ చర్చిలు పుట్టుకొచ్చాయి. ఈ కమ్యూనిటీ ప్రజలు భూమిని విరాళంగా ఇస్తారని, ఇక్కడ చర్చి నిర్మాణంలో కొరియన్ చర్చిలు ఆర్థిక సహాయం చేస్తాయని పాంగ్ చెప్పారు.

‘‘దాదాపు ప్రతీ పర్వత లోయలో చర్చిలు నిర్మాణం అవుతున్నాయి’’ అని పాంగ్ తెలిపారు.

ఈ వ్యాఖ్య కాస్త అతిశయోక్తి అనిపించొచ్చు. కానీ, ఇటీవలి సంవత్సరాల్లో నేపాల్‌లో చర్చిల సంఖ్య భారీగా పెరిగిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. జాతీయ క్రైస్తవ సమాజం సర్వే విడుదల చేసిన తాజా డేటా ప్రకారం, నేపాల్‌లో 7,758 చర్చిలు ఉన్నాయి.

నేపాల్‌లోని ఈ మార్పు వెనుక దక్షిణ కొరియా మిషనరీలు ఉన్నాయి.

నేపాల్ ఇప్పుడొక లౌకిక దేశం. 2015లో ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగం ప్రకారం అక్కడ మత స్వేచ్ఛ ఉంది.

నేపాల్ 2018లో మతమార్పిడి నిరోధక చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం, ఎవరైనా మతం మారాలని ప్రోత్సహిస్తే అయిదేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

‘‘మత మార్పిడి నిరోధక చట్టం కారణంగా మేం ఎప్పుడూ ఆందోళనతో పని చేస్తున్నాం. కానీ భయాన్ని కారణంగా చూపుతూ సువార్తను వ్యాప్తి చేయకుండా ఉండలేం. ప్రజలను రక్షించడం మేం ఆపబోం’’ అని పాంగ్ భార్య లీ జియోంగ్ హీ అన్నారు.

పాంగ్ చాంగ్ ఇన్, లీ జియోంగ్ హీ
ఫొటో క్యాప్షన్, పాంగ్ చాంగ్ ఇన్, లీ జియోంగ్ హీ

పాంగ్ దంపతులు గతంలో బ్యాంకులో పనిచేసేవారు. ‘‘మొదట నా భర్తను దేవుడు అనుగ్రహించారు. మమ్మల్ని నేపాల్‌కు వెళ్లమని చెప్పాడు’’ అని లీ జియోంగ్ హీ చెప్పారు.

2003లో ఈ జంట నేపాల్‌కు చేరుకున్నప్పుడు నేపాల్‌ను ఒక హిందూ రాజ కుటుంబం పాలిస్తుంది.

‘‘చాలా రకాల విగ్రహాలను పూజించడం చూసి నేను ఆశ్చర్యపోయా. నేపాల్‌కు సువార్త అవసరం చాలా ఉందని నేను భావించా’’ అని పాంగ్ వెల్లడించారు.

వారు నేపాల్ వచ్చిన అయిదేళ్ల తర్వాత, 240 ఏళ్ల నాటి రాచరికాన్ని నేపాల్‌లో రద్దు చేశారు. దశాబ్దం పాటు సాగిన అంతర్యుద్ధం తర్వాత ఈ మార్పు వచ్చింది. దీంతో 2008లో నేపాల్‌ను లౌకిక, గణతంత్ర రాజ్యంగా ప్రకటిస్తూ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

‘‘ఈ మార్పు మిషనరీ పనికి స్వర్ణయుగాన్ని తెచ్చింది’’ అని పాంగ్ చెప్పారు.

నేపాల్‌లో 300 కొరియన్ మిషనరీ కుటుంబాలతో కూడిన ఒక సమాజంలో పాంగ్ దంపతులు కూడా భాగంగా ఉన్నారు.

ఖాట్మండులోని భైసేపతి శివారులోని ఒక కొరియన్ చర్చి పరిసర ప్రాంతాల్లో ఈ సమాజానికి చెందిన వారు ఎక్కువగా నివసిస్తారు.

