మథుర కారిడార్: ఇక్కడ ఆలయాలను కూలగొడతారా... బృందావన వాసులు ‘రక్తం’తో లేఖలు ఎందుకు రాస్తున్నారు

ఫొటో సోర్స్, Shri Banke Bihari Mandir, Vrindavan/Facebook
- రచయిత, దిల్‌నవాజ్ పాషా
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించొద్దని మేం చేతులు నమస్కరించి వేడుకుంటున్నాం. వెళ్లి మోదీ, యోగిలకు ఈ విషయం చెప్పండి. మాలో చాలా మంది కనీసం నడవలేని స్థితిలో ఉన్నారు. మేమంతా ఎక్కడికి పోవాలి?.’’
ఇవి మథురలో జీవించే వృద్ధురాలు రాధా రాణి తివారీ వ్యాఖ్యలు.
‘‘బంకే బిహారీ మందిర్’’కు వెళ్లే వీధుల్లో జీవించే చాలా మంది ఇదే చెబుతున్నారు. చిన్న పిల్లలు, యువత లేదా వృద్ధులు ఎవరితో మాట్లాడినా ఒకే మాట వినిపిస్తోంది. ‘‘ఠాకుర్‌జీ నుంచి మమ్మల్ని దూరం చేయకండి. మేం ఆయన్ను విడిచి బతకలేం.’’
వారణాసిలోని కాశీ విశ్వనాథ్ మందిరాన్ని అభివృద్ధి చేసినట్లే బృందావన్‌లోని ‘‘బంకే బిహారీ మందిర్’’ ఆవరణలోనూ కొత్త కారిడార్‌ను అభివృద్ధి చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది.
తద్వారా ఇక్కడకు వచ్చే భక్తులకు మెరుగైన సదుపాయాలను కల్పించొచ్చని చెబుతోంది.
కొత్త కారిడార్ కోసం దేవాలయం చుట్టుపక్కల ప్రభుత్వానికి కొన్ని ఎకరాల భూమి అవసరం.

‘‘కొలతలు తీయడంతో..’’
అసలు ఈ కారిడార్ ఎలా ఉంటుంది? ఎప్పటికల్లా ఇది పూర్తవుతుంది? లాంటి అంశాలపై ఇటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లేదా మథుర పరిపాలనా విభాగం స్పందించ లేదు.
ఈ విషయంపై మరింత సమాచారం తెలుసుకునేందుకు మథుర జిల్లా కలెక్టర్‌ను కూడా బీబీసీ సంప్రదించింది. అయితే, ఎలాంటి స్పందనా రాలేదు.
అయితే, బ్రజ్ తీర్థ వికాస్ పరిషత్ (బీటీవీపీ) వైస్ ప్రెసిడెంట్ శైలజా కాంత్ మిశ్ర మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం ఈ విషయం కోర్టు పరిధిలో ఉంది. అందుకే దీని గురించి ఎవరూ ఎక్కువ మాట్లాడటం లేదు’’అని చెప్పారు.
‘‘బృందావన్‌కు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రభుత్వం వీరి కోసం సదుపాయాలను కల్పించాలని భావిస్తోంది. అందుకే కారిడార్ నిర్మించాలని భావిస్తున్నారు’’అని శైలజా కాంత్ మిశ్ర వివరించారు.
కొన్ని రోజుల క్రితం నగర పాలక సంస్థ ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొలతలు తీసుకుంది. దీంతో స్థానికుల్లో ఆందోళన ఎక్కువైనట్లుగా కనిపిస్తోంది.
ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కొన్ని రోజులుగా స్థానికులు నిరసనలు చేపడుతున్నారు.

