కులాల వారీగా జనాభా లెక్కలు తీయడానికి అభ్యంతరం ఎందుకు... దీనివల్ల బీజేపీకి నష్టమా?

ఫొటో సోర్స్, SAM PANTHAKY
- రచయిత, రాఘవేంద్ర రావ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
బిహార్‌లో కుల గణన చేపట్టాలని గత జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రక్రియలను జనవరి 6న మొదలుపెట్టారు.
రాష్ట్రంలో కుల గణనను రెండు దశల్లో చేపట్టాలని, మొదటి దశను మే 31లోగా పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రెండో దశలో కులాలు, ఉప కులాలు, సామాజిక-ఆర్థిక స్థితిగతుల సమాచారాన్ని కూడా సేకరిస్తారు.
అయితే, బిహార్‌లో ఈ కులగణనను వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలైంది. శుక్రవారం ఇది విచారణకు వచ్చింది. కులగణనను రద్దు చేయాలని కోరుతూ ఆ వ్యాజ్యాన్ని దాఖలుచేశారు.
అయితే, కుల గణనను అడ్డుకునేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ వ్యాజ్యాన్ని పట్నా హైకోర్టులో దాఖలు చేయాలని పిటిషన్‌దారులకు సుప్రీం కోర్టు సూచించింది.
‘‘రాజ్యాంగం బేసిక్ స్ట్రక్చర్ (మౌలిక స్వరూపాన్ని)ను ఉల్లంఘించేలా ఆ కుల గణనను చేపడుతున్నారు. రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్‌లోని మొదటి లిస్టులోకి జన గణన వస్తుంది. అంటే కేంద్రం మాత్రమే ఇలాంటి జన గణనను చేపట్టాలి. కానీ, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది’’అని సుప్రీం కోర్టులో పిటిషన్‌దారుడు చెప్పారు.
మరోవైపు సెన్సస్ యాక్ట్ – 1948లోనూ కుల గణన చేపట్టేందుకు ఎలాంటి నిబంధనలూ లేవని వ్యాజ్యంలో పేర్కొన్నారు. అయితే, వాదనలు పూర్తయిన తర్వాత పట్నా హైకోర్టుకు వెళ్లాలని పిటిషన్‌దారులకు సుప్రీం కోర్టు సూచించింది.

ఫొటో సోర్స్, ANI
కుల గణన చరిత్ర
భారత్‌లో బ్రిటిష్ పాలనా కాలంలో, 1872లో, జనాభా లెక్కలు మొదలయ్యాయి. 1931 వరకు బ్రిటిష్ అధికారులు జనాభా లెక్కలు సేకరించేటప్పుడు కులాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరించేవారు.
స్వతంత్ర భారతంలో తొలిసారి 1951లో జనాభా లెక్కలు చేపట్టారు. అప్పుడు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల సమాచారం మాత్రమే సేకరించారు. అప్పటినుంచి కులగణనను భారత ప్రభుత్వం వ్యతిరేకిస్తూ వచ్చింది. దీనిపై విధానపరంగా నిర్ణయం తీసుకున్నామని సుప్రీం కోర్టులో కేంద్రం చెప్పింది.
అయితే, 1980లలో పరిస్థితులు మారాయి. కులాల ఆధారంగా పుట్టుకొచ్చిన కొన్ని ప్రాంతీయ పార్టీలు కొన్ని రాష్ట్రాల్లో చక్రాలు తిప్పడం మొదలుపెట్టాయి.
మరోవైపు రాజకీయాల్లో అగ్రవర్ణాల ఆధిపత్యానికి వ్యతిరేకత కూడా ఎదురుకావడం మొదలైంది. దిగువ కులాలకు విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని ఉద్యమాలు కూడా మొదలయ్యాయి.
1979లో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు ఇచ్చే అంశాలను పరిశీలించేందుకు భారత ప్రభుత్వం మండల్ కమిషన్‌ను ఏర్పాటుచేసింది.