అయితే ఈ సమాజంలోని ఎవరూ అధికారికంగా మిషనరీలు కాదు. వారు వ్యాపారం లేదా చదువు వీసా మీద వచ్చారు. కొందరు రెస్టారెంట్లు, మరికొంతమంది చారిటీలను నడుపుతున్నారు.

కొరియన్ మిషనరీ కమ్యూనిటీతో కొన్ని వారాలు మేం ఉన్నాం. అయితే ఆ కమ్యూనిటీలో పాంగ్, ఆయన భార్య మాత్రమే మాతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. ‘‘నేపాల్‌లో దేవుడు ఏమి చేస్తున్నాడో చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా’’ అని పాంగ్ అన్నారు.

తాము చేస్తున్న పనిని చట్ట ఉల్లంఘనగా వారు చూడరు. ఎందుకంటే తాము బహిరంగంగా మతమార్పిడిలు, బాప్టిజాన్ని చేయడం లేదని వారు నమ్ముతున్నారు.

‘‘మా మిషనరీ పని కేవలం మా గురించి మాత్రమే కాదు. దేవుడు ఈ పని చేస్తున్నారు. నేపాల్‌లో అద్భుతాలు సృష్టించడానికి దేవుడు మా ద్వారా ఎలా పనిచేస్తున్నాడో మేం చూపించాలని అనుకుంటున్నాం’’ అని ఆయన అన్నారు.

నేపాల్ జనాభాలో క్రైస్తవుల శాతం 2 కంటే తక్కువ. హిందువులు 80 శాతం, బౌద్ధులు 9 శాతంగా ఉన్నారు. కానీ, సెన్సస్ డేటా వారి సంఖ్యలో వృద్ధి ఉన్నట్లు సూచిస్తోంది.

1951 నాటికి నేపాల్‌లో అసలు క్రైస్తవులే లేరు. 1961లో వారి సంఖ్య కేవలం 458 మంది. కానీ, 2011 వచ్చే నాటికి అక్కడ క్రైస్తవుల సంఖ్య 3,76,000కు చేరింది. తాజా సెన్సస్ గణాంకాల ప్రకారం ఇప్పుడు వారి జనాభా 5,45,000 వరకు ఉండొచ్చని అంచనా.

మాజీ ఉప ప్రధాని కమల్ థాపా
ఫొటో క్యాప్షన్, మాజీ ఉప ప్రధాని కమల్ థాపా

‘‘ఇది దావానలంలా వ్యాపిస్తోంది. సాంస్కృతిక గుర్తింపు, జాతీయ ఐక్యత ప్రమాదంలో ఉన్నాయి" అని మాజీ ఉప ప్రధాని కమల్ థాపా అన్నారు.

దేశ సాంస్కృతిక గుర్తింపుపై కొరియన్ మిషనరీ వర్క్‌ను ఆయన వ్యవస్థీకృత దాడిగా భావిస్తున్నారు.

"మిషనరీలు తెరవెనుక నుంచి పనిచేస్తున్నాయి. పేద, అమాయకులను మోసం చేస్తూ వారిని క్రైస్తవ మతంలోకి మారమని ప్రోత్సహిస్తున్నారు.

ఇది మత స్వేచ్ఛకు సంబంధించిన అంశం కాదు. మతం పేరుతో చేస్తున్న దోపిడి ఇది" అని ఆయన వ్యాఖ్యానించారు.

నేపాల్‌ను తిరిగి హిందూ రాష్ట్రంగా మార్చాలని ఆయన చర్చలు జరుపుతున్నారు. మతమార్పిడి నిరోధక చట్టాన్ని ప్రవేశపెట్టడాన్ని ఆయన స్వాగతించారు. అది కఠినంగా అమలు అయ్యేలా చూడాలన్నారు.

ఈ చట్టం కింద అభియోగాలు నమోదైన వారిలో క్రైస్తవులే ఉన్నారు. కానీ, ఇంతవరకు ఎవరినీ దోషులుగా నిర్ధారించలేదు. సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల కొన్ని కేసులు కొట్టివేశారు. అప్పీల్‌పై కొంతమంది నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారు.

నేపాల్ క్రైస్తవ సమాజం ప్రకారం, ప్రస్తుతం అయిదు క్రియాశీల కేసులు ఉన్నాయి. డిసెంబర్‌లో ఇద్దరు నన్‌లతో సహా నలుగురు కొరియన్లపై అభియోగాలను కొట్టివేశారు.