చర్చ ఎప్పుడు మొదలైంది?
2022 ఆగస్టు 20న కృష్ణాష్టమి రోజు బంకే బిహారీ దేవాలయానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఆ రోజు చోటుచేసుకున్న తొక్కిసలాటలో ఇద్దరు మరణించారు. చాలా మందికి గాయాలయ్యాయి.
దీంతో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ అలహాబాద్ హైకోర్టులో సీనియర్ జర్నలిస్టు, మథుర నివాసి ఆనంద్ శర్మ ఒక ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలుచేశారు.
ఈ వ్యాజ్యం విచారణ సమయంలో 2022 సెప్టెంబరు 27న రాష్ట్ర ప్రభుత్వం.. కోర్టులో ఒక ప్రమాణపత్రాన్ని దాఖలుచేసింది. ఆలయంలో భక్తులకు మెరుగైన సేవలు కల్పించేందుకు తాము కొత్త ట్రస్టును ఏర్పాటుచేస్తామని, ఐదు ఎకరాల్లో ప్రత్యేక కారిడార్‌ను కూడా నిర్మిస్తామని అఫిడవిట్‌లో ప్రభుత్వం పేర్కొంది.
అయితే, ఆ కొత్త ట్రస్టులోని 11 మంది సభ్యులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వమే నామినేట్ చేస్తుంది. ఆలయం నుంచి కేవలం ఇద్దరు గోస్వాములకు మాత్రమే దీనిలో చోటు కల్పిస్తారు.

మరోవైపు తొక్కిసలాట తర్వాత, దీనిపై విచారణకు యూపీ మాజీ డీజీపీ సుల్ఖాన్ సింగ్ నేతృత్వంలో ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఆ కమిటీ కూడా ఇక్కడ కారిడార్ ఏర్పాటుచేయాలని సూచించింది.
యమునా నదిపై వంతెన ఏర్పాటుచేయడంతోపాటు, యమునాపార్ ప్రాంతాల్లో భక్తుల కోసం మెరుగైన సదుపాయాలు ఏర్పాటుచేయాలని నివేదికలో ఆ కమిటీ సూచించింది.
మరోవైపు బంకే బిహారీ దేవాలయానికి తీసుకెళ్లే అన్ని మార్గాల వెడల్పును తొమ్మిది మీటర్ల వరకు విస్తరించాలని కూడా కమిటీ సూచించింది.
ఆనంద్ శర్మ పిటిషన్‌పై విచారణ సమయంలో, ఈ ప్రాంత అభివృద్ధికి దేవాలయ నిధులను ఉపయోగించాలని అలహాబాద్ హైకోర్టు సూచించింది.
‘‘ఆలయ నిర్వహణ సరిగా లేదు. దీన్ని సరిచేయాలి. 400 మందికి సరిపడేలా సదుపాయాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఆలయాన్ని నిర్మించారు. కానీ, వారాంతాల్లో ఇక్కడకు దాదాపు లక్ష మంది వస్తున్నారు. అందుకే తొక్కిసలాట లాంటి పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఇక్కడ సదుపాయాలను మెరుగుపరచాలి. అప్పుడే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి’’ అని బీబీసీతో ఆనంద్ శర్మ చెప్పారు.

కారిడార్ ఎలా ఉంటుంది?
ఇప్పటివరకు అధికారికంగా ఈ కారిడార్ మ్యాప్‌ను ప్రభుత్వం విడుదల చేయలేదు. దీని గురించి ఎలాంటి సమాచారాన్ని బయటకు వెల్లడించడం లేదు.
అయితే, బీబీసీకి అందిన అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. పది వేల మంది భక్తులు సందర్శించుకునేలా ఐదు ఎకరాల్లో ఈ కారిడార్‌ను నిర్మించబోతున్నారు.
యమునా నదీ తీరం నుంచి దేవాలయం వరకు ఈ కారిడార్ ఉంటుంది. ఈ మధ్యలోనున్న ఇళ్లను ఖాళీ చేయించాలని మథుర మున్సిపల్ కార్పొరేషన్ భావిస్తోంది.
అయితే, కోర్టు తీర్పు వచ్చిన తర్వాతే ఇక్కడ పనులు మొదలయ్యే అవకాశముంది.

