అటుకులు, పూలతో చేసిన హైబ్రిడ్ బీరుతో పోలాండ్‌లో హిట్ కొట్టిన ఇద్దరు ఇండియన్స్

ఫొటో సోర్స్, CHANDRA MOHAN NALLUR
అటుకులు, హాప్ అనే పువ్వులతో తయారు చేసిన హైబ్రిడ్ బీరును పోలాండ్‌లో విక్రయించిన తొలి వ్యక్తులుగా ఇద్దరు భారతీయులు చరిత్ర సృష్టించారు.
వారిద్దరూ బీరు తయారు చేసేందుకు యుక్రెయిన్ యుద్ధం ఎలా కారణమైందో బీబీసీ ప్రతినిధి ఇమ్రాన్ ఖురేషి వివరించారు.
భారత్‌కు చెందిన చంద్రమోహన్ పోలాండ్‌లో నివసిస్తారు. ఇండో-పోలిష్ చాంబర్ ఆఫ్ కామర్స్ అనే సంస్థలో ఆయన బిజినెస్ రిలేషన్స్ హెడ్‌గా పనిచేసేవారు.
ఒక సంవత్సరం క్రితం ఆయన వద్ద 20 వేల కిలోల రైస్ ఫ్లేక్స్ (అటుకులు) మిగిలిపోవడంతో ఆయన తీవ్రంగా మదనపడ్డారు. తన బిజినెస్ క్లయింట్, సరుకు తీసుకునేందుకు ముందుకు రాకపోవడంతో భారీమొత్తంలో అటుకులు ఆయన వద్దే మిగిలిపోయాయి.
భారత్‌లోని ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక సంస్థ నుంచి ఈ అటుకులను, తృణధాన్యాల (సీరియల్స్) తయారీ కోసం పోలాండ్‌లోని ఒక వ్యాపారవేత్త దిగుమతి చేసుకునేవారు.

ఫొటో సోర్స్, CHANDRA MOHAN
అప్పుడే యుక్రెయిన్ యుద్ధం మొదలైంది. సరుకు రవాణా చేసే ఓడ పోలాండ్‌లోని ఓడరేవుకు చేరుకోవడానికి కేవలం నాలుగు రోజుల ముందు, మారకపు రేటు హెచ్చుతగ్గులకు లోను కావడంతో క్లయింట్ తన మనసు మార్చుకున్నారు.
ఆ సరుకును తాను ఇకపై కొనలేనని చాంబర్ ఆఫ్ కామర్స్‌కు క్లయింట్ తెలిపారు. సరుకు విషయంలో ఏదైనా పరిష్కారాన్ని ఆలోచించాలని ఆయన సంస్థను చెప్పారు.
చంద్రమోహన్ ఆ అటుకులను కొనుగోలు చేశారు. డిజైనర్ అయిన తన స్నేహితుడు సర్గీవ్ సుకుమారన్‌తో కలిసి బీర్‌ను తయారు చేయాలని అనుకున్నారు.
‘‘మలయాళీ అనే బీరును తయారు చేయాలని అనుకుంటున్నానని చంద్రన్ నాతో చెప్పాడు’’ అని సుకుమారన్ గుర్తు చేసుకున్నారు.
చంద్రమోహన్, సుకుమారన్ ఇద్దరూ భారత్‌లోని కేరళ రాష్ట్రానికి చెందినవారు. వారిద్దరి మాతృభాష మలయాళం. ఈ భాష మాట్లాడేవారిని మలయాళీలు అని పిలుస్తారు.
‘‘ మా చరిత్రలో పాతుకుపోయిన ఒక ఉత్పత్తిని తయారు చేయాలనే ఆసక్తి నాకు కూడా కలిగింది’’ అని సుకుమారన్ అన్నారు.
బీరులో అటుకులను ఉపయోగించాలని, కానీ అది బియ్యంతో చేసిన బీర్ తరహాలో ఉండకూడదని వారిద్దరూ ఒక స్పష్టతతో ఉన్నారు.
అటుకులతో బీర్‌ను తయారుచేయాలనే ఆలోచన పూర్తిగా కొత్తది.
‘‘పోలాండ్‌లో అప్పటికే జపనీస్ బీర్ ఉంది. బియ్యంతోపాటు జపనీస్ హాప్‌తో ఈ బీర్‌ను తయారు చేస్తారు. అయితే, అటుకులతో యూరోపియన్ హాప్‌లను కలిపి కొత్త రుచితో బీర్‌ను తయారు చేయాలని మేం అనుకున్నాం’’ అని మోహన్ చెప్పారు.
మోహన్, సుకుమారన్ ఈ విషయంలో సలహా కోసం మరో మలయాళీని సంప్రదించారు.
కరోనా మహమ్మారికి ముందు లిజో ఫిలిఫ్ అనే వ్యక్తి ‘కాలికట్ 1498’ పేరుతో పోలాండ్‌లో సొంత బీర్‌ను ప్రవేశపెట్టారు.