పాస్టర్ డిల్లీ రామ్ పాడెల్
ఫొటో క్యాప్షన్, పాస్టర్ డిల్లీ రామ్ పాడెల్

మత మార్పిడి నిరోధక చట్టం కింద తొలుత ప్రశ్నించిన వ్యక్తుల్లో నేపాల్ క్రైస్తవ సమాజానికి నాయకత్వం వహిస్తోన్న పాస్టర్ డిల్లీ రామ్ పాడెల్ కూడా ఒకరు.

ప్రజలు మతం మారేందుకు లంచం ఇచ్చారని 2018లో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. వీటిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆ తర్వాత అతనిపై అభియోగాలను కొట్టివేశారు.

"మత మార్పిడిలకు పాల్పడినట్లు నాపై ఆరోపణలు వచ్చాయి. కానీ ఆ శక్తి నా చేతుల్లో లేదు. ఒకవేళ అంత శక్తి ఉంటే నేను మా అమ్మనే మతం మారిపోయేలా చేసేవాడిని. ఇప్పుడు ఆమె వయస్సు 92 ఏళ్లు. నేను ఆమెకు డబ్బు ఇవ్వగలను. ఆమె కోసం ప్రార్థించగలను. కానీ, ఆమె మతాన్ని నేను మార్చలేను. ఎందుకంటే అది జీసెస్ నుంచి జరగాలి’’ అని ఆయన అన్నారు.

డిల్లీ రామ్ పాడెల్ ఒక హిందూ కుటుంబానికి చెందినవారు. ఆయన ఒక పూజారి. ఆయన కుటుంబంలోని 21 తరాలు కూడా ఇదే వృత్తిలో ఉన్నాయి. 20 ఏళ్ల వయస్సున్నప్పడు చదువుకోవడం కోసం ఆయన కొరియా వెళ్లారు. అక్కడే అతను క్రైస్తవ మతానికి ఆకర్షితులు అయ్యారు.

‘‘నేను అప్పుడు ఒంటరిగా ఉండేవాడిని. స్నేహితులు కూడా లేరు. అప్పుడు నేపాలీ భాషలో ఉన్న కొరియన్ బైబిల్‌ను కొంతమంది నాకు ఇచ్చారు. దాన్ని ఒక్క రాత్రిలోనే చదివేశాను. నా సృష్టికర్తను కనుగొన్నాను. ఇది తమాషాగా ఉందా? నమ్మశక్యంగా అనిపించడం లేదా? కానీ, నాకు అదే జరిగింది’’ అని ఆయన చెప్పారు.

చిన్నతనంలో హిందు పూజారిగా డిల్లీ రామ్ పాడెల్ పనిచేశారు
ఫొటో క్యాప్షన్, చిన్నతనంలో హిందు పూజారిగా డిల్లీ రామ్ పాడెల్ పనిచేశారు

తిరిగి ఇంటికి వచ్చినప్పుడు అతని కుటుంబం ఆయనను బహిష్కరించింది. ‘‘క్రైస్తవం అనేది ఒక విదేశీ మతం అని కొందరు చెప్పారు. కొంతమంది నాకు పిచ్చి అని, నాకు తెలివిలేదని అన్నారు. మళ్లీ నన్ను నా కుటుంబం, సమాజం అంగీకరించడానికి చాలా సమయం పట్టింది’’ అని ఆయన తెలిపారు.

ప్రతీ సంవత్సరం 2,000 కంటే ఎక్కువ మంది నేపాలీ విద్యార్థులు చదువుకోవడం కోసం కొరియాకు వెళ్తారు.

"నేపాల్‌లో సువార్త పని చేయడం సవాలు లాంటిది. ఇందుకోసం మాకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. మా లక్ష్యం మతమార్పిడి చేయడమే. పాస్టర్ డిల్లీ రామ్ పాడెల్ చిన్నతనంలో హిందూ పూజారి. మేం ఎవరినైనా మార్చుకోగలం. కాబట్టి మేం జాగ్రత్తగా ఉండాలి’’ అని తమ వివరాలు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఒక కొరియన్ మిషనరీ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)