వగీర్: ‘శత్రువుల కంటపడకుండా సముద్రంలో కదిలే జలాంతర్గామి’

ఫొటో సోర్స్, PRO Defence Mumbai/Twitter
కలవరి శ్రేణికి చెందిన అయిదో జలాంతర్గామి 'వగీర్' నేడు భారత నౌకాదళంలో చేరింది.
ముంబైలోని మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్(ఎండీఎల్) దీన్ని నిర్మించింది.
పోయిన ఏడాది డిసెంబర్ 20న భారత నౌకాదళానికి దాన్ని అప్పగించారు. ప్రస్తుతం నేవీలో నాలుగు కలవరి శ్రేణి సబ్‌మెరైన్‌లు ఉన్నాయి.
శత్రువుల కంట పడకుండా సంచరించగల ఆధునిక టెక్నాలజీ వగీర్‌లో ఉందని, ఇది సముద్రజలాల్లో భారత సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని భావిస్తున్నారు.
భారత నౌకాదళంలో 1973లో తొలిసారి 'వగీర్'ను తీసుకొచ్చారు. మూడు దశాబ్దాల పాటు సేవలు అందించిన ఆ జలాంతర్గామిని 2001లో డీకమిషన్ చేశారు.
ఆ తరువాత మరింత అధునాత ‘వగీర్’ కోసం 2020 నవంబరులో కొత్త ప్రాజెక్ట్ చేపట్టారు. అతి తక్కువ సమయంలో భారత్‌లో నిర్మించిన తొలి జలాంతర్గామి ఇదేనని నేవి చెబుతోంది.
ప్రాజెక్ట్-75 కింద కలవరి శ్రేణిలో ఆరో జలాంతర్గామి నిర్మాణం వేగంగా జరుగుతోంది. దీన్ని ఫ్రెంచ్ కంపెనీ డిజైన్ చేసింది.
భారత సముద్ర జలాల్లో భద్రతను మరింత పెంచడానికి వగీర్ తోడ్పడుతుందని నేవి అధికారు ఒకరు వార్తా సంస్థ పీటీఐతో అన్నారు.
భారతదేశ ఉత్పత్తి సామర్థ్యాన్ని చాటిచెప్పడానికి కూడా ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుందని నేవి తెలిపింది.

ఫొటో సోర్స్, ANI
అత్యుత్తమ సెన్సార్ వ్యవస్థ
సరిహద్దు సంబంధిత సమస్యలపై భారత్, చైనాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా ఉనికి పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
గతేడాది ఆగస్టులో చైనాకు చెందిన 'యువాన్ వాంగ్ 5' నౌకను హంబన్‌టోట నౌకాశ్రయానికి శ్రీలంక అనుమతించింది. దీనిపై భారత్ కూడా శ్రీలంక ప్రభుత్వానికి నిరసన తెలిపింది.
అది గూఢచారి, నిఘా నౌక అని చెబుతున్నారు. హంబన్‌తోట ఓడరేవును చైనా సాయంతో నిర్మించారు. అయితే రుణాన్ని తిరిగి చెల్లించలేకపోవడంతో దానిని 99 సంవత్సరాలు చైనాకు తాకట్టు పెట్టారు.
ఈ శ్రీలంక ప్రాంతం తమిళనాడుకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున జాఫ్నాలో చైనా ఉనికిని భారతదేశానికి ముప్పుగా పరిగణిస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
వగీర్ అత్యుత్తమ సెన్సార్‌లు కలిగి ఉందని ఇండియా టుడే తన కథనంలో పేర్కొంది. వైర్-గైడెడ్ టార్పెడోలు (నౌక విధ్వంసకాయుధం), పెద్ద శత్రు నౌకాదళాన్ని తుదముట్టించడానికి ఉపరితల క్షిపణులు ఉన్నాయని తెలిపింది.
దాని శక్తివంతమైన డీజిల్ ఇంజిన్‌లు స్టెల్త్ మిషన్ కోసం బ్యాటరీలను త్వరగా ఛార్జ్ చేయగలవని నేవీ తెలిపిందని ఆ కథనం పేర్కొంది.

