నేపాల్: విమానప్రమాదంలో ‘చనిపోయిన’ కో పైలెట్ అంజూకు తెనాలికి సంబంధం ఏంటి...

పైలెట్ అంజూ ఖాతివాడ

ఫొటో సోర్స్, Siva Makutam/Facebook

    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

నేపాల్‌లోని పోఖరాలో జరిగిన విమానప్రమాదంలో 69 మంది చనిపోయారు. ఇప్పటి వరకు 43 మృతదేహాలను గుర్తించారు.

యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఆ విమానాన్ని నడిపిన కో పైలెట్ అంజూ ఖాతీవాడ, ఆంధ్రప్రదేశ్‌లో చదువుకున్నారు. గుంటూరు జిల్లాలోని తెనాలిలో గల వివేకానంద జూనియర్ కాలేజీలో ఆమె ఇంటర్మీడియట్ చేశారు.

ఇప్పటి వరకు అంజూ మృతదేహం ఇంకా దొరకలేదని వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది. కానీ ఈ ప్రమాదంలో బతికి బయటపడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు భావిస్తున్నారు.

నేపాల్ విమాన ప్రమాదం

ఫొటో సోర్స్, Facebook/Anju Khatiwada

తెనాలిలో విద్యాభ్యాసం

గుంటూరు జిల్లా తెనాలిలో గల వివేకానంద జూనియర్ కాలేజీలో నేపాల్‌కి చెందిన విద్యార్థులు ఎక్కువగా చదువుతుంటారు.

నేపాల్‌కు చెందిన అంజూ ఖాతీవాడ 1995లో భారత్‌కు వచ్చి వివేకానంద జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్‌లో చేరారు. సుమారు రెండు సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు.

అంజూ ఖాతీవాడ తెనాలిలో చదువుకుంటున్న సమయంలో శివ మకుటం ఆమె బ్యాచ్ మేట్‌గా ఉన్నారు.

‘నేపాల్‌లో జరిగిన విమానప్రమాదంలో నా స్నేహితురాలు అంజూ చనిపోయారు. పైలెట్‌గా 12ఏళ్లు పూర్తి చేసుకున్నట్లు నిన్ననే నాకు ఫేస్‌బుక్ ద్వారా మెసేజ్ పంపారు.

తెనాలిలోని వివేకానంద జూనియర్ కాలేజీలో చదువుకునేటప్పుడు ఆమె నా బ్యాచ్ మేట్. ఈ మధ్యనే నేపాల్ రావాలంటూ నన్ను ఆమె పిలిచారు. ఎవరెస్ట్ పర్వతం మీద విమానంలో తిప్పుతానని చెప్పారు.

కానీ ఇంతలోనే అలా జరిగిపోయింది’ అని శివ మకుటం తన ఫేస్‌బుక్‌లో రాశారు.

నేపాల్ విమాన ప్రమాదం

ఫొటో సోర్స్, EPA-EFE/REX/SHUTTERSTOCK

‘తనపని కాకపోయినా...’

చదువుల్లో అంజూ చాలా చురుకుగా ఉండేవారని బీబీసీతో మాట్లాడుతూ శివ మకుటం అన్నారు.

‘అనేకమందికి శిక్షణ ఇచ్చిన అనుభవం కమల్ కేసీకి ఉంది. అంజూ కూడా పైలట్‌గా ప్రమోషన్‌కు కావాల్సిన అన్ని రకాల అర్హతలు సాధించారు.

కో పైలట్‌గా నిర్దిష్ట కాలపరిమితి పూర్తి చేయాల్సి ఉంది. వందల గంటలు కో పైలట్‌గా పనిచేసి ఉండాలి. అందుకోసమై తన డ్యూటీ కాకపోయినా ఆ విమానం ఎక్కారు.

అనుకోని ప్రమాదం ఆమెను అందరికీ దూరం చేసింది’ అని బీబీసీకి శివ తెలిపారు.

తెనాలిలో అంజూతో పాటు చదువుకున్న వారు, ఆమెకు సంతాపం వ్యక్తం చేశారు.

అప్పట్లో వివేకానంద కాలేజీలో అమ్మాయిల క్యాంపస్‌లో అంజూ, అబ్బాయిల క్యాంపస్‌లో శివ చదువుకున్నారు.

విమానం

ఫొటో సోర్స్, Twitter/ANI

భర్త కూడా విమాన ప్రమాదంలోనే....

అంజూ ఖాతీవాడ భర్త కూడా పైలెట్. 2006లో నేపాల్‌లో జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయారు. నాడు కూడా యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానమే ప్రమాదానికి గురైంది.

‘భర్త చనిపోయినప్పుడు వచ్చిన బీమా డబ్బుతో అంజూ పైలెట్ శిక్షణ తీసుకున్నారు’ అని యతి ఎయిర్‌లైన్స్ ప్రతినిధి సుదర్శన్ బర్తౌలా రాయిటర్స్‌కు తెలిపారు.

44ఏళ్ల అంజూకు 6,400 గంటలకు పైగా విమానాన్ని నడిపిన అనుభవం ఉంది. అంతకు ముందు ఎన్నోసార్లు పోఖరాకు ఆమె విమానాన్ని నడిపారు. ఆదివారం విమానంలో కమల్ కేసీ ఆమెకు ఇన్‌స్ట్రక్టర్ పైలెట్‌గా ఉన్నారని సుదర్శన్ వెల్లడించారు.

ఇద్దరు పిల్లలు

అంజూకి ఇద్దరు పిల్లలని శివ తెలిపారు.

‘భర్త చనిపోయిన తరువాత ఎయిర్ లైన్స్‌లో అంజూ చేరారు. చాలా కాలంగా పైలెట్‌గా పని చేస్తున్నారు. మా కాలేజ్ వాట్సాప్ గ్రూపులో కూడా ఆమె యాక్టివ్‌గా ఉన్నారు.

నన్ను కాఠ్‌మాండూ రమ్మని కూడా ఆహ్వానించారు. త్వరలోనే అక్కడికి వెళ్లి వారి కుటుంబాన్ని కలుద్దామని అనుకున్నా’ అంటూ శివ ఆవేదన వ్యక్తం చేశారు.

వీడియో క్యాప్షన్, నేపాల్: విమానప్రమాదంలో ‘చనిపోయిన’ కో పైలెట్ అంజూకు తెనాలికి సంబంధం ఏంటి...

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)