జేపీ నడ్డా మీద నరేంద్ర మోదీ, అమిత్ షాలకు ఎందుకంత నమ్మకం?

జేపీ నడ్డా

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, ఫైసల్ మహమ్మద్ అలీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కొన్నేళ్ళ కిందట ఒక కార్యక్రమంలో నరేంద్ర మోదీతో కలిసి నడుస్తుండగా జగత్ ప్రకాశ్ నడ్డా చేతిని పట్టుకుని అమిత్ షా పక్కకు లాగేసినట్లుగా కనిపించే వీడియో ఒకటి వైరల్ అయింది.

భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో సీనియర్ నాయకుల్లో అమిత్ షా ఒకరు. ఆయన మోదీకి అత్యంత సన్నిహితులు కూడా. అయితే, నేడు వారిద్దరికీ నడ్డా కూడా చాలా సన్నిహితమైనట్లుగా కనిపిస్తోంది.

బీజేపీ అధ్యక్షుడి పదవిలో మరో ఏడాదిపాటు కొనసాగేలా తాజాగా నడ్డాకు అవకాశం లభించింది. ఈ విషయాన్ని స్వయంగా అమిత్ షానే వెల్లడించారు.

‘‘శుభవార్త. జేపీ నడ్డా పదవీ కాలాన్ని బీజేపీ వర్కింగ్ కమిటీ జూన్ 2024 వరకూ పొడిగించాలని నిర్ణయించింది’’అని అమిత్ షా ట్వీట్ చేశారు.

జేపీ నడ్డా

ఫొటో సోర్స్, ANI

‘‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకంలో పార్టీని నడ్డా మరింత మందికి చేరువచేశారు. పార్టీ పటిష్ఠానికి నడ్డా చాలా కృషి చేశారు’’అని చెబుతూ నడ్డాకు అమిత్ షా అభినందనలు తెలియజేశారు.

అంచనాలను అందుకోవడంలో, అధికారంలో ఉండేవారి అవసరాలను అర్థం చేసుకోవడంలో నడ్డాకు మంచి అనుభవం ఉందని రాజకీయ విశ్లేషకులు రాధికా రామశేషన్ చెప్పారు. ‘‘హద్దులను ఆయన దాటకుండా పనిపూర్తిచేస్తారు. అస్పష్టమైన హద్దుల్లోనూ ఎలా పనిచేయాలో ఆయనకు తెలుసు’’అని రాధికా అన్నారు.

శక్తిమంతమైన నాయకులతో కలిసి పనిచేయడం అంతతేలికాదని, అయితే, నడ్డా అలా పనిచేస్తూ తన కంటూ గుర్తింపు తెచ్చుకున్నారని రాధికా వివరించారు.

దిల్లీలో జరిగిన బీజేపీ రెండు రోజుల జాతీయ కార్యవర్గ కమిటీ సమావేశాల్లో నరేంద్ర మోదీ తర్వాత ఎక్కువ కటౌట్లు జేపీ నడ్డావే కనిపించాయి. గేటు దగ్గర మోదీ కటౌట్ ఒకవైపు.. నడ్డా కటౌట్ మరోవైపు ఏర్పాటుచేశారు.

జేపీ నడ్డా

ఫొటో సోర్స్, TWITTER/JPNADDA

బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా ఎలా పనిచేశారు?

ఈ సమావేశాలకు వెళ్లే మార్గంలో మోదీ రోడ్ షో నిర్వహించారు. అయితే, ఆయన పక్కన లేదా వాహనంలో అమిత్ షా లేదా నడ్డా కనిపించలేదు.

మరోవైపు జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముందే మీడియాలో నడ్డాపై చర్చ కూడా జరిగింది.

రాజ్యసభకు నడ్డా ప్రాతినిధ్యం వహిస్తున్న హిమాచల్ ప్రదేశ్‌లోని అసెంబ్లీ ఎన్నికల్లో ఇటీవల బీజేపీ ఓడిపోయింది. మరోవైపు తన సొంత రాష్ట్రం బిహార్‌లోని బీజేపీ ప్రభుత్వం కుప్పకూలింది.

ప్రస్తుతం తొమ్మిది రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరోసారి నడ్డాకు బీజేపీ అధ్యక్షుడి పదవి ఇస్తారా? అనే చర్చ జరిగింది.

జేపీ నడ్డా బిహార్‌లో జన్మించారు. పట్నా కాలేజీ నుంచి ఆయన బీఏ పట్టా పొందారు. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ కూడా పూర్తిచేశారు.

అయితే, ప్రస్తుతం నడ్డా పదవీ కాలాన్ని పొడిగించడంపై అమిత్ షా స్పందిస్తూ.. ‘‘నడ్డా నాయకత్వంలో బిహార్‌లో పార్టీ స్ట్రైక్ రేట్ మెరుగుపడింది. మరోవైపు నడ్డా నాయకత్వంలోనే మహారాష్ట్రలోనూ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుచేయగలిగింది. ఉత్తరాఖండ్, మణిపుర్, అస్సాంలలోనూ పార్టీ విజయం సాధించింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడులోని పార్టీ ఫలితాలు మెరుగుపడ్డాయి. మరోవైపు గోవాలో పార్టీ హ్యాట్రిక్ కొట్టింది.’’అని ఆయన చెప్పారు.

