ఇరాన్: ఎందుకు ఉరి తీయకూడదో 15 నిమిషాల్లోపే చెప్పాలి, ఆపై శిక్ష అమలు.

ఇరాన్

ఫొటో సోర్స్, WANA/Reuters

    • రచయిత, మరియం ఆఫ్సాంగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభమైన తర్వాత నలుగురిని ఉరి తీశారు.

ఈ నిరసనలతో సంబంధం ఉన్న 22 మందికి ఇప్పటి వరకు మరణ శిక్ష విధించినట్టు మానవ హక్కువ కార్యకర్తల న్యూస్ ఏజెన్సీ(హెచ్ఆర్ఏఎన్ఏ) పేర్కొంది.

22 ఏళ్ల కరాటె ఛాంపియన్ అయిన మహమ్మద్ మెహదీ కరామికి జనవరి 7న ఉరిశిక్ష అమలు చేశారు.

ఈ ఉరిశిక్ష నుంచి బయటపడేందుకు ఆయనకు కేవలం 15 నిమిషాల కంటే తక్కువ సమయమే ఇచ్చినట్టు బీబీసీకి సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఆయన్ని అరెస్ట్ చేసిన తర్వాత కేవలం 65 రోజుల్లోనే ఉరి తీసినట్టు చెప్పాయి.

ఇరాన్

ఫొటో సోర్స్, WANA/Reuters

స్వేచ్ఛ, స్వతంత్ర, మతాధికారుల పాలన విముక్తి కోసం ఎవరైతే పోరాడుతున్నారో ఆ నిరసనకారుల గుండెల్లో భయాలను రేపేందుకు ఇరాన్ అధికారులు ఉరిశిక్షలను ఎలా వాడుతున్నారో దీని ద్వారానే తెలుస్తుంది.

బ్రిటీష్-ఇరాన్ పౌరుడు అలీరెజా అక్బరీని ఇటీవల ఉరితీయడంతో ఇరాన్‌లో అమలు అవుతున్న ఉరిశిక్షలపై అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

వీధుల్లో జరిగే నిరసనలకు సంబంధం లేకుండా బ్రిటన్‌కు గూఢాచారిగా వ్యవహరిస్తున్నారనే కారణంతో ఆయన్ను ఇరాన్ అధికారులు ఉరితీశారు.

బలవంతంగా ఆయన్ని ఈ నేరం ఒప్పుకునేలాగా చేసి, జైలులో నాలుగు గోడల మధ్యన నిర్బంధించి నిరసనకారులకు ఎలాంటి శిక్షలైతే అమలు చేస్తున్నారో, ఆ విధానాన్నే ఆయన విషయంలోనూ అనుసరించారు ఇరాన్ అధికారులు.

ఇరాన్

ఫొటో సోర్స్, WANA NEWS AGENCY

సెప్టెంబర్‌లో పోలీసు కస్టడీలో మహసా అమినీ చనిపోయిన తర్వాత ఇరాన్ వ్యాప్తంగా ఈ నిరసనలు చెలరేగాయి.

తలపై తప్పనిసరిగా ధరించాల్సిన తన హిజాబ్‌ను సరిగ్గా ధరించలేదన్న కారణంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పోలీసు కస్టడీలోనే ఆమె చనిపోయారు.

బసీజ్ పార్లమెంటరీ దళాల్లోని ఒక సభ్యుణ్ని హత్య చేశారనే నెపంతో మహమ్మద్ మెహదీని కరాజ్‌లో నవంబర్ 3న అదుపులోకి తీసుకున్నారు.

ఈ నేరం కింద అరెస్టు చేసిన 16 మందిలో మహమ్మద్ కూడా ఒకరు. టెహ్రాన్ నగరానికి వెలుపల కరాజ్ కోర్టులో మూడు రోజుల పాటు వీరిని విచారించారు.

ఇరాన్‌లో నిందితులు తమ తరఫున వాదించేలా న్యాయ ప్రతినిధులను నియమించుకోవచ్చు. కానీ, ఇలాంటి సున్నితమైన కేసుల్లో లేదా గూఢాచారి ఆరోపణల కింద అరెస్ట్ అయితే స్వతంత్రంగా న్యాయవాదుల్ని నియమించుకోవడానికి వీలుండదు.

జ్యూడిషియల్ అధికారులు అనుమతి ఇచ్చిన జాబితాలోని న్యాయవాదిని మాత్రమే కోర్టు నియమిస్తుంది.

జర్నలిస్టులను, కుటుంబ సభ్యులను కూడా కోర్టులోకి అనుమతించరు.

మూసివేసిన నాలుగు గోడల మధ్యన ఏం జరిగిందన్న విషయాన్ని జ్యూడిషియరీ విడుదల చేసే ఎడిటెడ్ ఫుటేజీ ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు.