లిజో ఫిలిప్ సలహాలను మోహన్, సుకుమారన్‌లు తమ బీర్ తయారీలో ఉపయోగించారు.
‘‘పోలాండ్‌లో యూరప్ దేశాలకు చెందిన చాలా బీర్లు దొరుకుతాయి. ముఖ్యంగా బెల్జియం నుంచి చాలా రుచిగా ఉండే బీర్లు పోలాండ్‌కు వస్తుంటాయి. అయితే వీటిలో బియ్యాన్ని ఉపయోగించరు’’ అని సుకుమారన్ చెప్పారు.
చంద్రమోహన్ మద్యపానానికి చాలా దూరంగా ఉంటారు. అందుకే తమ ఉత్పత్తులను రుచి చూసే, పరీక్షించే బాధ్యతలను సుకుమారన్ తీసుకున్నారు.
‘‘రుచిలో సరైన సమతుల్యాన్ని మేం మూడో ప్రయత్నంలో అందుకున్నాం’’ అని సుకుమారన్ చెప్పారు.
బీర్‌ను పెద్ద ఎత్తున తయారు చేయడమే ఇప్పుడు మా ముందున్న సవాలు అని ఆయన అన్నారు.
తమ బీర్‌ను ప్రజలకు చేరువ చేసేందుకు ఒక సంస్థతో వారు ఒప్పందాన్ని చేసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం కొన్ని రెస్టారెంట్లు వారి బీర్‌ను సర్వ్ చేస్తాయి.
యుద్ధం కారణంగా యుక్రెయిన్ నుంచి తరలిపోయే ప్రవాస భారతీయులకు సహాయం చేసే బృందాన్ని మోహన్ నడిపిస్తున్నారు.
‘‘మా బృందంలోని వాలంటీర్లు చాలామంది కేరళకు చెందినవారు. మలయాళీ గుర్తింపును కలిగి ఉండటం ఒక ఎమోషన్ నేను గ్రహించాను’’ అని మోహన్ చెప్పారు.
ఈ కారణంగానే వారిద్దరూ తాము రూపొందించిన బీర్‌కు ‘మలయాళీ బీర్’ అని పేరు పెట్టారు.
బ్రాండ్ డిజైన్‌లో కూడా సాంస్కృతిక గుర్తింపును మేళవించారు.
బ్రాండ్ లేబుల్‌ను సుకుమారన్ డిజైన్ చేశారు. కేరళ సంప్రదాయక నృత్యరూపకమైన కథాకళిని ప్రదర్శించే కళాకారుల రూపంలో కాస్త మార్పులు చేసి లేబుల్‌లో జోడించారు. కేరళ వాసులకు సినిమాపై ఉండే అభిమానాన్ని ప్రస్ఫుటించేలా ఏవియేటర్ సన్‌గ్లాసెస్, దిగ్గజ నటుడు మోహన్‌లాల్ మీసాలను లేబుల్‌లో చేర్చారు.
వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వెడ్డింగ్ ప్లానర్స్‌తో వారు జతకట్టారు. ఈ ఉపాయం విజయవంతమైంది.
‘‘మలయాళీ స్పిరిట్స్’’ కంపెనీ పేరుతో వారిద్దరూ ఈ వ్యాపారం చేస్తున్నారు. ఈ కంపెనీ, ప్రతీ రెండు నెలలకు భారత, ఆసియా గ్రోసరీ దుకాణాల్లో 2,400 లీటర్ల బీర్‌ను పంపిణీ చేసే ఒప్పందాన్ని ఒక పంపిణీదారునితో కుదుర్చుకుంది.
ఇప్పటివరకు 50 వేల బాటిళ్లకు పైగా బీర్లను విక్రయించినట్లు వారు తెలిపారు. త్వరలోనే ఉత్పత్తిని మరింత పెంచాలని అనుకుంటున్నామని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- బొల్లి - విటిలిగో: చర్మం మీద వచ్చే తెల్ల మచ్చలకు అందుబాటులో ఉన్న చికిత్సలేంటి?
- బాపట్ల అగ్రికల్చరల్ కాలేజ్: సన్నబియ్యం సాంబ మసూరీ పుట్టినిల్లుగా పిలిచే ఈ కాలేజీ ప్రత్యేకత ఏమిటి?
- కులాల వారీగా జనాభా లెక్కలు తీయడానికి అభ్యంతరం ఎందుకు... దీనివల్ల బీజేపీకి నష్టమా?
- 'నన్ను రేప్ చేసిన వ్యక్తి మాటలను నేను సీక్రెట్‌గా రికార్డ్ చేశాను'
- స్విగ్గీబాయ్ రిజ్వాన్: అన్నయ్య ఐడీ మీద డెలివరీకి వెళ్లాడు, శవమై తిరిగొచ్చాడు... అసలేం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

