ఫొటో సోర్స్, INDIAN NAVY
మాజీ ఉద్యోగులు ఏమంటున్నారు?
ఒకవైపు సరిహద్దుల్లో పొరుగు దేశాలతో భారత్ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండగా మరోవైపు సైనిక సామర్థ్యాలను మెరుగుపరిచే ప్రక్రియ కూడా వేగవంతమైంది.
గతేడాది డిసెంబర్ 18న విధ్వంసక యుద్ధనౌక పీ15బీ క్షిపణి భారత నావికాదళంలోకి ప్రవేశించింది.
ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ.. ''మజగావ్ డాక్ షిప్‌బిల్డింగ్ లిమిటెడ్ నిర్మించిన ఈ యుద్ధనౌక రక్షణ పరికరాల తయారీలో దేశానికి ఉన్న సామర్థ్యానికి గొప్ప ఉదాహరణ.
రానున్న కాలంలో మన అవసరాలు తీర్చుకోవడమే కాకుండా ప్రపంచ అవసరాల కోసం యుద్ధనౌకలను నిర్మిస్తామనడంలో సందేహం లేదు.
హిందూ మహాసముద్రంతో నేరుగా ముడిపడి ఉన్న దేశాలలో భారతదేశం ఒకటి. ఈ ప్రాంతంలో ఒక ముఖ్యమైన దేశం కాబట్టి, దాని భద్రతలో మన నౌకాదళం పాత్ర మరింత ముఖ్యమైనది" అని ఆయన అన్నారు.
గతేడాది సెప్టెంబర్‌లో భారత్ తన అతిపెద్ద యుద్ధనౌక విక్రాంత్‌ను నౌకాదళంలో చేర్చుకుంది.
ఆ సమయంలో వైస్ అడ్మిరల్ ఎ.కె. చావ్లా (రిటైర్డ్) బీబీసీతో మాట్లాడుతూ "80వ దశకంలో ఆర్థిక సరళీకరణ తర్వాత చైనా తన నౌకాదళ శక్తిని పెంచుకోకుండా ప్రపంచ శక్తిగా ఎదగలేనని గ్రహించింది.
నేడు వాళ్లది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నౌకాదళం. కొత్త విమానాలను చాలా వేగంగా తయారు చేస్తున్నారు" అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వచ్చే నెలలో అరుణాచల్ ప్రదేశ్‌లో వైమానికి విన్యాసాలు
గత కొన్నేళ్లుగా భారత్, చైనాల మధ్య సంబంధాలు క్షీణించాయి. ఇరు దేశాల సరిహద్దుల్లోని పలు ప్రాంతాల్లో వివాదం కొనసాగుతోంది.
డిసెంబరు 9న భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ వద్దగల తవాంగ్ సెక్టార్‌లో చైనా, భారత సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి.
ఇందులో ఇరు వైపులా సైనికులు గాయపడ్డారు. అంతకుముందు జూన్ 2020లో గాల్వాన్‌లో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణల తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.
ఈ ఉద్రిక్తతల మధ్య వచ్చే నెలలో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం వంటి ఈశాన్య రాష్ట్రాలలో భారతదేశం వైమానిక విన్యాసాలు నిర్వహించనుంది.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్లో పోయిన కరెంటు... ఆర్థికసంక్షోభమే కారణమా
- యుద్ధానికి పిలుస్తారన్న భయంతో అడవిలోకి పారిపోయిన వ్యక్తి, అక్కడెలా బతుకుతున్నారంటే...
- క్రైస్తవం: జెరూసలేంలో మొదటి మహిళా పాస్టర్ నియామకం
- సుభాష్ చంద్రబోస్ 'ద గ్రేట్ ఎస్కేప్': బ్రిటిష్ వాళ్ల కళ్లుగప్పి నేతాజీ దేశం ఎలా దాటారు?
- పస్మాంద ముస్లింలు ఎవరు, ప్రధాని మోది వారి గురించి ఎందుకు ప్రస్తావించారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