ఆలయ ప్రతినిధుల ఆగ్రహం ఎందుకు?
బంకే బిహారీ ఆలయం పరిసరాల్లో కారిడార్ నిర్మించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఆలయ గోస్వాములు, పూజారులు, స్థానికులు వ్యతిరేకిస్తున్నారు.
ఈ విషయంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు గోస్వాములు తమ రక్తంతో ఒక లేఖ రాశారు. ఇక్కడ కారిడార్ ప్రయత్నాలు నిలిపివేయాలని దానిలో వీరు అభ్యర్థించారు.
ఆలయాన్ని కాపాడాలంటూ ఆలయ నిర్వహణ కమిటీలో పనిచేసిన రజత్ గోస్వామి సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలుచేశారు. ‘‘ఈ ఆలయం చుట్టుపక్కల ఐదు ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం సేకరించాలని భావిస్తోంది. ఆ భూమి యజమానులకు పరిహారాన్ని ఆలయ నిధుల నుంచి ఇవ్వాలని భావిస్తున్నారు. మరోవైపు ప్రస్తుత ఆలయ నిర్వహణ కమిటీని రద్దుచేసి, కొత్త కమిటీని ఏర్పాటుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మేం వీటిని వ్యతిరేకిస్తున్నాం’’అని ఆయన బీబీసీతో చెప్పారు.
ఆలయ నిధులను ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకోవాలని చూస్తోందని రజత్ గోస్వామి వ్యాఖ్యానించారు.
అయితే, ఇక్కడ కారిడార్ నిర్మించడంతో భక్తులకు మెరుగైన సదుపాయాలను కల్పించడానికి వీలవుతుందని, దేవుడిని దర్శించుకోవడం కూడా తేలిక అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.
అయితే, ఆలయ ప్రతినిధులు ఈ వాదనను విమర్శిస్తున్నారు. దేవాలయానికి చెందిన రాజ్‌భోగ్ ఆనంద్ ఉత్సవ్ సేవా అధికారి జ్ఞానేంద్ర ఆనంద్ కిశోర్ గోస్వామి మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వం ఇలానే కాశీలోనూ కారిడార్ ఏర్పాటుచేసింది. అక్కడ కేవలం సెల్ఫీ పాయింట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ప్రత్యేక సదుపాయాలేమీ లేవు. దూరం నుంచి చూసి వెళ్లిపోండని అన్నట్లుగా అక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా ఆ సెల్ఫీ పాయింట్లే ఏర్పాటుచేస్తారా?’’ అని ఆయన ప్రశ్నించారు.
‘‘ఇక్కడి వీధుల్లో కనిపించే అందమైన వారసత్వ సంపదను ప్రభుత్వం లేకుండా చేయాలని చూస్తోంది. బ్రజ్‌వాసులను ఇక్కడి నుంచి వెళ్లగొట్టాలని భావిస్తున్నారు. ఇక్కడ చాలా దేవాలయాలు ఉన్నాయి. వీటిని పడగొట్టాలని భావిస్తున్నారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

