జోషీమఠ్: 12 రోజుల్లో 5.4 సెంటీమీటర్లు కుంగిన నేల.. ఇస్రో శాటిలైట్ సమాచారం వెల్లడి

ఫొటో సోర్స్, ISRO
ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్ ప్రాంతంలోని నేల గత ఏడు నెలల్లో 9 సెంటీమీటర్ల మేర కుంగిపోయిందని ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తెలిపింది.
ఇస్రో శాటిలైట్స్ అందించిన సమాచారం ప్రకారం ఇది 2022 ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్యలో జరిగిందని స్పష్టంచేసింది.
ఇస్రో విభాగమైన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) జోషీమఠ్‌లో పరిస్థితిపై నివేదిక అందించిందని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
జోషీమఠ్‌లో కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 700 ఇళ్లకు పగుళ్లు వచ్చాయి. ప్రస్తుతం ఉన్న హోటళ్లు, ఆసుపత్రులతో పాటు రోడ్లకు కూడా పగుళ్లు ఏర్పడినట్లు ఎన్‌ఆర్‌ఎస్‌సీ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
జోషీమఠ్ పట్టణంలో 2022 ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య ఏడు నెలలు 9 సెం.మీ వరకు నేల నెమ్మదిగా క్షీణించింది.
2022 డిసెంబర్ 27 నుంచి 2023 జనవరి 8 మధ్య వేగవంతమైన క్షీణత ఏర్పడినట్లు ఇస్రో పరిశోధనలో తేలింది. ఈ కొన్ని రోజుల వ్యవధిలో ఈ ప్రాంతం 5.4 సెంటీమీటర్ల మేర కుంగింది. క్షీణత ప్రాంత పరిధి కూడా పెరిగింది.
అయితే ఇది జోషిమఠ్ పట్టణం మధ్య భాగానికి మాత్రమే పరిమితమైందని భారత అంతరిక్ష సంస్థ స్పష్టంచేసింది.
అక్కడ సాధారణ ల్యాండ్‌స్లైడ్ ఆకారాన్ని పోలి ఉండే ఒక క్షీణత జోన్‌ను గుర్తించారు.
2,180 మీటర్ల ఎత్తులో జోషిమఠ్-ఔలీ రహదారికి సమీపంలో దాని కేంద్రం ఉందని ఇస్రో నివేదిక తెలిపింది.
ఇస్రో కొత్త కార్టోశాట్-2ఎస్ ఉపగ్రహ డేటాతో క్షీణత జోన్ గుర్తించారు.
పౌరుల భద్రతే అతి పెద్ద బాధ్యత: ఉత్తరాఖండ్ సీఎం
జోషీమఠ్‌లో భూమి క్షీణించడంపై ప్రధాని కలత చెందారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం వెల్లడించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ తీవ్రంగా శ్రమిస్తున్నారని పేర్కొన్నారు.
ధామీతో హోం మంత్రి అమిత్ షా జోషీమఠ్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని తెలిపారు రాజ్‌నాథ్ సింగ్.
జోషీమఠ్ కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి గురువారం జోషీమఠ్ సంక్షోభంపై సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో ఆర్మీ, ఐటీబీపీ, ఎన్డీఆర్‌ఎఫ్, శాస్త్రవేత్తలు, జిల్లా పరిపాలనా విభాగం, పోలీసు తదితర విభాగాల అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు.
పౌరుల భద్రతే మన అతి పెద్ద బాధ్యత అని ఈ సందర్భంగా సీఎం పిలుపునిచ్చారు. ప్రజల భద్రత కోసం ప్రతి ఒక్కరూ అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు.

ఇళ్లు దెబ్బతిన్నవారికి రూ. 1.50 లక్షలు తక్షణ సాయం
కొండచరియల పరిశోధనలో నిమగ్నమైన పలువురు శాస్త్రవేత్తలతో ముఖ్యమంత్రి సంభాషించారు. అక్కడ కొనసాగుతున్న అధ్యయనాలు, జోషీమఠ్‌లో కొండచరియలు విరిగిపడటానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
ఇప్పటివరకు జరిగిన పరిశోధనలను ఈ సమావేశంలో శాస్త్రవేత్తలు సీఎంకు వివరించారు.
సమావేశం అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ "అందరితో సమావేశమయ్యా. రాష్ట్ర పరిపాలనా విభాగం జోషీమఠ్ ప్రజల వద్దనే ఉందని ప్రజలకు హామీ ఇచ్చాను. మేం ప్రతి ఒక్కరికీ సాయం చేస్తాం" అని అన్నారు.
వారి ప్రాణాలను, ఆస్తులను కాపాడుతూనే బాధిత వ్యక్తులకు మార్గం చూపడం మా ప్రాధాన్యత అని ధామి అన్నారు.
అనంతరం ముఖ్యమంత్రి పుష్కర సింగ్ ధామి స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖులతో సమావేశమయ్యారు. విపత్తుల సమయంలో ప్రతి ఒక్కరూ సమన్వయంతో పరిపాలన సాగించాలని కోరారు.
ఇళ్లు, దుకాణాలు, వ్యాపారాలు దెబ్బతిన్న వారందరికీ తక్షణమే 1.50 లక్షలు మధ్యంతర సాయంగా అందజేస్తున్నట్లు సీఎం తెలిపారు.
ఇవి కూడా చదవండి
- భాంగఢ్ కోట: "చీకటి పడ్డాక అక్కడికి వెళ్లినవారు ప్రాణాలతో తిరిగి రారు" - ఇది నిజమేనా?
- కామెరూన్: ఈ దేశంలో శవపేటికలు అమ్ముకోవడం మంచి వ్యాపారం, ఎందుకంటే....
- ఆస్కార్-ఆర్ఆర్ఆర్: ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల ‘నాటు నాటు’ పాట ఎలా పుట్టింది?
- మొబైల్ ఫోన్: సిగ్నల్ అందకపోతే నేరుగా శాటిలైట్‌తో కనెక్షన్, ఇది ఎవరికి అందుబాటులో ఉంటుంది?
- గౌతమ్ అదానీ: మోదీతో స్నేహాన్ని ఒప్పుకున్నారా, సోషల్ మీడియాలో చర్చ ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