జేపీ నడ్డా

ఫొటో సోర్స్, Getty Images

అలా పైపైకి

గుజరాత్‌లో ఎన్నికల ఫలితాల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘మాకు 53 శాతం ఓట్లతో 156 స్థానాలు వచ్చాయి. దీనికి మోదీ ప్రజాదరణతోపాటు నడ్డా వ్యూహాలు కూడా ఒక కారణం’’అని ఆయన చెప్పారు.

‘‘పార్టీ శక్తిమంతం కావాలంటే అన్నింటికీ ప్రభుత్వంపైనే ఆధారపడటం మానుకోవాలని నరేంద్ర మోదీ మొదట్లోనే గుర్తించారు. నిజానికి ప్రభుత్వంపై అతిగా ఆధారపడితే పార్టీకి భవిష్యత్ ఉండదనే విషయం వారికి బాగా తెలుసు. అందుకే పార్టీని సమర్థవంతులైన నాయకుల చేతుల్లో పెట్టేందుకు ఆయన ప్రయత్నించారు’’అని రాధిక రామశేషన్ చెప్పారు.

బాల్యంతోపాటు నడ్డా విద్యాభ్యాసం చాలావరకు బిహార్‌లోనే జరిగింది. కానీ, తన రాజకీయ ప్రస్థానం మాత్రం హిమాచల్ ప్రదేశ్‌ నుంచి మొదలైంది. 1990ల్లో హిమాచల్ ఇన్‌చార్జి బాధ్యతలను నరేంద్ర మోదీకి అప్పగించినప్పుడు ఆయనతో నడ్డాకు మంచి పరిచయం ఏర్పడింది.

2014 ఎన్నికలకు రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో బీజేపీ ముందుకు వెళ్లింది. అయితే, ఆ ఎన్నికల్లో విజయం తర్వాత పార్టీపై మోదీ తన పట్టును మరింత పెంచారు.

మొదటగా తన సన్నిహితుల్లో ఒకరైన అమిత్ షాకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. రెండుసార్లు పార్టీ అధ్యక్షుడిగా షా పనిచేశారు. జనవరి 2020లో ఈ బాధ్యతలను జేపీ నడ్డాకు ఇచ్చారు. మొదట కొన్నిరోజులపాటు తాత్కాలిక అధ్యక్షుడిగా నడ్డా పనిచేశారు.

కోవిడ్-19 వ్యాప్తి నడుమ నిబంధనలకు అనుగుణంగా పార్టీలో ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో, లాంఛనంగా నడ్డాకు బాధ్యతలు అప్పగించేందుకు కాస్త సమయం పట్టింది.

వీడియో క్యాప్షన్, పండ్లు అమ్ముకునే వికలాంగ యువకుడిపై దాడి చేసిన బీజేపీ మాజీ కార్పొరేటర్ సోదరుడు

పార్టీ కార్య వర్గ సమావేశంలో అధ్యక్షుడి పేరును రక్షణ మంత్రి, మాజీ పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపాదించారు. దీనికి అందరూ ఆమోదం తెలిపారు.

బిహార్ తరఫున జూనియర్ స్విమ్మింగ్ పోటీల్లో నడ్డా పాల్గొన్నారు. టెక్నాలజీ ఉపయోగంలోనూ ఆయనకు పట్టుంది. మరోవైపు విద్యార్థి కాలం నుంచీ ఆయనకు రాజకీయ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి.

మూడుసార్లు హిమాచల్ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన పార్టీలోని అగ్రనాయకులతో కలిసి పనిచేశారు. మరోవైపు పార్టీ గుజరాత్ విభాగం అధ్యక్షుడిగా, గుజరాత్ వ్యవహారాల బాధ్యుడిగానూ ఆయన పనిచేశారు.

వీడియో క్యాప్షన్, అమిత్ షా చెప్పులు మోశారంటూ ప్రత్యర్ధులు చేస్తున్న విమర్శలకు బండి సంజయ్ జవాబు ఏంటి?

నడ్డా ప్రత్యేకత ఏమిటి?

ఈ విషయంపై బీజేపీలో ఒక సీనియర్ నాయకుడు బీబీసీతో మాట్లాడారు. ‘‘బీజేపీలో ఇద్దరు అగ్రనాయకులూ తమకు సవాల్ విసరని నాయకుడికి పార్టీ పగ్గాలు ఇవ్వాలని భావించారు’’అని ఆయన చెప్పారు.

అటల్ బిహారీ వాజ్‌పేయీ, ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ప్రమోద్ మహాజన్ లాంటి నాయకుల హయాంలో పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన కుశాబాహు ఠాక్రే తరహాలో నడ్డా కూడా అనవసర విషయాల్లో తలదూర్చకుండా తనను తాను చాలా మార్చుకున్నారని కొందరు రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

అయితే, కుశాబాహులా కాకుండా, నడ్డా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారని మరికొందరు చెబుతున్నారు. పార్టీకి సంబంధించిన అన్ని అంశాలను సోషల్ మీడియాలో నడ్డా పంచుకుంటారని, తనతోపాటు అందరినీ ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన ప్రయత్నిస్తారని మరికొందరు వివరిస్తున్నారు.

ఇది కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)