‘‘ఇది విశ్వాసాలపై దాడి’’
మరోవైపు బంకే బిహారీ ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న సుమిత్ మిశ్ర ఇల్లు కూడా ఆలయానికి సమీపంలోనే ఉంటుంది.
తమ ఇంటి బాల్కనీ లోనుంచి కనిపిస్తున్న ఆలయ శిఖరాన్ని చూపిస్తూ సుమిత్ బీబీసీతో మాట్లాడారు. ‘‘మేం ఉదయం నిద్రలేచిన వెంటనే మాకు ఆలయ శిఖరం కనిపిస్తుంది. మేం పడుకునే ముందు కూడా ఈ శిఖరాన్ని దర్శించుకుంటాం. రోజూ మేం దేవుడి దర్శనంలో తరించిపోతుంటాం. ఏదిఏమైనా మేం ఇక్కడి నుంచి వెళ్లం. ఇది మా జన్మ హక్కు. మా నుంచి దీన్ని ఎవరూ తీసేసుకోలేరు’’అని ఆయన చెప్పారు.
అయితే, కారిడార్ కోసం ఎన్ని ఇళ్లను కూలగొట్టాల్సి ఉంటుందో తెలియదు. అయితే, మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు 300 ఇళ్ల పరిధిలోని స్థాలాలకు ఇటీవల కొలతలు తీసుకుంది.
తమ బాల్కనీ నుంచి యమునా తీరాన్ని చూపిస్తూ సుమిత్ మాట్లాడారు. ‘‘ఇక్కడి నుంచి కేవలం 200 మీటర్ల దూరంలో యమునా తీరం ఉంటుంది. అటువైపు వందల ఎకరాల స్థలం ఖాళీగా ఉంది. అక్కడ ఎందుకు భక్తుల కోసం సదుపాయాలు ఏర్పాటుచేయకూడదు?’’అని ఆయన ప్రశ్నించారు.

బంకే బిహారీ దేవాలయానికి వెళ్లే మార్గంలో ఇరుకైన సన్నని మార్గాలు కనిపిస్తాయి. కొన్నిచోట్ల వీటి వెడల్పు కేవలం ఒక మీటరు.. మరికొన్ని చోట్ల మూడు నుంచి నాలుగు మీటర్లు ఉంటుంది. ఈ వీధుల్లోనే కృష్ణుడు ఒకప్పుడు ఆడుకునేవాడని ఇక్కడి స్థానికులు భావిస్తారు.
అయితే, ఈ వీధుల్లోని ఇళ్లపై కొన్ని ఎర్ర గుర్తులు కనిపిస్తున్నాయి. మున్సిపల్ అధికారులు ఈ గుర్తులు వేయడంతో స్థానికుల్లో ఆందోళన ఎక్కువైంది.
ఇక్కడి ఒక ఇంటి బయట నిలబడి ఒక మహిళ బీబీసీతో మాట్లాడారు. ‘‘కారిడార్ నిర్మాణంలో మా ఇల్లు అడ్డు వస్తుందేమోనని మాకు భయమేస్తోంది. మేం మా ఇంటిని విడిచి బయటకు వెళ్లలేం. ఎందుకంటే దేవుడికి సమీపంలోనే మా ఇల్లు ఉంది. మేం దేవుడిని చూడకుండా ఎలా ఉండగలం?’’అని ఆమె ప్రశ్నించారు.
స్థానిక యువకుడు కుంజ్ బిహారీ పాఠక్ మాట్లాడుతూ.. ‘‘మున్సిపల్ కార్పోరేషన్ లేదా రాష్ట్ర ప్రభుత్వం మాకు స్పష్టత ఇవ్వడం లేదు. అసలు ఈ గుర్తులు ఎందుకు పెట్టారో చెప్పడం లేదు. ఏం జరుగుతుందో ఎవరికీ తెలియడం లేదు. ఎవరూ ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోవాలని అనుకోవడం లేదు. బృందావన్‌కు ఇక్కడి వీధులే అందం. వీటిని పూర్తిగా మార్చేస్తే, దేవాలయం అందం దెబ్బతింటుంది’’అని అన్నారు.
తమ ఇళ్లు, సంస్కృతిని కాపాడుకునేందుకు ఎంతవరకైనా వెళ్తామని స్థానికులు చెబుతున్నారు.
బంకే బిహారీ బిజినెస్ అసోసియేషన్ అధ్యక్షుడు, స్థానిక వ్యాపారవేత్త అమిత్ గౌతమ్ మాట్లాడుతూ.. ‘‘ఇది వారసత్వ నగరం. బృందావన్ కుంజ్ అంటే వీధుల నగరం అని అర్థం. ఇక్కడి వీధులను ధ్వంసంచేస్తే, పర్యటకులు చూడటానికి ఏం మిగులుతుంది? ఇక్కడి మాల్స్, భారీ భవంతులు చూడటానికి వారు వస్తారా? అవి ఎక్కడైనా చూడొచ్చు’’అని ఆయన అన్నారు.

