సంక్రాంతి: ‘ఓటు ఉంటేనే బతికుంటాం... లేదంటే శవాలమే’... గంగిరెద్దుల కుటుంబాలపై గ్రౌండ్ రిపోర్ట్

గంగిరెద్దు
    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
    • హోదా, బీబీసీ కోసం

సంక్రాంతి పండుగ రాగానే గంగిరెద్దుల సందడి మొదలవుతుంది.

పదీ పదిహేను రోజుల తరువాత గంగిరెద్దులు, వాటిని ఆడించేవారు పెద్దగా కనిపించరు. మరి ఈ గంగిరెద్దులను ఆడిస్తూ బతికే వారు ఎవరు? మిగతా సమయంలో వారు ఏం చేస్తారు?

గంగిరెద్దులను ఆడించే కుటుంబాలు చాలా వరకు ఒక చోట స్థిరంగా ఉండరు. సంచార జీవితం గడుపుతుంటారు. ఎద్దులను ఆడించడం, యాచన ద్వారా వచ్చే సంపాదనపైనే వీరు ఆధారపడి జీవిస్తుంటారు.

తెలుగు రాష్ట్రాల్లో గంగిరెద్దులను ఆడించే వారు లక్షల మంది ఉంటారు. వీరికి చాలా వరకు సొంత ఊరు అంటూ ఉండదు. తిరుపతి జిల్లాలోని ఓజిలి మండలం ఆచార్య పార్లపల్లి గ్రామంలో గంగిరెద్దులను ఆడించే కొన్ని కుటుంబాలున్నాయి. వీరికి ఇది పేరుకే సొంత ఊరు. ఇలాంటి 14 కుటుంబాలు శ్రీకాళహస్తి చుట్టుపక్కల మూడు బృందాలుగా విడిపోయి ఉంటున్నాయి.

వీరిలో కొన్ని కుటుంబాలు ఉత్తర కండ్రిగ, ఊరందూరు సమీపంలో బస చేశాయి. వీరి దగ్గర 80 పశువులున్నాయి. వాటిలోని 15 గంగిరెద్దులను సమీప పట్టణ, గ్రామాల్లో తిప్పుతూ జీవిస్తుంటారు.

గుడారాల బండ్లు

‘భూదేవే మంచం, ఆకాశమే దుప్పటి’

గంగిరెద్దులను ఆడించే వారు ఒక చోట స్థిరంగా ఉండరు. ఒక చోటు నుంచి మరొక చోటుకు తరచూ మారిపోతుంటారు.

గుడారం కట్టిన చిన్నచిన్న బండ్లలో ఇంటి సామాను, బట్టలు వేసుకుని బయల్దేరుతారు. చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు బండ్లలో ఎక్కుతారు. పురుషులు పశువులను తోలుకుని నడుస్తూ పోతుంటారు. ఎన్ని కిలోమీటర్లు అయినా ఇలాగే వారు ప్రయాణిస్తుంటారు.

ఎక్కడ పచ్చని గడ్డి కనిపిస్తే అక్కడ ఆగి ప్లాస్టిక్ షీట్లతో చిన్న చిన్న గుడారాలు వేసుకుంటారు. పశువులకు అక్కడ మేత దొరుకుతుంది. ఎండైనా వానైనా వారు ఆ గుడారాలు, గూడు బండ్లలోనే తలదాచుకుంటారు.

‘వానకు తడిసి, ఎండకు ఎండతా ఇక్కడే ఉంటాం. అక్కడ పది రోజులు, ఇక్కడ పది రోజులు ఉంటాము. మాకు మా ఊళ్లో ఇళ్లు, పొలాలు లేవు. ఎక్కడ ఉండనీరు, వానొస్తే బండ్లో కూర్చుంటాం. లేకపోతే బయటే ఉంటాం. బిడ్డలందరూ ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ ఉంటారు.

చిన్న బిడ్డలు, బాలింతలు అందరూ ఉంటారు. ఇక్కడే వండుకుంటాం... ఇక్కడే తింటాం... ఇక్కడే పడుకుంటాం. రాత్రిపాములు రావచ్చు... తేళ్లు రావచ్చు... ఏమైనా రావచ్చు.

మాకు భూదేవే మంచం... ఆకాశమే దుప్పటి.