ఇతర వెనుకబడిన తరగతులు(ఓబీసీ)లకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని మండల్ కమిషన్ సిఫార్సు చేసింది. 1990లో ఈ సిఫార్సులను కేంద్రం అమలుచేయాలని భావించింది. దీంతో దేశ వ్యాప్తంగా జనరల్ కేటగిరీ అభ్యర్థులు నిరసనలు చేపట్టడం మొదలుపెట్టారు.
కుల గణనకు రిజర్వేషన్లతో సంబంధం ఉండటంతో రాజకీయ పార్టీలు తరచూ దీని కోసం డిమాండ్లు చేస్తుంటాయి. అయితే, 2010లో ఈ కుల గణను చేపట్టాలని చాలా మంది ఎంపీలు కోరడంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి అంగీకరించింది. అయితే, అప్పట్లో సేకరించిన కులాల సమాచారాన్ని ప్రభుత్వం బయటపెట్టలేదు.
ఇలానే 2015లోనూ కర్నాటకలోనూ కులాల సమాచారాన్ని సేకరించారు. కానీ, ఈ సమాచారాన్ని కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం బయటకు వెల్లడించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
2011 కుల గణనను ఎందుకు బయటపెట్టలేదు?
సామాజిక, ఆర్థిక కుల గణన (సోషియో ఎకనమిక్ కాస్ట్ సెన్సస్ – ఎస్‌ఈసీసీ)లో భాగంగా 2011లో సేకరించిన సమాచారాన్ని బయటపెట్టబోవడం లేదని జులై 2022లో పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
మరోవైపు సుప్రీం కోర్టులోనూ ఈ విషయంపై విచారణ సమయంలో 2021లో కేంద్రం స్పందించింది. ‘‘2011లో చేపట్టిన ఆ సామాజిక-ఆర్థిక కుల గణనలో చాలా లోపాలు ఉన్నాయి. తప్పులు దొర్లడంతోపాటు ఆ సమాచారం దేనికీ ఉపయోగపడదు’’అని కోర్టులో కేంద్రం చెప్పింది.
‘‘1931 జనాభా లెక్కల్లో కులాల సంఖ్య 4,147గా ఉండేది. కానీ, 2011 జనాభా లెక్కల్లో ఈ సంఖ్య 46 లక్షలకుపైనే ఉన్నట్లు కనిపిస్తున్నాయి’’అని కేంద్రం తెలిపింది.
మహారాష్ట్రలో చేపట్టిన కుల గణన లెక్కలను ఉదహరిస్తూ ‘‘అప్పట్లో రాష్ట్రంలో మొత్తం కులాలు, తెగలు కలిపి 494 ఉండేవి. కానీ, 2011 లెక్కల్లో ఇక్కడ మొత్తంగా 4,28,677 కులాలు ఉన్నట్లు తేలింది’’అని పేర్కొంది.
మరోవైపు కులాల వారీగా జనాభా లెక్కలు చేపట్టడం చాలా కష్టమని కోర్టులో కేంద్రం తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్ని రోజులు ఆపుతారు?
‘‘నేడో లేదా రేపో జాతీయ స్థాయిలో కుల గణన చేపట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు ఎన్ని రోజులు దీన్ని దాటవేసుకుంటూ కేంద్రం వెళ్తుంది? అనేదే అసలు ప్రశ్న. రాష్ట్రాలు తమకు తాముగానే ఈ లెక్కలు చేపడుతున్నాయి. కొన్నిసార్లు ఈ లెక్కలు వారి రాజకీయ లక్ష్యాలతో సరిపోలకపోవచ్చు. కొన్ని వారు అనుకున్న ఫలితాలే రావచ్చు. అయితే, చాలాసార్లు మాత్రం ఈ సమాచారాన్ని బయట పెట్టేందుకు ప్రభుత్వాలు ఇష్టపడవు’’అని దిల్లీ యూనివర్సిటీ సోషియాలజీ ప్రొఫెసర్ సతీశ్ దేశ్‌పాండే చెప్పారు.