‘‘అవే గుర్తింపు’’
దేశ రాజధాని దిల్లీకి 150 కి.మీ. దూరంలో బ్రజ్ ప్రాంతానికి మధ్యలో బృందావన్ కనిపిస్తుంది. యమునా నదీ తీరం వెంబడి సన్నది వీధుల గుండా బంకే బిహారీ ఆలయానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడి వీధుల్లో పూజా సామగ్రి, స్వీట్, చాట్ దుకాణాలు కనిపిస్తాయి. ఈ దుకాణాలు భిన్న రంగుల్లో భక్తులను ఆకట్టుకుంటాయి.
ఇక్కడ చాలావరకు ట్రాఫిక్‌ను నగర శివార్లలోనే నియంత్రిస్తారు. ఆలయానికి వచ్చే భక్తులు కాలినడకనే వస్తుంటారు. ఆ మధ్యలో దుకాణాల్లో వస్తువులు కొనుక్కుంటారు. ఇక్కడి రుచులను కూడా ఆస్వాదిస్తుంటారు.
దేవాలయానికి వెళ్లే మార్గంలో ముఖాలపై చాలా మంది పిల్లలు, యువత ‘‘రాధే రాధే’’అనే గుర్తును పసుపుతో వేయించుకుంటారు. బృందావన్ ఆలయం చుట్టూ తిరిగేందుకు ఇక్కడ మార్గాలు ఉన్నాయి. చాలా మంది వీటి గుండా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. రాధేరాధే అని పాటలు పాడుకుంటూ, భజనలు చేస్తూ వారు ముందుకు వెళ్తారు.
అయితే, ఒకవేళ ఇక్కడ కారిడార్ నిర్మిస్తే, ఇక్కడి రంగులు, సంస్కృతి అంతా మయం అవుతాయని స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

పర్యటకులకు ఏం కావాలి?
ఉదయం అవుతూనే వందల మంది బంకే బిహారీ ఆలయానికి వస్తూ కనిపించారు. కొన్ని వీధుల్లో జనాలతో అడుగు ముందుకు వేయడం కూడా కష్టంగా అనిపించింది.
దిల్లీ నుంచి తమ కుటుంబంతో దేవుడిని దర్శించుకునేందుకు సునీల్ మెహ్తానీ వచ్చారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘ఇక్కడికి వచ్చే భక్తుల కోసం మెరుగైన సదుపాయాలు కల్పిస్తే బావుంటుంది. కారిడార్‌తో దేవుడి దర్శనంలో ఎదుర్కొనే సమస్యలన్నీ తొలగిపోవు. మేం ఒకటో నంబరు మార్గం నుంచి లోపలకు వెళ్తే ఐదో నంబరు మార్గం నుంచి బయటకు వచ్చాం. అలా కాకుండా వెళ్లే వైపు నుంచి బయటకు వస్తే బావుంటంది. చెప్పులు తొలగించేలా చూడటం లేదు. ఇలాంటి అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. వీటికి కారిడార్‌నే నిర్మించాల్సిన అవసరం లేదు’’అని ఆయన చెప్పారు.
సిమ్లా నుంచి కుటుంబంతో పూనమ్ వచ్చారు. ఆమె ఏటా ఇక్కడికి వస్తుంటారు. ఆమె బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘ఇక్కడి వీధులు నేడు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. చిన్నచిన్న దుకాణాలు ఇక్కడ కనిపిస్తాయి. మనకు నచ్చినవి కొనుక్కోవచ్చు. ఒకవేళ కారిడార్ ఏర్పాటుచేస్తే, ఇక్కడ అన్నీ మారిపోతాయి’’అని ఆమె అన్నారు.
అయితే, కొంతమంది భిన్నంగానూ స్పందిస్తున్నారు. బ్యాంకులో పనిచేసి పదవీ విరమణ పొందిన కుశీరామ్ బన్సల్ మాట్లాడుతూ.. ‘‘నేను 40 ఏళ్లుగా బృందావన్‌లో ఉంటున్నాను. రోజూ దేవాలయానికి వస్తాను. ఇక్కడ కారిడార్ ఏర్పాటుచేస్తే బావుంటుంది. ఎందుకంటే అప్పుడు పది రెట్లు ఎక్కువ మంది దేవుడిని దర్శించుకోవచ్చు. ఇక్కడి ఇళ్లలో జీవించే వారికి ప్రభుత్వం పరిహారం ఇస్తుంది’’అని ఆయన అన్నారు.