ఆ చంద్రుడే మాకు ఎలుతురు... దీపంలే దూపంలే ఎమీ లే. ఆ భగవంతుడే మాకు దిక్కు’ అని గంగిరెద్దు కుటుంబానికి చెందిన గంగమ్మ బీబీసీతో అన్నారు.

గంగిరెద్దు

అలంకరణతో మొదలు

పొద్దున్నే గంగిరెద్దుల అలంకరణతో వీళ్ల రోజు ప్రారంభమవుతుంది. ఎవరైనా ఇచ్చిన బట్టలతో కుట్టిన బొంతలు, బహుమతులుగా వచ్చిన శాలువల్లాంటి వాటితో ఎద్దులను ముస్తాబు చేస్తారు. గజ్జెలు, గవ్వలు వేసి వాటిని అందంగా అలంకరిస్తారు. తమకు మంచి బట్టలు లేకపోయినా ఎద్దులకు మాత్రం ఏ లోటు చేయరు.

ఒకప్పుడు పండుగ సమయాల్లో గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ధాన్యం తీసుకుని గంగిరెద్దు కుటుంబాలు జీవించేవి. కానీ ఇప్పుడు గంగిరెద్దులను ఆడిస్తూ వాటితో రకరకాల విన్యాసాలు చేయిస్తూ... చూసేవాళ్లు ఐదో, పదో ఇస్తే వాటితోనే నెట్టుకొని వస్తున్నారు.

ప్రస్తుతం శ్రీకాళహస్తి దగ్గర ఉన్న ప్రతి కుటుంబం దగ్గరా ఆరేడు పశువులు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని వారు గంగిరెద్దులుగా అలంకరించి ఇంటింటికీ తిప్పుతుంటారు.

‘గంగిరెద్దులతోనే జీవినం సాగిస్తుంటాం. వీటిని వదల్లేము. వీటిని వదిలితే మేము బతకలేము. సినిమా యాక్టర్ కొడుకు సినిమా యాక్టర్ అవుతున్నాడు. రైతు కొడుకు రైతు అవుతున్నాడు. అలాగే మాకు కూడా ఇది వంశపారంపర్యంగా వచ్చింది. ఈ వృత్తిని మేము కల్పించుకున్నది కాదు. దీనిని పవిత్రంగా చేస్తాం. అప్పట్లో మా దగ్గర వందల గంగిరెద్దులు ఉండేవి. ఇప్పుడు ఒకటో, రెండో ఉంటున్నాయి. వాటిని కట్టేసుకోడానికి కూడా స్థలం లేకుండాపోయింది’ అని గంగిరెద్దులను ఆడించే ఏడుకొండలు బీబీసీతో చెప్పారు.

గంగిరెద్దులను ఆడించే వారు

‘పిల్లలను చదివించలేక పోతున్నాం’

గంగిరెద్దులను ఆడించడానికి పురుషులు చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్తారు. మహిళలు బస చేసిన చోటే చిన్న పిల్లల్ని చూసుకుంటూ, మిగతా పశువులను మేపుతూ ఉంటారు. గంగిరెద్దులను ఆడించడం ద్వారా వచ్చే డబ్బుతో వీరికి పూట గడుస్తుంది.

‘మా జీవితం అంటే అయిపోయింది. మా బిడ్డలకైనా ఒక దారి దొరుకితే బావుణ్ణని మేము ఆలోచిస్తున్నాం. వాళ్లను చదివించాలని ఉంది. చదువుకుంటేనే కదా వాళ్లు ఏదో ఒక పని చేసుకుని బతకగలరు. కానీ, మా ముత్తాతల నుంచి మాకు ఇదే వృత్తి.

మేం ఒక దగ్గర ఉంటే పిల్లలను స్కూల్లో వేసి చదివించవచ్చు. కానీ తిరుగుతూనే ఉంటాం. ఎక్కడకు వెళ్తే, అక్కడకు మాతోటే తీసుకెళ్తాం. ఇక్కడ మాకు స్నానం చేయాలన్నా ఇబ్బందే. కానీ తప్పదు’ అని జ్ఞానమ్మ అన్నారు.

ఆచార్య పార్లపల్లిలో బడి ఉన్నా, ఆ ఊరిలో ఉండడానికి తమకు ఎలాంటి వసతి లేదని ఏడుకొండలు చెప్పారు. సొంత స్థలం, ఇల్లు లాంటివి ఉంటే అక్కడే ఉండి తమ పిల్లలను చదివించుకుంటామని చెబుతున్నారు.