కర్నాటకలో కుల గణన అంశాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘చాలా ఉత్సాహంతో ఆ కుల గణన చేపట్టారు. నిజానికి అన్ని జాగ్రత్తలతోనే ఆ కుల గణన చేపట్టారు. కానీ, ఆ లెక్కలను మాత్రం బయటపెట్టలేదు. దీని వల్ల అక్కడ రాజకీయంగా చాలా వివాదాం రేగింది. ఈ కులాల వారీ లెక్కలను బయటపెడితే తమకు మేలు జరుగుతుందని కొన్ని కులాల సంస్థలు చెబుతున్నాయి. మరికొన్ని సంస్థలు మాత్రం తమకు ప్రమాదమని భావిస్తున్నాయి’’అని ఆయన వివరించారు.
అయితే, గోవింద్ బల్లభ్ పంత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ప్రొఫెసర్ బద్రీనారాయణ్ మాట్లాడుతూ.. ‘‘గణన ప్రక్రియలు పూర్తయిన తర్వాత కూడా లెక్కలను ఎందుకు విడుదల చేయడం లేదంటే.. వారికి భయం ఉండొచ్చు. అయినా కులాలను వారీగా లెక్కలు సేకరించడం అంత తేలిక కాదు. అసలు వివాదాలు సృష్టించడం ఎందుకని, మొత్తంగానే ఆ సమాచారాన్ని బయట పెట్టడం లేదు’’అని అన్నారు.
‘‘అయితే, తర్వాత ఏం జరుగుతుందో చెప్పడం కొంచెం కష్టమే. కానీ, కులాల గణన చేపట్టాలనే డిమాండ్ మాత్రం న్యాయమైనదే. ఎప్పటికైనా దీన్ని చేపట్టాల్సిందే’’అని దేశ్‌పాండే అన్నారు.
‘‘కుల గణనకు ఎదురవుతున్నట్లుగా చెబుతున్న సవాళ్లన్నీ ఊహాగానాలే. అయినా సంక్లిష్టమైన జన గణన పూర్తిచేయడం మనకు కొత్తేమీ కాదు. 2001లో అప్పటి సెన్సస్ కమిషనర్ డాక్టర్ విజయనున్ని మాట్లాడుతూ.. కుల గణనను సమర్థంగా పూర్తిచేసే సామర్థ్యం భారత్‌కు ఉందన్నారు’’అని దేశ్‌పాండే వివరించారు.

ఫొటో సోర్స్, AFP
ప్రయోజనాలు ఏమిటి?
కుల గణనకు మద్దతుగా కొందరు మాట్లాడుతుంటే, మరికొందరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు.
అయితే, కుల గణనను చేపట్టడం ద్వారా ప్రభుత్వ పథకాలను అవసరమైన వర్గాలకు మెరుగ్గా చేరవేయడం సాధ్యం అవుతుందని కొందరు నిపుణులు చెబుతున్నారు.
‘‘ప్రభుత్వ పథకాలను అవసరమైన వారికి చేరవేయడంతోపాటు పథకాలను మెరుగ్గా సిద్ధం చేయడానికీ కుల గణన ఉపయోగపడుతుందని అనేది ఒక వాదన’’అని ప్రొఫెసర్ దేశ్‌పాండే అన్నారు.
‘‘ఈ కుల గణనలో సమాజంలో వనరులు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియడంతోపాటు అవి ఎవరి దగ్గర పోగుపడ్డాయో కూడా తెలుసుకోవచ్చ. నిజంగా అసమానతలు ఉంటే, ఈ లాంటి కుల గణనతో మేలు జరుగుతుంది. ముందు కొన్ని రకాల రాజకీయ సమస్యలు వచ్చే మాట వాస్తవమే. అయితే, దీర్ఘకాలంలో దీనితో దేశానికి మేలు జరగొచ్చు’’అని ఆయన తెలిపారు.
‘‘అయితే, నేడు కుల గణనను రెండు ప్రధాన సమస్యలు వేధిస్తున్నాయి. ఈ రెండింటికీ ఒకదానితో మరొకటికి సంబంధం ఉంది’’అని ఆయన వివరించారు.