ఇరాన్

ఫొటో సోర్స్, Social media

‘అమ్మకి ఏం చెప్పొద్దు ’

అలా విడుదల చేసిన వీడియోలో మహమ్మద్ మెహదీ చాలా బాధతో కనిపించారు. బండరాయితో సెక్యూరిటీ ఫోర్స్ సభ్యుణ్ని తలపై కొట్టినట్టు ఆయన ఒప్పుకున్నట్టు వీడియోలో ఉంది.

కోర్టు నియమించిన ఆయన న్యాయవాది దాన్ని సవాలు చేయడానికి, కొట్టివేయడానికి బదులు, మహమ్మద్ మెహదీని క్షమించాలని జడ్జిని కోరారు.

తను చాలా మోసపోయానని, కింద కూర్చుని మహమ్మద్ మెహదీ కన్నీటి పర్యంతమయ్యారు.

సాధారణంగా ఇలాంటి శిక్షలు అమలయ్యేటప్పుడు కుటుంబ సభ్యులు నోరు మెదపకుండా ఉండాలంటూ అధికారుల నుంచి ఒత్తిడి ఎదురవుతోంది.

కానీ, వీధుల్లో టిష్యూ ప్యాకెట్లను అమ్ముకునే మహమ్మద్ తండ్రి మాషాలాహ్ కరామి ఇరాన్ వార్తాపత్రిక ఈటెమాడ్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు.

మహమ్మద్‌కి ఉరిశిక్షను అమలు చేసే రోజు తాను కన్నీరుమున్నీరైనట్లు తండ్రి మాషాలాహ్ కరామి చెప్పారు.

‘‘డాడ్, వారు తీర్పు చెప్పారు. నాకు ఉరిశిక్ష అమలు చేస్తున్నారు. ఏదీ అమ్మకు చెప్పొద్దు’’ అంటూ తన కొడుకు బాధపడ్డాడని గుర్తుకు చేసుకున్నారు.

ఆ తర్వాత మహమ్మద్ మెహదీని ఎలా హింసించారో చెబుతూ గుర్తుతెలియని ‘150 ఇమేజస్’ అనే గ్రూప్ పలు ఫొటోలను పబ్లిష్ చేసింది.

గార్డులు తనని స్పృహ తప్పేలా కొట్టారని జైలులో ఉన్న సమయంలో కుటుంబాన్ని కలిసినప్పుడు మహమ్మద్ చెప్పారు.

ఇరాన్

ఫొటో సోర్స్, Getty Images

మెహదీ చనిపోయినట్లు భావించి, ఆయన శరీరాన్ని ఒక మారుమూల ప్రాంతంలో కూడా పడేశారు. కానీ, ఆ తర్వాత ఇంకా తాను బతికున్నట్టు గార్డులు గుర్తించారు.

సెక్యూరిటీ గార్డులు ప్రతిరోజూ తన జననాంగాలను తాకేవారని, విచారణ సమయంలో తనని అత్యాచారం చేస్తామని బెదిరించేవారని మహమ్మద్ చెప్పారు.

ఇరాన్ న్యాయ విధానం కింద, కింద కోర్టులు ఉరిశిక్షను అమలు చేసి, దాన్ని ఆమోదం కోసం అత్యున్నత న్యాయస్థానానికి పంపుతారు.

కానీ, సుప్రీంకోర్టు ఈ మరణ శిక్షను ఆమోదించినా, దీనిపై అప్పీలుకి వెళ్లే అవకాశం ఉంటుంది.

తాము చాలా సార్లు అధికారులు నియమించిన న్యాయవాదిని సంప్రదించేందుకు ప్రయత్నించామని, కానీ అటు నుంచి ఎలాంటి స్పందన రాలేదని మహమ్మద్ మెహదీ తండ్రి చెప్పారు.

ఆ తర్వాత ఇరాన్‌లో అత్యంత ప్రముఖ మానవ హక్కుల న్యాయవాదుల్లో ఒకరు మహమ్మద్ హుస్సేన్ అఘసిని నియమించుకునేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు.

‘‘మహమ్మద్ మూడు సార్లు జైలు నుంచి నన్ను పిలిచారు. ఆయన తరఫున పోరాడమని అడిగారు. ఆయన తల్లిదండ్రులు కూడా కొడుకు తరఫున వాదించాలని కోరారు’’ అని అఘసి చెప్పారు.

ఇరాన్

ఫొటో సోర్స్, WANA/Reuters

మహమ్మద్ మెహదీ స్థానిక కోర్టుకి, ఆ తర్వాత సుప్రీంకోర్టుకి లేఖ రాశారు. కానీ ప్రతి దగ్గర కూడా ఆయన లేఖలు పక్కన పెట్టేశారు లేదా తిరస్కరించారు.

సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీలుకి వెళ్లినప్పటికీ దాన్ని కూడా కొట్టివేశారు.