ఇప్పుడు ఏం చేస్తారు?
వారణాసిలో కాశీ విశ్వనాథ్ కారిడార్ నిర్మాణ సమయంలోనూ ప్రభుత్వం ఇలాంటి నిరసనలను ఎదుర్కొంది. అయితే, మొత్తానికి ఇక్కడ ఆలయానికి సమీపంలోని ఇళ్లు, ఆలయాలను పడగొట్టి కారిడార్ ఏర్పాటుచేశారు. అందుకే స్థానికుల వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇక్కడ కారిడార్ నిర్మిస్తుందని స్థానికులు భావిస్తున్నారు.
కారిడార్ నిర్మించడం తప్పనిసరని బృందావన్‌కు చెందిన వ్యాపారవేత్త కపిల్ దేవ్ ఉపాధ్యాయ్ అన్నారు. ‘‘ప్రస్తుతం ఇక్కడకు వస్తున్న భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వీరికి ప్రస్తుతమున్న సదుపాయాలతో ఆతిథ్యం ఇవ్వలేం. ఇక్కడ మనకు రెండే మార్గాలు ఉన్నాయి. ఏకంగా బంకే బిహారీ విగ్రహాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లి స్థలం ఎక్కువగా ఉండే చోట పెట్టడం లేదా ఇక్కడి రోడ్లను విస్తరించడం. ఇక్కడ మరో మార్గమే లేదు’’అని ఆయన అన్నారు.
‘‘ఇక్కడ చాలా మంది ప్రభావితం అవుతారు. వారి పరిస్థితిని మనం అర్థం చేసుకోగలం. మా చెల్లి ఇల్లు కూడా ఆ కారిడార్ పరిధిలోకి వస్తుంది. అలాంటి వారు చాలా మంది ఉన్నారు. కానీ, ఒక గొప్ప కార్యం కోసం మనం కొన్ని భరించాలి. లేకపోతే, బృందావన్ పరిస్థితి అదుపు తప్పుతుంది’’అని ఆయన చెప్పారు.
(మథురకు చెందిన సురేశ్ సైనీ ఈ కథనం కోసం సాయం అందించారు)
ఇవి కూడా చదవండి:
- ప్రభుత్వ 'ఫ్యాక్ట్ చెక్ టీమ్' కూడా ఫేక్ వార్తలను వ్యాప్తి చేస్తోందా? ఇవిగో ఉదాహరణలు...
- ఇండియా vs న్యూజీలాండ్: నెంబర్1 ర్యాంకుకు మరో అడుగు దూరంలో టీమ్ ఇండియా
- మొగల్లను ఓడించిన ముస్లిం యోధుడు 'బాఘ్ హజారికా'ను కల్పిత పాత్రగా బీజేపీ చిత్రీకరిస్తోందా?
- అటుకులు, పూలతో చేసిన హైబ్రిడ్ బీరుతో పోలాండ్‌లో హిట్ కొట్టిన ఇద్దరు ఇండియన్స్
- 'రూ. 5 కోట్ల లాటరీ తగిలాక అందరూ వచ్చి పలకరిస్తున్నారు'
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