‘‘కుల వ్యవస్థ వల్ల ప్రయోజనాలు పొందిన అగ్ర వర్ణాల లెక్కింపు దీనిలో మొదటిది. వారు తమను లెక్కించొద్దనే కోరుకుంటారు. మరోవైపు ఆర్థికంగా ముందు వరుసలోనున్న కొన్ని తరగతులు తమకు ఎలాంటి కులం లేదని చెబుతాయి. ఇప్పుడు వారిని ఏ కేటగిరీలో పెట్టాలి అనేది మరో సమస్య’’అని ఆయన చెప్పారు.
‘‘జనాభా లెక్కల్లో భాగంగా మీ కులం ఏమిటని అందరినీ అడిగినప్పుడు, తమకు కులం అనేది ఒకటుందని అందరికీ మనం మరోసారి గుర్తు చేసినట్లు అవుతుంది’’అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, AFP
భయం ఎందుకు?
2018 ఆగస్టులోనే 2021 జనాభా లెక్కల కోసం సిద్ధం అవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అప్పుడే తొలిసారి ఓబీసీ లెక్కలు కూడా చేపడతామని ప్రభుత్వం చెప్పింది. అయితే, తర్వాత మళ్లీ ఆ లెక్కలు చేపట్టబోమని తెలిపింది.
‘‘నిజానికి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కుల గణనపై వ్యతిరేకత వ్యక్తంచేస్తుంది. అదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్నవారు దీని గురించి ఎక్కువగా మాట్లాడతారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తోపాటు కాంగ్రెస్ విషయంలోనూ ఇదే జరిగింది’’అని ప్రొఫెసర్ దేశ్‌పాండే చెప్పారు.
అయితే, కుల గణన తర్వాత కొత్త రిజర్వేషన్లకు డిమాండ్లు కూడా పెరుగుతాయనే ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది.
అయితే, రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని ఇప్పటికే సుప్రీం కోర్టు చెప్పిన విషయాన్ని కొందరు నిపుణులు గుర్తుచేస్తున్నారు.
‘‘కుల గణనతో సామాజిక ప్రజాస్వామ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు. అయితే, దీని వల్ల సమాజంలో వచ్చే విభేదాల సంగతి ఏమిటి?’’అని ప్రొఫెసర్ బద్రీనారాయణ్ ప్రశ్నిస్తున్నారు.
కుల గణనతో సౌభాతృత్వం పటిష్ఠం అవుతుందని, ప్రజాస్వామ్యం తమ వాటా ప్రజలకు చేరుతుందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. అయితే, ఇక్కడ కులాల వారీగా సమాజంలో మరిన్ని చీలికలు వస్తాయనే ఆందోళన కూడా చాలా మందిని వెంటాడుతోంది.
బీజేపీ ఆందోళన ఏమిటి?
ఈ కుల గణనతో బీజేపీకి నష్టం చేకూరే అవకాశముందని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
‘‘తాము అందరినీ కలుపుకుని పోతామని బీజేపీ చెబుతోంది. కాబట్టి ఇప్పుడు కుల గణనతో సమాజంలోని కొన్ని కులాలు వారికి వ్యతిరేకమయ్యే అవకాశముంది. ఈ విషయాన్ని ఎవరూ కాదనలేరు. అందుకే బీజేపీ మధ్యేమార్గాన్ని అనుసరిస్తోంది’’అని ప్రొఫెసర్ బద్రీనారాయణ్ అన్నారు.
కుల గణనతో హిందువులు మరిన్ని వర్గాలుగా చీలిపోతారనేది కూడా బీజేపీ సమస్యల్లో ఒకటని ఆయన చెప్పారు.
‘‘ప్రాంతీయ పార్టీల లెక్కలన్నీ కులాల సమీకరణలపైనే ఉంటాయి. కుల గణనతో సమాజం మరింత చీలిపోతే అంతిమంగా మేలు జరిగేది వారికే’’అని బద్రీనారాయణ్ వివరించారు.