‘ఊరిలో బడి ఉంది. కానీ, మేము ఉండడానికి ఏవీలేవు. పాకలు వేసుకొని ఎన్ని రోజులని ఉండగలం. మాకంటూ సొంత స్థలం, ఇల్లు ఉంటే మా పిల్లల్ని అక్కడే ఉండి చదివించవచ్చు. ఎక్కడ స్థిరంగా ఉండలేకపోతున్నాము.

తిరుపతిలో కూడా ఒక చోట మూడు సంవత్సరాలు దాకా ఉన్నాము. మళ్లీ ఓటేరు దగ్గర ఉన్నాం. ఎక్కడున్నా ఇదే పరిస్థితి. వెళ్లిపోండి, అంటే వెళ్లిపోవాలా. కూలి అయినా చేసుకొని బిడ్డలను చదివించుకోవాలని ఉంది. ఇప్పుడు గంగిరెద్దులను దేవుడిగా గుర్తించే వాళ్లు, భిక్షం వేసే వాళ్లు కూడా తగ్గిపోయారు’ అని ఏడుకొండలు అంటున్నారు.

‘మాకు ఒక ఊరు అనేది లేదు. 10 రోజులు అయితే, ఇక్కడనుంచి ఖాళీ చేయండి అంటే, అక్కడి నుంచి వెళ్లిపోవాలి. మా ఊర్లో ఇల్లు పడిపోయింది. నాకు ఇద్దరు కూతుళ్లు. నేను ఎక్కడైనా నిలకడగా ఉంటే, వాళ్లని బడికి పంపించవచ్చు. నేనే ఊర్ల మీద పోతుంటే. వాళ్లను ఎలా ఎక్కడ ఉంచి చదివించగలను’ అంటారు శ్రీనివాసులు.

కొవ్వొత్తి వెలుగులో భోజనం

ఎక్కడ ఉంటే అక్కడే కార్యాలు

ఈ కుటుంబాల్లో మంచి చెడూ ఏ కార్యం జరిగినా ఏ ప్రాంతంలో ఉంటే అక్కడే పూర్తి చేస్తారు. పిల్లలు ఎవరైనా పెళ్లీడుకు వస్తే, మరో కుటుంబంలో అదే ఈడులో ఉన్న జంటను వెతికి పెళ్లి తంతు ముగిస్తారు.

‘మేం శుభకార్యాలు ఏ ఊర్లో ఉంటే ఆ ఊరిలోనే డేరాలు వేసుకుని చేసుకుంటాం. ఇల్లు వాకిలి లేవు కాబట్టి వాటిని ఏ ఊళ్లో చేసినా ఒకటే అనుకుని అక్కడే చేసేస్తాం. మా కుటుంబాల్లో పెళ్లిళ్లు జరిగితే, మాలో మేమే చేసుకుంటాం. కట్నకానుకలు ఇవ్వడం, లాంటివి ఏమీ ఉండవు. పప్పు అన్నం పెట్టి, పెళ్లి చేసేస్తాం. మాకు ఉంటే కదా బిడ్డలకు ఇవ్వడానికి’ అని గంగమ్మ అంటున్నారు.

స్వగ్రామం అయిన ఆచార్య పార్లపల్లిలో ఎన్నికల సమయానికి రప్పించుకుని ఓట్లు వేయించుకునే నేతలు, తర్వాత తమకు ఏమీ చేయరని గంగమ్మ ఆరోపిస్తున్నారు.

‘ఓట్లు లేకపోతే సచ్చిపోయిన వాళ్లతో సమానం. ఓటు ఉంటేనే మీరు మనిషి, మీకు గుర్తింపు ఉంటాది అన్నారు. మాకు ఎప్పుడో ఇందిరమ్మ ప్రభుత్వంలో కాలనీ కట్టించారు. ఆ ఇళ్లన్నీ పగిలిపోయి, పాడైపోయాయి. వర్షం వస్తే తడిచి పడిపోతుంటాయి. అందుకే ఈసారీ ఊళ్లకు కూడా పోలేదు.

ఏ కార్యాలు చేసుకోవాలన్నా ఎక్కడుంటే అక్కడే. ఇలా డేరాలేసుకుని పెళ్లిళ్లు అన్నీ చేసుకుంటాం. ఏదైనా పల్లెల మీద పోతున్నప్పుడు ఎవరైనా చనిపోతే, ఆ ఊళ్లోనే దహనక్రియలు పూర్తి చేసేస్తాం’ అని ఆమె చెబుతున్నారు.