వేగంగా కేసులను విచారించి ఉరిశిక్షలను అమలు చేయడం ద్వారా నిరసనకారులన్ని నిరోధించవచ్చని ఇరాన్ అధికారులు చెబుతున్నారు.

ఈ బూటకపు న్యాయ విధానాలు అమల్లోకి వచ్చిన తర్వాత కరాజ్‌లో మహమ్మద్ హుస్సేనికి కూడా ఉరిశిక్ష విధించారు.

ఆయన్ని రక్షించేందుకు సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహించేందుకు ఆయన కుటుంబ సభ్యులెవరూ లేరు.

కానీ, ‘మేమెంతా మహమ్మద్ వెన్నంటే ఉన్నామంటూ..’ చాలా మంది పోస్టులను షేర్ చేశారు.

బైపోలార్ డిసార్డర్‌తో మహమ్మద్ బాధపడుతున్నట్టు బీబీసీ పర్షియన్ రిపోర్టు చేసింది.

అయితే, ఆయన మరణశిక్షను సుప్రీంకోర్టు ఆమోదించిన తర్వాత కూడా మహమ్మద్ హుస్సేని స్వతంత్ర న్యాయవాదిని నియమించుకోగలిగారు.

ఇరాన్

ఫొటో సోర్స్, Social media

న్యాయవాది అలీ షరీఫ్‌జాదే ఆయన్ని జైలులో కలిశారు. ఆ తర్వాత దీనిపై ట్వీట్ చేశారు.

‘‘మహమ్మద్ హుస్సేనిని కలవడానికి వెళ్లినప్పుడు బాగా ఏడ్చేవారు. ఏ రకంగా హింసిస్తున్నారో చెప్పేవారు. చేతికి సంకెళ్లు వేసి, కళ్లకు గంతలు కట్టి ఆయన్ని కొట్టేవారని చెప్పారు. తలపై కొట్టడంతో, స్పృహ తప్పిపడిపోయినట్టు తెలిపారు’’ అని ఆయన న్యాయవాది చెప్పారు.

టార్చర్ పెట్టడం ద్వారా నేరం ఒప్పుకునేలా చేయడం న్యాయ పరంగా చెల్లదని అన్నారు.

సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా అలీ షరీఫ్‌జాదే అప్పీల్‌కు వెళ్లారు.

జనవరి 7న కోర్టుకు రావాల్సిందిగా పిలుపు రావడంతో, అక్కడికి వెళ్తున్న సమయంలో మహమ్మద్ హుస్సేనిని ఉరితీసినట్లు న్యాయవాదికి తెలిసింది.

ఆ తర్వాత అలీ షరీఫ్‌జాదేని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన్ని బెయిల్‌పై విడుదల చేశారు.

బలవంతంగా నేరాలు ఒప్పుకునేలా చేసి, వారికి శిక్షలు విధించడంపై మానవ హక్కుల గ్రూప్‌లు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.

అధికారులు నియమించే న్యాయవాది కేవలం ‘ఇంటరాగేటర్’ మాదిరిగానే పని చేస్తున్నారని, నిందితులని రక్షించే బదులు వారు నేరం ఒప్పుకునేలా బలవంతం చేస్తున్నట్లు బీబీసీకి సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇరాన్

ఫొటో సోర్స్, @VAHID/TWITTER

109 మంది వ్యక్తులకు ఉరిశిక్ష అమలయ్యే ప్రమాదం ఉందని నార్వేకి చెందిన ప్రభుత్వేతర సంస్థ(ఎన్‌జీవో) ఇరాన్ మానవ హక్కుల సంస్థ తెలిపింది.

వారిలో 60 మంది వయసులను తాము గుర్తించగలిగామని చెప్పింది.

మరణ శిక్ష ఎదుర్కొంటున్న వారి సగటు వయసు 27గా ఉందని ఈ ఎన్‌జీవో తెలిపింది. ముగ్గురు 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారని చెప్పింది.

సోషల్ మీడియాలో ఈ నిరసనలకు చెందిన మరో హృదయ విదారకర పొటో కూడా ఒకటి సర్క్యూలేట్ అవుతుంది.

ఇందులో మాషాలాహ్ కరామి తన కొడుకు సమాధి వద్ద మోకాలపై కూర్చుని కుమిలి కుమిలి ఏడుస్తున్నారు.

నలుపు రంగ షర్ట్ ధరించి, ఒక చేతిని తలపై పెట్టుకుని ఉన్న మహమ్మద్ మెహదీ ఫోటోను పట్టుకుని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.

ఇవి కూడా చదవండి:

వీడియో క్యాప్షన్, గూఢచర్యం ఆరోపణలో మరణశిక్షను ఎదుర్కోబోతున్న అక్బరీ ఎవరు?

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)