మరోవైపు బద్రీనారాయణ్ వాదనతో సతీశ్ దేశ్‌పాండే కూడా ఏకీభవించారు.
‘‘బీజేపీ శక్తిమొత్తం హిందువులను ఏకం చేయడంలోనే ఉంది. ఒకవేళ కులం పేరుతో వారి మధ్య విభజన వస్తే, బీజేపీకి చాలా నష్టం జరుగుతుంది’’అని ప్రొఫెసర్ దేశ్‌పాండే అన్నారు.
‘‘ఇప్పుడు కేంద్రంలో బీజేపీ గట్టిగా వ్యతరేకించడంతో కుల గణన వాయిదా పడే అవకాశముంది’’అని ఆయన చెప్పారు.
‘‘నేడు బీజేపీని ఎదుర్కొనే గట్టి ప్రతిపక్షమే కనిపించడం లేదు. దీంతో వారిలో ఆత్మవిశ్వాసం పతాక స్థాయికి పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో వారు కుల గణనతో ముందుకు వెళ్లినా వెళ్లొచ్చు. నిజానికి దూరదృష్టితో ఆలోచిస్తే, వారు ఇప్పుడే ముందుకు వెళ్లడం మంచిది’’అని దేశ్‌పాండే వివరించారు.
భారత్‌కు కుల గణన అవసరమా?
అసలు భారత్‌కు కుల గణన అవసరమా? అనే ప్రశ్న కూడా నేడు ఉత్పన్నం అవుతోంది.
మన సమాజంలో కుల వ్యవస్థను రూపుమాపాలంటే మొదటగా కులాలకు ఇచ్చే ప్రత్యేక హక్కులను కూడా రద్దుచేయాలని చాలా మంది రాజకీయ, సామాజిక విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో నిజంగా వెనుకబడిన వారెవరో కూడా గుర్తించాలని చెబుతున్నారు.
అసలైన వెనుకబాటును గుర్తించాలంటే మన దగ్గర గణాంకాలు, సమాచారం ఉండాలి. ఇది కుల గణనతో సాధ్యం.
అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలను మెరుగ్గా చేరవేయాలనే వాదన ఎప్పటినుంచో ఉంది. కుల గణన నుంచి వచ్చే సమాచారంతో ఇది కూడా సాధ్యపడుతుంది.
మరోవైపు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను మెరుగ్గా ప్రజలకు చేరవేయాలన్నా కులాల వారి లెక్కలు అవసరం.
‘‘నేడు కుల గణన చేపట్టడం ముఖ్యం. ఎందుకంటే పరిస్థితి ఎలా ఉందో తెలియాలి’’అని ప్రొఫెసర్ దేశ్‌పాండే అన్నారు.
అయితే, కుల గణన మంచిదికాదని ప్రొఫెసర్ బద్రీనారాయణ్ భావిస్తున్నారు. ‘‘నేడు మన ప్రజాస్వామ్యంలో చాలా పురోగతి కనిపిస్తోంది. మళ్లీ కుల గణన లాంటి లెక్కలతో దీన్ని వెనక్కి తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు’’అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కూర్మగ్రామం: ఈ ఊరిలో ఫోన్లు, టీవీలు లేవు, ఇంటర్నెట్ లేదు, అసలు కరెంటే లేదు... మరి ప్రజలు ఎలా జీవిస్తున్నారు?
- ఈ దేశంలో చికెన్ కన్నా ఉల్లిపాయల ధర మూడు రెట్లు ఎక్కువ... కిలో రూ. 890
- జేపీ నడ్డా మీద నరేంద్ర మోదీ, అమిత్ షాలకు ఎందుకంత నమ్మకం?
- కేసీఆర్: విశాఖ ఉక్కును మోదీ అమ్మితే... మేం మళ్లీ తీసుకొస్తాం
- మెదక్: తన పేరు మీద రూ.7 కోట్లకు బీమా... ‘తన లాంటి వ్యక్తిని చంపేసి తానే చనిపోయినట్లు నాటకం’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