వీరిలో కొంత మందికి రేషన్ కార్డులు లేవు. మరికొంత మందికి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు అన్నీ ఉన్నా సొంత ఊళ్లో బతకలేని స్థితిలో ఉన్నామని వాపోయారు ఏడుకొండలు.

‘రాజకీయపరంగా ఓట్లు అన్నీ ఉన్నాయి. ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు కూడా ఉన్నాయి. రేషన్ కోసం పెద్దగా పోము. వీటితో ఇక్కడే సరిపోతుంది. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు అన్నీ కల్పిస్తామంటారు. తర్వాత పోయి అడిగితే మీరు ఊళ్లు పట్టుకుని తిరుగుతుంటారు అని మమ్మల్ని పట్టించుకోరు. ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తించి మాకు ఏదైనా చేస్తే, మా పిల్లల్ని చదివించుకుని అక్కడే ఉండిపోవాలని ఉంది. కానీ, మాకు ఎవరూ సహాయం చేసింది లేదు. ఎన్నో తరాల నుంచీ ఇలాగే జరిగిపోతోంది’ అని ఆయన అన్నారు.

గంగిరెద్దుల ఆట

‘గంగిరెద్దులకు గుర్తింపు కరవు’

గంగిరెద్దులను ఒకప్పుడు హరికథ, బుర్రకథలాగే గుర్తించేవారని, చరిత్ర రూపంగా భావించేవారని కానీ ఇప్పుడు గంగిరెద్దులను అసలు గుర్తించేవాళ్లే లేరని ఈ కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి.

సంచార జీవితంలో కూడా వీరికి ప్రశాంతత కరవైపోయింది. ఎక్కడైనా కొన్ని రోజులు ఉంటే భూమి యజమాని ఎప్పుడు తమను అక్కడ నుంచి వెళ్లగొడతాడేమోననే భయంతో వీరు బిక్కుబిక్కు మంటూ గడుపుతుంటారు. ఏ ప్రభుత్వం వచ్చినా తమ జీవితాల్లో పెద్దగా ఒరిగిందేమీ లేదన్నారు.

‘ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మేం ఓట్లు వేశాం. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఇప్పుడు జగన్‌మోహన్ రెడ్డి అందరినీ చూస్తూనే ఉన్నాం. ఎన్నికలు ఉన్నప్పుడు ఎక్కడున్నారు అని పిలిపించుకుంటారు. కానీ మాకు ఒరిగిందేమీ లేదు.

మమ్మల్ని గుర్తించి ఏదైనా సాయం చేస్తే, అదే మాకు పది వేలు. ఎమ్మెల్యేలకు, ముఖ్యమంత్రికి కూడా మా బాధలు చెప్పుకున్నాం. మమ్మల్ని గుర్తించి మాకు ఏదైనా చేస్తే భావితరాలు మా బిడ్డలు బాగుపడతారు అనుకుంటున్నాము.

ఇప్పటిదాకా మాతో మీ పిల్లల్ని హాస్టల్‌కు పంపించమని చెప్పినోళ్లు లేరు. మా బిడ్డలు మా తోనే ఉంటున్నారు. మాకు ఉండడానికి ఇళ్లు లాంటివి కట్టించి ఇస్తే, కూలైన చేసుకొని బతికి పోతాం, మా పిల్లల్ని బడిలో చేర్పించి చదివించుకుంటాం’ అని ఏడుకొండలు కోరుతున్నారు.

గంగిరెద్దులు

‘అర్హులకు ఇళ్లు ఇస్తాం’

‘హౌసింగ్ స్కీం కింద ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించి అర్హులైన వారికి ఇస్తాము. వారి పశువులను మేపుకోవడానికి చుట్టుపక్కల అటవీ పోరంబోకు స్థలం ఉంది. వారి పిల్లలు చదువుకోవడానికి పాఠశాలలు ఉన్నాయి. వారు ఎప్పుడూ గ్రామాలు పట్టుకొని తిరుగుతుంటారు. స్వగ్రామంలో స్థిరంగా ఉండరు’ అని ఓజిలి మండలం తాశీల్దార్ డి.లాదరఫ్ అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)